RSS

పిలుపులు

   ఫలాన రోజున మా అబ్బాయి వివాహము మీరు తప్పకుండా రావాలి. వివాహము హైద్రాబాదులో, వస్తారు కదా, లేదంటరా రెసెప్క్షను ఫలానరోజున పోనీ అప్పుడు రండి. పిల్లలని ఆశీర్వదించినట్లుగాను వుంటుంది, మన పాత స్నేహితుల్ని కలవవొచ్చును ఏమంటారు?ఇది పెళ్ళి పిలుపు పిలుపుతో బాటు ఉచిత సలహా.అదేమిటీ, అమ్మాయి వాళ్ళది ఎక్కడో తూర్పు గోదావరి అన్నట్లున్నారు?ఏమిటోనండీ,అందరికీ సౌకర్యంగా ఉంటుందని హైదరాబాద్ లో చేయమన్నామూ అని సాగతీసుకుంటూ చెప్పడం! మగపెళ్లివారికైతే బాగానే ఉంటుంది, వీళ్ళ కొడుకో, కూతురో ఆడబడుచో ఇంకోళ్ళెవరో ఆ ఊళ్ళోనే ఉండడంతో వీళ్ళకేమీ ఫరవాలేదు. కానీ, ఎక్కడో ఉండే ఆడపెళ్ళి వారికి, అంతంత దూరం వచ్చి
కూతురు పెళ్ళి చేయాలంటే ఉండే కష్టం అసలు, అవతలివాళ్ళు ఎందుకు గుర్తించరో, నాకైతే ఇప్పటికీ అర్ధం అవదు.

   పిల్లాడి తరపు వాళ్ళలాగ, ఏదో పెళ్ళికి ఒకరోజు ముందరొచ్చేసి, పని కానిచ్చేయడం ఆడపిల్ల తల్లితండ్రులకి కుదరదుగా. ఓ నెల ముందునుంచి ఎన్నెన్ని ఎరేంజిమెంట్లు చేయాలి? క్యాటరింగు,ఫొటోలు, బట్టలు ఒకటేమిటి,ప్రతీ దానికీ పాపం ఆ తండ్రే కష్టపడాలి. అదీ ఏ ఉద్యోగమైనా చేస్తూంటే, ఆఫిసుకి శలవు పెట్టడం దగ్గరనుండి అన్నీ సమస్యలే.పోనీ వీళ్ళకి తెలిసిన చుట్టమో,పక్కమో ఉన్నాడనుకుందాము, అన్నిటినీ అతనిమీద వదిలిపెట్టేయలేడు కదా. చివరి నిమిషంలో ఏదైనా లోటుపాట్లొస్తే, చివాట్లు తగిలేది ఈయనకేగా.ఎవరిమీద బాధ్యత పెట్టామో ఆయన్ని ప్రతీదానికీ శ్రమ పెట్టడానికి మొహమ్మాటం.ఈ గొడవలన్నీ పడలేక, ఓ పోర్షనోటి అద్దెకు తీసికుని అక్కడే భార్యనుంచేసి,ఓ నెలరోజులు ఎలాగోలాగ కాలక్షేపం చెయ్యాలి.పొనీ ఈవిడ ఒక్కర్తీ ఉంటోందీ, చేసుకోలేదేమో అనుకుని, ఏదో సహాయం చేద్దామని,ముందుకు వద్దామనుకున్నా సవాలక్ష సమస్యలు. ఇంట్లో భార్యని కన్విన్స్ చేయాలి.ఆవిడేమీ అపోహ పడకుండా!అబ్బబ్బ ఎన్నెన్ని సమస్యలండి బాబూ, వీటికి కారణం ఎవరూ, మగపెళ్ళివారి గొంతేరమ్మ కోరిక!

   ఇదివరకటి రోజుల్లో, ఆడపెళ్ళివారి స్వగృహమో, వసతి గృహమో,ఏదీ లేకపోతే, స్వంత ఊళ్ళోని,ఏ కల్యాణమండపం లోనో చేసేవారు, కారణం స్థానబలం.ఎటువంటి లోటుపాట్లొచ్చినా, మేమున్నామంటూ ముందరకి వచ్చేవారు, చుట్టాలూ, స్నేహితులూనూ.ఇప్పుడలా కాదే, మొగపెళ్ళివారే డిసైడ్ చేస్తారు, ఏ కల్యాణమండపం లో చేయాలో.పైగా ముందరే చెప్పేస్తారు, మా అబ్బాయి ఆఫిసు స్నేహితులూ, కాలేజీ ఫ్రెండ్సూ వస్తారు, వాళ్ళకి విడిగా రూమ్ములుండాలండోయ్, ఎక్కడో హొటల్లో ఉండమంటే ఏం బావుంటుందీ? పెళ్ళికొడుకు తరఫునయ్యే ఖర్చు ఓ వెడ్డింగ్ కార్డొకటే. అవికూడా పోస్టు ఖర్చులేకుండా, హాయిగా స్కాన్ చేసేసి పంపేస్తున్నారు.పోనీ ఎంతమంది రావొచ్చో అయినా చెప్పగలరా అని అడిగినా, ఎంతమందని చెప్పగలమండీ,అప్పటికీ అందరినీ పిలవడమే లేదూ, మీకు అనవసరంగా శ్రమైపోతూందనీ అంటాడే కానీ ,నెంబరు మాత్రం చెప్పడు.పోనీ ఆ వచ్చేవాడైనా ఒక్కడూ వస్తాడా,కొత్తగా పెళ్ళిచేసికున్న భార్యతో వస్తాడా అన్నదీ తెలియదు.ఏదో హనీమూన్ లా ఉంటుందీ అనుకుని, పెళ్ళిరోజుకి పొద్దుటే, భార్యతో తయారు.వీళ్ళిద్దరికీ విడిగా ఓ రూమ్మూ.ఇలాటి 'జంటలు' ఇంకా ఎంతమందొస్తారో ఆ భగవంతుడిక్కూడా తెలియదు.ఎలాగూ శలవు పెట్టి వచ్చాం,హొటల్ లో రూమ్మిచ్చారూ అని, పెళ్ళితరువాత ఓ రెండు రోజులుండే ప్రోగ్రాం చేసికుంటాడు.ఏదో పెళ్ళిరోజుకైతే ఫరవా లేదు కానీ, ఈ స్నేహితుల హనీమూన్ కూడా, స్పాన్సర్ చేయమంటే కష్టం కాదూ?

   స్వంతఊళ్ళో, చేసికుంటే ఈ గొడవలన్నీ ఉండేవి కావుకదా.మగ పెళ్ళివారి తరఫున ఇంటినుండి బయలుదేరేది ఎవరూ, తల్లీ, తండ్రీ, పెళ్ళికొడుకూనూ ( స్నాతకం పీటలమీద కూర్చోవాలి కనుక వాళ్ళూ, తాళి కట్టాలి కాబట్టి ఆ అబ్బాయీనూ).ఇంక ఏ ఒడుగో ఏదో కూడా చేయాలంటే, ఇంకో రోజు ముందరే రావాలి.ఇంక మిగిలిన వాళ్ళంటారా, పెళ్ళికి తప్పకుండా రావాలేం అంటారే కానీ, ఎలా రావాలో అంటే రిజర్వేషనూ వగైరాల గురించి నోరెత్తరు. పైగా అడిగితే, మేమే తత్కాల్ లో టికెట్లు తీసికోడానికి,రేప్పొద్దుటే క్యూలో నుంచోవాలిటా, అని ఓ ముక్కన్నారే అనుకోండి, ఇంకేం అడుగుతాం?రెండు నెలల ముందునుంచీ, పెళ్ళి మాటలు జరుగుతున్నాయి కదా, రిజర్వేషను చేయించుకోలేదంటే నమ్మే మాటేనా? మనం పెళ్ళికి పిలిస్తే, వెళ్ళడానికి ఎరేంజ్మెంట్స్ ఏం చేశారూ అని అడగడం, ఇదే వాళ్ళు పిలిస్తే తత్కాల్ అంటూ చెప్పడం.ఇదివరకటి రోజుల్లో మగ పెళ్ళివారంటే, ఓ బస్సు కుదుర్చుకుని,దాన్నిండా చుట్టాలూ, స్నేహితుల్నీ తీసికుని, మహ అయితే పెళ్ళికొడుక్కి వేరే టాక్సీలో పంపేవారు.ఇప్పటికీ వోల్వో బస్సుల్లో 'ఫలానా వారి పెళ్ళి'అంటూ చూస్తూంటాము.

   ఇన్ని కబుర్లు చెప్తారూ, మీరు మాత్రం ఏం చేశారూ అని అడగొచ్చు. అమ్మాయి పెళ్ళి కి,వరంగాం లో( పూణె కి 350 కి.మీ) ఉంటున్నా, పెళ్ళికొడుకు తరఫు వారు ఢిల్లీ లో ఉంటున్నా, ఇద్దరికీ, వచ్చే చుట్టాలకీ సౌకర్యంగా ఉంటుందని
పూణె లో చేశాము. అయినా ఏ కష్టమూ లేకుండా, కారణం,మా వియ్యాలారు ముందరే చెప్పేశారు, మా స్టే గురించి మీరేమీ శ్రమ పడొద్దూ అని.అలాగే, మా అబ్బాయి ఎంగేజ్మెంటు టైములో మావారే హైదరాబాద్ వెళ్ళడానికి, తిరిగి రావడానికీ బాధ్యత తీసికున్నారు. ప్రొద్దుటే చేరి, రాత్రికి మళ్ళీ ట్రైనెక్కేశాము.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

baaga chepparu ,inka chaala vunnayandi,katanma vaddu grand ga pelli cheylantaru teera chuste pelliki rvataniki ranu ponu
chargelu inak chaala vunanuyi lendi .ipudu kotha trend entnatnte aa abbyiki akko chello vunte maa ammaiki ila chesam miru mahto vashte meme ant aarange chestham miru dabbulu iste chaalu anantu vundi vyvaharam.eduti vari sathoamta eem atram anchanveyaru. katanam vaddu annarukada anukunte daniki padinthalu ekkvi vuntnundi

అజ్ఞాత చెప్పారు...

chala baaga chepparu ,nijamga aada pilla vallani ardham chesukune vaallu chaala thakkuva.

కొత్త పాళీ చెప్పారు...

చాలా బాగా రాశారు, పెళ్ళిళ్ళ సాధక బాధకాలు

kiranmayi చెప్పారు...

పిన్ని గారు
వరస కలిపెస్తున్నాను ఏమి అనుకోకండి. ఆంటీ అని పిలిస్తే బ్లాగర్లు అందరు తన్తారేమో అని భయం. ముఖ్యంగా మనసులోమాట సుజాత ఆంటీ.
ఇంకా మీరు రాసిన టపా గురించి: ఈ టాపిక్ మీద మాట్లాడాలంటే అబ్బో చాలానే ఉంది. నా పెళ్ళప్పుడు మా అతగారు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో చెయ్యమన్నారు. వాళ్ళ ఊరేదని అడగండి. తమిళనాడు లో కారైకుడి. మరి అరవ వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని మోస్తారేమో అందరు నన్ను. మరేం చెయ్యను కొన్ని కొన్ని అలా జరిగి పోతాయి.
సరే నా పెళ్లి విషయానికొస్తే మా నాన్న"నేను మద్రాస్ లో చేస్తాను" అని వాళ్ళని ఒకసారి అడగంగానే ఒప్పెసుకున్నారనుకోండి. మా నాన్న నాకు మాత్రం "వాళ్ళ ఊళ్ళో చేస్తే వాళ్ళ "den " కి వెళ్లినట్టు ఉంటుందే. మద్రాస్ లో నే చేస్తాగా" అని అభయం ఇచ్చేసారు. తరవాత ఆయన ఫ్రెండ్ అన్నాడట "అక్కడ చేసేస్తే బాగానే ఉండేది సర్. అధితుల్ని, arrangements ని అన్నింటిని వాళ్ళే చూసుకునేవారు. మీకు డబ్బులు కలిసోచ్చేవి" అని. నేను ఇప్పటికి మా ఆయన్ని తిడుతూనే ఉంటా. నిన్ను చేసుకున్న కాబట్టే నా ఫ్రెండ్స్ ఎక్కువమంది లేకుండా నా పెళ్లి మద్రాస్ లో అయ్యింది అని. నా ఫ్రెండ్ ఒకమ్మాయి పెళ్ళికి వాళ్ళ అత్తగారు వాళ్ళు దిల్షుక్నగర్ లో ఒక స్పెసిఫిక్ హాల్ లో పెళ్లి చెయ్యాలి అని ముహూర్తం కూడా ఆ హాల్ దొరికే రోజు ఓకే చేసుకున్నారు. ఎందుకు? వరంగల్ నించి వచ్చే వాళ చుట్టాలందరికి అది "on the way to hyderabad" అట.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@అజ్ఞాత గారూ,

ఏమిటో ఇలా సంబోధించడానికి ఏదోలా ఉంది. హాయిగా, అమ్మా నాన్నలు పెట్టిన పేరుతో వ్రాస్తే బాగుంటుందిగా.మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

@కొత్తపాళీ గారూ,

ధన్యవాదాలు.

@కిరణ్మయీ,

మీ నాన్నగారి స్నేహితుడు చెప్పినట్లుగా, ప్రతీ చోటా ఖర్చులు కలిసొస్తాయని అనుకోడం బుధ్ధితక్కువ. పైగా ఖర్చుకి ఓ అదుపుండదు.మీ నాన్నగారు చేసిందే బావుంది.నేను వ్రాసినది మీ ఫ్రెండు అత్తవారి వారు చేసిన బాపతన్నమాట !

అజ్ఞాత చెప్పారు...

@అజ్ఞాత గారూ,
ఏమిటో ఇలా సంబోధించడానికి ఏదోలా ఉంది. హాయిగా, అమ్మా నాన్నలు పెట్టిన పేరుతో వ్రాస్తే బాగుంటుందిగా.
------------------------------------
అమ్మా, పెద్దవారు. మీరు కూడా అలా మాట్లాడితే ఎలాగమ్మా? మీకు అజ్ఞాత అని సంబొధించడం ఇబ్బందిగా ఉంటే, అజ్ఞాతగా వ్రాసే వ్యాఖ్యలు మీకు నచ్చకపోతే మీ బ్లాగులో అజ్ఞాత వ్యాఖ్యలని అనుమతించే సదుపాయం తీసేయండి. మన పేరెందుకులే గాని ఈ బ్లాగులో రాసిన నాలుగు ముక్కలు బాగున్నాయి, ఒక్కసారి మెచ్చుకుందాం అనుకున్నవారు మీరు అజ్ఞాత వ్యాఖ్యలని అనుమతించే సదుపాయం ఉన్నపుడు అలా రాయడం తప్పు కాదు. దానికే అలాంటి మాటలెందుకులెండి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes