RSS

కోనసీమ కుర్రోడు....

   కోనసీమ సంబంధం అనేసరికి నా కళ్ళముందు గలగలమనే గోదావరి, పచ్చని పొలాలు, మామిడి చెట్లు, పనస, అరటి, ముఖ్యంగా కొబ్బరి చెట్ట్లు, అన్ని ఒక్కసారిగా , జుయ్ ! జుయ్! మని కళ్ళముందు నిలిచాయి. అందులోనూ కొబ్బరిచెట్టంటే చాలా యిష్టం. ఎవరితో అనకండి,చిన్నప్పుడయితే చెట్టుకాయలు( కొబ్బరిచెట్టు) తీసేవాడంటే నాకు హీరో తో సమానం. తెలుసున్న వాళ్ళింట్లో కాయలు తీయిస్తున్నారంటే అక్కడకి హాజరు. రోడ్డు మీద ఎక్కడయినా చూస్తే అక్కడే నిలబడిపోయేదాన్ని. అంత పెద్ద చెట్టు రెండు సైకిలు టైరులాంటి రబ్బరు చక్రాలతో అవలీలగా ఎక్కేసి కాయల్ని డుం డుం అంటూ కింద పడేస్తూంటే నోరెళ్ళబట్టి చూస్తూవుండేదాన్ని. భయం లేకుండా ఎలా ఎక్కేవాడో, ఎలా కోసేవాడో. ఇప్పటికీ అలాగే అనుకుంటాను నిజంగా హీరోయేను---- మరి,

   అంతంత బారలతో ఆ గట్టునుండి ఈ గట్టుకి అవలీలగా ఈదుకొంటూ వచ్చె స్తారట అక్కడి యువకులు. గజ ఈతగాళ్ళట అక్కడివాళ్ళు, అలా ఈతకెడితే గట్టు మీద నిలబడి ఎదురుచూడాలంటే తోచాలి కదా మరి అందుకని గబగబా గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, కోనసీమ పల్లెలోన గొప్పవారింటిలోన, ఓ రెండు పాటలు నేర్చేసుకుందామనుకున్నాను నిజంగా హీరో కోసమేనూ.... మరి,

   మామిడి పిందెలేరుకొంటూ పోలిబూరెలు తింటూ అరటి ఆకులో దంపుడు బియ్యం ( పొలాలున్నాయని తెలుసులెండి) అన్నం తింటూ హాయిగా జాం,జాం అంటూ పొలాల్లొ తిరగచ్చునని కలలు కంటూంటే తెలిసిందేమిటంటే కోనసీమయినా అబ్బాయి మహరాష్ట్రలో వుంటున్నాడని, పోన్లే అదీ బాగుందీ, కోనసీమలో నే వుంటే ఈ కోరికలు తీరకపొగా ఇంకో బెడద వుంది, ఆక్కడ చిన్న చిన్న పిల్లలు అరుగుల మీద కూర్చొని వేదాలు వల్లె వేస్తారట, ముఖ్యంగా ముక్కామలలో, అసలే వీరు ముక్కామల భమిడిపాటివారు,అమ్మొ! ఆ ఆచారం, మడి, కచ్చాపొసి చీర,మెడలో చంద్రహారం,నడుముకి వడ్డాణం --- చివరవి బాగున్నాయనుకోండీ, కాని వీరింట్లో కోపాలెక్కువట, అదీ భయంగానే అనిపించినా నేను మాత్రం తక్కువా, అసలే ప.గో.జి. అమ్మాయిని ఆ మాత్రం నా చేతిలో పెట్టుకోలేనా! క వ న శర్మగారి శకుంతల ది మాది తణుకే, --- మరి,

   ఇంక మిమ్మల్ని విసిగించకుండా , ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చేస్తున్నాను. పెళ్ళయి పూనే వచ్చెసామండి!
కనుచూపుమేరలో కొబ్బరిచెట్టు లేదు, ఈతమాట దేముడెరుగు గోదార్లో స్నానమంటేనే భయమట,( నీళ్ళలొ పడవ కూడా ఎక్కరు) కొండలెక్కరు(ఎత్తంటే భయమట) , స్కూటరు లేదు , బైకుల్లేవు, సైకిలే రాదట, అంతెందుకూ నాకు ఈస్థటిక్ సెన్సే లేదంటారు. మరి....

   అయితే ఏం, మనిషిని మనిషిగా అర్దం చేసుకొని అటు ఉద్యోగ నిర్వహణలో , యిటు సంసార సాగరంలో ఆటు పోటులు తట్టుకొని, పిల్లలకి మంచి చదువు, సంస్కారాలతో పాటు వారికినచ్చి మెచ్చిన వారినే, వారి జీవిత భాగస్వాములుగా చేసి మిగిలిన జీవితాన్ని ఆధునిక వానప్రస్థానం(పిల్లలతో కాకుండా పిల్లలకి దగ్గరగా)అంటే టప, టపా కొట్టుకుంటూ దెబ్బలు కాదండీ, బాబూ, బ్లాగులు. కామెంట్లు కౌంటు చేసుకొంటూ , మనుమలు, మనవరాళ్ళని చూసుకొని మురిసిపోతూ శ్రీరమణగారి మిధునంలో అప్పన్నగారి వంటి సూపర్ హీరో లాంటి ఈ కోనసీమ కుర్రాడితో బాపుగారి బొమ్మలతో ఆనందిస్తూ, జాగర్తగా కొమ్మ, కొమ్మ పట్టుకొంటూ కోతికొమ్మొచ్చి ఆడుకుంటూ కాలం గడిపేద్దామనుకుంటున్నాను, పట్టు జారిందో, కొమ్మ దొరకలెదో , అయితే మాత్రం ఏంటంట, శ్రీ వెంకటరమణ గారిని , శ్రీ బాపు గారిని కలుసుకోవచ్చు.... మరి.



జరుగుబాటు...

   చాలామందికి ఇళ్ళల్లో మనం చేసేది ప్రతీ రోజూ తిని తిని, ప్రతీదానికీ వంకలు పెట్టడం ప్రారంభిస్తారు. మా శ్రీవారిని ఎప్పుడైనా కూరలయిపోయాయీ అంటే, మార్కెట్ కి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూంటారు. ప్రతీ అయిదు నిముషాలకీ బస్సూ, చిటుక్కున బస్సెక్కేసి, కూరలు కొనేసి, లటుక్కున వచ్చేస్తూంటారు. అక్కడికేమైనా కూరలూ అవీ ఏమైనా వెదకాలా ఏమిటీ? దొండకాయ, బెండకాయ,పొట్లకాయ, వంకాయ, అయితే గియితే అప్పుడప్పుడు ఆక్కూరలూ. ఎప్పుడు చూసినా చుక్కకూరోటి తెచ్చి నా మొహాన్న పడేస్తారు. సరదాగా ఎప్పుడైనా పాలక్ ( పాలకూర) తీసుకురాకపోయారా అంటే, నాకు ఆ పేరు నచ్చదూ అంటారు. పేరునచ్చకుండా ఉంటుందా ఎక్కడైనా, చిత్రం!

   ఏదో అప్పుడప్పుడు పాలక్ పనీర్ లాటిదెప్పుడైనా చేద్దామని తీసుకురమ్మంటే, పనీర్ అంటే, పెళ్ళిళ్ళల్లో, ఓ వెండి బుడ్డిలాటిదాంట్లో వేసి చల్లుతారూ, అదనుకున్నారుట. వేషాలు, వినేవాళ్ళుంటే కావలిసినన్ని చెప్తారు. ప్రతీ రోజూ స్నానం చేసి పూజ చేసికునేసరికల్లా బ్రేక్ ఫాస్టు రెడీగా ఉండాలి. పోనీ అప్పుడప్పుడు, నాతోపాటు, పుల్కాల్లాటివి తినొచ్చుగా అంటే, అబ్బే అది కుదరదు. ప్రతీ రోజూ ఇడ్లీయో,దోశో కావాలి, మళ్ళీ దాంట్లొకి ఏ ఆవకాయో, మాగాయో వేసికుంటే నాకు శ్రమైనా తగ్గుతుందనుకుంటే, మళ్ళీ దాంట్లోకో పచ్చడీ.

   వారం లోనూ రెండు రోజులు, నవ్య, అగస్థ్య ల దగ్గరే కదా ఉండేది. అక్కడ ఆ వంటావిడ చేసినవి, నోరెత్తకుండా తింటారు మళ్ళీ. నాదగ్గరే సూకరాలన్నీనూ! ఇక్కడ ఇంట్లో ఫ్రిజ్ లో ఏమేం కూరలున్నాయో మర్చిపోయి, మళ్ళీ అవే కూరలు తెస్తూంటారు. దానితో ఒక్కోసారి ఓ కిలో దొండకాయలు, ఓ కిలో బెండకాయలూ చేరుతాయి. ఆ మాయదారి దొండకాయలు వారం వెళ్ళేటప్పటికల్లా, నా వయస్సుకొచ్చేసి, పండిపోతాయి. మళ్ళీ మా శ్రీవారికి పదునోటీ, మరీ పండిపోయిన దొండకాయలు, నమలడం కష్టం అవుతోందీ అంటూ. సగానికి సగం అవతల పారేయడమే. పోనీ బెండకాయలెక్కువగా ఉన్నాయి కదా సరదాగా ,వాటిని మధ్యలో తరిగి, మసాళా దట్టించి, మైక్రోవేవ్ లో పెట్టి చేస్తే, ఎంత బావుంటుందీ. అబ్బే అలాటివి మా శ్రీవారికెందుకు నచ్చుతాయీ? అక్కడికేదో ఆయనమీద అసలు దృష్టి పెట్టకుండా వంటలు వండుతూన్నట్లు పోజెట్టేసి, ఆ ముక్కల్లో మసాళా విడిగా తీసికుని, కలుపుకోడం! ఆ దిక్కుమాలిన బెండకాయలు, పైగా ఒక్కోటీ చూపుడువేలంత పొడుగున, నాకు మిగులుతాయి! పోనీ ఒక్కొప్పుడు వేయిద్దామని,రుచిగా ఉంటాయని వాటిలో పల్లీలు (వేరుశనగ గింజలు) వేస్తే, శుభ్రంగా అవన్నీ ఏరేసి, నాకు మిగులుస్తారు. ఏమైనా అంటే, ఆ వేరుశనగ గింజలు నమల్లేనూ, గొంతుకలో అడ్డడతాయీ అనో వంకా! ఆ డెంచర్సేవో పెట్టేసికోక, ఎందుకొచ్చిన గొడవ చెప్పండీ, నన్ను హైరాణ పెట్టాలని కాపోతే?

   ఏదో వేవిళ్ళకోరికలాగ, అప్పుడప్పుడు ఈయనకి బచ్చలికూర దొరుకుతూంటుంది. దానితో పాటు ఓ కిలో కంద కూడా తెచ్చి నా మొహాన్న పడేస్తారు.అందులో ఒక్కోప్పుడు, ఆ కంద ముక్కలు గట్టిగా ఉన్నా సరే, ఆవురావురుమని లాగించేస్తారు.అప్పడాలు నూనెలో వేయించాలిట. మైక్రో వేవ్ లో కాలిస్తే నచ్చదు, మావారికి!

   ఇంట్లోనే ఈ సూకరాలన్నీనూ. మొన్న , ఆయనగారి "రామాయణం" సుఖాంతమైన సందర్భంలో, అమ్మాయీ,అల్లుడూ పిల్లలతో బయటకు వెళ్ళాము. మా అల్లుడు, ఎప్పుడు తీసికెళ్ళినా, పంజాబీ డిషెస్ ఉన్న చోటకే తీసికెళ్తూంటాడు. పాపం ఆర్డరు చేసేముందర అడుగుతాడు కూడానూ. ఈయనేమో ముంగిలా కూర్చుని " మీ ఇష్టం.." అంటారు. మరి ఇంట్లో ఆ "విశాల హృదయం" ఏమైనట్లూ? అదేదో డిష్ లో మటరూ ( బఠానీ గింజలు), ఉల్లిపాయ ముక్కలూ వేసి తెచ్చాడు. పాపం గట్టిగా ఉండి తినలేరేమో అని, నేనూ, అమ్మాయీ
ఆయనతో అన్నాము-" చూసుకు తినండీ, గట్టిగా ఉంటాయేమో.." అని. ఓ నాలుగు గింజలు నోట్లో వేసికుని, రుచి మరిగారేమో, నోట్లో వెసికుందామని చూస్తే ఏముందీ, ప్లేట్ ఖాళీ! నేనూ మా అమ్మాయీ మొహం తేలేశాము! పైగా పక్క ప్లేటులో ఉంచిన పాపడ్ , ఈయన తినలేరుగా అని పక్కనే ఉంచితే అవీ ఖతం ! అవేమీ వేయించినవి కావు, మామూలుగా కాల్చినవే ! ఇంట్లో మాత్రం నూనెలో వేయించాలిట. చేసేవాళ్ళుంటే సరీ !

   ఇదిగో దీన్నే జరుగుబాటంటారు. ఏవేవో తిని, ఓ గ్లాసుడు మిల్క్ షేక్కూ, ఓ గ్లాసుడు మజ్జిగా తాగి, అవీ ఇవీ తిని, రాత్రి పదకొండింటికి ఇంట్లో దింపారు. అప్పుడప్పుడు ఇలా బయట తిళ్ళు తింటే మాత్రం ఓ సదుపాయం ఉంది. మర్నాడు శుభ్రంగా పొట్ట ఖాళీ అవుతుంది. బయటివాటిల్లో ఏం వేస్తారో ఏమో...

మావారు బంగారు కొండండి బాబూ....

   "ఎప్పుడు మా స్వంత ఇంటికి, పిల్లల్ని చూద్దామని, వెళ్ళి ఓ మూడునాలుగు రోజులుందామా అనుకున్నా, మా శ్రీవారెప్పుడూ, ఛాన్స్ దొరికితే, ఒక్కరూ మేముండే ఫ్లాట్ కి పారిపోతూంటారు! ఇక్కడ నాకు తోచదూ అంటూ. ఇన్నాళ్ళూ నిజమే కాబోసూ, పోనీలే ఈ వయస్సులో ఆయనమీద ఆంక్షలు పెట్టడం ఎందుకూ అని వదిలేసేదాన్ని. ఆయన మొన్నెప్పుడో వ్రాసిన టపా చూసిన తరువాతే తెలిసింది.వామ్మోయ్ అందుకనన్నమాట, ఎప్పుడు చూసినా నెట్ ముందరే కూర్చుంటారూ,ఇక్కడుంటే అక్కడకీ, అక్కడుంటే ఇక్కడికీ ఛాన్స్ దొరికితే పారిపోవడమే!

   పిల్లలతో క్రిందటేడాది చెన్నై ఫ్లైట్ లో వెళ్దామూ అంటే, వద్దూ, నేను ట్రైనులోనే వెళ్తానూ అన్నారు, ఇదన్న మాట అసలుకారణం! ఎప్పుడు పిల్లలతో కలిసి, ఏ వీకెండుకో, తిరగడానికి కారులో వెళ్ళినా సరే, నాకు ఓపిక లేదూ, మీరందరూ వెళ్ళండీ అనే! ఓపికుండమంటే ఎక్కడుంటుందీ? ఎన్నెన్ని "వ్యాపకాలు" మరి? ఆరోజుకూడా, రాత్రెప్పుడో ఫోను రావడం వలన తెలిసింది కానీ, ఎన్నాళ్ళనుండి జరుగుతోందో అసలీ భాగవతం? పైగా ఆ టపాకి "రామాయణం...." అని పేరోటీ!

   అప్పుడెప్పుడో మార్కెట్ లో జారిపడ్డప్పటినుండీ, ఏదో రిటైరయి ఆరేళ్ళవుతోందీ, కాళ్ళల్లో నొప్పీ,మళ్ళీ నడుస్తున్నప్పుడేమైనా స్లిప్ అవుతారేమో అని, ఈవెనింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు,పోనీ చేయి పట్టుకుందామా అంటే, గయ్యిమంటారు. నా చెయ్యెందుకు పట్టుకుంటావూ, నాకేమైనా రోగమనుకున్నావా రొచ్చనుకున్నావా అని. అయినా నా చెయ్యి పట్టుకుంటే ఏమొస్తుందీ, "పట్టుకునేవాళ్ళు" పట్టుకుంటే బావుంటుంది కానీ! అమ్మో అమ్మో, ఇంతకాలం నాగ్గూడా తెలియకుండా, ఎలా మానేజ్ చేశారో?

   ఉద్యోగం లో ఉన్నంతకాలం, అదీ వరంగాం లో ఉన్నప్పుడు, మాట్లాడితే, డెప్యుటేషన్లమీద వెళ్ళేవారు. పైగా అస్తమానూ అలా ప్రయాణాలెందుకండీ అంటే, పిల్లలకి పుస్తకాలు ఇక్కడ దొరకవు కదా, అదే ఢిల్లీ లోనూ, కలకత్తాలోనూ, బొంబైలోనూ అయితే దొరుకుతాయీ, అని నన్నూరుకోబెట్టేవారు. నిజమే కాబోసనుకునేదాన్ని, ఏదైనా పెద్ద చదువులు చదువుకున్నానా ఏమిటీ? పైగా వెళ్ళడం వెళ్ళడం, ఓ వారంరోజులదాకా రాకపోవడం.ఎక్కడికెళ్ళేవారో, ఏం గ్రంధం నడిపించేవారో ?"

---

అని అంటాననుకున్నారు కదూ. అబ్బే, మాశ్రీవారు ఓ బంగారు కొండండి బాబూ ! నోట్లో వేలెడితే కొరకలేరు ( అసలే పళ్ళు కూడా లేవూ). అయినా అంత ధైర్యం ఎక్కడిదండి బాబూ ఆయనకి? ప్రతీ రోజూ నాతోనే వేగలేకపోతున్నారే, మళ్ళీ ఇంకోళ్ళా. ఛస్తే నమ్మను....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes