మామూలుగా నాకు ఊరికే బయటకు వెళ్ళి తిరగడం అంత ఇష్టమూ ఉండదు. పోనీ అలాగని అస్తమానూ, కొంపా గోడూ అంటూ ఇంట్లోనే కూర్చుని అదీ ఇదీ సవిరిస్తూ కూడా కూర్చోలేం కదా. ఆ ఇంటికి ఎంతచేస్తేనేం, ఎవరికైనా పడుతుందా,పాడా ? ఎవరికి కావలసినది వాళ్ళకి వండి పడేస్తే చాలు,ఇంటిది ఏమైతేనేం, ఏ గంగలో దూకుతేనేం.ఇలా అప్పుడప్పుడు అనుకుని, ఎప్పుడో పున్నానికీ, అమాసకీ ఏ కిందనున్నవాళ్ళింటికో వెళ్ళేదాన్ని.ఈయన కి పొద్దున్నే డబ్బా ఇచ్చేసి, అబ్బాయికి భోజనం పెట్టేసి,వాడు కాలేజీకి వెళ్ళిన తరువాత,ఓసారి మా కిందిక్వార్టరు లోకి వెళ్ళాను.ఆ వెళ్ళిన అరగంటలోనూ, ఈయన ఓ పదిసార్లు ఫోను చేసేశారు(ట), అయ్యనకేం, హాయిగా టేబిలు మీద ఎదురుగా ఉంటుంది. ఎప్పుడు పనిలేకపోతే అప్పుడో ఫోనూ! పోనీ ఫోను రింగవుతూందీ, ఎవరూ ఆన్సరు చేయడంలేదని, వదిలేయొచ్చుగా, అబ్బే, అలా వదిల్తే భమిడిపాటివారెలా అవుతారు! టెలిఫోన్ ఎక్స్చేంజ్ కి ఫోన్ను చేసేయడమూ, ఫోను ఊరికే రింగవుతూందీ, ఎవరూ ఎత్తడంలేదూ, పాడైపోయిందేమో చూడండీ అని ఓ complaint ఇవ్వడం.వాళ్ళంతా ఈయనకి బాగా పరిచయం లెండి, దీపావళి కి బక్షీసూ అవీ దండిగా ఇస్తూంటారులెండి, అంతే వాళ్ళవాడెవడో రావడం,ఇంతట్లో నేను ఇంటికే వచ్చేసీదాన్ని,' మేడం,మీరు ఇంట్లో లేరా, ఫోను ఎవరూ తీయడంలేదూ,ఏమైనా పాడయ్యిందేమో చూడూ అని సార్ complaint ఇచ్చారు'అని ఓ పలకరింపూ. చచ్చే సిగ్గేసేది-- ఏదో ఏడాదికోసారి బయటకు వెళ్తే, ఈయనిదేమిటీ,అలా చేస్తారూ, ఖర్మ ఈ టెలిఫోనువాడేం యాగీ చేస్తాడో, సారు ఆఫీసుకెళ్ళగానే మేడంగారు ఊరిమీదకు వెళ్తారూ అని-. ఏమిటో ఒక్కదాంట్లో స్వతంత్రం లేదమ్మా అనుకునేదాన్ని! ఇంక సాయంత్రం ఆయన ఇంటికిరాగానే పలకరింపోటీ,'ఏమోయ్ బయటకేమైనా వెళ్ళావా, మధ్యాన్నం ఫోను చేస్తే ఎత్తలేదూ' అంటూ. మనం చేసిన నిర్వాకం ( అదే ఎక్స్చేంజ్ కి complaint వగైరా) గురించేమీ మాట్లాడరు. ఆ రోజు చెప్పేశాను,అప్పుడప్పుడు, ఏ కిందవాళ్ళింటికో వెళ్తూంటాను, అలాటప్పుడు ఊరికే వస్తోందికదా అని ఫోన్లు చేసేసి, ఊరంతా టముకేయఖ్ఖర్లేదు అని. ఇంక ఆయన సాయంత్రం ఇంకా ఇంటికి రాలేదు కదా, ఈలోపులో కొంచెం చాయ్ పెట్టుకు తాగుదామూ అనుకున్నంతసేపు పట్టదు, ఆ చాయ్ వాసన ఎలా తగులుతుందో అమ్మా, ఠక్ మని డోర్ బెల్లు మ్రోగుతుంది.తీసి చూస్తే, మా శ్రీవారు! ఆఖరికి రిటైరయినతరువాతకూడా, ఈయన ఎప్పుడైనా బయటకు వెళ్ళి రావడం ఆలస్యం అయిందనుకోండి, టీ కి నీళ్ళు పడేసి, డికాక్షనుచేసి, పాలు పోసేలోపులో ఈయన ప్రత్యక్షం! 'సువర్ణసుందరి' సినిమాలో, నాగేశ్వర్రావు ఫ్లూటు వాయిస్తే, అంజలీదేవి ప్రత్యక్షమైనట్లుగా!పాపం వెళ్ళేముందర చెప్తూంటారు, ఫలానా టైముకి వచ్చేస్తానూ అని, ఆయన చెప్పే టైముకి చాయ్ పెట్టేసుకుని రెడీగా ఉండొచ్చు.time sense మాత్రం చాలా ఉంది. రోజంతా ఏవేవో చూస్తూ, టపాలు వ్రాసుకుంటూ, ఆ కంప్యూటరు ముందే సెటిలవుతూంటారు. మధ్యాన్నం భోజనం చేసి టి.వీ ల్లో ఏదో చూస్తూ, అక్కడే హాల్లో సోఫామీదే ఓ కునుకు తీస్తూంటారు. అర్ధరాత్రి దాటే దాకా పుస్తకాలూ,కంప్యూటరూ అంటూ కూర్చుంటే, నిద్దర్రాదూ? ఆ సంగతి వదిలేయండి, నేను కూడా వంటిల్లు సద్దుకుని, ఓ పుస్తకం చేతిలో పట్టుకునేసరికల్లా, కళ్ళుమూసుకుపోతాయి, సరే అని మధ్యలో మెళుకువొచ్చి చూస్తే, ఆయనుండరు, ఏమయ్యారా అని చూస్తే, సోఫామీదాయనా,చేతిలో రిమోటూ.టి.వీ.దారిన టి.వీ. ఇలా ఉంటుంది మావారి వరస. అదేదో పరీక్షలకెళ్తున్నట్లు అంత నిద్రాపుకుని మరీ చూడ్డం ఎందుకో! ఏదో నిద్రపోతున్నారు కదా అని, పోనీ బ్లాగ్గుల్లో,మనవాళ్ళందరూ ఎలా ఉన్నారో చూద్దామని, కంప్యూటర్ ఆన్ చెయ్యడం చాలు, ఈయన ప్రత్యక్షం పక్కనే! ' మధ్యాన్నం ఓ టపా రాశానూ, ఎవరైనా చదివేరా' అంటూ. నేను కంప్యూటర్ ఓపెన్ చేశానని ఎలా పసికడతారో, అలాగే చాయ్ పెట్టానని ఎలా కనిబెడతారో, అలాగే ఎప్పుడోసారి బయటకు వెళ్ళాననీ,ఎలా తెలుస్తుందో, ఈయనకెమైనా 'sixth sense' ఉందేమో అని నాకనుమానం !
మాశ్రీవారూ- Sixth Sense
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 19, జులై 2010, సోమవారం
2 కామెంట్‌లు:
>>మనం చేసిన నిర్వాకం ( అదే ఎక్స్చేంజ్ కి complaint వగైరా) గురించేమీ మాట్లాడరు.
:)
>>పరీక్షలకెళ్తున్నట్లు అంత నిద్రాపుకుని మరీ చూడ్డం ఎందుకో!
ఇది సూపరు.మా అమ్మ గుర్తొచ్చింది ఈ డైలాగుకి.మా ఇంట్లో కూడా ఇదే తంతు(ట) రోజూ,అమ్మ చెప్తుంది.
>>ఈయనకెమైనా 'సిక్ష్థ్ సెన్సే ఉందేమో అని నాకనుమానం !
మరి ఫణి గారిని అడిగారా ఎప్పుడయినా?
ఆవకాయా,
నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.ఆయన్నడిగేదేముందీ, రోజూ అనుభవిస్తున్నానుకదా!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి