RSS

మరుపు రాని రోజు

               ఈరోజు  మరువలేని రోజు. మాబంగారు తల్లిని మాప్రాణంలొ ప్రాణాన్ని,మాకంటి పాపను, తను కోరినవానితొ ఇరుకుటుంబాల సమ్మతితొ పచ్చని మామిడితోరణాలమధ్యలొ  పగలంతా మండుటెండగా వున్నా సాయంత్రానికిచల్లబడిన ఆహ్లాద వాతావరణంలొమరొ యింటికి దీపంగా  పుత్రవధువుగా పంపినరొజు,ఏమిటి  గోల అనుకొంటున్నారా, మా అమ్మాయి పెళ్ళిరోజండి బాబూ, ఆ సంతోషంలొ కాస్తంత భావుకత్వం ఎక్కువయిందిలెండి.         

      పెళ్లి బట్టలు ,నగలు అన్ని రెండు నెలలముందరె తీసెసుకున్నాము. మేము వుండేది ఓ పల్లెటూరు. బంగారం జలగావ్ లొ మిగిలినవి అన్నిపూనెలొ, పెళ్లికూడా మాఫాక్టరి క్లబ్ లొ,  ఢిల్లి నుండి వచ్చె మగపెళ్ళివారికి( ఢిల్లి-పూనె ఫ్లైట్) ఆంధ్రానుండి వచ్చె మా చుట్టాలకు ( కోనార్క్ ఎక్సుప్రెస్ )వీలుగావుంటుందని. మాఅమ్మ,నాన్నగార్లు వైజాగ్ నుండి ముందరె సూత్రాలు, యజ్ఞోపవీతం, సారె సామాను లాంటివి తీసుకొని  వచ్చేసారు .మా అబ్బాయి మావారు పెళ్లివారి బట్టలు బంగారం వెండి విలువైన సామాను, తో ముందరే రైలులొ  పూనా చేరుకున్నారు ఈ ఏర్పాటు ముందు జాగర్తన్నమాట. మిగిలిన సామాను అంటె పానకం బిందెలు కాళ్ళుకడుగుపళ్ళెం పెట్టుబడిబట్టలు,రిటర్న్ గిఫ్టులు.కేటరింగ్ భొజనం నచ్చనివారికి కొత్తావకాయ, కందిపొడి.వగైరా వగైరా తీసుకొని క్వాలిస్ లొ నేను మాఅమ్మ,నాన్నగారు ఫాక్టరిలొపనిచేసె ఓఇద్దరు అబ్బాయిలు బయలుదేరాము. నిజానికి మాతొ మాడాక్టరు స్నేహితులుకూడా రావలసినది కాని ఆఖరి నిమిషంలొ వారికి కుదరలేదు.వీరు మాతొ వుంటారనే ఈయన ధైర్యంగా  ముందరగా వెళ్లినది. డాక్టరు ఫ్రెండ్స్ దగ్గరవుండి కొబ్బరికాయకొట్టించి   పసుపు కుంకమలతొ పూజచేయించి పంపారు.ప్రయాణం బాగానె జరుగుతున్నా మనసులొ భయం. అమ్మవంటిమీద నాదగ్గర  బంగారం , వీళ్ళకా భాష రాదు, ఆ అబ్బాయిలు చిన్నవాళ్లెను, ఆహమ్మదునగర ప్రాంతానికి వచ్చాము. అక్కడ చెక్ పొస్టు దగ్గర పొలిసులు గాడి ఆపారు,గాడిలొ పేకెట్లు పెట్టెలు సామాను చూసి ఏమిటని ప్రశ్నించారు. ఇంక డ్రయివరు,నేను, ఆ అబ్బాయిలు వారికిసమాధానం చెప్పేసరికి తాతలు దిగివచ్చారు, వాళ్ళు అనేది ఓ కార్డు,లేక పెళ్లిఎక్కడొ అడ్రస్ కాని మీ ఐడెంటిటీ కాని ఏదొ ఒకటి చూపించమంటారు,అబ్బె, మాదగ్గర ఏమీ లేవు.  ఏదొ ఒకటి పెట్టుకొవాలికదా అసలు ఏమి తొచలేదు డాక్టర్స్ మాతొ రాకపొవడంతొ గడబిడ అయిపొయింది. వాళ్లు చెప్పిందివిని  సారి చెప్పి బయలుదేరాము. పొలీసు గాడీ కూతతొ మావెనకేరావడం ఆపుచేయడం నిజంగా దడే వచ్చేసింది.మొదటిసారిగా పోలీసులతొ మాట్లాడ్డం.           

       అయిన ఆలస్యం ఎలాగా అయిందికదా అని చెప్పి దగ్గరలొనె వున్న శనిసింగపూర్ వెళ్లి దర్శనం చేసుకొని పూనా వెళ్లాము.అప్పటికె బొంబాయిలొ పనిచేసె పెళ్లికొడుకు ,పెళ్లికూతురు కలసి పూనా వచ్చి ఎవరి పెరెంట్సు దగ్గరికి వాళ్లు చేరారు. అరొజు పెళ్లికూతుర్ని చేయడం,మెహందిప్రొగ్రాం, సాయంత్రం రిసిప్షను,  ఆసమయానికి అందరూ వాళ్ళ కార్లలొను టాక్సిల్లొను వచ్చేసారు బందువులు,రైల్లొ వచ్చినవాళ్లు తక్కువేను,  పెళ్ళికొడుకు అక్కగారింటి నుండి బారాత్ తీసుకొని మగపెళ్ళివారు వఛ్చెసారు. మా అత్తగారు  బారాత్ ని చూసి చిత్రహార్లా వుందని అందరికి చెప్పెవారు. ఆ డాన్సులు అవీ కొత్తకదామరి. ఒకసారి బారాత్ వాళ్లు వచ్చినతరువాత ఎవరు మగపెళ్లివారు ఎవరుఆడపెళ్లివారొ తెలియనంతగా కలసిపోయారు. రిసిప్షను, రాత్రిపెళ్ళి, అయినవెంటనె వాళ్ళు దుల్హనుతొ బారాత్ తీసుకువెళ్లడం ఉదయం 5గంటలకు  మేము మాఅమ్మ,నాన్నగారు మాబాబు, మాబావగారితో వచ్చిన మాఅత్తగారు మిగిలాము. ఆసాయంత్రానికిఆదే క్వాలిసులొ వరణ్ గావ్ బయలుదేరాము. భగవంతుని అనుగ్రహంతొ పెద్దల , బందుమిత్రులఆశీర్వచనాలతొ, చక్కగా జరిగి అమ్మాయి అల్లుడు పిల్లలతొ చల్లగావున్నారు.           

     మాబంగారుతల్లి మమ్మల్ని అడిగినది ఒకే ఒక్కటి, అదే అతనితొ వివాహం. పసిపిల్లగా వున్నప్పుడు కాని పెద్దయినతరువాత కాని ఎప్పుడూ ఏమి అడగలేదు పెళ్ళిబట్టల సెలక్షను, నగలవి,  అన్ని మాఇష్టమేను,  నాక్కావలసినది  నాకు ఇచ్చారు. మీరు ఏదీ చేసిన నాకుఇష్టమేను, నాగురించి నాకంటె  కూడామీకే బాగాతెలుసు , అంటుంది. అప్పుడు ఇప్పుడు ఆంతే.

అంతా రామ మయం

           అరుణగారడిగిన శ్రీసూర్యనారాయణా కొసం వెతుకుతూంటె 1971సంవత్సంలొ  రాసిన పాటల కాయితం బయట పడింది. అది అందరికి తెలుసునా అనేది తెలీదు. కాని చక్కని  రామనామ బృందగానం.  దీన్ని రాసినది శ్రీ వింజమూరి శివరామారావు గారని గుర్తు. అక్షర తప్పులున్నా క్షమించి సరిదిద్దుకొగలరని మనవి. 

                               అంతా రామమయం

               శ్రీరామ రాఘవేంద్రా! సీతా మనొ రాజ పూర్ణచంద్రా!

               వైకుంఠ దివ్యధామా! సుశ్యామ లోకైకపూజనామా

               నీరాహరాశిలొనా శేషాద్రి చారు తల్పమ్ముపైనా --

              శయనించు దేవదేవా,మామీద దయయుంచుమాదిదేవా!

              క్రూర కృత్యములు సాగె ,లొకానదారుణత్వములుమూగే --

              పురుషార్ధము నేర్వగా,రావయ్యా,ధరణి భారము తీర్పగా !

              దానవులుకష్టాత్ములై, ఓస్వామి,మానవులు దీనాత్ములై --

              తపియించుచున్నారయా రావయ్యా, కృపనించుమన్నారయా!

              ధశరధేశ్వరుల తపసు ,కౌసల్య,విశదవ్రతముల మహస్సు --

              ఫలియించినవి కాంతిలొ, లోకాలు,జ్వలియించినవి శాంతిలొ!

              మోని యాగము రక్షకై, దుష్టుకా,దానవావళి శిక్షకై--

              శ్రీరాఘవుండరిగెను, అనుజుతొ, ఘోరాటవుల తిరిగెను !

              దుష్టులను శిక్షించెను,మా తండ్రి శిష్టులను రక్షించెను--

              మిధిలాపురము చేరగా,ఆ దాశరధియేగె నింపారగా!

              విరెసె పూవులు,మల్లెలు,స్వామిపై కురిసెవెన్నెలజల్లులు--

              జానకీ దరహాసమో,జనకభూజాని యాత్మ వికాసమో !

             శ్రీజానకీయుతుడవై, వరమోని, రాజేంద్ర సన్నుతుడవై --

             పరశురాముని శౌర్యము,శ్రీరామా,హరియించితివిసర్వమూ!

             దశరధేశ్వరుల మాట, తలదాల్చి,విశదభొగముల వీడి--

             నారచీరలే కట్టెను   నాతండ్రి కారడవులే పట్టెను!

             దానవత్వము మించగా,రావణుడు జానకిని హరియించగా--

             కారడవిలొరేగెనే ,లంకపై కారుమబ్బులుమూగెనే !

             ఎంతశోకించినాడో,శ్రీరాముడెంత కృశియించినాడొ --

             జీవితమ్మెభారమై జానకీదేవి దృష్టికి దూరమై!

             తరులతీవెలదరిసెను,మాతండ్రి గిరులకొనలనడిచెను--

             ఏవాడకానరాదయా,మాతల్లి ఏజాడయను లేదయా!

             శిష్టులను రక్షించెను దాశరధి ,దుష్టులను శిక్షించెను--

             వాలికూలగ చేసెను,సుగ్రీవు వానరాధిపుచేసెను !

             లంకాపురమో కాల్చెనో,దానవాహాంకారమేవేల్చనో--

             హనమంతుడుద్రిక్తుడై , శ్రీరామ ఘనపాదసద్బక్తుడై !

             వీరవానరకొటితొ సాహసొదార భాసుర కోటితొ--

              జైత్రయాత్రకు వెడలిరి రాఘవులు శత్రు వీరులెఅడలిరి !

              శరము సంధించినాడు వీరుడై శరధి బందించినాడు--

              కోదండపాణియగుచూ దివ్యాస్త్ర వేదియై యోధుడగుచూ!

              శ్రీసతీ చిత్తకామా , బల భీమ కొశలాధీశరామా--

              పట్టాభిరామా ,అయోధ్య,పట్టణాధీశ రామా!

              సీతా సమేత రామా, సన్మార్గ , పూత చరిత్ర రామా--

             దుష్టైక శిక్షరామా, శ్రీరామా శిష్ట సంరక్షక రామా!

       

   మరొసారి మనవి, ఈపాట ఏ కేసెట్ లొ వుందొ తెలియబరచగలరు.

వృశ్చికం, ఫణి , నేను

                                              మేము నరసాపురములొ వున్నది కొద్దిరోజులయినా, నాది చిన్నవయస్సేఅయినా కొన్ని కొన్ని జ్ఞాపకాలు యిప్పటికి తాజాగానే వున్నాయి. ఎందుకంటె  నాజీవితంతొ ముడిపడి వున్నాయికనుక.

                                              నా చిన్నప్పుడు మా అమ్మగారు 9గంటలకల్లా అన్నం వండి చక్కగా కలిపి వేడి వేడిగా పప్పు, నెయ్యి వేసి తినిపించారట. మరి చిన్నపిల్లని కదా ఆడుకొమ్మని బొమ్మలు అవీ యిచ్చి కూర్చోపెట్టారట. ఆ తరువాత మా తాత గారికి వడ్దిస్తూ  కూర,పప్పువేసి అన్నం ఓ గరిట పెట్టి రెండొ గరిట  తీస్తూంటే ఎర్రగా వుందిట, ఏమిటా అని అన్నం పైకి కిందకి తీసి చూస్తే ఇంత పెద్ద తేలు అన్నంలొ వుడికి కనిపించిందట. ఇంకెముంది తాతగార్కి అన్నంపెట్టడంమాట దేముడెరుగు, ఆడుకొంటున్న నన్ను చంకన వేసుకొని ఏడుపులు, రాగాలుపెడుతూ ,ఈపక్కవాళ్లని, ఆపక్కవాళ్లని పిలిచి తేలుతో వుడికిన అన్నంపెడితే  ఏమన్నా అవుతుందా, అయ్యొ ఎంతపనిచేసాను ,-- ఇంతలొ నాన్నగారు వచ్చారట. ఇరుగు పొరుగు ,ఇక్కడ ఏడ్చి లాభం ఏమిటి? తొందరగా డాక్టరు దగ్గరకి  తీసుకెళ్ళండనారట. పొలొమని గబగబా హస్పిటల్ తీసుకెళ్లి డాక్టరు గారికి చెబితె ఇంతకి పిల్ల ఎక్కడ అన్నారట?  ఇంతింత కళ్ళతొ ఈ తతంగం అంతా వింతగా చూస్తున్న నన్ను చూపించారట.  నన్ను చూసిన ఆయన నవ్వుతూ  ఓ సారి స్టెతస్కోపు తొ పరిక్ష చేస్తూ ఇంతకి ఎన్నింటి కి పెట్టారంటె మాములుగానె 9గంటలకు పెట్టానండి, ఏడుపునాపుకొంటూ,

                                     ఏం పరవాలేదమ్మా,ఏమీ కాదు,పాప చక్కగా ఆడుకొంటొందికదా,తిన్నదంతా ఎప్పుడొ జీర్ణ మయిపోయింది,పీడకలలా మరచిపోండి, అన్నా వినకుండా అల్లాకాదు సరిగ్గా చూడండి, రాగాలట. ఇంక అయన మీరు ఆ రాగాలు ఏడుపు మానకపోతే మిమ్మల్ని హాస్పిటల్ లొ జాయి న్ చేయవలిసి వస్తుందని చెప్పి పంపిచేసారట. ఆ తరువాత ఓ రెండు రోజులు నిద్ర మానుకొని గమనిస్తూ గడిపారట.ఇప్పటికి చెబుతూవుంటారు. అందుకనొ ఏమో తెలీదు కాని నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు, మా ఇంట్లొను, మాకు తెలిసినవారు చాలా మంది తేలు కాటు తొ బాధపడ్దవాళ్లున్నారు. 

                                    మా అమ్మగారు టీచరు కదండీ, అప్పట్లొ డే కేర్ సెంటర్లు, క్రెష్ లు వుండేవికాదుకదా. నన్ను చూసేందుకు ఓ నెల మాపిన్ని, ఓనెల మామయ్యలది  డ్యూటి.  మా అమ్మక్కయ్య స్నేహితిరాలు భర్త  తణుకు-నరసాపురమ్ బస్సు  డ్రయివర్. ఆయన వీళ్లని అటు ఇటు తిప్పుతూవుండెవారు. పరిక్షల సమయంలొ ఎవరు వుండెవారుకాదు. అప్పుడు నన్ను స్కూలుకి తీసుకెళ్లి పెద్ద క్లాసు పిల్లలకు అప్పగించేవారు. నన్ను ఆడించడం డ్యూటి వాళ్లది. ఓ రోజు ఆకలి వేస్తోంది ఇంటికి వెళ్లిపోదామని మారాం చేస్తూ అమ్మకాళ్లమీద తలపెట్టి చీరకుచ్చెళ్ళతొ ఆడుకొటుంటె  ఇదుగొనమ్మా, గంట కొట్టగానే వెళ్ళిపోదాం బంగారుతల్లిలా అక్కడ కూర్చోమరి అనగానే , అంతే ,తలతీసి యిలా తిరిగానొ లేదొ ,దబ్ మంటూ పైనుంచి చుట్ట చుట్టుకొనిఓ పెద్ద పాము  అమ్మవడిలొ పడటం  కెవ్వుమని అరుస్తూ నన్ను దూరంగా తోసెయ్యడమ్ ,వడిలొంచి నేలమీదపడి అ పాము పారిపోవడమ్,అన్ని ఓ క్షణంలొ జరిగిపొయాయి. ఆ స్కూలు పై కప్పు తాటాకులది. ఆ తరువాత పాముని కొట్టారనుకొండి. ఇప్పటికి ఆ శబ్దం నాచెవిలొ అల్లాగే వినిపిస్తుంది. సినిమాల్లొకాని టి.వి.లొకాని  పాముల్ని చూడ్డం యిస్టం  వుండదు. జూలొ కూడా చూడను. పుస్తకాలలొ బొమ్మల్ని కూడా ఎవాయిడ్ చేస్తాను. మా అబ్బాయి యిప్పటికి ఏనిమల్ ప్లానెట్ చానెల్ చూస్తూ లొపల పనిలొ వున్న నన్ను సడన్ గా పిలిచి చూడు చూడంటూ  ఆట పట్టిస్తాడు.

                                      ఎలాగొ  శ్రీదేవి నటించిన నాగిన్ చూసాను   అల్లాగే లల్లాదేవి గారి శ్వేతనాగు, యండమూరిగారి దుప్పట్లొమిన్నాగు చదివాను. నాగులచవితికి ఉపవాసం వుంటాను. సుబ్రమణ్యేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్లినా భక్తికంటే భయమే ఎక్కువ.

                                     కొసమెరుపు: మావారిది వృశ్చికరాసి, పేరు మీ అందరికి తెలిసినదే---!

మాతృ దినొత్సవ సందర్బం గా

   తాళి కట్టినవాడు కాటికెళ్ళాడు

   కడుపున పుట్టినవాడు కఠినుడయ్యాడు

   ఆలి మాట జవదాటక అరుగయినా దిగాడు కాదు

  

   గడువు టైము కాకుండా మా గుమ్మమెట్లుక్కుతావు?

   గండు పిల్లిలా గాండ్రిచె చిన్నకోడలూ---

   నేనేమి చేతునంటూ చేతులెత్తిన చిన్నోడు--

 

   మధ్యాహ్న మార్తాండ మహిమ చూపేవేళ

   అస్తవ్యస్తంగా చిన్న బట్టల మూట తో

   ఆవేదనతో  ఆక్రోశిస్తోంది---ఆ అవ్వ

 

  ఆపు ఆపంటూ ఆటో వాడిని ఆపి

  ఆయాసపడుతూ ఆత్రుతగా-- ఆ అవ్వని

  అమ్మా! అంటూ అక్కున జేర్చుకుంది ---ఓ అతివ

 

  కూతురి కౌగిట్లొ గువ్వలా వదిగిపోతూ

  అల్లుడికి తెలిసే వచ్చావా? అని

  అడుగుతున్న అవ్వలో అమ్మ తనం

               అర విరిసింది.

 

మా వారు పోస్టాఫీస్ నుంచి వస్తూ చూసిన సంఘటన చెప్పగా   దానికి  నా అక్షరరూపం.

ఓ పాప

                   గౌతమి నందనంలొ (పార్కు) గోదావరి అలల చిరు సవ్వడి లొ పగలంతా ఎండ వేడికి మాడిపోయిన మమ్మల్ని చల్లని గాలితో పలకరించిన గోదావరి ని చూస్తూ కాసేపటికి తేరుకున్నాం. వేణుగోపాలస్వామిని, అష్టలక్ష్మి ని దర్శించుకొని  ప్రసాదం తీసుకొని చిన్నపిల్లలాగ (సాతాళించిన శనగలు )  ఒక్కోటి తింటూంటే మనసు ఎక్కడికొ ----

                   ఓ గౌను, రెండు జడలు తో అమ్మా ,పార్కు వెడుతున్నా, గట్టిగా చెప్పి అమ్మ దగ్గర తీసుకున్న అర్ధణాని జాగర్తగాపట్టుకొని శారదా ధియేటర్ కేంటినులో  మెత్తని పకోడిలు తిని పార్కులో ఆడుకోవడం ఓ పని,

                   మెత్తని లానులో నడచి, జారుడుబల్ల మీద జారి, పాటలు వింటూ , మాలి జిమ్మిన  నీళ్ల తో తడిసిన మొక్కల్ని పలకరిస్తూ , ఫౌంటెన్లు చూస్తూ  ,రోజూవచ్చే పిల్లలని పలకరించం ఓ పని,

                  పార్కు మూసే టైము కి గబగబా మళ్ళి అంతా ఓ రౌండు తిరిగి మాలిని అడిగి ఓ రెండు గలాబి పూలు తీసుకొని  , మళ్ళి రేపు వస్తాను  పరుగే పరుగుతో ఆయాసపడుతూ పూలు అమ్మకివ్వడం ఓ పని,

                  ఇంత ఆలస్యంగానా రావడం, ఇలా అయితే రేపట్నుంచి వెళ్లద్దు అంతే తెలిసిందా మరి,అమ్మ కోప్పడ్డం, సరేనని చెప్పి కాళ్లు చేతులు కడుక్కోని బుద్దిగా అన్నం తినేసి చదువుకొని నిద్ర పోవడం ఓ పని,

                  మరునాడు సాయంత్రం ఇంటికి పక్కనే మునిసిపల్ ఆఫీసు  లొ చాలా పెద్దతోట వుండేది అందులొ ఓ ఫౌంటెను మద్యలొ శివుడు  ధ్యానం చేస్తూ,అమ్మతొ చెప్పి దణ్ణ్ మ్ పెట్టుకోవడమ్ ఓ పని, మరి అమ్మయిచ్చిన పైస ( రాగి ది) జాగర్తగా  పట్టుకొని శివుడి చేతిలో పడేటట్లుగా వెయ్యడం,చేతిలొ పడితే అమ్మ కోప్పడదు, ఆలస్యంగా వెళ్లచ్చు,లేకపోతే తొందరగా వెళ్లాలి. కాడమల్లెపూలు ఏరి దారం లేకుండా జడ అల్లినట్లుగా దండచేసి  శివుడు మెడలో వెయ్యడం,  దీపాలు వెలిగిన తరువాత అయ్యబాబొయ్ చీకటి పడిపోయింది,గబగబా యింటికి పరుగు,

                 రోజూ యింత ఆలస్యం అయి తే ఎలాగమ్మా, నాన్నగారు ఊళ్ళొ లేరుకదా మరి   నేను ఒక్కతిని వుండాలి నాకు భయం వేస్తూంది కదా చెప్పు, అమ్మ నచ్చచెప్పడం ,నిజమేగా మరి ,పాపం ఒక్కత్తి వుండాలంటే భయమేను,

                 మరునాడుసాయంత్రం దొడ్లొ వున్న బొగడి చెట్టు కింద  పూలు ఏరి అరటి తడపతో దండలు కట్టి అనీ దేముడి ఫొటొలకు వేసి అరుగు మేదే కూర్చుంటే అమ్మవచ్చి రేపు పార్కుకి వెడతావా? వెళ్ళు కాని తొందరగా వచ్చేయ్ తెలిసిందా----

                    50 సంవత్సరాల కిందటి సంగతి, ఆ పాపని నేనే.

మా యాత్రలు

      మా పిల్లలు పంచగని కేంపింగ్ వెళ్లి  వారాంతర శలవలు గడిపి వచ్చారట.  మనవరాళ్లు, మనవడు చాలా ఆనందంగా గడిపారట.  మాఅమ్మాయి చిన్నప్పుడు తన స్నేహితులు ఈ టూర్ కి వెళ్ళామ్ అక్కడకి వెళ్లాం ఆంటే  అన్నిచోట్ల వాళ్ల చుట్టాలుండి  వెళ్ళారనికొనేది. పాపం. ఎందుకంటె మావారు మమ్మల్ని అమ్మమ్మగరింటికి మామ్మగారింటికే తీసుకువెళ్లెవారు ఇంతలొ ఆయన శలవు అయిపోయేది.అదీ ల్.టి.సి మీద. 4 సంవత్సరాలకు తిరుపతి వెళ్లెవాళ్లం. ఆంతే. ఆదే తెలుసు వాళ్లకి. పతే పరమేశ్వర్ అంటానని తనచుట్టూ  తిరిగితే చాలనుకునేవారనుకుంటాను ఏమిటొ ఎక్కడకు వెళ్లడంలొ ఇష్టత వుండేదికాదు. పెళ్లి అయిన కొత్తలొ ఎక్కడకయిన వెడదామాంటే  ప్రేమ యాత్రలకు  బృందావనము ,కాశ్మీరాలు ఏలనొ ( గుండమ్మ కధ) పాట రికార్డు పెట్టేసేవారు,   ఆ తరువాత ఓ పత్రికలో  పరిమళా సోమేశ్వర్ గారి పిల్లలతో ప్రేమయాత్ర  అనే సీరియల్ వచ్చింది  అది చూపించి వెడదామంటే అ కధ ఇంకొ సారి చదువుకొమ్మనేవారు. పిల్లలు మాత్రం స్కూల్  ద్వారా నాగపూర్ , నాసిక్ , దేవఘడ్, పూణె  సి.సి.ఎ  ప్రోగ్రాములకు వెళ్ళి వచ్చారు. మేము అప్పుడు భుసావల్ దగ్గర వరణ్ గావ్ లొ వుండేవాళ్లం. కాలేజి చదువులు పూనాలొ చదివారు.  మా స్నేహితులు ఓ సారి సౌత్ టూరని మరో సారి నార్త్ టూరని అల్లాగే దగ్గరగా వున్న అజంతా ఎల్లోరా షిరిడి  అవీ చూసివచ్చేవారు, అందులో అజంతా ఒకటి కొంతమందితో వెళ్లివచ్చాం. ఆ తరువాత అమ్మాయి పెళ్లి. ఆ సందర్బంలొ ఢిల్లి వెళ్లాం. శనివారం పొద్దునే  ఢిల్లి లొ దిగాం సాయంత్రం వియ్యాలవారితొ మాటలు,రాత్రికి ( మాపెద్దత్తగారి అబ్బాయి ) బావ గారింట్లొ వుండి ఆదివాం సాయంత్రం తిరుగు ప్రయాణం.  ఆదివారం బావగారు  ప్రొద్దుటే  వాళ్ళ ఏరియా మయూర్ విహార్,రెడ్ ఫోర్ట్,  ప్రగతి మైదాన్, అవీ అలా కారులొనే చూపించి పంపించారు. అందులొ ఈయన ప్రమేయం లేదు కనుక  సరిపోయింది .తను అవి అన్నీఆఫీసు పనిమీద వెళ్లినపుడు ఛూసివచ్చారు.   రెడ్ ఫొర్ట్ చూసి చాలా గర్వపడ్దాను.  అమ్మాయి ఉద్దోగరీత్య బెంగుళూర్ ,ముంబాయి, అ తరువాత ఢిల్లి  అన్ని చూసాననుకోండి.  నాకు తిరగడం అన్ని ప్రదేశాలు చూడ్దం ఎంత యిష్టమో తనకి ఇంట్లో ఆంత ఆనందం. అందుకని మా పిల్లలు  అల్లుడు కాబోయె కోడలు తన షష్టిపూర్తి కి తిరుపతిలొ స్వామి వారి కళ్యాణం ఆ తరువాత తమిళనాడు టూరిజం వారి  పది రోజుల ట్రిప్ ఏర్పాటు చేసారు.  మేము ఓ రెండు రోజులు ముందర తిరుపతి వెళ్లి  ఎ.పి ఆర్.టి.సి వాళ్ల బస్ లొతిరుచానురు, శ్రీనివాసమంగాపురం,కాణిపాకం ,కపిలతీర్ధం చూసుకొని వచ్చేసరికి  పూనా నుండి  మా అల్లుడు, అమ్మాయి ,మనవరాలు, మనవడు , అబ్బాయి చెన్నాయి   ప్లేన్ లొవచ్చి  సిటిబ్యాంకులొ పని చేస్తూన్న కాబోయే కోడల్ని తీసికొని తిరుపతి వఛ్చేసారు. ఆందరం కలిసి పైకి వెళ్లి మరునాడు ఉదయం అభిషేక ఆనంతర అర్చన కళ్యాణం చేసుకొని కిందకి వచ్చేసాం   ఆ తరువాత అందరం చెన్నాయ్ వెళ్లామ్.పిల్లలు పూనా వెళ్లిపోయారు.  మేము ఆరోజుకి అక్కడే సిటిలొ పార్ధసారధి గుడి ,అష్టలక్ష్మిగుడి, కపాలేశ్వరమందిరమ్ చూసి హూటేల్ కివెళ్లేసరికి మాకొడలు ఆఫీసునుండి వచ్చి మాతోనే వుండి పొద్దునే మమ్మల్ని టి.టి. బస్ ఎక్కించి వెళ్లింది. ఇక మా యాత్ర మొదలు అయింది. నాకు చాలా ఆశ్చర్యం అన్పించింది. నేనా ఈయనతో యాత్రా, మేము నిజంగా వెడుతున్నామా, ఏ దేవుడి కరుణో ఇది,ఇంత భాగ్యామా నాకు.పరిసరాలు చూసుకుంటూచుట్టుపక్కల దృశ్యాలు  తిలకిస్తూ చాలా ఆనందంగా శ్రీపెరుంబుదూర్ నుండి కంచి, మహబలిపురమ్,పాండిచ్చేరి, చిదంబరం, వైదీశ్వరన్ మందిరమ్,నాగపట్టణం,మన్నార్, తంజావూర్,రామేశ్వరమ్, కన్య్యాకుమారి,శుచీంద్రం,మధుర,కొడైకెనాల్,తిరుచ్చి,చూసుకొని 25వ తేది డిశంబర్ సాయంత్రం చెన్నాయ్ చేరుకున్నాం. మాకోడలు బస్ దగ్గరకు వచ్చి మమ్మల్ని కలిసింది అందరం హుటల్ కి వెళ్లాం.మా యాత్రావిశేషాలు చెబుతూ  మేమిద్దరం ఇలా మొదటిసారి ఇలా వెళ్లడం,ఏం జరుగుతుందో, --- అంతే ఆరాత్రే వచ్చేసిందండి బాబూ   సునామి !! .

33 సంవత్సరాల క్రితం స్మైల్ పింకీ

         "  మనం  మేలు  చేసినవాళ్లను గుర్తు పెట్టుకోవక్కరలేదు కాని మనకు మేలు  చేసినవారిని మాత్రం మరవకూడదు. "

  ఈ రోజు మా  చెల్లెలు కు ఫొను చేస్తే పన్ను నొప్పి పెడుతోంది డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చాను.పిప్పి పన్ను తీయకుండా టెబ్లెట్స్ యిచ్చారు. తీయించుకుందుకు నాకు భయమేను, అసలు తీయించుకొవచ్చొ లేదొ కూడా తెలీదు అని. అలా ......

              ఒక్కసారి నా మనసు గత జ్ఞాపకాల్లొకి వెళ్లింది. ఇంచు మించుగా  33 సంవత్సరాల క్రితం మాట . నేను యిచ్చిన టెలిగ్రామ్ కి బదులుగా నాన్నగారు  చెల్లిని తేసుకొని" పూనా " వచ్చారు.  టెలిగ్రామ్ చూసి వెంటనే బయలుదేరి వచ్చేశమమ్మా,  ఇది జరిగేపనేనంటావా, అని ఎంతో ఆశతొ ఆత్రుత తొ అడిగారు.చూద్దాం నాన్న,ప్రయత్నిద్దాం. మొన్న పాప పుట్టినరోజున వచ్చినపుడు మాటల్లొ అడిగాము సరే రమ్మనమండి అన్నారు.ఎక్కువ ఆశ పెట్టుకోకండి. మళ్ళి పని జరగకపోతే అదో భాద, ఇలా మేం మాట్లాడుకుంటుంటే మా మాటలు వింటూ పాపని (1సం) ఆడిస్తోంది.అప్పటి కే 10  వ తరగతి పాస్ అయి చదువు మానేసిన 16 సంవత్సరాల మా చెల్లెలు. తను పుట్టుకతోనే గ్రహణం మొర్రి(చీలిన పెదిమ---క్లెఫ్ట్ లిప్).  పాలు ఎలా పొయ్యాలొ తెలియక గ్లూకోజ్  నీళ్ళతొ నాలిక తడిపే హాస్పిటల్ సిబ్బంది ,పాలు ఎలా యివ్వాలొ తెలీని తల్లి,వీరిద్దరినుండి మా అమ్మమ్మ గారు తన చేతిలొకి తీసికొన్న తరువాత ఆశ వదులుకోండి అని చెప్పిన డాక్టర్ల మాట వమ్ము చేసి  ఎలా పెంచారో ఆవిడకే తెలియాలి. చిన్న చిన్న దూది వుండలు  పాలలొ ముంచి నోటిలొ చుక్కలు గా పొసేవారట. ఆ తరువాత తెలిసినది ఏమిటంటే పెదవే కాక లోపల అంగుట్లొ కూడా చీలిక వుందని, మా అమ్మగారు  స్కూల్ టీచర్. పసిబిడ్డని అమ్మమ్మగారి వద్ద వదలి  చాలా బాధ తొ  నన్ను తీసుకొని  నాన్న గారి దగ్గరకు వెళ్లిపోయారట.

            మా తాతగారు వేదపండితులు. దేవతార్చన, మడి ,ఆచారం చాలా చాలా ఎక్కువ.అందుకని అమ్మమ్మగారు అరటీ ఆకు మీద పడుక్కొపెట్టి దూది వుండలతోనే పాలు ,నీళ్ళు , పప్పు నీళ్ళు, కూరల నీళ్లు  ఇలాగే పోస్తూ, అమ్మక్కయ్య,పిన్ని, మామయ్య మొత్తం అందరూ కలసి పెంచారు. మద్ధ్య మద్ధ్యలొ వెళ్లి చూసెవాళ్ళం ఆ తరువాత ట్రాన్సుఫర్ చేయించుకొని అమ్మమ్మగారి ఊరు వెళ్ళేవరకూ తను అక్కడె పెరిగింది, ఇది మన యిల్లు. మనము కలసి వుండాలని చెప్పగా చెప్పగా ఎప్పటికొ మా యింట్లొ ఆలవాటు అయింది  అ తరువాత స్కూల్ లొ ఎన్నో ఫేస్ చేసి మరి ఎంతమందో ఎగతాళిల మద్య ఎలాగొ సిగ్గుతొ 10 వ తరగతి పాస్ అయ్యిందీ . పేరుతో పిలావలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోయేది కొంతమందికి. ఏ అవకరముండేదో అలాగే పిలిచేవారు. అ తరువాత చదివేందుకు ఒప్పుకోలేదు. పిల్ల చిన్నగా వున్నపుడు దీనికి ఓ ఆపరేషన్ వుంటుందనీను, ఎలాగో ఎక్కడొ  తెలీక, తెలిసిన తరువాత ఎంతవుతుందో తెలీక మొత్తానికి,ఏమయితేనే తలరాత అని మన కర్మ. అని సర్దుకున్న సమయంలొ ఈయన మిత్రులు" మేజర్ బాలరంగయ్య"గారు  ఎ ఎఫ్ ఎమ్ సి లో ఈ ఆపరేషన్ అవ్వచ్చు ప్రయత్నిద్దాం  పిలిపించండి. అన్న కబురు మళ్లి ఆశలకు ప్రాణంపోసినట్లయింది. వెంటనె వఛ్చారు.

               ఆ తరువాత మేజర్ బాలరంగయ్యగారు తనకి సంబందించిన మనిషిగా  హాస్పిటల్ లో చేర్చి కల్నల్ సిన్హా గారి ద్వారా ఆపరేషను విజయవంతముగా చేయించారు.మొత్తం 5నెలలు పట్టింది. అడ్మిట్ అయిన తరువాత ఓ మూడు వారాలు బాగా బలమయిన మందులు ,ఇంజక్షనులు యిచ్చి పండ్లు, పాలతో ఓ  ఎనిమిది కిలోల బరువు పెరిగిన తరువాత మొదటి ఆపరేషన్ చేసారు.ఓ పది రోజుల తరువాత డిశ్చార్జి చేసి  ఇంటికి పంపారు.జాగర్తగా చూసుకొమ్మని ఇన్ఫెక్షన్ కాకుండా వుండాలని చెప్పి రెండో ఆపరేషనుకి  నెల తరువాత రమ్మని చెప్పారు. నాన్నగారు స్కూల్ టీచర్ కదా శలవులు వుండవుగా అందుకని ఇక్కడ దింపిన వారానికే  తిరిగి వెళ్ళిపోయారు.అమ్మకి వచ్చేందుకులేదు ఇంట్లొ ముగ్గురుచెళ్ళెళ్లు.  అదీ కాక తనకి శలవు లేదు. ఆప్పటికే మాఅమ్మమ్మగారు కార్తీక పున్నమి రోజున పసుపు కుంకమలతో మా తాతగారి వడిలోనే  మా అందరిని వదలి వెళ్ళిపోయారు.

                అప్పుడు చూసుకోండి మా తిప్పలు. ఏడాది దాటిన పాపతొ సరిగ్గా భాష రాని నేను కలాస్ అనే ఏరియా నుండి విశ్రాంతివాడి వరకు నడచివచ్చి ఆక్కడ బస్ ఎక్కి పూనా స్టేషన్ దగ్గర దిగి కొండువా బస్ ఎక్కి కమాండ్ హాస్పిటల్ దగ్గర దిగివెళ్లవలసివచ్చేది.తను రోజు విడచి రోజూ వెళ్లివచ్చేవారు. ఆ తరువాత రెండో ఆపరేషనికి జాయిన్ చేసినతరువాత వారానికి అయింది , ఈ సారి తినేందుకు ఏమీ లేదు. అన్ని ద్రవపధార్దేలేను. ఇంచుమించుగా నెలరోజులుఆంతేను. ఈలోపులొ స్పీచ్ తెరెపి. వారి యిద్దరి మంచిమనసులు తో చేసిన సహాయం చెల్లెలికి చక్కని జీవితం దీనికి అయిన ఖర్చు ఏమీలేదు.

              ఈ రోజుకి ఆమేజర్ గారికి కల్నల్ గారికి మంచి జరగాలని రోజూ పూజలు చేస్తుంది. జన్మనిచ్చింది అమ్మనాన్నగార్లయితే పునర్జన్మ నిచ్చింది అక్కబావగార్లని అంటుంది. ఆ రోజుల్లొ ఏ హంగు ఆర్బాటం లేని  స్మైల్ పింకి కధ.          

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes