RSS

మధుర జ్ఞాపకాలు..

   అపుడెప్పుడో మా రాజమండ్రీ కాపరంలో మొదలెట్టిన బ్లాగు ప్రస్థానం, మొత్తానికి పాక్కుంటూ, డేక్కుంటూ నాలుగేళ్ళు పూర్తిచేసికుంది.అసలు నేను బ్లాగులు వ్రాయడం మొదలెట్టడానికి ముఖ్యకారణం-- మా శ్రీవారు ఏదో ఒకవంక పెట్టుకుని బయట ప్రపంచంతో సంబంధబాంధవ్యాలు ఉంచుకునేవారు. ఆయన చెప్పే కబుర్లు వినడానికి కావలిసినంతమందుండేవారు. వచ్చిన గొడవల్లా నాకే.నా గోల విని విని విసుగెత్తి బయటకు పారిపోయేవారు.పోనీ ఊర్లు పట్టుకు తిరుగుదామా అంటే అలాటి అలవాటు లేనేలేదు. మరి నా ఘోష ఎవరితో చెప్పుకోనూ? అదిగో అప్పుడన్నమాట, ఈ బ్లాగులగురించి. మనలో మన మాటా, మావారు అప్పటికే ఓ వారం రోజులముందు తెలుగులో వ్రాయడం నేర్చేసికుని, ఓ బ్లాగు మొదలెట్టేయడమూ, ఎంతమందో చదివేయడమూ, వ్యాఖ్యలు పెట్టేయడమూ జరిగిపోయింది. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటీ అనేసికుని మొదటి టపా వ్రాసేశాను.ఇది జరిగి ఈవేళ్టికి(22-04-2013) సరీగ్గా నాలుగేళ్ళయింది. మరి ఈ నాలుగేళ్ళలోనూ జరిగినవి గుర్తుచేసికోద్దూ, మొదట్లో ఎంతోమంది పాఠకులు తమతమ వ్యాఖ్యలతో ప్రోత్సాహపరిచేవారు. వాటితో నాకూ ఉత్సాహం వచ్చి ఏదో నాకు తోచినవేవో వ్రాసేదానిని.మా వారిలా ఏమిటీ నాకూ, ఇంట్లో పనులూ, వంటా వార్పూ చూసుకోవాలాయె పైగా పూణె తిరిగి వచ్చేసిన తరువాత మనవడూ, మనవరాలూ, అసలు మేము తిరిగి వచ్చేసింది కూడా మా అగస్థ్య కోసమేకదా. ఇన్నేసి వ్యాపకాలు పెట్టుకుని బ్లాగులు వ్రాసుకుంటానూ అంటే కుదురుతుందా మరి? అలాగని ఇంతమంది కొత్త బంధువులుని పరిచయం చేసిన, నా చిన్నారి బ్లాగుని మరిచిపోతే ఎలా మరి? మా అగస్థ్య కంటే ఓ తొమ్మిది నెలలు పెద్ద ! అంటే నేను బ్లాగుమొదలెట్టడమూ, మా అగస్థ్య మా కోడలు కడుపున పడడమూ ఒకేసారన్నమాట !మరి అందుకే అంత అవినాభావసంబంధం.

    ఈ నాలుగేళ్ళలోనూ నేను వ్రాసిన టపాలూ, వాటికి స్పందించిన నా అభిమానబంధువులనీ జీవితంలో ఎప్పటికీ మరువలేను. కానీ వీటితోపాటే కొన్ని మధుర జ్ఞాపకాలనికూడా గుర్తుచేసికుందామనే ఈ టపా. మా జీవితాల్లో ఎప్పటికీ మరిచిపోలేనిది ఏమైనా ఉందా అంటే అది- మా రాజమండ్రీ కాపరం.అదేమిటో ప్రతీవారూ, తాము కొత్తగా కాపరంలో ప్రవేశించినప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసికుంటారు, అప్పటికంటే కూడా మధురమైన జ్ఞాపకాలివి. కారణం ఏమిటీ అని ఆలోచిస్తే అనిపించిందేమిటీ అంటే, కొత్తగా కాపరానికి వచ్చినప్పుడు ఎన్నెన్నో ఆశలతో జీవితం ప్రారంభిస్తాము. కానీ, భగవంతుడి దయతో మన కలలు నిజం చేసికుని, బాధ్యతలు సంతృప్తికరంగా పూర్తిచేసికుని, ఏ బరువూ బాధ్యతా లేకుండగా, ఆ గోదావరి గాలి పీల్చుకోడం లోని జ్ఞాపకాల తీయదనం ద్విగుణీకృతం అయినట్టే కదా !

   ఏదైనా జరగాలీ అంటే ముందుగా ఆ అమ్మవారి దయ సంపూర్ణంగా ఉండాలి. ఆవిడ దయ ఉంటే మనజీవితాల్లో అసంతృప్తి అనేది ఉండదు. మరి అంత దయా కారుణ్యాలు మనమీద ప్రసాదిస్తున్న ఆ అమ్మకి పూజ చేసికోద్దూ. పూజకోసమని విడిగా ఓ గది ఉన్నది మాకు రాజమండ్రీలోనే. మిగిలిన ప్రతీ చోటా ఏదో విడిగా వంటగదిలోనే ఓ మందిరం పెట్టుకుని పూజ చేసికోడంతోనే సరిపోయేది.

   మేము రాజమండ్రీలో ఉన్నంత కాలమూ, పువ్వులకేమీ కొదవలేదు. ఎన్నిరకాల పువ్వులో !! పూజ చేసేయగా కూడా, కావలిసినన్ని పువ్వులు ఉండేవి. కింద చూడండి..

    పైన చెప్పినవన్నీ మేముండే ఎపార్టుమెంటు లోపల. మరి బాల్కనీలోకి వచ్చి ఏమి చేసేవారూ అంటే ఇదిగో మేము ప్రతీ రోజూ చూసే సుందరదృశ్యాలు...

   బాల్కనీలోకి వచ్చేటప్పటికి కనిపించే ఈ పచ్చటి చెట్లు చూశారా, ప్రకృతిలో ఉండే తుమ్మెదలూ, రామచిలుకలూ పలకరించేవి.

   మరి కిందకు చూస్తే...

   ఏ సాయంత్రం పూటో వాహ్యాళికి వెళ్తే ...

    మరి ఇన్నిన్ని మధురక్షణాలను మాకు ప్రసాదించిన రాజమండ్రీని ఎలా మర్చిపొమ్మంటారూ?

శ్రీలలితాసహస్రనామస్తోత్రం

   ఈరోజు శుక్రవారం అమ్మవారి పూజ, శ్రీరామనవమి కనుక సీతారాముల పూజ . మంచి సమయం. మేము రాజమండ్రి లో వున్నప్పుడు మా బిల్డింగులో వున్న మహిళలు ఓ మంచి పుస్తకాన్ని బహుమతి గా యిచ్చారు. అది ఏమిటంటే శ్రీలలితాసహస్రనామం. ఇది అందరికి తెలుసు కదా ! అనుకుంటున్నారు కదూ!దీని ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి నామాలు ఎన్ని అక్షరాలు కలిపి చదవాలి, అని ప్రతి నామం పైన అంకెలు వుండి తగిన గాప్ యిచ్చి వివరంగా వుండటమేను.ఎవరికయినా తెలియని వారికోసం " బ్రహ్మశ్రీ వేదమూర్తులు సామవేదం షణ్ముఖశర్మ గారి " శ్రీలలితా సహస్ర నామ స్తోత్రం" పెడుతున్నాను.ప్రతీ పేజీని విడిగా నొక్కితే పదవివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes