RSS

అలాటి రోజులు మళ్ళీ వస్తాయంటారా....

   మేము రాజమండ్రీ లో ఏణ్ణర్ధం, అదీ గోదావరి గట్టుమీద ఎపార్ట్మెంటు అద్దెకు తీసికుని మరీ ఉన్నాము. గోదావరి ఘాట్లకు వెళ్ళి, ఏదో దోశిట్లో నీళ్ళు తీసికుని,నెత్తిమీద చల్లుకోడం తప్పించి, స్నానం చేసే ధైర్యం ఎప్పుడూ చేయలేకపోయాము. మా శ్రీవారికి నీళ్ళంటే, భయం మూలాన స్నానం చేయలేదనుకోవచ్చు కానీ, నదీస్నాలంటే ఎంతో ఇష్టం ఉన్న నేను కూడా స్నానం చేయలేదంటే కారణం-ఒడ్డున పేరుకుపోయిన, చెత్తా చెదారం చూసి భయపడి పోవడమే!
స్నానం చేస్తే, ఏం రోగం పట్టుకుంటుందో అనే భయం! మన నదీ పరివాహక ప్రాంతాలు, అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. ఊళ్ళో ఉన్న చెత్తా చెదారం, ఏ పట్టింపూ లేకుండా, గోదావరిలోకి వదిలేయడమే.పేపర్లలో మాత్రం, మన నాయకులందరూ,పర్యావరణం రక్షించవలసిన బాధ్యత అందరిదీ అని లెక్చర్లు ఇస్తూంటారు.ఏ ఒక్కరికి పట్టినా ఇలా ఉండేది కాదు. చట్టాలదారి చట్టాలదే.

   ఈ సందర్భం లో, నా చిన్నప్పుడు, మా అమ్మమ్మ తెల్లవారుఝామునే, లేచి మా ఇంటికి వెనక్కాల ప్రవహించే 'కాలవ' కి కాలవ అంటే ఒప్పుకోరు మా తణుకు వాళ్ళు,గోస్థనీ నది అనాలి.ఏదో ఒకటి, పేరులో ఏముందిలెండి,అక్కడికి వెళ్ళి,నదిలో దిగి స్నానం చేసి ఓ పెద్ద గుండ్రటి ఇత్తడి బిందె తో నీళ్లు మడిగా తెచ్చి మా తాత గారి సంధ్యావందనం సమయానికి తయారుగా వుంచేది, అంటే సూర్యోదయానికి ముందరే తెచ్చేసెదన్నమాట. ఏ కాలమైనా సరే! ఒండ్రు మట్టి ఒంటికి రాసుకొని పచ్చి పసుపు కొమ్ము అరగదీసి మొహానికి రాసుకొని లేకపొతే యింత పసుపు రాసుకొని నిత్యం కాలవ స్నానం వలనో ఏమో మరి తెలీదు చివరి వరకూ కూడా జుట్టు పూర్తిగా తెల్లబడకుండా నల్ల జుట్టు వుంది. బహుశా ఆ ఒండ్రు మట్టి యిప్పటి ముల్తాని మట్టి లా పని చేసేదనుకుంటాను.సాయంత్రానికి కొబ్బరికాయలు ఆడించిన స్వచ్చమైన కొబ్బరి నూనె తలకి పట్టించి నున్నగా దువ్వుకొని వేలు ముడి వేసేసుకొనేది. కాళ్ళకి కూడా నూనె మర్ధనా చేసుకొని, అరికాళ్ళకి రాసుకునేది.చెప్పులు వాడకం తక్కువే ఆ రోజ్జుల్లొ అయినా కాళ్ళ పగుళ్లు అవీ వుండేవికావు.దోసకాయలు పచ్చడి కోసం తరిగినా, టమాటాలు తరిగినా, పుచ్చకాయలు కోసినా,ఆ తొక్కలతో చేతులకి మొహానికి రాసుకునే వారు,ఎవరికయినా బత్తాయి రసం తీస్తే ఆ పిప్పి రాసుకునేవారు, బహుశా యిప్పటి ఫ్రూట్ ఫేషియల్ లాంటిదే అనుకుంటాను, ఇంక ఆదివారం వచ్చిదంటే మా పిల్లలందరికి ఇంత నూనె రాసి సున్నిపిండితో నలుగు పెట్టి, మందార ఆకులు కుంకుడు కాయల రసంతో తలరుద్ది సాంబ్రాణి పొగ వేస్తే స్వర్గానికి బెత్తెడు దూరంలో వున్నామా అన్నంత హాయిగా వుండేది, సాంబ్రాణి వాసన తలవెంట్రుకల్కి పట్టి సువాసన వస్తూ వుండేది.ఇవి అన్ని ఏ తాళపత్ర గ్రంధా లలొ చదివారో తెలీదు. ( వాళ్ళింట్లొ తాళపత్ర గ్రంధాలు వుండేవి లెండి అప్పట్లో) నిజానికి యిప్పుడున్న స్పా బాత్ లు అవీ వీటిముందు ఎందుకూ పనికిరావనుకుంటాను.

   అన్నట్లు చెప్పడం మరిచిపోయాను, ఓ సారి యిలాగే స్నానికి వెళ్ళి, ముందుగా ఇత్తడిబిందె తోమేసి, గట్టుమీద పెట్టుకుని, నీళ్ళల్లోకి దిగింది,స్నానం చేద్దామని. ఆ నదీ ప్రవాహానికీ, వడికీ తట్టుకోలేక,కొట్టుకుపోయింది. చేతికి అందిన ఓ పుల్ల పట్టుకుని,ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూండగా, ఆ పై రేవులో ఎవరో చూసి, అరే మన సుందరం అక్కయ్యర్రా అంటూ, రక్షించి గట్టుమీదకు తెచ్చారు. అదృష్టంకొద్దీ మా అమ్మమ్మగారి పుట్టింటి వారి ఇల్లు,ఆ గట్టుకి దగ్గరలోనే ఉంది.ఈవిడకి స్పృహ వచ్చిన తరువాత, ఈ హడావిడంతా చూసి, 'అయ్యో అయ్యో మన రేవులో గట్టుమీద ఇత్తడిబిందె పెట్టానే, ముందర ఉందో ,ఎవడైనా ఎత్తుకు చక్కాపోయాడో చూడండే' అంటూ ఒకటే గోలట!

   ప్రొద్దుటే స్నానాలు చేయడం, బిందెతో మడినీళ్ళు తీసికోవడం, పదైయ్యేసరికి గుడ్డలుతుక్కోవడం, కొద్ది దూరంలో పశువుల్ని కడగడం,అయినా సరే, ఆ నదిలోని నీళ్ళు స్వచ్చంగానే ఉండేవి. ఎప్పుడు చూసినా ప్రవహిస్తూనే ఉండేది.కొత్తనీళ్ళొచ్చినప్పుడు,ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు బలైపోయేవారు. దాంట్లో అంటూ మునిగిపోతే, మళ్ళీ పెరవలి లాకుల దగ్గరే తేలడం!!

   అటువంటి రోజులు వచ్చి, మన పవిత్ర నదీజలాల్లో స్నానాలు చేసే అవకాశం ఉంటుందంటారా?

3 కామెంట్‌లు:

హితుడు చెప్పారు...

kalushyam perigipotunna ee rojullo alanti rojulu malli rakapovachu..

Sudha Rani Pantula చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ...
నదీ స్నానాలు, అమ్మమ్మ జ్ఞాపకాలతో నా చిన్నప్పటి జ్ఞాపకాల తుట్టెని కదిలించారు... ఓ నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళి వచ్చాను. ఇలాగే....సరిగ్గా ఇలాంటి జ్ఞాపకాలే రాసుకున్న నా పోస్టు మా చిన్నప్పటి నదీ ప్రవాహంతో ముడి పడినది...
http://illalimuchatlu.blogspot.com/2009/01/blog-post.html
మళ్ళీ అలాంటి రోజులు చూడం....ఇప్పటి వాళ్ళకి చూపించలేం కూడా.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@హితుడు గారూ,

ఎప్పటికో అప్పటికి వస్తాయనే ఆశతో ఉంటేనే బాగుంటుందేమో !!

@సుధా గారూ,

మీ టపా చదివాను.చాలా బాగుంది.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes