RSS

నాకూ నిండాయి రెండేళ్ళు....

   ఏమిటో బ్లాగులు వ్రాయడం మొదలెట్టిన ప్రతీ వాళ్ళూ,ఏడాదయ్యింది, రెండేళ్ళయిందీ అని వ్రాసేవాళ్ళే. నేను కూడా అదేదో అనేస్తే, నాకూ మనశ్శాంతుంటుంది.ఈవేళ్టికి నేనూ రెండేళ్ళు పూర్తిచేశానండి. అయితే ఏమిటీ, మమ్మల్నేం చేయమంటారూ అని అడక్కండి. మర్రిచెట్టుకింద ఓ మామూలు మొక్కలా, ఏదో గాలికీ, ఎండకీ, వర్షానికీ వయస్సొచ్చేస్తోంది.పోనీ ఎప్పుడైనా ఓ టపా పెడదామా అంటే, కరెంటు పోవడమో ఏదో ఒకటి.రాత్రిళ్ళు పెడదామా అంటే,ఇరవైనాలుగ్గంటలూ ఆ కంప్యూటరు వదలరే మా మర్రి చెట్టు గారు!మొదట్లో కొద్దిగా సంసారపక్షంగా వ్రాసేదాన్ని, ఈయన బ్లాగులేమో రాజధాని స్పీడులో వెళ్తున్నాయి, ఇదికాదు వ్యవహారం అని, నా పధ్ధతి మార్చేశాను.అప్పటినుండీ నా టపాలు కూడా చూడ్డం ప్రారంభించారు.పోనీ ఆయనలా రోజుకోటి రాయడానికి, నేనేమైనా రిటైరయ్యానా ఏమిటీ? అంత సుఖం కూడానా?

   పోనీ ప్రొద్దుటే బ్రేక్ ఫాస్టు చేసేసి, ఊరిమీదకెళ్ళిపోతాను, ఆ టైములో వ్రాసుకోవచ్చుగా అని సలహా ఓటీ! ఇంట్లో తుడుపులు,పూజా, మనకి వంటా ఎవరు చేస్తారమ్మా?మళ్ళీ పన్నెండునరయేసరికి, టేబుల్ మీద అన్నం గిన్నె లేకపోతే రోజెళ్ళదూ.అదేదో సీరియల్ చూస్తూ,టేబిల్ మీద గిన్నెలు సర్దేస్తారు,ఖర్మకాలి కుక్కరు పెట్టలేదా ఇంక నా పని అయిపోయిందే! మరి అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎలా కుదురుతుందీ? అందుకే 'బువ్వ'కే సెటిలైపోయి, అమావాశ్యకో,పున్నానికో ఓ టపా వ్రాయడం. అలా మూలుగుతూ, ముక్కుతూ మొత్తానికి ఓ 'శనగ' పైన టపాలు వ్రాశాను. మళ్ళీ ఈ 'శనగ' అంటే ఎమిటనుకుంటున్నారా, మా శ్రీవారి కోనసిమలో, కొబ్బరికాయలు కదూ, వాటిని లెఖ్ఖ పెట్టేటప్పుడు, వందని శనగ అంటారుట. ఏం శనగలో ఏమిటో, లెఖ్ఖల్లోకూడా తిండి యావే! ఏం చేస్తాంలెండి, చేసికున్నవాడికి చేసికున్నంతా! 40 ఏళ్ళవుతోంది, ఇంక మారేదేమిటి లెండి? ఏ కూర చేసినా, అందులో ఆవ పెట్టవోయ్ అనడమే.పైగా ప్రతీదానికీ ఆయనక్కవలిసినలాగ చేయమనడం. పోనిద్దురూ,ఉద్యోగంలో ఉన్నంతకాలం డబ్బాలోనే కదా తిన్నారూ,అని జాలి పడిపోయి, ఏదో ఆయనకు నచ్చే విధంగానే చేసిపెడుతున్నాను.చేయడం మొదలెట్టానుకదా అని రోజుకోటి అడగడం. అందుకే మొగుడైనా, పిల్లలైనా నెత్తికెక్కించుకోకూడదంటారు.

   మా తమ్ముడి భార్య, తణుకులో ఏవో నోములూ, వ్రతాలూ చేసికుంటోంది, పోనీ మనమెలాగూ చేసికోలేదూ, ఆ నోమేదో చూసి, ప్రసాదం తీసికుంటే, ఓ కాస్త పుణ్యమైనా వస్తుందీ అని, మా అమ్మను చూసినట్లుంటుందీ అనుకుని, తణుకు వెళ్ళొస్తానండీ అన్నాను.అల్లుడి బెట్టుసరి చేయొద్దూ, నువ్వొకర్తివే వెళ్ళూ అని, టిక్కెట్లు రిజర్వ్ చేశారు. దేంట్లోనూ బస్సులో! అడక్కడక్క ఒకసారి అడిగిందీ, పోనీ ట్రైనులో చేద్దామని ఉండొద్దూ, అబ్బే ఓసారి ఇలా బస్సుల్లో వెళ్తే, మళ్ళీ జీవితంలో ఎప్పుడూ అడగదూ, దీనికిదే మందూ అని అనుకున్నట్లేకదా!అంతా కలిపి ఓ వారం రోజులు! అదీ చూస్తాను, ఈ వారంరోజులూ, ఆయనక్కావలిసినట్లుగా వండి, తిండెవరు పెడతారో? అప్పుడు తెలిసొస్తుంది, భార్య తడాఖా ఏమిటో!

   నా టపాలకి నారుపోసి, నీరుపొసిన మీ అందరికీ కృతజ్ఞతలు. వ్యాఖ్యలు పెట్టిన వారి పేర్లన్నీ వ్రాసే ఓపిక లేదు,అదిగో మా ఇంటాయన అదేనండి శ్రీవారు ఫొనుచేసేశారు, పన్నెండున్నరకల్లా తయారూ, కుక్కరు పెట్టుకోవాలి......

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కంగ్రాట్స్ అండోయ్ :)))
మీరేనయం కదండీ రెండేళ్ళకే ' శెనగ ' దాటెసారు . నేను ముడేళ్ళనుంచీ రాస్తున్నా మీకంటే ఓ ' పరక ' ఎక్కువ రాసానంతే .
అయ్యగారికి అమ్మరాజీనామా సినిమా చూపించెయ్యండి . దెబ్బకి దారిలోకొస్తారు. రాలేదా... వచ్చే వరకూ
ఆ సినిమా వదలకుండా చూపిస్తూనే వుండండి

అజ్ఞాత చెప్పారు...

:)

అజ్ఞాత చెప్పారు...

:) అభినందనలండి.

జయ చెప్పారు...

అభినందనలండి. ఇంకా చాలా, చాలా పుట్టినరోజులు చేసుకోవాలండి.

mayura చెప్పారు...

congrats aunty.meeru inka mee chinnappati vishayalu, appati, ippati changes gurinchi raasthe baaguntundhi. inka mee pillalidharu baaga chadhivarani uncle bloglo choosanu. naaku kooda konni tips ivvandi pillalni penchatamlo.

కొత్త పాళీ చెప్పారు...

మాస్టారికి మీరేం తగ్గట్లేదు శైలిలో.
brilliant style.
రేండేళ్ళ పండక్కీ, శనగ దాటినందుకూ ప్రత్యేక అభినందనలు.

మాలా కుమార్ చెప్పారు...

పుట్టినరోజు శుభాకాంక్షలండి .

మాలా కుమార్ చెప్పారు...

abhinandanalanDi .

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@లలిత గారూ,

ఎప్పుడో అప్పుడు అలాటిదేదో చేస్తేనే కానీ పరిస్థితి బాగుపడేటట్లు లేదు !!

@అజ్ఞాత,

ధన్యవాదాలు.

@జయా,

మీ అందరి అభిమానం ఉంటే అలాగే చేయాలనిపిస్తోంది.

@మయూరా,

ఈమధ్యనే తణుకు వెళ్ళొచ్చానుగా, ప్రయత్నిస్తాను.

@కొత్తపాళీ గారూ,

మరీ అలా అనేయకండి, ఉడుక్కుంటారు !

@మాలాకుమార్ గారూ,

ధన్యవాదాలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes