మా శ్రీవారు ఫాక్టరీలో ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ, పూనాలో ఉన్నంతకాలం షిఫ్టుల్లో వెళ్ళేవారు.అప్పటిదాకా క్యాంటీన్ లో భోజనం చేసే మనిషి, ఇంక నేను వచ్చేశానుకదా అని,నన్నే డబ్బా
(మనవైపు క్యారీరు) చేసి ఇమ్మనేవారు.పోనీ ఎండలో ఇంటికి రావడం కష్టమౌతుందీ అని, ప్రొద్దుటే లేచి, ముందుగా బ్రేక్ఫాస్టూ, ఆ తరువాత నాలుగు గిన్నెల్లోకీ కూర,పచ్చడి,పులుసూ, అన్నం పెట్టి ఇచ్చేదాన్ని.కొన్నిరోజులు ఓ కుర్రాడిని పెట్టుకున్నాము,12.30 కి డబ్బా తీసికెళ్ళడానికి. ప్రతీరోజూ ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, డబ్బాలో పెట్టిన కూర ఎలాఉందో, చెప్తారేమో అంటే, దాని ప్రసక్తే ఉండేది కాదు.పోనీ మొహం మీద పొగడడం ఇష్టం లేదేమో అనుకుని ఊరుకునేదానిని.పైగా కొత్తా!
ఇంట్లోకి సామాన్లు కొనమంటే, మొట్టమొదట ఓ కత్తిపీట తెచ్చారు! ఇదేం టేస్టురా బాబూ, అని భయపడిపోయి, కొంచెం జాగ్రత్తగానే ఉండేదాన్ని.ఏం అంటే ఏం గొడవొస్తుందో బాబూ అనుకొని. అందువలన డబ్బాలో పెట్టిన పదార్ధాలగురించి ఆయన అభిప్రాయం ఎప్పుడూ అడగలేదు! ఆయన ఆ సంగతి ప్రస్తావించకపోడానికి కారణం కొన్ని రోజుల తరువాత తెలిసింది.చూసి చూసి ఓ రోజు అడిగేశారు--ప్రతీ రోజూ కూరా అదీలేకుండా ఖాళీ డబ్బా పెడతావెందుకూ అని. ఓ రోజు కూరుండేది కాదు, ఇంకోరోజు పచ్చడుండేది కాదు.కారణం ఏమిటయ్యా అంటే, డబ్బా తీసికెళ్ళే కుర్రాడు ఆకలేసినప్పుడల్లా దారిలో ఈయన డబ్బా తెరిచి, అందులో ఏం ఉంటే దానితో వాడు తెచ్చుకున్న చపాతీతో నలుచుకుని తినేసి, వాడు తినగా మిగిలినదేదో తీసికెళ్ళిచ్చేవాడుట! ఇంక ఇలాగ కాదని ప్రొద్దుటే అన్నీ తయారుచేసేసి ఇచ్చేదాన్ని.
దీనితో ఇంక ఓ అలవాటు అయిపోయింది, ప్రతీ రోజూ ప్రొద్దుటే బ్రేక్ ఫాస్ట్ తినడం. పైగా పిల్లలకి కూడా స్కూలికి వెళ్ళేముందర ఏదో ఒకటి పెట్టాలికదా. వాళ్ళతో అంత సమస్య ఉండేదికాదనుకోండి. స్కూలు మా క్వార్టర్స్ కి ఎదురుగానే ఉండేది.స్కూలునుండి రాగానే అన్నం తినేసి చదువుకునేవారు.
దీంతో చివరకు జరిగిందేమిటంటే, ఈయనకి ప్రొద్దుటే 8.00 గంటలకి ముందే బ్రేక్ ఫాస్ట్ తినడం. ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా, ఇదో పెద్ద సమస్య అయిపోయేది. మనవైపు ప్రొద్దుటే టిఫిన్లు తినడం అదీ అలవాటుండేది కాదు. కానీ ఈయన వచ్చినప్పుడల్లా, మా అమ్మ అల్లుడుగారొచ్చారూ( ఎంతైనా ఇంటికి పెద్దల్లుడు), నానా హైరాణా పడిపోయి, ముందురోజు పప్పు నానబెట్టి ఇడ్లీకో, దోశలకో పోయడం.బయట హొటల్ నుండి తెప్పిస్తే అల్లుడుగారేమనుకుంటారో అని ఓ భయం. ( అంతకుముందే ఆయన మొదటిసారి ఇంట్లోకి కొన్న కత్తిపీట గురించి చెప్పాను!). ఈయనకి ఆ టిఫినేదో పెట్టి వంట చేసి, పాపం స్కూలుకి వెళ్ళేది.అలాగని అమలాపురం మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు మాత్రం,ఉన్న పదిరోజులూ, దగ్గరలో ఉన్న హొటల్ కి వెళ్ళి టిఫిన్ కానిచ్చేసేవారు.అమ్మని కష్ట పెట్టకూడదుగా ! అంటే జరుగుతూంటే జరిపించుకోవడం అన్నమాట!
ఒకసారి మా అమ్మాయి ముంబైలో ఉండగా, మా మనవరాలి మొదటి పుట్టిన రోజుకి వెళ్ళడానికి ఉదయం 6.00 గంటల ట్రైనులో రిజర్వేషన్ చేయించి, మర్నాడు ప్రొద్దుటే 5.30 కి బ్రేక్ ఫాస్ట్ తీసికుని వెళ్దాం అన్నారు! చెప్పేదేమిటంటే, ఆయన బ్రేక్ ఫాస్ట్ లేకుండా రోజు ప్రారంభించరు! ఎప్పుడో ఏవో పూజలు చేయించే రోజుల్లోనూ, మా మామగారి, అత్తగార్ల తిథి రోజున మాత్రం బ్రేక్ ఫాస్ట్ 'త్యాగం' చేసేస్తారు.అప్పుడుకూడా, ఏదో చాలారోజులనుండీ ఏమీ తినడం లేనట్లుగా ఓ పోజూ!
2008 లో రాజమండ్రీ కాపురం పెట్టించారు. పోనీ స్థలం మార్పుతో ఏమైనా ఈయనలో కూడా మార్పొస్తుందేమో అనుకున్నాను. అబ్బే, అక్కడ ఇంకా అన్యాయం. అక్కడ వెలుగు తొందరగా వచ్చేస్తుండనే వంకతో, 6.00 గంటలకే లేచి, స్నాన పానాదులు పూర్తిచేసి రెడీ అయిపోయేవారు! 'అదేమిటండీ మనం రాజమండ్రీ ఎందుకు వచ్చామో మర్చిపోయారా, హాయిగా స్నానం చేసి, గోదావరి గట్టుమీదుండే దేవాలయాలు అన్నీ తిరిగి వస్తూండండి, ఈలోపులో నాకూ టైముంటుంది, మీకు బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాను' అన్నాను.కాఫీ త్రాగేసి వెళ్ళిపోయేవారు. అంతకు ముందు రోజు ఇడ్లీలకో, దోశలకో ఓ కప్పు పప్పు నానబెట్టి, ఏదో ఒకటి చేసేదానిని.ఎప్పుడైనా అదృష్టం బాగోక పప్పు నానపెట్టకపోతే, 'పోన్లే రేపు బ్రెడ్డు తెచ్చుకుని లాగించేస్తాను' అని ఓ బెదిరింపు! ప్రతీ రోజూ ఒక్కొక్కప్పుడు 8.30 దాకా వచ్చేవారు కాదు, అయినా నేను పెట్టిన బ్రేక్ ఫాస్ట్ మీద అంత ఆసక్తీ చూపించేవారు కాదు, ఫర్వాలేదు, దేముడు నా మొర ఆలకించాడూ అనుకున్నంత సేపు పట్టలేదు, కారణం ఏమిటంటే అష్టలక్ష్మి గుడిలో ప్రతీ రోజూ దధ్ధోజనము, పులిహార, ప్రసాదంగా ఇచ్చేవారుట! ఇంక ఆదేముడే ఆయనని కాపాడుతూంటే, మానవమాత్రురాలినైన నేనెంత ! అదృష్టవంతుడిని పాడిచేసేవారుండరుట !
2009 లో పూణే తిరిగి వచ్చేశాము. ఇక్కడ కూడా దగ్గరలో ఉన్న దేవాలయాలకి వెళ్ళడానికి, ప్రొద్దుటే వెళ్ళి 8.30 కి వచ్చేవారు.మా అబ్బాయీ వాళ్ళూ ఓ వంట మనిషిని పెట్టారు,ఆవిడ ప్రతీరోజూ చపాతీలో, పరోఠాలో బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఖర్మ కాలి ఏ రోజైనా ఆలశ్యం అయిందా, చెప్పా పెట్టకుండా ఎదురుగా ఉండే హొటల్ కి వెళ్ళి ఏదో తింటేనే కానీ ఈయనకి రోజు ప్రారంభం అవదు. మా కోడలు, 'అదేమిటీ మామయ్య గారు బ్రేక్ ఫాస్ట్ తీసికోలేదా'అంటే 'పాపం మీ మామయ్యగారు ఆకలికి ఓపలేరమ్మా' అని ఎక్కడ చెప్పుకోనూ,'వెరైటీ కోసం ఎదురుగా ఉన్న హొటల్ లో తినేశారు' అని సర్ది చెప్పుకోవలసివస్తోంది!
ఏం చేస్తాను ఈ బ్రేక్ ఫాస్ట్ నేను చేసిన అలవాటే, భరించాలి! ఈ 38 ఏళ్ళలోనూ, మా అమ్మాయి పుట్టినప్పుడు ఈయనని వదిలి ఉన్న నాలుగు నెలలూ తప్పించి, ఈయన నన్ను ఒక్కర్తినీ ఎక్కడికీ పంపలేదు. అదంతా ఏదో 'అమర ప్రేమ' అనుకోకండి, నెను లెకపోతే బ్రేక్ ఫాస్ట్ ఉండదేమో అనే భయంతో !!
ఆఖరికి మేము రాజమండ్రీ లో ఉన్నంతకాలం, పూణే రావడానికి తెల్లవారుఝామున 5.30 కి భావనగర్ ఎక్స్ ప్రెస్స్ లో బయలుదేరినా సరే,బ్రేక్ ఫాస్ట్ లేకుండా బయలుదేరలేదు.అలాగని ఆయనకు డయాబెటిక్ సమస్యేం లేదు, ఉండకలరు ఏమీ తినకుండానూ ( కోపాలూ తాపాలూ వచ్చినప్పుడు ఉండడంలేదూ), అదో జరుగుబాటు ! అంతే !