RSS

ఆవకాయ--The other side of the coin !

    నేను ఈ మధ్య మా మనవడు చి.అగస్త్య తో చాలా బిజీ అయ్యాను.తనని చూడడానికి ఓ పిల్లని పెట్టారు, అయినా అదేం అదృష్టమో, ఆ పిల్ల నన్ను చూడగానే, బాబుని వదిలేసి, ఇంకేదో పని చూసుకోవడానికి వెళ్ళిపోతుంది! దానితో రోజులో సగం భాగం,నేనే చూడావలసివస్తోంది.పాపం వాడేమీ ఏడవడం అదీ లేదు కానీ, మెళుకువగా ఉన్నప్పుడు వాడితో కబుర్లు చెప్పకపోతే అరుస్తాడు!

    దీనికి సాయం ఊరగాయలు పెట్టడం ఒకటీ. ఈ హడావిడిలో పడి, మా శ్రీవారు బ్లాగ్గుల్లో ఏం వ్రాస్తున్నారో పట్టించుకోవడానికి సమయమే కుదరడం లేదు. ఇదివరకు రాజమండ్రీ లో ఉన్నప్పుడు, తన బ్లాగ్గు పోస్ట్ చేసేముందు చూపించేవారు.ఇప్పుడు ఛాన్స్ దొరికిందికదా అని, నా మీద అవాకులూ చవాకులూ వ్రాసేస్తున్నారు. చూడండిఅక్కడికి నేనేదో ఆయనని గత 38 ఏళ్ళనుండీ హింస పెట్టేస్తున్నట్లూ, పాపం తనే ఏదో ఓర్పుగా ఉండి ఆవకాయ పెట్టేస్తున్నట్లుగా, వ్రాసేశారు! ఆవకాయ లేందే ముద్ద దిగదు.కానీ ఊరగాయలు పెట్టడానికి, ఆయన నన్ను పెట్టే తిప్పలు ఎవరితో చెప్పుకోను? ఒక్కటంటే ఒక్క పనీ సవ్యంగా ఉండదు.ఎన్ని కాయలు తెమ్మంటావూ తో ప్రారంభం, ఇదేమీ మొదటిసారా, పెళ్ళైన మూడో ఏటినుండి తెస్తున్నారు. ప్రతీ సారీ కొత్తే!

    నేను మా ఇంట్లో మా అమ్మా,అమ్మమ్మా పెట్టేటప్పుడు తెలిసిన పరిజ్ఞానంతో( వాళ్ళు మాత్రం ఏమైనా కాయలూ అవీ తూచేవారా, ఏదో ఓ గిన్నెతో ఆవపిండీ, కారం,ఉప్పూ,నూనె కొలిచి, వాటికి సరిపడే ఇంకో నాలుగు గిన్నెల ముక్కలు వేసేవారు). అప్పటికీ చెప్పాను అమ్మమ్మగారు ( అంటే మా అత్తగారు) కూడా అలాగే పెడతారూ అని.అందుకని ఇక్కడ కూడా,మా అందరికీ ఏడాది పొడుగునా సరిపోయేటట్లు ( అంటే మాకూ,మా అమ్మాయికీ,అబ్బాయికీ), ఓ గిన్నెడు ముక్కలు ఈయన వేవిళ్ళకోరిక( ఉల్లావకాయ), మొత్తం నాలుగు గిన్నెలకి సరిపోయేలా తెమ్మంటూంటాను. మన గిన్నె కొలత కొట్టువాడికెలా తెలుస్తుందోయ్ అంటారు. పోనీ అలాగని ఓ పాతిక కాయలు తెండీ అంటే, నిమ్మకాయ సైజులో ఓ పాతిక కాయలు ముక్కలు కొట్టించి తెచ్చేవారు, ఇదేమిటీ ఇవి మెంతిబద్దల్లోకి కూడా సరిపోవూ అంటే ఇంకోసారి పెద్ద పంపరపనాసకాయ ( అంటె పేద్ద నారింజకాయకంటె పెద్దది) సైజులో తెచ్చారు.వాటితో ఊళ్ళోవాళ్ళందరికీ సరిపడేటట్లుగా పెట్టేయొచ్చు! ఈయన్ని బాగుచేయడం ఇంక దేముడికూడా సాధ్యం కాదనుకొని,(పైగా ఆయన కోనసీమలో పుట్టానని ఓ గర్వం కూడానూ, వీలున్నప్పుడల్లా తూ.గో. ప.గో అంటూ వేళాకోళాలోటీ, నాది తణుకు కదా),చేత్తో సైజు చూపించి, ఇలాటివి, నాలుగు గిన్నెల ముక్కలు తీసుకురండి మహాప్రభో కి సెటిల్ ఐపోయాను.లేకపోతే ఆ గిన్నె పట్టుకుని మార్కెట్ కి వెళ్తారేమో అని ఓ భయం, అదో అప్రతిష్ట!

    అక్కడికి కాయలు ఎన్ని తేవాలో ఓ కొలిక్కి వచ్చిందా,ఇంక నూనె సంగతి, ఎప్పుడూ కొత్తే, ఏం నూనె అంటూ, అదేదో బారెల్స్ లో తెచ్చేస్తూన్నట్లుగా ఓ పోజు పెట్టేయడం.మనవేపైతే, పప్పునూనె అంటె తెలుస్తుంది. ఏం పప్పూ అంటారు మొత్తానికి 'తిల్' అని చెప్పేక, కొట్టులోకి వెళ్ళీ, ఈయనేం అడుగుతారో,వాళ్ళేం ఇస్తారో తెలియదుకానీ, ఓ రెండు లీటర్ల నూనె తెస్తారు.నువ్వుల్ని 'తిల్' అంటారని తెలియలేదంటే ఎలా నమ్మాలి? పైగా 48 ఏళ్ళనుండీ, మహరాష్ట్రలో ఉంటున్నానని ఓ బడాయీ!ఏదో తీసుకొచ్చారు కదా అని, చూసుకోకుండా మాగాయి పెట్టే రోజున బాటిల్ ఓపెన్ చేస్తునుకదా, అదేమో ఆవ నూనె ( సరసోం కా తేల్). ఇదేమిటండీ, నేను తెమ్మంది తిల్ ఆయిల్ కదా, మిమ్మల్ని నమ్ముకుంటే ఆవనూనె తెచ్చారూ అంటే, కోపం ఒకటీ. ఏమైతేనే మిట్ట మధ్యాన్నం ఎండలో వెళ్ళి, ఆ తిల్ ఆయిలేదో తెచ్చి నామొహాన్న పడేశారు ( మాగాయ కావాలి కదా!). సాయంత్రానికి మాగాయేదో కలిపేసి పెట్టేశాను.

    ఆవకాయకి కాయలు ఎప్పుడు తెమ్మంటావూ అని రోజూ అడగడం. ఎక్కడ పెట్టడం మానేస్తానో అని భయం.ఈయన సంగతి తెలుసుగా, ఇంట్లో పెట్టకపోతే, ఊళ్ళో వాళ్ళందరూ ఇచ్చింది, అపురూపంగా, ఆవురావురుమంటూ తింటారు, లేకపోతే 'ప్రియా' సీసా తెచ్చేస్తారు! ఆ మాత్రం దానికి నేను వెల్తి పడడం ఎందుకులే అనుకొని,ఈ సారైనా జాగ్రత్తగా చూసుకొని తీసుకు రండీ అన్నాను.వచ్చేటప్పుడు నూనె సరీగ్గా చూసుకుని తీసుకురండీ అనికూడా చెప్పాను.అదిగో అలా చెప్తే మళ్ళీకోపం. ఏం తమాషాగా ఉందా ,ప్రతీసారీ కళ్ళూమూసుకుని తెస్తానా ఏమిటీ అంటూ. మొత్తానికి అక్కడ మార్కెట్లో ఈయనేం అడిగారో, వాళ్ళేం ఇచ్చారో తెలియదు కానీ, కాయలు కోయించి తెచ్చారు.అందులో సగానికి సగం లేతవి. ఇదేమిటీ ఈ ముక్కలతో పెడితే, ముక్క మెత్తబడిపోయి నిలవ ఉండదూ అంటే మళ్ళీ కోపం!పైగా ముక్క మెత్తగా ఉంటే హాయిగా తినేయొచ్చూ అని ఓ సమర్ధనోటీ (పళ్ళులేవుగా), మా అమ్మమ్మ గారి పధ్ధతే, ఆవిడా అంతే, వాళ్ళు చేసిన తప్పుని సమర్ధించుకోవడంలో వాళ్ళంతటి వాళ్ళులేరు ( ఏమైనా కోనసీమ వాళ్ళు కదా!).

    ఆ మెత్తగా ఉన్నముక్కలన్నీ మళ్ళీ ఓ కత్తిపీట ముందేసుకుని, తొక్కతీసి ఉప్పులో వేసి, ఎండలో పెట్టాల్సొచ్చింది.మొత్తానికి అంతకు ముందు ఎండపెట్టిన ఒరుగులూ, ఇవీ కలిపి ఏడాదంతా సరిపోతాయి.ఈయన ఆవకాయ కోసం తెచ్చిన కొన్ని ముక్కలెంత మెత్తగా ఉన్నాయీ అంటే, వాటిలో పంచదార కలిపేస్తే మురబ్బాలా తయారైపోతుంది.రోజూ టెర్రెస్ మీదకు వెళ్ళడం, ఎండలో పెట్టడం, ఎప్పటికి ఎండుతాయో.

    ఒక సంగతి మాత్రం చెప్పుకోవాలి, నేను పెట్టిన ఆవకాయ మాత్రం ప్రతీరోజూ, భోజనానికి ముందే టేబుల్ మీద పెట్టేసుకోవడం, భోజనం చేసేటప్పుడు మా మనవరాలు, నాకూ పచ్చడీ అన్నం కావాలీ అని పేచీపెట్టడం, పిల్లలు తనని కోప్పడడం తప్పడం లేదు. ఈయనకి చెప్పాలేరు, తనని ఆపాలేరు. ఇదో గొడవ!
ఇంత శ్రమా పడి పెట్టిన తరువాత రుచి చూశాను బాగానే ఉందండోయ్ !

47 కామెంట్‌లు:

సుభద్ర చెప్పారు...

సూర్యలక్ష్మి గారు డౌన్ డౌన్...ఆవకాయ పేరుతో పాప౦ ఫణిబాబుగార్ని చాలా తిప్పలు పెట్టారు..ఆపైన కోసీమవాళ్ళు అని మా మనోభావాలు దెబ్బకొట్టారు..కోనసీమా వాళ్ళు తరలిర౦డి..
ఇట్లు,
పణిబాబు గారి మద్దతుదారులు..

మంచు చెప్పారు...

సూర్యలక్షి గారు జిందాబాద్.. సూర్యలక్షి గారు జిందాబాద్.. ఆవిడది మా వూరు మరి..

బ్లాగాగ్ని చెప్పారు...

నా మద్దతు ఫణి బాబు గారికే. ఫణిబాబు గారు జిందాబాద్! నాదీ ఆయన పేరే మరి :)

- ఫణిబాబు గారి మద్దతుదార్ల సంఘం సెక్రెటరీ.(ప్రెసిడెంటు ఎవరా అనుకుంటున్నారా? పైన చూడలా సుభద్ర గారే)

చేతన_Chetana చెప్పారు...

:-) ఇన్నాళ్ళూ ఫణిబాబుగారి బ్లాగు అప్పుడప్పుడూ చూస్తూ మా నాన్నగారు బ్లాగు వ్రాస్తే ఇలాగే ఉంటుందేమో అనుకునేదాన్ని.. ఇప్పుడు మీ బ్లాగు చూసి మా అమ్మ వ్సాస్తే ఇలాగే ఉంటుందేమొ అనిపిస్తుంది. :-) తూ.గో. ప.గో గొడవలు మా ఇంట్లో కూడా ఉంటాయి. కాకపోతే డాడీదీ ప.గో. అమ్మది తూ.గో. ఇంకో మాట, ఇన్నేళ్ళగా మా డాడీని చూసిన అనుభవంతో చెప్తున్నా, తూగో అయినా పాగో అయినా, చేసిన పని చెప్తే ఎదురు కోపాలు తెచ్చేసుకోవటం ("ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే" అన్నట్టు), సమర్ధించుకోవటాలు నాన్నలకి చాలా కామన్‌ ఏమో.. :-)

శ్రీనివాసరాజు చెప్పారు...

అవునండీ ఈ కోనసీమవాళ్ళకి కొబ్బరికాయంత తలకాయలుంటాయి గానీ అందులో మేటరుండదు.. (కోనసీమ.. కొబ్బరికాయ.. ప్రాసకోసం వాడాను.. ఎవరూ నన్ను తిట్టొద్దు.. మా ఆవిడది కూడా కోనసీమే.. మంచి ఛాన్స్ దొరికింది ఆటపట్టించడానికి, ఉపయోగించుకోనివ్వండి ఫ్లీజ్.. :) )

మాటిమాటికి మీది ప. గో మీది ప.గో అంటారు కానీ.. వారు చేసే పనులన్నీ ఇలానే వుంటాయి.. అయినా చోద్యంగానీ.. ఆవనూనెకీ.. నువ్వులనూనెకు అసలు పొంతనుందా!! (ఒక్క అక్షరం కూడాకలవలేదు.. నూనె అన్నది తప్ప :) )..

ఆంటీ!, మీరు ఏం తగ్గొద్దు.. మన ప. గో జిల్లావాళ్ళం వెనకడుగువెయ్యోద్దు.., అందులోనీ మన తణుకు వాళ్ళు అస్సలు.., ఆయన అదిగో ఇదిగో అంటే నాకు ఒక్క మిస్డ్ కాల్ కొట్టండి నేనొచ్చేస్తా :)

------------
హ హా హా.. బాగుందండీ మీ బ్లాగ్యుధ్దం...

@చేతన గారు
అక్కడ తూ.గో నా ప.గోనా అన్నది కాదు అసలు మేటర్.. ఏదొక టైమ్ పాస్ ఉండాలికదండీ :)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుభద్ర గారూ,

ఉన్నమాటంటే ఉలుకెందుకమ్మా?(సరదాగా వ్రాశాను)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మంచుపల్లకీ,

జయ హో !!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

బ్లాగాగ్ని,

పేరులో ఏముంది బాబూ !!!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

చేతనా,

చాలా లౌక్యంగా వ్రాశావే!ఎవరినీ నొప్పించకుండా మార్కులు కొట్టేశావు !!!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీనివాసూ,

నువ్వున్నావనే ధైర్యంతోటే వ్రాసేస్తున్నాను !!

అజ్ఞాత చెప్పారు...

నేనూ మీవైపే.
పుట్టింది తణుకులో, పెరిగింది నరసాపురంలో.
వెరసి ప. గో. జి నే.

Ramachandrudu చెప్పారు...

మీ ఆవకాయ కథనము బాగుంది. ఆవకాయ నేను ఏదో అందాజుగా పెట్టెస్తూన్టాను. మీరు వ్రాసినది చదవటము వల్ల కొలతలు తెలిసేయి. ఆవకాయకి పెద్ద కాయలు వాడాలని తెల్సింది. థాంక్స్. మీ దంపతులకి అభినందనలు.
బులుసు విమల

సుభద్ర చెప్పారు...

ఉన్నమాటా అయితే మాత్ర౦ ఊరుకు౦టామే౦టి???ఏదో ఆ ప"గో పిల్లాడు ఆ౦టీ అనేసి ఐస్ చేశాడని అనేస్తారా!!!పైగా ఆ అబ్బాయి ఉన్నాడనే దైర్యమా??నేను ఏమైనా ఈ ఉద్యమ౦ ఆపేది లేదు...అవసర౦ అయితే మళ్ళి కేసిఆర్ తో నిరహారదీక్ష చేయిస్తా౦......ఆ పిల్లోడు మీకు కామె౦ట్ రాసిన తరువాత పూటను౦చి ఆవకాయలేని బోజన౦ అట పాప౦..మా కోనసీమావాళ్ళతో పెట్టుకు౦టాడా???హన్నా...ఏ ప"గో బాబు మాకు మేటర్ ఉ౦డదా??సరేలే చూద్దా౦ కాని కాస్తా మీ ఆవిడ పోన్ న౦బర్ లేదా ఈమెయిల్ ఐడి ఇస్తావు ప్లీజ్...మా కోనసీమా ఆడపడుచుని (మీ ఆవిడని) ఆటపట్టి౦చాలన్న ఆలోచనే లేకు౦డా చేస్తా౦..కోనసీమా కొబ్బరి ప్రాస సుపర్....ఇ౦కా కోనసీమా కోడవలి ఇ౦కా సుపర్ కదా !!!!!!హ హ్హ హ్హ హ హ్హ(నల్లకళ్ళజోడు పెట్టుకుని తమిళ్ డబ్బి౦గ్ సీరియల్ లో లేడి విలన్ లా నేను)

sphurita mylavarapu చెప్పారు...

సూర్యలక్ష్మి గారూ, ఇవాళే మీ బ్లాగు చూశాను. ఇంతకుముందు ఫణి బాబుగారిది కొన్ని సార్లు చూసాను. నాది కూడా చేతన గారి కామెంటే. మా అమ్మ, నాన్నగారూ బ్లాగు మొదలుపెడితే ఇలాగే రాస్తారేమో. ఇప్పటికి phone లో ఒకళ్ళ మీద ఒకళ్ళు Complaints చెప్పేస్తూ వుంటారు రోజూ. కానీ వాళ్ళిద్దరిదీ తూ.గో ఏ ఐనా ఇంతే...

మంచు చెప్పారు...

మీ కొనసీమ వాళ్ళందరూ ఇంతే సుబధ్రగారు.. మమ్మల్ని అమాయకులు చేసి ఎదురు దెబ్బలాడతారు..

ఆంటీ.. మీ వెనక మన ఊరుమొత్తం వుంది.. అవసరమయితే.. చుట్టుపక్కల తేతలి, దువ్వ, రావిపాడు, వరిగేడు, అత్తిలి, ఉండ్రాజవరం, కానూరు, ఇల్లిందలపర్రు, ఇరగవరం, రెలంగి, మంచిలి, వడ్లూరు, పైడిపర్రు, పెరవలి, కాకరపర్రు, వేల్పూరు .. ఊళ్ళనుండి జనాలని రప్పిద్దాం :-))

శ్రీనివాసరాజు చెప్పారు...

ఆంటీ మనం ఒక్కమాటంటే.. సభద్రగారు ఎన్నిమాటలన్నారో చూసారా.. :)

కోనసీమ కోనసీమ అనుకోవటం ఎందుకుమరి.., నిరూపించారు.., ఉన్నదే అనుకుంటున్నాం కదా మనం.. :)

@సుభద్రగారు
మా అవిడఫోన్ నెంబరు, మెయిల్ ఐడి రెండూ పంపిస్తానండి.. ఆవకాయ యుద్ధమో.. కొబ్బరికాయల యుద్ధమో మీరిద్దరూ తేల్చుకుని పూణే రండి మరి.. :)

సుభద్ర చెప్పారు...

అయ్యె అయ్యె ఎ౦తా అన్యాయ౦!!
నన్ను, బ్లాగాగ్ని గార్ని ఇద్దర్ని చేసేసి మీర౦తా ఒకటి అయ్యిపోతారా??? :( :(
పైగా ఊళ్ళు ఊళ్ళు ను౦చి జనాల్ని తీసుకోస్తారా!!! ఇలా భయపెట్టేస్తే నాకు అసలే భయ౦ తెలుసా!! మేము మొనార్కుల౦ ..హ్హహ్హ హ హ హ్హ..(భయపడ్డ కనిపి౦చనియ్య౦)..

శ్రీనివాస్ గారు ,
మీరు పుణెలో ఉ౦టారా??నేను 2011 ఆగష్టు లో వస్తాను అయితే మీరు అప్పటివరకు అక్కడే ఉ౦టే!!!

బాగు౦ది నాకైతే ఏదొ ఇ౦ట్లో పెళ్ళీకి వెళ్ళినట్లు ,అక్కడ మా కజిన్స్ తో సరదా పొట్లాట వేసున్నట్లు అనిపిస్తు౦ది..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

బోనగిరిగారు
థ్యాంక్సు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

విమలగార్కి
మీరు నా బ్లాగులో పెట్టిన కామెంటుకి చాలా చాలా సంతోషంగా వుందండి.
సంగీతసరస్వతి అభిమానపుత్రికయినా మీరు నా బ్లాగ్ చదివి వ్యాఖ్య రాసినందుకు నిజంగా చాల సంతోషంగా వుంది.( మనలో మాట ఆవకాయని అటక ఎక్కించ్చేద్దాము సరేనా!)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుభద్ర గారూ,

మీరూ , శ్రీనివాసూ చూసుకోండి బాబూ. పూణే వచ్చినప్పుడు మాత్రం మా ఇంటికి రండి .

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

స్ఫురితా,

మా బ్లాగ్గులు నచ్చినందుకు సంతోషం. అలాగే చదువుతూండండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మంచు పల్లకీ,

నీ లాటివాళ్ళూ, శ్రీనివాసు లాటి వాళ్ళూ ఉంటే నాకు కొండంత ధైర్యం !!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీనివాసూ,

సుభద్ర గారు ఎలాగూ పూణే వస్తానన్నారుగా !

శ్రీనివాసరాజు చెప్పారు...

బాగుంది.. ఆఖరికి సూర్యలక్ష్మిగారి ఆవకాయ ఎంతపనిచేసిందో చూడండి..., నాకు ఆవకాయలేకుండా చేసింది.. సుభద్రగారిని పూణే వచ్చేలా చేసింది.. :)

అవునండీ సుభద్రగారు.. పూణేలోనే ఉంటున్నాం. మేం అందరం అప్పుడప్పుడూ కలుస్తుంటుంటాం కూడా :)

మీరు వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం... ఇన్నిగొడవలు తెచ్చిపెట్టిన ఆవకాయే రుచి చూద్దాం :-)

నేస్తం చెప్పారు...

ఇక్కడ ఇంత గొడవ జరుగుతుందా.. నేనూ మా తూ గో జిల్లా వైపే..ప.గో డవున్ డవున్ ..ఏంటి సుభద్ర మనకు మాత్రం ఊర్లు లేవా,కరప,పిఠాపురం,రామచంద్రపురం,కాకినాడ,రాజమండ్రి,అమలాపురం,రామవరం మరి ఉప్పడా,మట్లపాలెం,తూరంగి,ద్రాక్షారామం ..ఏం తక్కువ ఉన్నాయేంటి మనకు మాత్రం..

నీహారిక చెప్పారు...

ఆవకాయ -- The other side of the coin
కోనసీమని విడగొట్టేసింది.
ఈ పాపం ఊరికే పోతుందా? ఆవకాయని అందరికీ పంచేవరకు పోదు.

సుభద్ర చెప్పారు...

శ్రీనివాస్ గారు,
అవున౦డి ఆవకాయ భలే స౦దడి చేసి౦ది!!ఇ౦త వరకు మా ప్రె౦డ్ ఇ౦ట్లో ఉపనాయ౦ కోస౦ 2011 లో పుణె రావాలనుకున్నా.......కాని ఇప్పుడు సూర్యలక్ష్మిగారి మళ్ళి ఏడు కొత్త ఆవకాయకోస౦ రావాలి..నాకు బ౦ధుగణ౦ పెరిగిపోయారు ఇప్పుడు పుణెలో..మీర౦తా కలుస్తారు అ౦టే ఇ౦కా ఇ౦కా రావాలని ఉ౦ది..వచ్చి మీతో కలిసి సూర్యలక్ష్మి గారి ఇ౦ట్లో ఆవకాయ తినాల్సి౦దే!!

నేస్త౦,
వచ్చారా!!హమ్మయ్య..నాకు కొ౦చ౦ బల౦ వచ్చి౦ది..అవునవును మనకి బోలెడు ఊళ్ళు ఉన్నాయి..అక్కడ క౦టే ము౦దు మన౦ పుణెలో ఉన్న పణిబాబుగార్ని తీసుకోస్తే బాగు౦టు౦దేమొ కదా!!లక్ష్మిగారు ఏ౦ మ౦త్ర౦ వేశారో కాని మన౦ అ౦తా పణిబాబుగారి మద్దతుస౦ఘ౦ పెట్టా౦ కాని ఫణిబాబుగారికి తెలియలేదు అనుకు౦టా!!!

సూర్యలక్ష్మిగారు ,
మీరు మా స౦ఘ౦ గురి౦చి చెప్పారా లేదా ఫణిబాబుగారితో??

నీహరిక,
హమ్మయ్య మీరు వచ్చారా??thank god..అవునవును ఈ పాప౦ ఊరికేపోదు..
మళ్ళీ ఏడు వాసిని విప్పని కొత్త ఆవకాయ జాడీ నేను,శ్రీనివాస్ గారు రిజర్వ్ చేసుకున్నాము..మనలో మన మాట ఈ లోపు ఈ స౦వత్సర౦ శ్రీనివాస్ గారు రె౦డు మూడు కోటాలు వేస్తారనుకో౦డి....మీరు ర౦డి మళ్ళీ ఏటికి అ౦తాకలిసి పుల్ జాడీ ఖాళీ చేద్దా౦..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నేస్తం,

మీఅందరి ధర్మమా అని తూ.గో.జి, ప.గో.జీ లలో ఉన్న ఊళ్ళ పేర్లు తెలిశాయి !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నీహారికా,

పూణే వస్తే పాప పరిహారం చేస్తాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుభద్రగారూ,

తనకి వచ్చిన మద్దతు చూసి అప్పుడే పార్టీ కూడా ఇచ్చేశారు ! ఇంటికొచ్చి నేను చేసిన ఆవకాయ కలుపుకుని అన్నం తిన్నారనుకోండి !!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రినివాసూ,

వాళ్ళందరూ వచ్చేదాకా ఆగఖ్ఖర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆవకాయా అన్నం పెడతాను. ఎంతైనా నాకు కావలిసిన వాడివి !!

శ్రీనివాసరాజు చెప్పారు...

@సుభద్రగారు
తప్పకుండా రండి, అందరం సరదాగా కలుద్దాం.

మీలోమీరే అనుకోఅఖ్ఖర్లేదు రెండుమూడేంటి.. నాలుగైదు కోటాలే లాగించేస్తాను.. ఎంతైనా మేంమేం కావలసినవాళ్ళం మరి :)

@ఆంటీ
నేను వీలున్నప్పుడు వస్తాను, వేడివేడి అన్నంలో, ఆవకాయ, నెయ్యివేసుకుని తింటున్న క్లోజప్ ఫొటో తీసి వీళ్ళందరి నోరూరేలా మీ బ్లాగులోనే ఫోస్టుచేద్దాం. :)

venaru చెప్పారు...

పిన్నమ్మో ,
ఈ తు గో / ప గో ఆవకాయ భారత సంగ్రామం బాగానే ఉంది గాని ,
నాకు ఇంకా ఆవకాయ ముక్క ల కొలత మాత్రం అర్థం అవలేదు -> ప్రస్తుతానికి నేను బాబయ్య పక్షమే .
- కోన సీమ వారం / అందులో భమిడిపాటి వారం - ఏమీ అనుకోకు .
కాని చద్దన్నం - బ్లాగ్ కి నీకే మద్దతు !

Unknown చెప్పారు...

అందరి వ్యఖ్యలూ చదివాను. బావున్నాయి. ఈ సారి నెనె ఆవకాయ్ పెట్టా మా ఇంట్లో. మా అత్తయ్యగారి పర్యవెక్షణలో.

అమ్మ, నాన్నగారు చాలా బావుందని, నేనిచ్చిన చిన్న భరిణెలోని ఆవకాయ్ ఆఖరుచేసేవరకూ రొజూ వేస్కున్నారని చెప్పారు.

50 కాయ పెట్టా. చాలా ఆనందంగా ఉంది!!! మీతొ చెప్దామని ఇలా...

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అరుణా,

ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది !!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఏరిఎన్,

చాలా సంతోషం.

Unknown చెప్పారు...

మీరు నా ఆవకాయ్ సంగతులు చదవడానికి ఇష్టపడితే ఈ బ్లాగ్ ను చూడండి...http://arien78.wordpress.com

A K Sastry చెప్పారు...

అక్కగారూ!

మనది ప గో అయినా, మా ఆవిడది తూ గో (కాకినాడ) అయినా, నేను బాబుగారి పక్షమే! యెందుకంటే, ఆవకాయ కాయ విషయంలో నాకూ సతాయింపులు తప్పవు.

వేసంకాలం వచ్చిందంటే మా రుస్తుంబాదా నుంచి మొదలెట్టి, సీతారాం పురం, మొగల్తూరు వరకూ రెండు మూడు ట్రిప్పులు పడతాయి. యెండనబడి (వెళ్లేది ఏసీ కారులోనే అయినా, తోటల్లో ఏసీలు వుండవుకదా) "మచ్చు" కయలు తెస్తామా, ఒకదానికి తొక్క దళసరీ, ఇంకోదానికి కండ పలచన, ఇంకోటి బొత్తిగా పులుపులేదు--ఇలాగ.

ప్రతీ యేడూ సాధ్యమయినంతవరకు అవే చెట్టు కాయలు తెద్దామంటే, ఒక్కో యేడు ఆ చెట్టు కాయదు. లేదా, లీజుదారుడు మారిపోతాడు. కొత్తవాడు మార్కెట్ రేటు ఇమ్మంటాడు.

ఒక్కోసారి, అదే చెట్టుకాయలు తెస్తానన్నా, క్రితం యేడాది వూట తక్కువ రాలేదూ? ఈసారి మారుద్దాం--అంటుంది.

యేదేమైనా, ఒకళ్లమీద వొకళ్లు--మీ ఫిర్యాదులు భలే వుంటాయి.

వచ్చే పనిబడలేదుగానీ, లేకపోతే, నేనూ వచ్చేద్దును పుణె!

ఈసారి తణుకొస్తే చెప్పండి--మా నరసాపురం తీసుకెళ్లి, మా ఆవకాయ రుచి చూపిస్తాను--మీ యిద్దరికీ!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కృష్ణశ్రీ గారూ,
నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

'''నేస్తం... చెప్పారు...

నన్ను కూడా మీ యుద్ధం లో చేర్చేసుకోండి..
ఎటువైపు ఉండాలో ఇంకా డిసైడ్ కాలేదు
స్వంత ఉరు తాడేపల్లి గూడెం, చదువుకున్నది తణుకు లో,
ఉద్యోగం వెలగబెడుతోంది పూణే లో..

చాల బాగుంది మీ ఆవకాయ్ గొడవ

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కమల్,

యుధ్ధంలో చేరాలంటే, మీ ఎడ్రసు, ఫోను నెంబరూ చెప్పండి. మా శ్రీవారిది 9325508220

'''నేస్తం... చెప్పారు...

ఎంటండి మీ ధైర్యం నెంబర్ అలా డిస్ప్లే పెట్టేసారు
అసలే మీ వారికి ఫాన్స్ ఎక్కువా..
అడ్రస్ అయితే హింజేవడి. ఫోన్ నెంబర్ మీ వారి నెంబర్ కి మెసేజ్ వస్తుంది
చెప్పండి కమల్ మెసేజ్ పెడతాడు రెడీ గా ఉండాలి యుద్ధానికి అని..

'''నేస్తం... చెప్పారు...

ఐన నేను మీ వారి తరుపే ఉంటాను..
ఎందుకంటే నాకెప్పుడు ఇదే డౌట్ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా తెమ్మంటే నేను ఇలాగే చేస్తుంటాను..
రేపు నా లైఫ్ లోకి ఒక నైఫ్ వచ్చాక ఇలాగే చేస్తే ఊరుకుంటాడా ఉరి వేసేస్తదా అని ఊరికే భయపడుతూ ఉంటాను...
ఏదో ఇలా వెల్లిపోద్ది అన్నమాట లైఫ్..

:-)

'''నేస్తం... చెప్పారు...

ఐన నేను మీ వారి తరుపే ఉంటాను..
ఎందుకంటే నాకెప్పుడు ఇదే డౌట్ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా తెమ్మంటే నేను ఇలాగే చేస్తుంటాను..
రేపు నా లైఫ్ లోకి ఒక నైఫ్ వచ్చాక ఇలాగే చేస్తే ఊరుకుంటాడా ఉరి వేసేస్తదా అని ఊరికే భయపడుతూ ఉంటాను...
ఏదో ఇలా వెల్లిపోద్ది అన్నమాట లైఫ్..

:-)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నేస్తం..,

ఈ నేస్తం అన్న పేరు ఎక్కడో విన్నట్టుందే....

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కమల్,

చెప్పారు ఈవేళ మెసేజ్ వచ్చిందని...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes