మా రాజమండ్రీ కాపురంలో , మాకు ప్రతీరోజూ పూజకి పువ్వులు తెచ్చే మనిషి ఒకసారి, అమ్మవారికి ప్రీతిపాత్రమైన "కదంబ పుష్పం" తెచ్చి ఇచ్చేసరికి ఎంతో సంతోషమయింది. ఆ సందర్భంలో ఒక టపా కూడా పెట్టాను. ఒక పువ్వుకే అంత సంతోషపడిపోయానని ఆ అమ్మ ఈసారి మేముండే కాంప్లెక్స్ లో ఏకంగా ఆ వృక్షాన్నే చూపించేసింది. ఆ చెట్టుమీదుగా వచ్చే గాలిని పీల్చడానికి ఎంత అదృష్టం చేసికోవాలో కదా !! మేము పూణె లోనే ఇదివరకు ఉండే సొసైటీలో, బిళ్వ వృక్షం ఉండేది. మూడు సంవత్సరాలు, ప్రతీరోజూ ఆ బిళ్వపత్రాలతోనే పూజ చేసి..చేసి..చేసేయగా, ఆ త్రినేత్రుడు కూడా, సంతోషించి, " ఇంక నాకు పూజ చాలులే, ఇటుపైన కదంబవృక్షం మీదుగా వచ్చే గాలి పీల్చి జీవితంగడపండీ అని, ప్రస్తుతం మేముండే కాంప్లెక్స్ కి పంపి ఉంటాడు...
చెట్టు ఎక్కికానీ, కర్రతో కానీ కదంబ పుష్పం కోయకూడదుట((అని మా వాచ్ మన్ ఉవాచ... కోసి ఇమ్మంటానేమో అని భయంతో..) అందువలన అమ్మవారికి పూజచేసే భాగ్యం లభించకున్నా, ప్రతీరోజూ మా కిటికీలోంచి చూసి దండం పెట్టుకునే అదృష్టం మాత్రం కలుగుతోంది. ఆ సంతోషం మీ అందరితోనూ పంచుకోవద్దు మరీ...
ఈ కదంబవృక్షాన్ని గురించి దేశంలో, దక్షిణప్రాంతాల్లో కదంబవనవాసిని సంబంధించినదనీ, ఉత్తరభారతంలో కృష్ణవృక్షమనీ అభిప్రాయాలున్నాయి. వివరాలు ఇక్కడ చదవండి. ఉత్తరభారతదేశంలో ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షనీడలోనే జరిగాయంటారు.అందుకే కృష్ణవృక్షము అంటారు. మనము 'కదంబవనవాసిని' పార్వతీవృక్షమంటాము. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు 'నారాయణా నారాయణి' లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉంది.