బాల్కనీ లో నిలబడి, చక చకా చేతులు ముందుకూ, వెనక్కూ తిప్పుతూ స్వెట్టర్లు అల్లుతున్న ఉత్తర భారతీయ స్నేహితుల్ని చూసి, చీపురు పుల్లలతో,పురుకొస తో, అల్లిక విధానం పుస్తకాలతో మొదలయిన నా ' అల్లిక ప్రస్థానం' నిరాటంకంగా 15 సంవత్సరాలు బాగా నడిచింది.
చిన్న చిన్న స్కార్ఫ్( చెవులకి కట్టుకునేవి) తో మొదలయి ఎన్నెన్నో స్వెట్టర్లూ, ఫ్రాకులూ, షర్టులూ, బ్లౌజులూ అన్నీ పూర్తి అయి ఓ పెద్ద షాల్ తో ఇంచుమించు ముగిసింది.
రోజూ, 'ఈవేళ మేడం, ఏ రంగుది, ఏ డిజైన్ లో వేసేరా' అని పరీక్షగా చూసేవారుట ! నా డిజైన్లకి అంత ప్రాచుర్యం వస్తోందంటే వినడానికి బాగానే ఉండేది కానీ, మరీ ఆడ పిల్లలు ఈయనని చూసేరంటే వినడానికి బాగుండేది కాదు! ఆఫీసులో ఆడ పిల్లలు చూస్తారని కాబోలు, ఈయన ప్రతీ రోజూ మర్చిపోకుండా నేను అల్లిన కొత్త స్వెట్టరు వేసుకుని వెళ్ళేవారు!
అప్పుడు రోజుకు రెండు రకాల స్వెట్టర్లూ--ఒకటి ఏ పుట్టిన రోజుకో సర్ప్రైజ్ గా ఇచ్చేది ఒకటీ,( ఆయన ఆఫీసు కి వెళ్ళిన సమయంలో అల్లేది), ఇంకోటి పిల్లల ఎదురుగానూ, ఆయన ఎదురుగానూ అల్లేది. అన్నేసి స్వెట్టర్లు ఎలా అల్లేనో ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవదు. అంత పిచ్చిగా అల్లేసే దాన్ని.అదొక 'అబ్సెషన్' లా ఉండేది.
వరంగాం లో ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు మార్కెట్ ఉండేది. ఎవడైనా కొత్త డిజైన్ వేసికుని మార్కెట్ కి వచ్చేడంటే చాలు, నేనూ, నా స్నేహితురాలూ, ఆ స్వెట్టర్ చుట్టూరా, అతనికి తెలియకుండా తిరగడం ( ప్రదక్షిణం లాగ!). ఆ డిజైన్ చూసి, ఇంటికి వెళ్ళి తయారు చేసికోవడం !!
ఇవే కాకుండా, పాపం మా శ్రీవారి గురించి కూడా చెప్పుకోవాలి- ఇంగ్లీషు లో వచ్చే ' చిక్ ' మాస పత్రిక తెప్పించేవారు, నా ఆసక్తి చూసి. అలాగే హిందీ పత్రికలు కూడాను. ఎప్పుడైనా కొల్తలు కావాలంటే ,మా శ్రీవారినీ, పిల్లల్నీ నుంచోపెట్టి కొలుచుకునే దానిని! వాళ్ళందరికీ అసలు 'ఈస్తటిక్ సెన్స్' ఉండేది కాదు. ఏదో కొత్త డిజైన్ వేసి, ఎలా ఉందీ అని అడిగితే, ఏదో సమాధానం చెప్పొచ్చు కదా, ' ఏం అర్ధం అవడం లేదూ' అనేవారు. స్వెట్టరు తయారయిన తరువాత మాత్రం, ప్రతీ రోజూ మార్చడానికి మాత్రం రెడీ !!
ఈ రోజుల్లో స్వెట్టర్లు ఎవరు వేసికొంటున్నారూ, అందరూ జెర్కిన్లూ, జాకెట్లూనూ. ఊలుతో అల్లిన స్వెట్టర్లు ' అవుట్ ఆఫ్ ఫేషన్' అయిపోయాయి.ప్రస్తుతం నేను అల్లిన స్వెట్టర్లు అన్నీ' కలరా ఉండలు' వేసి సూట్ కేసుల్లో క్షేమంగా విశ్రాంతి తీసికుంటున్నాయి. అయినా సరే శీతా కాలం వచ్చిందంటే, వాటన్నింటినీ ఒకసారి బయటకు తీసి పలకరిస్తూంటాను !
11 కామెంట్లు:
చాలా బాగున్నాయండి మీ అల్లికలు. ఎన్నెన్ని డిజైన్స్ వేసారో. అంత కష్టపడి అన్నీ పెట్లో దాచేస్తున్నారా! ఒద్దండీ, ఇప్పటికీ స్వెట్టర్లు వాడుకుంటూనే ఉన్నారుగా...
చాలా బాగున్నాయండి.
chaalaa baagunnayandi mii allikalu .neanu swetarlu ,table matlu allanu .
చాలా బాగున్నాయి మీ స్వెట్టర్లన్నీ.
ఇప్పటికి కూడా చేతితో అల్లిన వాటి అందమే వేరు. వాటి ప్రత్యేకత మరి దేనికీ రాదు. మీరు స్వెట్టర్లు దాచకుండా గర్వంగా ఈ సీజన్ అంతా వాడెయ్యండి. తర్వాత మళ్ళీ సీజన్ కోసం దాచిపెట్టుకుందురుగాని..
చాలా బాగున్నాయండి.ఎంచక్కా ఈ చలికాలం మీరు రోజుకొకటి వేసుకోవచ్చు.ఎన్ని కొత్త రకాల జెర్కిన్లు, జాకెట్లు వచ్చినా ఊలు వాటి అందం వేటికీ రాదండి!
సూర్యలక్ష్మి గారూ,
మీ స్వెట్టర్ల డిజైనులన్నీ చాలా చాలా బాగున్నాయండీ..! మొదటిది అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎంత ఓపిగ్గా ఎంత చక్కని డిజైన్లలో అల్లారో...అన్నట్టు.. స్వెట్టర్ ఎప్పుడూ అవుట్ అఫ్ ఫాషన్ అయిపోదండీ :)
జయా,
ధన్యవాదాలు.పెట్టెల్లో దాచక ఏం చేయనూ?ఎవరికీ ధ్యాసే లేదు.నేనే ఉండబట్టలేక ప్రతీ శీతాకాలం లోనూ ఓ సారి చూసుకొని ఆనందిస్తూంటాను!
శిశిరా, సత్యా,
ధన్యవాదాలు.
శ్రీ లలితా,
ధన్యవాదాలు. ఎన్నని వాడను? అప్పటికీ నేను అల్లుకున్న బ్లౌజులు వేసికుంటూనే ఉన్నాను.
సిరిసిరిమువ్వా,
ధన్యవాదాలు.
మదురవాణీ,
ధన్యవాదాలు. అల్లడంలో ఉన్న శ్రమ తెలిసినవారికి వాటిలో ఉన్న అందం అర్ధం అవుతుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి