RSS

కోనసీమ కుర్రోడు....

   కోనసీమ సంబంధం అనేసరికి నా కళ్ళముందు గలగలమనే గోదావరి, పచ్చని పొలాలు, మామిడి చెట్లు, పనస, అరటి, ముఖ్యంగా కొబ్బరి చెట్ట్లు, అన్ని ఒక్కసారిగా , జుయ్ ! జుయ్! మని కళ్ళముందు నిలిచాయి. అందులోనూ కొబ్బరిచెట్టంటే చాలా యిష్టం. ఎవరితో అనకండి,చిన్నప్పుడయితే చెట్టుకాయలు( కొబ్బరిచెట్టు) తీసేవాడంటే నాకు హీరో తో సమానం. తెలుసున్న వాళ్ళింట్లో కాయలు తీయిస్తున్నారంటే అక్కడకి హాజరు. రోడ్డు మీద ఎక్కడయినా చూస్తే అక్కడే నిలబడిపోయేదాన్ని. అంత పెద్ద చెట్టు రెండు సైకిలు టైరులాంటి రబ్బరు చక్రాలతో అవలీలగా ఎక్కేసి కాయల్ని డుం డుం అంటూ కింద పడేస్తూంటే నోరెళ్ళబట్టి చూస్తూవుండేదాన్ని. భయం లేకుండా ఎలా ఎక్కేవాడో, ఎలా కోసేవాడో. ఇప్పటికీ అలాగే అనుకుంటాను నిజంగా హీరోయేను---- మరి,

   అంతంత బారలతో ఆ గట్టునుండి ఈ గట్టుకి అవలీలగా ఈదుకొంటూ వచ్చె స్తారట అక్కడి యువకులు. గజ ఈతగాళ్ళట అక్కడివాళ్ళు, అలా ఈతకెడితే గట్టు మీద నిలబడి ఎదురుచూడాలంటే తోచాలి కదా మరి అందుకని గబగబా గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, కోనసీమ పల్లెలోన గొప్పవారింటిలోన, ఓ రెండు పాటలు నేర్చేసుకుందామనుకున్నాను నిజంగా హీరో కోసమేనూ.... మరి,

   మామిడి పిందెలేరుకొంటూ పోలిబూరెలు తింటూ అరటి ఆకులో దంపుడు బియ్యం ( పొలాలున్నాయని తెలుసులెండి) అన్నం తింటూ హాయిగా జాం,జాం అంటూ పొలాల్లొ తిరగచ్చునని కలలు కంటూంటే తెలిసిందేమిటంటే కోనసీమయినా అబ్బాయి మహరాష్ట్రలో వుంటున్నాడని, పోన్లే అదీ బాగుందీ, కోనసీమలో నే వుంటే ఈ కోరికలు తీరకపొగా ఇంకో బెడద వుంది, ఆక్కడ చిన్న చిన్న పిల్లలు అరుగుల మీద కూర్చొని వేదాలు వల్లె వేస్తారట, ముఖ్యంగా ముక్కామలలో, అసలే వీరు ముక్కామల భమిడిపాటివారు,అమ్మొ! ఆ ఆచారం, మడి, కచ్చాపొసి చీర,మెడలో చంద్రహారం,నడుముకి వడ్డాణం --- చివరవి బాగున్నాయనుకోండీ, కాని వీరింట్లో కోపాలెక్కువట, అదీ భయంగానే అనిపించినా నేను మాత్రం తక్కువా, అసలే ప.గో.జి. అమ్మాయిని ఆ మాత్రం నా చేతిలో పెట్టుకోలేనా! క వ న శర్మగారి శకుంతల ది మాది తణుకే, --- మరి,

   ఇంక మిమ్మల్ని విసిగించకుండా , ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చేస్తున్నాను. పెళ్ళయి పూనే వచ్చెసామండి!
కనుచూపుమేరలో కొబ్బరిచెట్టు లేదు, ఈతమాట దేముడెరుగు గోదార్లో స్నానమంటేనే భయమట,( నీళ్ళలొ పడవ కూడా ఎక్కరు) కొండలెక్కరు(ఎత్తంటే భయమట) , స్కూటరు లేదు , బైకుల్లేవు, సైకిలే రాదట, అంతెందుకూ నాకు ఈస్థటిక్ సెన్సే లేదంటారు. మరి....

   అయితే ఏం, మనిషిని మనిషిగా అర్దం చేసుకొని అటు ఉద్యోగ నిర్వహణలో , యిటు సంసార సాగరంలో ఆటు పోటులు తట్టుకొని, పిల్లలకి మంచి చదువు, సంస్కారాలతో పాటు వారికినచ్చి మెచ్చిన వారినే, వారి జీవిత భాగస్వాములుగా చేసి మిగిలిన జీవితాన్ని ఆధునిక వానప్రస్థానం(పిల్లలతో కాకుండా పిల్లలకి దగ్గరగా)అంటే టప, టపా కొట్టుకుంటూ దెబ్బలు కాదండీ, బాబూ, బ్లాగులు. కామెంట్లు కౌంటు చేసుకొంటూ , మనుమలు, మనవరాళ్ళని చూసుకొని మురిసిపోతూ శ్రీరమణగారి మిధునంలో అప్పన్నగారి వంటి సూపర్ హీరో లాంటి ఈ కోనసీమ కుర్రాడితో బాపుగారి బొమ్మలతో ఆనందిస్తూ, జాగర్తగా కొమ్మ, కొమ్మ పట్టుకొంటూ కోతికొమ్మొచ్చి ఆడుకుంటూ కాలం గడిపేద్దామనుకుంటున్నాను, పట్టు జారిందో, కొమ్మ దొరకలెదో , అయితే మాత్రం ఏంటంట, శ్రీ వెంకటరమణ గారిని , శ్రీ బాపు గారిని కలుసుకోవచ్చు.... మరి.



3 కామెంట్‌లు:

rishi చెప్పారు...

బాగుంది చివరలో మాత్రం...

ఇంతకీ అత్తగారింటికి వెళ్ళినప్పుడెప్పుడైనా మడి చీర అదీ కట్టుకున్నారా లేదా?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొంచెం ఆలస్యంగా చూసాను. ముక్కామలా మా మాష్టారు గారిది. ముక్కామలలో మావాళ్లు కూడా ఉండేవారు. కొంతమంది మిత్రులు ఇప్పుడూ ఉన్నారు.

టపా బాగుంది, చివర లైన్లు తప్ప. సరదాగా నవ్వుకున్నాను. ఇంతకీ చంద్రహారం, వడ్డాణం ఇచ్చారా కోనసీమ కుర్రాడు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@ఋషీ,

కోనసీమ కోడలై ఉండి, మడిబట్ట లేకుండా రోజెళ్తుందా !!

@సుబ్రహ్మణ్యం గారూ,

మన ఖండవిల్లి ముక్కామలా? మావారిది కోనసీమ ముక్కామల. ఆ ఊరిపేరు చెప్పేసికుని అందరి మీదా దాష్టీకం చేసేస్తూంటారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క మాత్రం లేదు! అక్కడేమో
అందరూ యజ్ఞాలూ,యాగాలూ చేసినవారూ !!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes