RSS

అమ్మ ఉత్తరం


    ఈ రోజు పోలాల అమావాస్య.పూజ చేసుకున్న ప్రతి సంవత్సరం ఆమ్మ పంపిన ఈ ఉత్తరం తీయడం చదువుకొని పూజ చేసుకోవడం.దాన్ని జాగర్తచేసుకోవడం. ఇంతవరకు ఏ పుస్తకంలో ను వ్రాయలేదు. అంత బద్దకం.కాని ఒకటి తీసి చదివినప్పుడల్లా అనందమేను.అప్పట్లొ అందరి యోగక్షేమాలు తెలుసుకునే ఆసక్తి వుండేది. ఆ అభిమానం ఆప్యాయత అలా ఉండేది.. ఇప్పుడు నేను నా పిల్లలు నా సంసారం, ఏమిటొ ఇలా మారిపోయాను.

ఈ ఉత్తరంలో అందరి కుశలము, పూజ ఎలా చేసుకోవాలో , కధ, అన్ని వ్రాసి 6-8-1974పోస్టు చేసిన ఉత్తరం.ప్రస్తుతం మా పిల్లలకు చాలాబంధుత్వాలే తెలీదు,చుట్టాలు మాట దేముడేరుగు, పక్క ఫ్లాటులో ఎవరుండేది కూడా తెలీదు.

    చి"సౌ" లక్ష్మిని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయునది. ఇక్కడ మేమంతా క్షేమం. నీవు చి"ఫణి బాబు, చి"రేణు.క్షేమమని తలుస్తానురేణు ఏం చేస్తోంది. డేకుతోందా, కూర్చుంటోందా? కబుర్లు బాగా చెబుతోందా, రోజు మంచము మీదనుండి క్రిందకు ఎన్నిసార్లు పల్టీ కొట్తిస్తున్నారు. అది పడిపోతే చూస్తూకూర్చుంటున్నారా, రేణు మామయ్య బాగా నడుస్తున్నాడు.(రేణుకంటె ఓ పదినెలలు పెద్దవాడు)అల్లరి చాలా చేస్తున్నాడు, నిన్న పెద్ద అక్క ( నేను) పంపిన రాఖీ అందుకొని చిన్నక్క చేత కట్టించుకున్నాడు. ఇంకా మాటలేమిరాలేదు.అరుణ , దేవి (ఇప్పుడు లేదు)రామం వాణి క్షేమం. నాన్నగారుక్షేమం. నీ ఆరోగ్యమెట్లున్నది? చిట్టివారి కోడలుఇక్కడే వున్నది(ఇంటి ఓనరుగారికోడలు)తెలుగు భాషా ప్రవీణ రెండవ శ్రేణిలో పాసయినది.భర్త (చిట్టి పంతులుమెట్రిక్ పరీక్షకు కట్టించినది. అమ్మమ్మ, తాతయ్య క్షేమం.రవణ అమ్మక్కయ్య(రవణ అమ్మక్కయ్య కూతురు)ఏలూరు వెళ్ళినారు. రవణ అక్కడే నోము పట్టినది. నాదెళ్ళవారింట్లొ అందరు క్షేమం(అమ్మ మేనమామగారింట్లొ). హైమతల్లిని తండ్రిని తాతను, నాయనమ్మను పెద్దతిరుపతి తీసుకువెళ్లినది, ఇంకా రాలేదు.(అప్పటికి ఈ హైమ 5నెలల పసిపాప, మా అమ్మగారి చిన్న మేనమామ గారి మనవరాలు)ఎల్లారమ్మ ( మా అమ్మగారి పెద్ద మేనమామగారి మనవరాలు)రెండు వారాలు హైదరాబాదులోచేసుకొని 3,4, వారాములకు మార్టేరు. నిన్ననే వచ్చినది. మధిరవారింట్లొ అందరూ క్షేమం.(మా అమ్మగారి పెద్దతల్లిగారింట్లొ) శ్యామలత్తయ్యగార్కి మరల ఏలూరు అయినది.(అమ్మగారి మేనమామగారి కూతురు హైమకి అమ్మమ్మ.)మామయ్య ఒక్కడే వెళ్లానాడు. కృష్ణ కు ఈ సంవత్సరము చదువైతేకాని కాపురం మార్చరు.సుందరం అత్తయ్యగారి(ఎల్లారమ్మ తల్లి) వెంకటనారయణ ఇంటర్మీడియ్ ట్ పాసు అయినాడు.పెద్దత్తయ్యగారి కోడలు పురిటికి వెళ్లినది( నా మేనత్త) క్రిష్ణ పాసయినాడు. రాధ, కుమారి పరిక్ష పోయినది.

పోలాల అమావాశ్య 17-8-74 తేది,శనివారమునాడు అయినది, దొరికితే కందమొక్కలు 2కాని 3 కాని పెట్టుకొని పూజ చేసుకొనవలెను. పసుపు కొమ్ములు పసుపు దారము 9 పోచలు వేసి మూడు కట్టి ఒకటి అమ్మవారికి ఒకటి నీవు ఒకటి పిల్లకు మెడలొ కట్టుకొనవలెను,9గారెలునైవేధ్యము , 9గారెలు వాయనము ఇవ్వవలెను, 7 చొ"న కూడా చేయవచ్చును, మొక్కదొరకనిపక్షములొ పోలేరమ్మ దేవత అని సంకల్పము చేసుకొని పూజ చేయవలెను, ముత్తయిదువు దొరకనిచో అమ్మవారికే వాయనమిచ్చి మీరె తినవచ్చును .మొక్కపెట్టు స్తలము అలికి పద్మములు పెట్టిపూజచేయవలెను. దీనిలో వెనుక కధ ఉన్నది, ఆ కధచెప్పుకొని అక్షింతలు అమ్మవారికి వేసి నీవు వేసుకొని పిల్లకు వేయవలెను. పిల్ల ఆరోగ్యం జాగర్త. విసుక్కోకు,బాబు అల్లరి చేస్తూంటే పూనా పంపేయమనిచెబుతోది అరుణ, అందుచే మామయ్య పూనా వచ్చేస్తూన్నాడని రేణుకుచెప్పు. ఇంక విశేషాలు లేవు, వెంటనే ఉత్తరం వ్రాయి, నోము అన్ని వారాలు చేసుకున్నావా?-------


    ఇదండీ! ఉత్తరం. మరి యిప్పుడు ఇంత ఓపిక వ్రాసెటంత సమయము ఎవరికివున్నాయంటారు? ఓ ఫోనుకాల్ అంతే మరి, వింటాం అంతే , వదిలేస్తాము. కాని ఉత్తరంలొ వున్న అనుభూతి , ఆనందం వస్తాయంటారా? ఇప్పటికి ఎన్నో సార్లు చదివాను, అయినా కొత్తగానే వుంటుంది. అందుకనే నేను పిల్లలతో ఫోను చేసినా సరే ఓ మెయిల్ కూడా పంపండి. నాకు కావలసినన్నిసార్లు తీసి చదువుకుంటాను అని, అమ్మొ! టైపు చేసి చేతులు నొప్పిపడుతున్నాయి, వుంటాను.

15 కామెంట్‌లు:

Prakash chowdary చెప్పారు...

మేడమ్ ... మీరలా అనకండి...

నేను 2006 లో కేరళ టూర్ వెళ్లి వచ్చాక

మా గురువు గారికి ... 39 పేజీల లేఖ రాశాను. జిరాక్స్ కూడా నా దగ్గరుంది. మా గురువు గారు కూడా దానిని దాచుకున్నారు. మీకు ఓపిక ఉంటే.. పంపుతాను చదువుతారా?

రాధిక చెప్పారు...

ఇప్పుడు ఉత్తరాలు తగ్గించేసాము కానీ ఇంటికి ఫోను చేస్తే ఇలానే అందరి క్షేమ సమాచారం చెపుతుంది అమ్మ.ఈ సమాచారంతోనే పదినిమిషాలు గడిచిపోతాయి.

జ్యోతి చెప్పారు...

ఈమెయిల్ ఐనా, చేత్తోరాసిందైనా మన మనసులోఉన్నఆలోచనలకు కళ్లెంవేయకుండా అలా రాస్తూ పోతుండొచ్చు.నాకు ఇది అలవాటే. మాట కంటే ఉత్తరంలోనే ఎక్కువ కబుర్లు చెప్తానేమో..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నా దృష్టిలో చేత్తో స్వయంగా రాసిన ఉత్తరం లోని ప్రతీ అక్షరం రాసిని వ్యక్తిని మనకళ్ళముంది నిలబెడుతుంది. ఎందుకంటే అవి సొంత దస్తూరితో రాసినవి కావటం. అదే ఉత్తరం కొన్నాళ్ళ తర్వాత దాని రంగు అవి మారటం మూలాన అది కాలం ని గురించి కూడా చెబుతూ ఉత్తరానికి మరింత గాడతని అద్దుతుంది. కంప్యూటర్ లో అక్షరాలు ఎవరు రాసిన ఒకేలాగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా ఒకేలా ఉంటుంది. భావోద్వేగాలని కేరీ చేయటం అనేది ఇమైల్ కంటే చేత్తోరాసిన ఉత్తరం ఎక్కువ చెయ్యగలదని నా అభిప్రాయం.

సుభద్ర చెప్పారు...

maa nanna amtuuntaaru uttaram raayamma,kavalukunnapudu chaduvukumtaanu ani,ee madya oka 2years nunchi raayatam ledu kaani antaaka mundu chalaa opikaga antaa navvutunna prati nelaa maa atta gaariki,ammaki raasedaani.naaku vaallaki chaalla happy ga undedi.
malli aa aanamdam gurtu chesaaru.

జీడిపప్పు చెప్పారు...

Wonderful letter and good post.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ప్రకాష్,

తప్పకుండా చదువుతాను. పంపండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

రాధికా,

అదే నేను చెప్పేది. పూర్వపు రోజుల్లా కాదు. ఇప్పుడు మనందరికీ బధ్ధకం పెరిగిపోయింది.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

జ్యోతీ,

మెయిల్ మెయిలే. చేతితో వ్రాసిన ఉత్తరంలోని మధురిమ ఉండదుగా.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శేఖర్,

మీరు చెప్పింది అక్షరాలా నిజం.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుభద్రా, జీడిపప్పు,



థాంక్స్.

satya చెప్పారు...

సూర్య లక్ష్మి గారు,
వినాయక చవితి కి సంభందించి నాకొక సందెహం.ఫూజ అంతా పూర్తి అయ్యాక పునహ్ పూజ ఎలా చెయ్యలి?మర్నాడు విగ్రహం తీసెంతవరకూ పాటించాల్సిన విధులు ఏమిటి? దయచెసి నా సందేహాలను తీర్చ గలరా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సత్య గారికి

పసుపు గణపతి పూజ తరువాత ఉద్వాసన చేసి కొద్దిగా తూర్పు వైపు జరిపి,

పునహః ఆచమనము చేసి వరసిద్ధివినాయకపూజ చేస్తాము.పూజానంతరం ఉద్వాసన చెప్పి చివర

శ్రీ వరసిద్ధి వినాయక పరమాత్మనం యధాస్ధానముద్వాసయామి"

పునరాగమనాయ చ "(విఘ్నేశ్వర పీఠమును కొంచెము కదుపుతాము)

ఉద్వాసన చేసిన తరువాత పూజ అవసరంలేదు. చేయకుండా వుంచితే రోజూ రెండు పూటలా పూజ ,హారతి , నివేదన తప్పనిసరిగా చేయాలి.( ఇది నాకు తెలిసినది)

satya చెప్పారు...

చాలా థాంక్స్ అండి సూర్యలక్ష్మి గారు వెంటనే సమాధానం ఇచ్చినందుకు,రేపు పూజకి మీరు చెప్పిన్నట్టే చేస్తాను.మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సత్యగారూ,

మీరు అడిగిన పునః పూజ సాక్షిపేపర్ సప్లిమెంట్ లో వుందండి. మీ కోసం వ్రాస్తున్నానండి.

పునఃపూజ: ఛత్రమాచ్ఛాయదయామి/ చామరేణ వీచయామి/ నృత్యం దర్శయామి/ గీతం శ్రావయామి/ ఆందోళికానారోహయామి/ గజనారోహయామి/ అశ్వానారోహయామి/ సమస్త రాజోపచార,భక్త్యోపచార,శక్యోపచార పూజాన్ సమర్పయామి"

(స్వామి పై పుష్పాక్షతలు వేయాలి)

శ్లో" మంత్రహీనం క్రియహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం

యమాదేవ పరిపూర్ణంతదస్తుతే అనేన

పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి

సుప్రీత స్సుప్రసన్నొ వరదోభవతు.( నేను చేసిన పూజలో మంత్రలోపము, కియాలోపము ఉన్నను అవన్నీ తొలగపోవుకాక. గణపతి ఈ పూజతో సంతృప్తి పొందుగాక)

తరువాత అపరాధన ప్రార్ధన:

శ్రీ గణేశ ప్రార్ధన:

ఉద్వాసనమ్

ఇదండి.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes