RSS

అడిగేవాళ్ళు లేపోతే. సరీ.....

   ఏదో నా దారిన నేను ఏవో దేముళ్ళూ, దేవతలూ, పూజలూ, పునస్కారాల గురించీ వ్రాసుకుంటున్నాను. ఈ మధ్యన వ్యాఖ్యలు పెట్టేవాళ్ళే కనిపించడం లేదు. ఔనులెండి మా వారి బ్లాగుల్లాగ ఉంటాయా ఏమిటీ? ఏదో ఉపవాసం రోజున చప్పిడిపిండి తిన్నట్లుంటాయి. కొంతమందికి శనివారం ఫలహారం ఇడ్లీలూ, మినపట్లూ ఉంటేనే కానీ నచ్చదు. పోనిద్దురూ ఎవరిష్టం వారిది. తుపాకీ గురి పెట్టి బలవంతంగా వ్యాఖ్యలు వ్రాయించుకోలేముగా.

   అడిగేవాళ్ళెవరూ లేరని, మా శ్రీవారు ఈమధ్యన పేట్రేగిపోతున్నారు. ఆయన జోక్కులన్నీ నామీదే. ఊళ్ళోవాళ్ళమీదేస్తే ఎవరూరుకుంటారు? తేరగా దొరికేది కట్టుకున్నదే కదా!.కన్న కొడుకైనా, కూతురైనా వాళ్ళమీద జోకులేయడం మొదలెడితే, ఏదో కన్న తండ్రికదా అని నాల్రోజులోపికపడతారు. మరీ ఎక్కువైపోతే చూడు నాన్నా ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని చెప్పేస్తారు! ఇంక మిగిలిందెవరూ, నేనే కదా. ఏదో వయస్సులో పెద్దాయనా, చిన్నప్పటినుండీ పెద్దలకు గౌరవం ఇవ్వాలీ అని నేర్చుకోడం చేత, ఇన్నాళ్ళూ ఓపిక పట్టాను. ఊరుకుంటూంటే నెత్తికెక్కేస్తున్నారు హన్నా !.

   అందుకే నిన్నెప్పుడో వ్రాశిన టపా మీద శ్రీ శర్మ గారో వ్యాఖ్య పెట్టారు--"భమిడిపాటి వారు ఉత్తి కబుర్ల పోగులు..."--అని. ఓ మెతుకు చూస్తే తెలియదూ అన్నం పూర్తిగా ఉడికిందో లేదో? అందుకే మరి, ఊరికే ఎడాపెడా రాసేయడం కాదు బాబూ, ఎంతమంది నమ్ముతారూ అనికూడా చూసుకోవాలి. చూడండి ఎలా అంటున్నారో," పి.ఏ. డ్యూటీ చేస్తున్నారా.." నమ్మేమాటేనా ఇదీ?

   ఏదో నాలుగు ముఖస్థుతి మాటలు చెప్పేయడం ముందర తరువాత తాటాకులు కట్టేయడం. కోనసీమవారండి బాబూ. తెలిసినవారూ, ఏదో చుట్టరికం కూడా ఉందిలెండి, అని కట్టబెట్టారు. ఈమాత్రం పెళ్ళికొడుకే దొరక్కపోతాడా మా ప.గో.జి లోనూ! ఏమిటో అంతా రాసిపెట్టుంది,ఈయన పాలిట పడ్డాను. ఒకటా రెండా, దాదాపు నలభైఏళ్లనుండి ఆడేసికుంటున్నారు. ఇదివరకైతే ఇంటికొచ్చిన ప్రతీ వాళ్ళతోనూ నామీద జోక్కులే! ఉద్యోగంలోంచి రిటైరయినప్పటినుండీ, పాపం ఈయన చెప్పే కబుర్లు వినడానికి ఎవరూ దొరకడం లేదు, ఇదివరకేమిటీ విధాయకం కాబట్టి వినేవారు. కానీ ఇప్పుడలాకాదుగా మరి, కొడుకేదో కంప్యూటరిచ్చేటప్పటికి ఇదిగో ఇలా ఊరిమీద పడ్డారు. చదివేవాళ్ళకేముందీ, ఇంకో భార్యాభర్తల విషయాలు entertainmen టేగా! అదండి మావారి సీక్రెట్టూ!

   ఈయనకేనా, నాకుమాత్రం తెలుగులో టైపు చేయడం రాదా అనుకుని నేనూ మొదలెట్టాను. రాయడం వరకే నాపని, దానికి హంగులూ, అలంకారాలూ పాపం ఆయనే చేస్తూంటారులెండి. అలా ఒప్పుకోకపోతే, దానిమీద కూడా ఓ టపా రాయగల సమర్ధులు మా శ్రీవారు, ఒప్పుకుంటే పోలే !ఒక్క విషయం ఒప్పుకోవాలిలెండి, పాపం అల్పసంతోషి. ఈమాత్రం రాస్తే చాలు సంబరపడిపోతారు. ఆయన సంతోషాన్నెందుకు కాదనాలీ? పోనిస్తురూ!ఏదో చేయమన్నానుకదా అని పెత్తనం ఇస్తే, మరీ "పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందిట" లాగ చేతికొచ్చిందల్లా రాస్తే ఎలాగా?

   అదేదో సెల్ ఫోనూ, డిజిటల్ డైరీ కొన్నానని వ్రాశారు. ఛస్తానా, పుట్టినరోజుకి రెండు మూడు నెలలముందునుంచీ, అదేదో లౌడ్ థింకింగుట, నాకు ఈ పుట్టినరోజుకి ఇలాటిదుంటే బావుండునూ అని కలవరింతల్లో కూడా అదే సొద. ఏదో అప్పుడూ ఇప్పుడూ పిక్కించిందీ, పోపుల డబ్బాలో దాచుకున్నదీ, ఎప్పుడో పుట్టింటికి వెళ్ళినప్పుడు, అమ్మో నాన్నో చేతిలో పెట్టిందీ, అదికూడా సరిపోపోతే, పిల్లల్ని అప్పడిగీ, మా పక్క లేడీడాక్టరుగారి సహాయంతో కొనిపెట్టాను.ఈమాత్రం దానికే "అస్థిత్వం" అంటూ ఉబ్బేయడం! అదేమిటండీ మీ చేతిలో ఖర్చులకి డబ్బియ్యరా అనడక్కండి. ఆ ముచ్చటా తీరింది- ఎప్పుడో పెళ్ళైన రెండో రోజున అనుకుంటా, అత్తారింట్లో మావాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూంటే, ఈ పెద్దమనిషి పేద్ద గొప్పగా వచ్చి, తన చేతిలో ఉన్న పర్సు నాచేతిలో పెట్టేశారు. అందరూ అనుకున్నారు, అక్కడ మా ఆడపడుచుకూడా ఉందిలెండి, అబ్బో మా వదినదే అంతా కంట్రోలూ అనీ, ఆహా ఓహో మా అమ్మాయిదెంతదృష్టం అని మావాళ్ళూ అనుకోడానికి తప్పించి, మళ్ళీ ఈ నలభైఏళ్ళలోనూ, ఆయన జీతం ఎంతో తెలియదు, పోనీ పెన్షనేనా తెలుస్తుందా అంటే అదీ లేదు. ఇదండి బాబూ నా కంట్రోల్! ఆ పర్సూ, దాంట్లోని వందరూపాయలూ మాత్రం ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఆయనమాత్రం ఓ వంద పర్సులైనా మార్చుంటారు!

   మళ్ళీ ఈమధ్యన ఇంకో టపా వ్రాసినట్లున్నారు. రోజూ పోరగా పోరగా మొత్తానికో ముహూర్తం చూసుకుని, ఆ పెన్షనెకౌంటేదో జాయింటు చేశారు. చేయడం అంటే చేయించారుకానీ, దాని డెబిట్ కార్డు ఎక్కడుందో బ్రహ్మకైనా తెలియదు. ఇంకెందుకూ ఆ జాయింటూ చూసుకుంటూ పులుసులో వేసికోడానికా! ఏదో పబ్లిసిటీకోసం చేయించారు కానీ, అదేమైనా ఆరుస్తుందా తీరుస్తుందా? ఏమిటో రోజులెళ్ళిపోతున్నాయి.......

12 కామెంట్‌లు:

SJ చెప్పారు...

bagundi mee tapaa..:))

అజ్ఞాత చెప్పారు...

peddammagaaru memantaa mee party ye.. pedannannagaari tapaalu baavuntaayi kaani meevi only super gaa vuntaayi..chaala normal gaa simple gaa anipistaaru meeru bhale concept tho raastaaru.chaala natchaayi meevi.ee madhya raasinavi mukyamgaa cheppalante..raasi phalaalu gurunchi raasindi chaala baavundi.kaani pedanannagaarni emi anaddandi.paapam meeku help chestaaru.maaku help chestaaru.meeku ekkuva raayadam kudardu anukuntaanu.so pedanannagaare kadaa maakosam rojoo raasedi so iddari party lendi.chaala abhinandaneeyulu meeriddaru.

krsna చెప్పారు...

హన్నన్నా... అట్టా ఉరుకుంటే ఎట్టా? కడిగేద్దాం అసలు సంగతి ఏంటో.

sarma చెప్పారు...

చెల్లాయ్ !

(పల్లెటూరివాళ్ళం. మాకు పేర్లుపెట్టి పిలుచుకోడం కంటే వరసలతో పిలుచుకోడం అలవాటు. ఏమనుకోకుతల్లీ.)
భమిడిపాటి వారు కబుర్ల పోగులనికదా అన్నాను. నిజమే కదా. గాలి పోగుచేసి కబుర్లుచెప్పడం అందరివల్లా అవుతుందా చెప్పమ్మా. జీన్స్ నుంచి వచ్చిన అలవాటు పోతుందా చెప్పు మరి. భమిడిపాటి కామేశ్వర రావు గారు నుంచి నేటికాలపు భమిడిపాటి రామగోపాలంగారి దాకా అందరు భమిడి పాటివారే కదా తల్లీ. మరి శ్రీవారు మాటలవారే కాని చేతలవారు కాదంటావా? ఎంతయినా కౌండిన్యస గోత్రీకులుకదా. సహవాస దోషం నీకుకలిగిందికదమ్మా. అల్ప సంతోషులని నేవేఅన్నావు కదమ్మా. సద్దు కుందాం. డబ్బులెవరిదగ్గరుంటె ఏమిటితల్లీ మనంచెప్పినట్లు బండి నడిచేటపుడు. నేనిలా అన్నానని బావగారికి చెప్పకేం. వూంటానమ్మాయ్.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@సాయి,

ధన్యవాదాలు.

@అజ్ఞాత,

అంతలా నచ్చినప్పుడు, పేరు కూడా వ్రాసుంటే ఎంతబాగుండేదీ? ఎనీ వే థాంక్స్ !నిజమే, ఆయన నాకు సహాయం చేస్తున్నారు, కాదనను, అలాగని నామీదే జోక్కులేస్తే ఎలా మరి?

@krsna,

వదిలేద్దాం పోనిస్తూ. పెద్దవారు !

@అన్నయ్యగారూ,

నాకు అన్నలేనిలోటు తీర్చినందుకు సంతోషం. ఒకవిషయం, మాది శ్రీవత్స గోత్రం.మీరు వ్రాసింది, ఆయనతో చెప్పొద్దంటే ఎలా? మా ఇద్దరిమధ్యా దాపరికం లేదు.

Advaitha Aanandam చెప్పారు...

మీ బ్లాగు చాలా కాలం క్రితం ఇలాగే ఒకసారి అక్కడి నుంచి వచ్చి చదివానండీ....
తరువాత బుక్ మార్క్ చేసుకోవడం మర్చిపోయాను నాకు భమిడిపాటి అనే గుర్తుంది కానీ ఎంత ఆలోచించినా ఇంకో పేరు గుర్తు రాదు ఎన్ని సార్లు వెతికినా దొరకదు...

లక్కీగా మొన్న బాబాయ్ గారి బ్లాగు కనపడింది. ఆత్రంగా బ్లాగంతా వెతికాను ఎక్కడైనా మీ బ్లాగు లంకె దొరుకుంతుందేమో అని..... అంతెందుకు బాబాయి గారు శ్రావణ మాస వ్రతాలప్పుడు అది తిన్నాను, ఇది తిన్నాను అని రాసిన బ్లాగు కోసం వెతికా ...... ఎంతకీ కంట పడితేనా... ఈ రోజు నా అదృష్టం పండి మళ్ళీ అక్కడ చదివుతూ ఇక్కడకి వచ్చాను.... ఇంక వదిలేది లేదు..... మీరు రాస్తూ ఉండండి.... నేను చదువుకుంటూ ఉంటాను....

ఇక ఈ టపా విషయానికి వస్తే పెద్దవారు మీకు తెలిసినదాన్లో సగం కూడా తెలీదు నాకు.... అందునా "వదిలేద్దాం పోనిస్తూ. పెద్దవారు !" అని మీరే అన్నరు కాబట్టీ... వదిలెయ్యడమే......



ఇదంతా రాస్తూ మిమ్మల్ని ఎలా సంబోధించాలో కూడా అర్థంకాక అలోచిస్తూ ఉన్నాను... బాబాయి గారు అననైతే అన్నాను (వారిని) కానీ తెలీడం లేదు...... నేనూ ఆలోచిస్తాను..... మీకు తోచింది చెప్పండి......

chavera చెప్పారు...

మిథునం-2
mohan

ఆ.సౌమ్య చెప్పారు...

ఇదన్యాయం..మీతో పాటే నేనూ...బాబాయిగారు కబుర్లలో పెటి మభ్యపెట్టేస్తున్నారన్నమాట...మీరు సాగించండి పోరాటం, నేనున్నాను :))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

లక్ష్మి గారూ మీరు అసలు తగ్గవద్దు. మీ పార్టీ జెండా పట్టుకొని ఆయన బ్లాగులో నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను.

>>> ఆయన జోక్కులన్నీ నామీదే.

అవును. మేమందరం చూస్తున్నాం గా. మీరు ఇలాంటి టపాలు ఇంకో రెండు మూడు వ్రాసి ఘట్టిగా అడగండి. మీకు మేము ఫుల్ సప్పోర్ట్.
పనిలో పని బోల్డు కామెంట్లు కూడా వచ్చేస్తాయి.

>>> ఆయన సంతోషాన్నెందుకు కాదనాలీ?

అబ్బే, మీరిలాగ జాలి పడితే ఆయన అక్కడ చెలరేగిపోతున్నారు. మళ్ళీ మళ్ళీ జోకులు వేస్తున్నారు. అర్ధం చేసుకోండీ.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@రాజేష్,

థాంక్స్.

@Maddy,
ఆయన్ని బాబయ్య అంటుంటే, నేను పిన్ని నే కదా!

@మోహన్ గారూ,

ధన్యవాదాలు.

@సౌమ్యా,

ఆయనకెప్పుడూ అలవాటే. మసిపూసి మారేడు కాయ చేసేస్తూంటారు. నలభై ఏళ్ళ నుండీ చూస్తున్నాను!!

@సుబ్రహ్మణ్యం గారూ,

ఏదో మీలాటివారందరి సానుభూతీ చూసి ఎంత సంతోషంగా ఉందో !!

జ్యోతిర్మయి చెప్పారు...

పిన్ని గారూ..మీరు వ్రాస్తారనే తెలియదండీ...
మీరు అడిగేయండి వెనుక మేమందరం వున్నాంగా.. ఎందుకైనా మంచిది బాబాయి గారి బ్లాగు లో ఓ లంకె వేసి ఉంచండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

జ్యోతిర్మయీ,

మా శ్రీవారితోపాటే మొదలెట్టాను. ఆయనలాగ రోజుకో టపా వ్రాసే తీరికెక్కడిదమ్మా ?

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes