RSS

నా తిప్పలెవరితో చెప్పుకోనూ?

    శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో చూసాము. ఓ ఆవు, ప్రతీ రోజూ ఠంచనుగా, మందనుంచి తప్పించుకుని, స్వామికి పాలివ్వడానికి ఒకే టైముకి వెళ్ళేదని. మరీ అలాగని కాదు కానీ, ఈ మధ్యన మా శ్రీవారు, ప్రతీ రోజూ ప్రొద్దుటే
స్నానం, పానం, బ్రేక్ ఫాస్టూ పూర్తిచేసికుని, ఇంట్లోంచి బయటకు వెళ్ళి, మళ్ళీ భోజనానికే, 12.30 కి వస్తున్నారు. మరీ అలాగని ఈయనేమీ, నాకు తెలియకుండా ఉద్యోగమేమీ వెలిగించడం లేదు, ఎప్పుడైనా మిస్టరీ షాపింగులున్నా, చెప్తారు, ఇంకీయనెక్కడికి వెళ్తున్నట్టూ?

    ఈ మధ్యన మరీ పనేమీ లేక, నెట్ లో పెట్టే కంది శంకరయ్యగారి పజిలూ, తురపుముక్క మురళీ మోహన్ గారి పజిలూ, చూడడం మొదలెట్టాను. ఒకాయనేమో ప్రతీ రోజూ పొద్దుట ఆరున్నరయేసరికి పెట్టేస్తున్నారు. అదేదో చూసి సరదాగా సాల్వ్ చేద్దామని, మొదలెట్టాను.ప్రతీ రోజూ అదో వ్యసనంలా తయారయింది.నాకు తెలిసినవేవో ముందర వ్రాసేసికుని, నాకు మరీ అంత తెలియనివి, ఉన్నారుకదా అని మా శ్రీవారిని అడుగుతూంటాను. ఏవేవో వ్రాస్తూంటారుకదా, ఆ మాత్రం తెలియదా అని. పాపం ఆయనకున్న వీక్ నెస్స్ ఏమిటంటే,తనకు ఏ మాత్రం పరిచయం లేని సబ్జెక్ట్ లో ఎవరైనా ఏమైనా అడిగితే పాపం టెన్షనొచ్చెస్తూంటుంది.

    అప్పటికీ, నేనెక్కడడుగుతానో అని భయ పడుతూ, షేవింగు చేసికుంటూనో, స్నానం చేస్తూనో, పూజ చేసికుంటూనో గడిపేస్తూంటారు! అలాగని నన్ను తప్పించుకునెక్కడికి వెళ్తారూ, మేమున్నదేం భవనమా ఏమిటీ, సింగిల్ బెడ్రూం, హాల్,కిచెన్! అక్కడ మా ఇంట్లో (స్వంత) అయితే, మా అగస్త్యని ఎత్తుకుంటూనో, నవ్యతో మాట్లాడుతూనో తప్పించేసికునేవారు.ఇకాడ, ( కొత్త బంగారులోకం లో డయలాగ్గు గుర్తుచేసికోండి!) పాపం అలాటి పప్పులేం ఉడకడం లేదు. అలా వచ్చీ, ఇలా వచ్చీ ఏదో ఒకటి అడగడం మానట్లేదూ, ఆయన విసుక్కోడం మానడం లేదూ!

    అలాగని ఆయనకేమీ తెలియదనడానికి వీల్లేదు.పుస్తకాలు చదువుతారు, ఎప్పుడు చూసినా నెట్ మీదే ఉంటారు. అదడిగిందీ, మనం చెప్పకూడదూ అంతే ! ఎప్పుడైనా నేను వ్రాసినవి అన్నీ కరెక్టవుతే శంకరయ్యగారూ, మురళీ కృష్ణ గారూ
చెప్తూంటారు కదా. అదీ విషయం! నేనెక్కడ బాగుపడిపోతానో అని దుగ్ధ!!అందుకనే పన్లన్నీ పూర్తిచేసికుని, బయటకెళ్ళిపోతే అసలు గొడవే ఉండదుగా, నా తిప్పలెవో నేనే పడతాను.బయటకెళ్ళి మళ్ళీ ఫోన్లోటి, 'నీ పజిలు పంపించడం అయిపోయిందా' అంటూ.అప్పుడుకానీ కొంపకి చేరరు. ఇదండీ విషయం !! ఇన్ని తిప్పలు పెట్టినా ఎప్పటికో అప్పటికి हाँगॅ कामियाब एक दिन् అనుకుంటూంటాను!!

మాశ్రీవారూ- Sixth Sense

    మామూలుగా నాకు ఊరికే బయటకు వెళ్ళి తిరగడం అంత ఇష్టమూ ఉండదు. పోనీ అలాగని అస్తమానూ, కొంపా గోడూ అంటూ ఇంట్లోనే కూర్చుని అదీ ఇదీ సవిరిస్తూ కూడా కూర్చోలేం కదా. ఆ ఇంటికి ఎంతచేస్తేనేం, ఎవరికైనా పడుతుందా,పాడా ? ఎవరికి కావలసినది వాళ్ళకి వండి పడేస్తే చాలు,ఇంటిది ఏమైతేనేం, ఏ గంగలో దూకుతేనేం.ఇలా అప్పుడప్పుడు అనుకుని, ఎప్పుడో పున్నానికీ, అమాసకీ ఏ కిందనున్నవాళ్ళింటికో వెళ్ళేదాన్ని.ఈయన కి పొద్దున్నే డబ్బా ఇచ్చేసి, అబ్బాయికి భోజనం పెట్టేసి,వాడు కాలేజీకి వెళ్ళిన తరువాత,ఓసారి మా కిందిక్వార్టరు లోకి వెళ్ళాను.ఆ వెళ్ళిన అరగంటలోనూ, ఈయన ఓ పదిసార్లు ఫోను చేసేశారు(ట), అయ్యనకేం, హాయిగా టేబిలు మీద ఎదురుగా ఉంటుంది. ఎప్పుడు పనిలేకపోతే అప్పుడో ఫోనూ! పోనీ ఫోను రింగవుతూందీ, ఎవరూ ఆన్సరు చేయడంలేదని, వదిలేయొచ్చుగా, అబ్బే, అలా వదిల్తే భమిడిపాటివారెలా అవుతారు! టెలిఫోన్ ఎక్స్చేంజ్ కి ఫోన్ను చేసేయడమూ, ఫోను ఊరికే రింగవుతూందీ, ఎవరూ ఎత్తడంలేదూ, పాడైపోయిందేమో చూడండీ అని ఓ complaint ఇవ్వడం.వాళ్ళంతా ఈయనకి బాగా పరిచయం లెండి, దీపావళి కి బక్షీసూ అవీ దండిగా ఇస్తూంటారులెండి, అంతే వాళ్ళవాడెవడో రావడం,ఇంతట్లో నేను ఇంటికే వచ్చేసీదాన్ని,' మేడం,మీరు ఇంట్లో లేరా, ఫోను ఎవరూ తీయడంలేదూ,ఏమైనా పాడయ్యిందేమో చూడూ అని సార్ complaint ఇచ్చారు'అని ఓ పలకరింపూ. చచ్చే సిగ్గేసేది-- ఏదో ఏడాదికోసారి బయటకు వెళ్తే, ఈయనిదేమిటీ,అలా చేస్తారూ, ఖర్మ ఈ టెలిఫోనువాడేం యాగీ చేస్తాడో, సారు ఆఫీసుకెళ్ళగానే మేడంగారు ఊరిమీదకు వెళ్తారూ అని-. ఏమిటో ఒక్కదాంట్లో స్వతంత్రం లేదమ్మా అనుకునేదాన్ని! ఇంక సాయంత్రం ఆయన ఇంటికిరాగానే పలకరింపోటీ,'ఏమోయ్ బయటకేమైనా వెళ్ళావా, మధ్యాన్నం ఫోను చేస్తే ఎత్తలేదూ' అంటూ. మనం చేసిన నిర్వాకం ( అదే ఎక్స్చేంజ్ కి complaint వగైరా) గురించేమీ మాట్లాడరు. ఆ రోజు చెప్పేశాను,అప్పుడప్పుడు, ఏ కిందవాళ్ళింటికో వెళ్తూంటాను, అలాటప్పుడు ఊరికే వస్తోందికదా అని ఫోన్లు చేసేసి, ఊరంతా టముకేయఖ్ఖర్లేదు అని.

    ఇంక ఆయన సాయంత్రం ఇంకా ఇంటికి రాలేదు కదా, ఈలోపులో కొంచెం చాయ్ పెట్టుకు తాగుదామూ అనుకున్నంతసేపు పట్టదు, ఆ చాయ్ వాసన ఎలా తగులుతుందో అమ్మా, ఠక్ మని డోర్ బెల్లు మ్రోగుతుంది.తీసి చూస్తే, మా శ్రీవారు! ఆఖరికి రిటైరయినతరువాతకూడా, ఈయన ఎప్పుడైనా బయటకు వెళ్ళి రావడం ఆలస్యం అయిందనుకోండి, టీ కి నీళ్ళు పడేసి, డికాక్షనుచేసి, పాలు పోసేలోపులో ఈయన ప్రత్యక్షం! 'సువర్ణసుందరి' సినిమాలో, నాగేశ్వర్రావు ఫ్లూటు వాయిస్తే, అంజలీదేవి ప్రత్యక్షమైనట్లుగా!పాపం వెళ్ళేముందర చెప్తూంటారు, ఫలానా టైముకి వచ్చేస్తానూ అని, ఆయన చెప్పే టైముకి చాయ్ పెట్టేసుకుని రెడీగా ఉండొచ్చు.time sense మాత్రం చాలా ఉంది.

    రోజంతా ఏవేవో చూస్తూ, టపాలు వ్రాసుకుంటూ, ఆ కంప్యూటరు ముందే సెటిలవుతూంటారు. మధ్యాన్నం భోజనం చేసి టి.వీ ల్లో ఏదో చూస్తూ, అక్కడే హాల్లో సోఫామీదే ఓ కునుకు తీస్తూంటారు. అర్ధరాత్రి దాటే దాకా పుస్తకాలూ,కంప్యూటరూ అంటూ కూర్చుంటే, నిద్దర్రాదూ? ఆ సంగతి వదిలేయండి, నేను కూడా వంటిల్లు సద్దుకుని, ఓ పుస్తకం చేతిలో పట్టుకునేసరికల్లా, కళ్ళుమూసుకుపోతాయి, సరే అని మధ్యలో మెళుకువొచ్చి చూస్తే, ఆయనుండరు, ఏమయ్యారా అని చూస్తే, సోఫామీదాయనా,చేతిలో రిమోటూ.టి.వీ.దారిన టి.వీ. ఇలా ఉంటుంది మావారి వరస. అదేదో పరీక్షలకెళ్తున్నట్లు అంత నిద్రాపుకుని మరీ చూడ్డం ఎందుకో! ఏదో నిద్రపోతున్నారు కదా అని, పోనీ బ్లాగ్గుల్లో,మనవాళ్ళందరూ ఎలా ఉన్నారో చూద్దామని, కంప్యూటర్ ఆన్ చెయ్యడం చాలు, ఈయన ప్రత్యక్షం పక్కనే! ' మధ్యాన్నం ఓ టపా రాశానూ, ఎవరైనా చదివేరా' అంటూ.

    నేను కంప్యూటర్ ఓపెన్ చేశానని ఎలా పసికడతారో, అలాగే చాయ్ పెట్టానని ఎలా కనిబెడతారో, అలాగే ఎప్పుడోసారి బయటకు వెళ్ళాననీ,ఎలా తెలుస్తుందో, ఈయనకెమైనా 'sixth sense' ఉందేమో అని నాకనుమానం !

అయోమయం, అధ్వాన్నం !!

    మా అబ్బాయి , Seth Godin , ISB హైదరాబాదు లో ఏదో లెక్చరు ఇస్తున్నారంటే, అక్కడికి వెళ్ళాడు. కోడలూ,పిల్లలూ ఒక్కళ్ళూ ఉంటారని, మేము మా ఇంటికి వెళ్ళాము.మా మనవడు అగస్థ్య తొ బాగా కాలక్షేపం అయింది. నవ్య స్కూలుకి వెళ్ళిపోయింది. మా కోడలైతే ఇంటినుండే పనిచేసికుంది. ఆయన సంగతి తెలుసుగా, కాలు కొంచెం బాగుపడింది, ఇంక ఇంట్లో ఎక్కడుంటారూ? మళ్ళీ మిస్టరీ షాపింగు కోసం, షాపర్స్ స్టాప్ కి వెళ్ళి,అగస్థ్యకి ఓ చొక్కా తెచ్చారు.క్రిందటి నాలుగునెలలూ వాడికి, పుట్టినరోజు 7 వ తారీకున, ఏదొవిధంగా, మిస్టరీ షాపింగు అసైన్ మెంటు రావడం, వాడికి ఏదో చొక్కాయో. జుబ్బాయో తేవడం.జేబులోది పడకుండా ఇదీ బాగానే ఉందనిపించింది.

   ఈవేళ మా అబ్బాయి హైదరాబాదు నుండి తిరిగి వచ్చాడు. మధ్యాన్నం లంచ్ చేసేసి, తిరిగి మేముండే ఎపార్ట్ మెంటుకి వెళ్ళిపోదామూ, అనుకుని, రిలయన్స్ లోకి వెళ్ళి కూరలూ, ఏవో ఇంట్లోకి కావలిసిన సామాన్లూ తెచ్చి, మా అబ్బాయితో చెప్పి ఇంటికి బయలుదేరాము. ఆయనేం కొన్నారో తెలియదు.ఓ నాలుగు సంచీలు భుజాన్నేసికుని ఆటో లో వచ్చాము.మా అబ్బాయి కారులో దింపుతానూ అంటే ఈయనే వద్దన్నారు. కారణం అప్పుడు నాకేం తెలుసూ?

   సంగతేమంటే అప్పుడెప్పుడో ఓసారి ఆయనతో మాటల్లో అన్నాను- ఐస్ క్రీం డబ్బా ఒకటి ఇంట్లో పెట్టండీ అని. అదెప్పుడూ వేసంకాలంలో, ఆయనకి ఇప్పటికి గుర్తొచ్చి, రిలయెన్స్ లో Baskin Robins దొరుకుతోందని, పెళ్ళాంమీద ప్రేమ పుట్టుకొచ్చేసి, పాపం ఓ డబ్బా కొన్నారు. పోనీ దాన్ని ఫ్రీజర్ లో పెట్టొచ్చుగా, అబ్బే అలాటివేవీ గుర్తుండవు! వర్షాలు పడుతూంటే, ఐస్ క్రీంలేమిటీ అని, కొడుకేమన్నా అంటాడేమో అని,' ఊరికే నీకు శ్రమెందుకురా, మేము ఆటోలో వెళ్ళిపోతాములే' అన్నారుట,ఇదన్నమాట అసలు సంగతి.

    ఇంటికొచ్చి, నేను ఇల్లూ అదీ తుడుస్తూంటే, ఆయన సంచీలు ఖాళీ చేసి, కూరలూ అవీ సద్దుదామనుకున్నారు. పాపం అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తూంటారు లెండి! ఏమిటో ఒక్కొక్క పొట్లం, కూరా తీయడం, దాన్ని ఓ గుడ్డతో తుడవడం, వామ్మోయ్ ఇంత శ్రధ్ధెక్కడినుంచొచ్చిందిరా దేముడోయ్ అనుకుంటూంటే, అసలు సంగతి తెలిసింది- పాపం ఆయన ఎంతో ప్రేమతో తీసికున్న ఐస్ క్రీం కాస్తా Liquid Robin అయిపోయిందని.అదేమిటండీ నాతో చెప్పనైనా లేదూ
లేకపోతే ఫ్రీజర్ లో పెట్టమైనా కానీ చెప్పేదాన్ని,అన్నాను. అంతా అయోమయం అధ్వాన్నమూనూ ! నేను చచ్చేట్లా తుడిచిన ఫ్లోర్ అంతా ఏమిటో జిగురుగా ఉందేమిటీ అనుకుంటే, ఇదండి ఆయన చేసిన ఘనకార్యం! మళ్ళీ ఫ్రిజ్ లో పెట్టిన కూరలు తీసి, ఓమాటు కడుక్కుని పెట్టాల్సొచ్చింది!
పన్లు చెయ్యరు, ఏదో బుధ్ధి పుట్టి చేస్తే ఇదీ నిర్వాకం !!

మా శ్రీవారూ-దీక్షావస్త్రాలూ    మాశ్రీవారి దీక్షావస్త్రాలనిగురించి ఓ టపా రాయాలనుకున్నా. పెళ్ళైన కొత్తలో, ఓ పైజమాలాటి పాంటేసికుని కూర్చునేవారు ఇంటా బయటా కూడా. ఎవరైనా మాఇంటికి వచ్చేరంటే,'ఎక్కడికైనా బయల్దేరుతున్నారా'అనేవారు.కొంతకాలానికి
ఆ పైజమా పాంటుల్లోంచి, బెల్ బాటం లోకి దిగారు.ఇంట్లో మాత్రం ఏవో పాత పాంట్లే వేసికుని కూర్చునేవారు. మొత్తానికి ఎలాగోలాగ లుంగీలు కొనిపించాను.మాపాగుతుంది కదా అని ఓ రెండుమూడు గళ్ళ లుంగీలు (శంఖు మార్కువి) తెచ్చేసికున్నారు. ఇంక అదే రంధి. మా మామగారు పోయినప్పుడు, అమలాపురం వెళ్ళినప్పుడు, మా పెదమామగారు, ఈయన్ని ఆ గళ్ళలుంగీల్లో చూసి చివాట్లేశారు.'అదేమిట్రా,బ్రెడ్డులూ,బన్నులూ అమ్మే కొట్టువాడిలాగ' అని.పుట్టి పెరిగింది
కోనసీమలో, పంచ కట్టుకోడమేనా సరీగ్గా రాదు.పీటలమీద కూర్చుని ఏ ప్రదక్షిణమో చెయ్యడానికి నుంచుంటే ఎప్పుడూడుపోతుందో అని భయమే ! లుంగీలా చుట్టపెట్టుకుంటే ఎవరైనా తిడతారెమో అని భయం. ఓసారి ఎక్కడో చూశారు,పంచ షేప్పులో కుట్టించిన పంచలు.దానికో బొందూ. కలకత్తాలో దొరుకుతాయిట. వాళ్ళఫ్రెండెవరినో కాళ్ళావేళ్ళా పడి, ఓ రెండు తెప్పించుకున్నారు!

   శుభ్రంగా ఆంధ్రదేశం లో పుట్టి ఈ బొందుపంచలేమిటీ అంటూ, మానాన్నగారు ఈయనకి పంచ కట్టుకోవడం నేర్పారు మొత్తానికి.మొత్తానికి అలాగ, పూజలు చేసికునేటప్పుడు పంచ కట్టుకోడం నేర్చేసికున్నారు!ఇంక ఆఫిసుకెళ్ళేటప్పుడు, ఓ రంగు ప్యాంటేసికునేవారు, నా బాధ భరించలేక. తెల్లదో, లేతరంగుదో వేసికుంటే, సాయంత్రానికి మాసిపోయేది,తెల్లారి లేచి మళ్ళీ అదే వేసికుంటానంటే ఎలాగండి బాబూ.ఆరోజుల్లో ఏమైనా వాషింగు మెషీన్లా ఏమిటీ,బాత్ రూం లో బకెట్టులో నానపెట్టి
చచ్చేట్లా ఉతుక్కోవడమే కదా
! ఈ సాధింపులు వదిలించుకోడానికి ముదురు రంగు పాంటుల్లోకి మార్చేశారు. పైగా వాటిమీద, రోజు విడిచి రోజు ఓ షర్టు మార్చుకున్నా ఆయన రోజెళ్ళిపోతుంది.అస్సలు డ్రెస్స్ సెన్స్ లేదండి బాబూ. ఓ రంగు నచ్చిందంటే
ఇంక కొట్టుకి వెళ్ళిన ప్రతీసారీ, అదే రంగు. నాకు పెళ్ళైన కొత్తలో ఆరెంజి రంగు చీరలే కొనేవారు. మా అత్తగారు, నేను స్నానం చేసి చీర మార్చుకోలేదనుకునేవారు.' ఏమే నీళ్ళోసుకుని చీర మార్చుకోలెదా' అనేవారు.'కాదూ మీ అబ్బాయి నాకన్నీ ఈ రంగువే కొన్నారూ' అని పెట్టె తీసి చూపించవలసివచ్చింది.ఆవిడ చివరకి ముద్దుల కొడుకుతో ' ఇవేం చీరల్రా మఠం లో వాళ్ళలాగ' అని చివాట్ళేసేవరకూ,నాకు ఆ కాషాయ రంగు చీరలే! మళ్ళీ ఈమధ్యన పాత జ్ఞాపకాల్లొకి వెళ్ళి
'ఆ రంగుల్లోవి దొరికితే మళ్ళీ మొదలెడదామా' అంటూంటారు.ఇప్పుడు మా అత్తగారుకూడా లేరు!

    ఆయన్ని కుర్తా పైజమ్మాల్లో(North Indian style) చూడాలని నాకు మనసూ.రిటైరుమెంటు ముందర దక్షిణ భారత దర్శనానికి వెళ్లినప్పుడు, అలాటిదోటి కొనిపించాను.అది చూసి మా పిల్లలు, ఇంకో నాలుగు జతలు ప్రెజెంట్ చేశారు! ఈయనకెంత చిరాకో,చూడిదార్ లాటిదేసుకోవడానికి, పోనీ కట్ చెయించేసికోనా అంటూంటారు. కాదండీ, అలా ముడతలు పడడమే స్టైలూ అంటే వినరే.స్వతహాగా తెలియదూ, చెప్తే అర్ధం చేసికోరూ.మా అబ్బాయికి కొంచెం టైట్ అయినప్పుడు, వాడి షర్టులు ( బ్రాండెడ్ వి) పోనీ వేసికుందామా అనుకుంటే, మా మనవరాలు ' తాతయ్యా, డాడీ షర్టేసేసికున్నావా' అని వీధిలో పెట్టేస్తూంటుంది.

    ఇంటిలోకి కోడలొస్తూందీ, ఇప్పుడైనా ఆ లుంగీలేసికుని కుర్చోకండీ అని పోరగా పోరగా మొత్తానికి ఓ నాలుగు పైజమాలు తెచ్చుకుని, ఇంక రోజంతా, బనీనూ, ఆ బొందు పైజమా.ఎప్పుడైనా మా అగస్థ్యని ఎత్తుకున్నప్పుడు తడిపితే, మార్చుకోండీ అంటే కోపం. ఫర్వాలేదూ, పసిపిల్లాడే కదా అంటారు. పైన పెట్టిన ఫొటోలో,ఆయన RKLaxman common man లా లేరూ గళ్ళకోటోటే తక్కువ!

పేద్ద గొప్పే !!

   మా శ్రీవారు క్రితం ఆదివారంనుండీ మూతి ముడుచుక్కూర్చున్నారు కారణం తెలుసుగా!మోకాలు బెణికిందని,బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కాలక్షేపం.మొన్న శుక్రవారం సాయంత్రం, మర్నాటికి కొబ్బరికాయ తెద్దామని, నేనే బయటకి వెళ్ళాను. ఈ లోపులో 'ఈనాడు' నుండి ఫోనొచ్చిందిట, ఈయనేం చెప్పారో ఆ భగవంతుడికే తెలియాలి.ఓ అరగంట పోయిన తరువాత వచ్చేటప్పటికి, 'అమ్మయ్యా, ఇప్పుడొచ్చావు బావుంది, ఓ అరగంట ముందర వచ్చుంటే, నా ప్రాణం పీకేదానివీ, అలా ఎందుకు మాట్లాడారూ,ఇలా ఎందుకు మాట్లాడారూ ' అంటూ.ఏం చేస్తాను అలవాటైపోయింది, అయినా మీకు తెలుసుగా, ఈ మగాళ్ళెలా మాట్లాడతారో, అందులో మనం లేకుండా అయితే పండగే పండగ!నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తారు. ఊళ్ళోవాళ్ళకేం తెలుసూ, వీళ్ళ అసలు గొప్పతనం ! కాలూ, చెయ్యీ సరీగా ఉన్నప్పుడే, ఇక్కడ వస్తువక్కడ తీసి పెట్టరు. ఇప్పుడాకాలునొప్పోటీ,ఎప్పుడు చూసినా కంప్యూటరు ముందరే కూర్చోడం.

   ఈవేళ వెరైటీ కోసమని राज्मा తో కూర చేస్తే,'అవి కొంచెం ఉడకనీయ వల్సిందోయ్' అంటూ, ఆ గింజలన్నీ తీసి ప్రక్కన పెట్టేసి, గ్రేవీ తో తినేశారు.ఈ మాత్రందానికి, నేను,అంత శ్రమపడి, గింజలు క్రితంరోజు నాన పెట్టడం ఎందుకూ,అవీ ఇవీ వేసి కూర తయారుచెయ్యడం ఎందుకూ? ప్రొద్దుటే సుజాత ఫోను చేసి చెప్పారు-'బాబయ్యగారూ, మీగురించి ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ లో వచ్చిందీ'అంటూ. ఈయన మెయిల్ ఓపెన్ చేయగానే, వేణు పంపిన ఎటాచ్మెంటు కనిపించింది.
ఇంక ఊళ్ళో వాళ్ళందరికీ టముకేసుకోవాలిగా,ఓ బ్లాగ్ వ్రాసేసికున్నారు.ఒక్క విషయం మాత్రం చెప్పాలి,అందులో' ... తనకూతురు పనిగట్టుకుని కంప్యూటర్ నేర్పిందని చెప్పారు' అని వ్రాశారు.నిజం చెప్పాలంటే ఆయనకి నేర్పింది మా అబ్బాయి.ఈయనేం చెప్పారో, ఆ ఇంటర్వ్యూ చేసినాయనేం విన్నారో? అందుకే అంటాను,నాలాటివాళ్ళుండాలీ,మీరు మాట్లాడేటప్పుడూ అని!

    అయినా ఒక విషయం చెప్పండి,ప్రతీ రోజూ, రోజుకోటి చొప్పున ఓ వరసా వావీ లేకుండా, వ్రాసుకుంటూ పోతే ఎప్పటికో అప్పటికి ఎవరో ఒకరు, పెద్దాయన వ్రాస్తున్నారూ అని జాలి పడి ఇంటర్వ్యూలూ అవీ చెయ్యకేంచేస్తారు? అదో గొప్ప విషయంలా ఊరంతా టాంటాం చేసికోవడం! క్వాలిటీ అమ్మా క్వాలిటీ ఉండాలి రాసేదాంట్లో,వ్రాసినవి 50 అయినా,అందరికీ ఉపయోగించే ఓ స్వీటు గురించి వ్రాస్తేనే కదా,క్రిందటి వారం దాని గురించి వ్రాశారూ? ఎవరిదొచ్చిందమ్మా ముందర పేపర్లో?
అది ఒప్పుకోరు.తయారుచేస్తే మాత్రం,దాచుకుని మరీ తింటారు.ఈ 38 ఏళ్ళ కాపరంలోనూ, ఒక్కసారంటే ఒక్కసారి, నువ్వు చేసింది బావుందీ అంటే ఆయన సొమ్మేంపోయిందో? నా చేతివంట తిన్న ప్రతీవారూ,ఇంకోసారి తింటే బావుంటుందన్నవాళ్ళే. కానీ మా శ్రీవారు మాత్రం 'బావుందీ,బావుందీ అని ప్రతీదానికీ చెప్పేదేమిటీ,రెండో సారి వేసికుంటే బావున్నట్లేకదా'. కానీ ఈమధ్యన ఆయనలో కొంచెం మార్పొస్తోందండోయ్,కోడలెప్పుడు చేసినా, బావున్నప్పుడు బావుందనిచెప్పడం నేర్చుకున్నారు. అందుకనేమో, కోడలెప్పుడు ఫోను చేసినా మావయ్యగారెలా ఉన్నారూ అంటుంది.ఇంక అమ్మాయైతే అడగఖ్ఖర్లేదు,ఈవేళ అంతపనిలోనూ చూడ్డానికి వచ్చేసింది.ఎంతైనా వాళ్ళూ వాళ్ళూ ఒకటే!

మా వారికి పథ్యం భోజనం !!   ట్రింగు ట్రింగ్ ట్రింగ్...
హలో, ఫోన్ తీసేసరికి సుమతి , హాయ్ ఎలా వున్నావు? అంటూ కబుర్లు చివరికి వచ్చేసరికి వంటల దగ్గరికి సంభాషణ. మీ ఇద్దరికేగా, ఎంతసేపులే నీ వంట...
అలా అనకు, ఇద్దరికయినా అన్ని చేయాలికదా అన్నాను.
సుమతి: ఇంతకీ ఏం చేసావు?
నేను : కొబ్బరి అన్నం , మొలకెత్తినపెసల కూర, ఖడీ, నిన్నటి షీరా వుంది,చపాతీలునూ,...
సుమతి: ఎలా చేసావు?...
నేను: అనుకుంటూనేవున్నాను, నువ్వు అడుగుతావని,
సుమతి: అసలే ఫొను లో కూడాను తొందరగా చెప్పేయ్..
నేను: కొలతలు అవీ ఆడగకు , చిన్న అల్లంముక్క,కొబ్బరి,వెల్లుల్లి రేకలు ఓరెండు, ఓ పచ్చిమిరపకాయ గ్రైండు చేసి తీసి ఓ టమాటా కూడా గ్రైండు చేసిపెట్టుకొని, చ్లిన్న కుక్కరు లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీరా వేసి వేయింఛి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేయించి,కరివేపాకు, గ్రైండు చేసిన మసాలా వేసి, గ్రైండు చేసిన టమాటా వేసి,ఓ చిటికెడు ధనియాపొడి, ఓచిటికెడు జీరాపొడి,గరంమసాలాపొడి, కొద్దిగా పసుపు వేసి,మొలకెత్తిన పెసలు వేసి ఓకప్పు నీళ్ళు పోసి,'శక్తి'చారుపొడికొద్దిగా , సాంబారుపొడి,కొద్దిగా కారం , ఉప్పు వేసి కుక్కరు 3 కూతలు వచ్చిన తరువాత కట్టేసి చల్లారిన తరువాత, కొత్తిమీర సన్నగాతరిగివేసాను.అంతేనూ, అయినా ఇలాంటివి ఫొన్లో మాట్లాడొచ్చా, మనం కలిసినప్పుడు చెప్పుకుందాం సరేనా---
సుమతి: నాకు కావలసింది తెలిసిపోయిందిలే--
నేను : ఏమిటబ్బా--
సుమతి: నీ సీక్రెట్, చారుపొడి, సాంబారుపొడి కలపడమన్నదీ--
నేను : సరేలే, ప్రతివాళ్ళకూ వాళ్ళ వాళ్ళ సిక్రెట్లు వుంటాయిమరీ---ఫొన్ పెట్టేస్తున్నాను, బై ---అన్నట్టు ఓ చిటికెడు పంచదార కూడా కలపాలి, మళ్ళి చెప్పలేదు అంటావు, నిజంగా బై --
మళ్ళీ ఓ పది నిమిషాల్లో అమ్మాయిఫొను, డాడి కాలినొప్పి ఎలావుందీ అంటూ ?
తగ్గిందమ్మా, అయినా ఇంకా రెస్టు తీసుకోవాలి అని చెప్పాను, ఇంతకు ముందే మా కోడలి ఫోను, ఎలావుందంటూ, ఎలాగయినా వీళ్లందరికి ఈయన అంటే చాలా చాలా అభిమానం , ప్రేమాను,నాకు నిత్యం కాలునొప్పి,నడుంనొప్పి వస్తూనేవుంటాయి అబ్బే ఎవరూ పట్టీంఛుకోరూ-- నేనే చెప్పుకోవాలి,నాకూ ఫలానా అని అప్పుడు అయ్యో! పాపం ఎలా వుందమ్మా అని అడుగుతారు.నీకు నొప్పి రాని రోజున చెప్పమ్మ, బయటకెక్కడకయినా వెడదాం అని నవ్వేస్తారు.( మా సుమతికి తెలీదులెండి. మావారి కాలినొప్పి గురించి,అందుకే వంటల గురించి అడిగింది)కాలినొప్పి అంటే గుర్తుకి వచ్చింది మా అత్తగారికి కాలినొప్పి వుండేది,ఆవిడ 70 సంవత్సరాల వయసులో ఓ సారి నాతో 'పలహారానికి ఇదుగో ఇవేళ ఇన్ని సగ్గుబియ్యం గింజలు (చేతితో చూపిస్తూ)ఇన్ని పాలచుక్కల్తొ వుడకపెట్టి,జీడిపప్పుపొడివేసి, రెండుకిస్మిస్ పళ్లువేసి పెట్టమ్మా, అన్నట్లు ఓ రెండు ఏలకులు చితక్కొట్టి వెయ్యామ్మా', అనేవారు---అంతావిని ఇదంతా ఎందుకూ సగ్గుబియ్యం పరవాన్నం చేయమని చెప్పొచ్చుకదా అనేదాన్ని. అంతేవెంటనే 'చాల్లే ! ఓఘాయిత్యం నాకు ఈ వయసులో పరవాణ్నాలు కావాలా' అనేవారు.మా యిద్దరిదీ అత్తాకోడళ్ళసరాగాలకంటే అమ్మమ్మ మనవరాళ్ళ సరదాలే వుండేవి ఎక్కువగానూ--మా అమ్మమ్మగారి మాటల్లొ చెప్పాలంటే నిత్యం చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళేవరు? నా నొప్పి నాకుండుగాక, నొప్పి కాలికేగాని కడుపుకికాదుకదా,ఎందుకయినా మంచిది ఓ ఫొటొ తీసి పెడెతే పోతుంది,మళ్ళి పిల్లలు ఫొను చేయొచ్చు వాళ్ళ డాడి కి సరిగ్గా చేసిపెట్టానో లేదో అని.నాకు ఫొటొ ఎందుకూ అని శ్రీవారు ఆంటూంటే , ఎందుకయినా మంచిది ఓ ప్రూఫ్ వుండాలి, లేకుంటే మీరు మాత్రం తక్కువా, తుమ్మితే మీ బ్లాగులో తేలుతున్నాను.
ఖర్మ కాలి ఎప్పుడైనా కొంచెం పన్ను పోటెడుతోందండీ అంటే 'పీకించేద్దామా పోనీ' అంటారు మా శ్రీవారు.ఎవరైకైనా పన్ను పీకించుకొమని ఉచిత సలహా ఇవ్వడం ఎంత సంబడమో ఆయనకి. కారణం తెలుసుగా !

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes