RSS

పుట్టింటికి పంపించేశారు...

   ఇన్నాళ్ళకి నన్ను ఒక్కత్తినీ పుట్టింటికి పంపించారండి మా శ్రీవారు! ఇద్దరు పిల్లలూ, ఇద్దరు మనవరాళ్ళూ, ఇద్దరు మనవలూ వచ్చిన తరువాత ఇదేం అఘాయిత్యం అనుకోకండి!మా మరదలు మంగళూరులో ఉంటోంది లెండి, తను ఏవో వ్రతాలూ,పూజలూ చేసికొందామని, అత్తారింటికి ( మా అమ్మగారి వద్దకు) వచ్చింది.ఆడపడుచులందరూ కూడా ఉంటే బావుంటుందని,మా అమ్మగారు ఫోను చేస్తే, ఏదో పేద్ద ఉపకారం చేస్తున్నట్లు టిక్కెట్లకోసం ప్రయత్నించారు.అంత తక్కువ టైములో ఎలాగూ దొరకవూ, ఈ వంక పెట్టి పంపించఖ్ఖర్లేదూ అనుకుని పాపం. ఆయన అనుకున్నట్లుగానే టిక్కెట్లు దొరకలేదు. రైళ్ళలో అన్నీ వెయిటింగు లిస్టులే.అమ్మయ్యా అని ఊపిరిపీల్చుకునే లోపల, మా కోడలు ఆన్లైన్ లోబస్సులకోసం వెదికింది.దొరికేశాయి!

   పూణె నుండి, హైదరాబాద్ దాకా, శతాబ్దిలో చేయించింది,అదే రోజున వాళ్ళ అమ్మగారూ, నాన్నగారూ ఎలాగూ అదే ట్రైనులో వెళ్తున్నారుకదా అని. సాయంత్రం 5.30 కి ఆడుతూ పాడుతూ చేరింది. కాఫీ త్రాగేసి,బస్సుకోసం ఖైరతాబాద్ వెళ్ళి,అక్కడ ఆ ట్రావెల్స్ వాళ్ళు, ఏదో కిడ్నాప్ చేసేవాళ్ళలాగ ఓ మినీ బస్సులో కుదేసి, ఇంకెక్కడికో తీసికెళ్ళి కాకినాడ వెళ్ళే బస్సులో కూర్చోపెట్టారు.అదో స్లీపర్ బస్సూ.బాగానే ఉందనుకోండి.కానీ, మార్గంలో ఏసీ పనిచేయడం మానెసింది.టాప్ మీదుండే డోర్ తెరిచేయడం వలన చల్లగాలి వేయడంతో ప్రయాణం బాగానే ఉంది.

   తణుకు లో మా ఇంటి దగ్గరే ఉన్న 'బెల్లం మార్కెట్' దగ్గర దింపేయమనడంతో, తెల్లవారుఝాము 4.30 కి అక్కడ దిగాను.అటు నడకకి ఎక్కువా, రిక్షాకి తక్కువా అన్నట్లుంది. అయినా ఆ సమయంలో అక్కడ రిక్షాలెక్కడ దొరుకుతాయి?హైవే మీద ఝూమ్మని వెళ్ళే ట్రక్కులూ,బస్సులూ ఓవైపూ, ఇంకోవైపు భౌభౌ మని మొరుగుతున్న కుక్కలూ, మధ్యలో నేనూ ! ఓ చేత్తో సూట్ కేసు డ్రాగ్ చేస్తూ, భుజానికి బ్యాగ్గు తగిలించుకుని, అలోలక్ష్మణా అనుకుంటూ నా పాదయాత్ర ప్రారంభించాను. ఆ క్షణంలో అనుకున్నానులెండి, ఆయనకూడా ఉంటే ఎంత బాగుండేది, ఆ బ్యాగ్గైనా తగిలించుకునేవారూ అని! ఒపిక ఉన్నన్నాళ్ళూ ఎప్పుడూ అవకాశమే రాలేదు ఒక్కర్తినీ ప్రయాణం చేయడానికి, తీరా వచ్చేసరికేమో ఉన్న ఓపిక కాస్తా హుళక్కయిపోయింది.ఆపసోపాలు పడుతూ బయలుదేరేసరికి, మా చెల్లెలు కనిపించింది అమ్మయ్యా అనుకున్నాను.ఆ బ్యాగ్గు కాస్తా చెరోవైపూ పట్టుకుని, ఇంటికి చేరాము.

   వెళ్ళి కూర్చున్నానో లేదో,శ్రీవారి దగ్గరనుండి ఫోనూ-'ఆంధ్రభూమి ఆదివారం పేపర్లో తను వ్రాసిన వ్యాసం వచ్చిందీ అని.పోనీ మా శ్రీవారి ఘనకార్యం అందరితోనూ చెప్పుకోవచ్చు అని, ఆ పేపరుకోసం, ఊళ్ళోకి బయలుదేరాను. ఆంధ్రభూమి,ఏరోజుదారోజే దిక్కులేదు, ముందురోజుదెక్కడదొరుకుతుందీ? ఆంధ్రభూమి ఇక్కడెవరూ తెప్పించుకోరండి అనేవాడొకడూ.ఆఖరికి నిన్నటి రద్దీలో దొరికినా డబ్బిచ్చి తీసికుంటానూ అన్నా దొరకలేదు. ఇవన్నీ ఆయనకి చెప్పి ఆయన ఫీలింగ్స్ హర్ట్ చేయడం ఎందుకూ అని చెప్పలేదు.

   ఎలాగూ బజారులోకి వచ్చానుకదా అని,పిల్లలందరూ తింటారని ఐస్క్రీం ఫ్యామిలీ ప్యాక్కొకటి తీసికున్నాను. ఇంటికి వచ్చి, మా అమ్మాయి వాళ్ళ పిన్నులకి,అమ్మమ్మకీ, అత్తకీ ఇచ్చిన బ్యాగ్గులూ, మా కోడలు తన పిన్నత్తగార్లకి ఇచ్చిన గిఫ్టులూ పంచేశాను. మా మేనల్లుడు, చిన్నవాడు కదా అని, ఓ వాచ్చీ, తినే సరుకులూ ఇచ్చాను.వాటిదారిన వాటిని తీసికుని, మా అక్కకేదేదో ఇచ్చావూ, నాకేమీ లేదూ అని అల్లరి పెట్టేస్తే, వాణ్ణి ఊరుకోపెట్టడానికి,సర్లెనాయనా బజారుకెళ్ళి నీక్కావలిసినదేదో తెస్తానూ, అన్న పాపానికి నన్నుకూర్చోనిస్తేనా ప్రతీ అరగంటకీ 'అత్తా బజారెప్పుడు వెళ్తున్నావూ' అని ఒకటే గోల! మొత్తానికి అయిదున్నరకి మళ్ళీ బజారుకి వెళ్ళి వాడికోసమే ప్రత్యేకంగా ఓ స్క్రాబుల్ బోర్డూ, ఏరొప్లెన్ విత్ రిమోట్ తెచ్చి ఇచ్చాను. మొదటి రోజు అలా పూర్తయిందండి.

5 కామెంట్‌లు:

Advaitha Aanandam చెప్పారు...

chaalaa bagundi meeru vivarinchina vidhanamu.... waiting for more

yalamanchili చెప్పారు...

బాగుందండీ.!
.........పుట్టింటికి పంపించారండీ, అన్న వాక్యంతో మొద‌లెట్టి - ... పూర్త‌యిందండీ అన్న వాక్యంతో ముగించిన మీ ఆర్టిక‌ల్ బాగుంది. చక్క‌టి గోదావ‌రి యాస‌తో రాసిన మీ వ‌చ‌నం.. మాకిద్ద‌రికీ బాగుంద‌నిపించింది. ఇటువంటి ప‌ద సంప‌ద‌ను మా www.godavariyouth.com లో ఎక్కువ‌గా వాడాల‌ని, ఇటువంటి ఆర్టిక‌ల్స్ ఎక్కువ‌గా వేయాల‌ని అనుకొంటున్నాం. ఎనీ హౌ గుడ్ ఆర్టిక‌ల్స్....

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@శరత్,
ధన్యవాదాలు.
@మాడి,
థాంక్స్.
@యలమంచిలి,

ధన్యవాదాలు. మీరు ఇచ్చిన లింకు చూశాను. చాలా బావుంది.

పానీపూరి123 చెప్పారు...

మీరు తణుకు వెళ్ళినన్ని రోజులు ఫణిబాబుగారు బెంగతో సరిగ్గా భోజనం చేశారో లేదో? :-(

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

పానీపురీ,

అలాటిదేమీ లేదు బాబూ.హాయిగా ఉన్నారు !!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes