RSS

పేద్ద గొప్పే !!

   మా శ్రీవారు క్రితం ఆదివారంనుండీ మూతి ముడుచుక్కూర్చున్నారు కారణం తెలుసుగా!మోకాలు బెణికిందని,బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కాలక్షేపం.మొన్న శుక్రవారం సాయంత్రం, మర్నాటికి కొబ్బరికాయ తెద్దామని, నేనే బయటకి వెళ్ళాను. ఈ లోపులో 'ఈనాడు' నుండి ఫోనొచ్చిందిట, ఈయనేం చెప్పారో ఆ భగవంతుడికే తెలియాలి.ఓ అరగంట పోయిన తరువాత వచ్చేటప్పటికి, 'అమ్మయ్యా, ఇప్పుడొచ్చావు బావుంది, ఓ అరగంట ముందర వచ్చుంటే, నా ప్రాణం పీకేదానివీ, అలా ఎందుకు మాట్లాడారూ,ఇలా ఎందుకు మాట్లాడారూ ' అంటూ.ఏం చేస్తాను అలవాటైపోయింది, అయినా మీకు తెలుసుగా, ఈ మగాళ్ళెలా మాట్లాడతారో, అందులో మనం లేకుండా అయితే పండగే పండగ!నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తారు. ఊళ్ళోవాళ్ళకేం తెలుసూ, వీళ్ళ అసలు గొప్పతనం ! కాలూ, చెయ్యీ సరీగా ఉన్నప్పుడే, ఇక్కడ వస్తువక్కడ తీసి పెట్టరు. ఇప్పుడాకాలునొప్పోటీ,ఎప్పుడు చూసినా కంప్యూటరు ముందరే కూర్చోడం.

   ఈవేళ వెరైటీ కోసమని राज्मा తో కూర చేస్తే,'అవి కొంచెం ఉడకనీయ వల్సిందోయ్' అంటూ, ఆ గింజలన్నీ తీసి ప్రక్కన పెట్టేసి, గ్రేవీ తో తినేశారు.ఈ మాత్రందానికి, నేను,అంత శ్రమపడి, గింజలు క్రితంరోజు నాన పెట్టడం ఎందుకూ,అవీ ఇవీ వేసి కూర తయారుచెయ్యడం ఎందుకూ? ప్రొద్దుటే సుజాత ఫోను చేసి చెప్పారు-'బాబయ్యగారూ, మీగురించి ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ లో వచ్చిందీ'అంటూ. ఈయన మెయిల్ ఓపెన్ చేయగానే, వేణు పంపిన ఎటాచ్మెంటు కనిపించింది.
ఇంక ఊళ్ళో వాళ్ళందరికీ టముకేసుకోవాలిగా,ఓ బ్లాగ్ వ్రాసేసికున్నారు.ఒక్క విషయం మాత్రం చెప్పాలి,అందులో' ... తనకూతురు పనిగట్టుకుని కంప్యూటర్ నేర్పిందని చెప్పారు' అని వ్రాశారు.నిజం చెప్పాలంటే ఆయనకి నేర్పింది మా అబ్బాయి.ఈయనేం చెప్పారో, ఆ ఇంటర్వ్యూ చేసినాయనేం విన్నారో? అందుకే అంటాను,నాలాటివాళ్ళుండాలీ,మీరు మాట్లాడేటప్పుడూ అని!

    అయినా ఒక విషయం చెప్పండి,ప్రతీ రోజూ, రోజుకోటి చొప్పున ఓ వరసా వావీ లేకుండా, వ్రాసుకుంటూ పోతే ఎప్పటికో అప్పటికి ఎవరో ఒకరు, పెద్దాయన వ్రాస్తున్నారూ అని జాలి పడి ఇంటర్వ్యూలూ అవీ చెయ్యకేంచేస్తారు? అదో గొప్ప విషయంలా ఊరంతా టాంటాం చేసికోవడం! క్వాలిటీ అమ్మా క్వాలిటీ ఉండాలి రాసేదాంట్లో,వ్రాసినవి 50 అయినా,అందరికీ ఉపయోగించే ఓ స్వీటు గురించి వ్రాస్తేనే కదా,క్రిందటి వారం దాని గురించి వ్రాశారూ? ఎవరిదొచ్చిందమ్మా ముందర పేపర్లో?
అది ఒప్పుకోరు.తయారుచేస్తే మాత్రం,దాచుకుని మరీ తింటారు.ఈ 38 ఏళ్ళ కాపరంలోనూ, ఒక్కసారంటే ఒక్కసారి, నువ్వు చేసింది బావుందీ అంటే ఆయన సొమ్మేంపోయిందో? నా చేతివంట తిన్న ప్రతీవారూ,ఇంకోసారి తింటే బావుంటుందన్నవాళ్ళే. కానీ మా శ్రీవారు మాత్రం 'బావుందీ,బావుందీ అని ప్రతీదానికీ చెప్పేదేమిటీ,రెండో సారి వేసికుంటే బావున్నట్లేకదా'. కానీ ఈమధ్యన ఆయనలో కొంచెం మార్పొస్తోందండోయ్,కోడలెప్పుడు చేసినా, బావున్నప్పుడు బావుందనిచెప్పడం నేర్చుకున్నారు. అందుకనేమో, కోడలెప్పుడు ఫోను చేసినా మావయ్యగారెలా ఉన్నారూ అంటుంది.ఇంక అమ్మాయైతే అడగఖ్ఖర్లేదు,ఈవేళ అంతపనిలోనూ చూడ్డానికి వచ్చేసింది.ఎంతైనా వాళ్ళూ వాళ్ళూ ఒకటే!

20 కామెంట్‌లు:

Ravi చెప్పారు...

మీ ఇద్దరి కబుర్లు చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో... బ్లాగ్ లోకమంతా ఓ ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది...

అజ్ఞాత చెప్పారు...

మీ ఇద్దరి పని బాగుంది తాయారమ్మ బంగారయ్యలా ఉన్నరు . ఇప్పటి వరకు మొగుడు పేళ్లాలు ఇంట్లో వాదోపవాదలకు దిగుతారను కుంటె మీరు ఇంత పెద్ద వయసులో చిన్న పిల్లలా బ్లాగులో విమర్శించు కుంట్టారా?

అజ్ఞాత చెప్పారు...

మీ ఇద్దరి పని బాగుంది తాయారమ్మ బంగారయ్యలా ఉన్నరు . ఇప్పటి వరకు మొగుడు పేళ్లాలు ఇంట్లో వాదోపవాదలకు దిగుతారను కుంటె మీరు ఇంత పెద్ద వయసులో చిన్న పిల్లలా బ్లాగులో విమర్శించు కుంట్టారా? :-)
గురువు గారికి అభినందనలు.

Unknown చెప్పారు...

అవునండి ! ఎంతైనా వాళ్ళూ వాళ్ళూ ఒహటే ! మీకు నా సహానుభూతి.

సుజాత వేల్పూరి చెప్పారు...

మా అమ్మ ని నాన్నగారి గురించి రాయమన్నామనుకోండి ఇదిగో ఇలాగే రాస్తుంది అచ్చంగా!

మీ ఇద్దరి టపాలు మేమంతా టెన్నిస్ ప్రేక్షకుల్లా అటొక సారీ ఇటొక సారీ తల తిప్పుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం! కానీండి!

ఫణి బాబుగారు ఎంతో ఈజ్ తో రాయడం ఒకటీ, పైగా ఆయన రిటైర్ అయినా ఎంతో హుషారుగా ఉండటం ఒకటీ గమనించాకనే ఆ వ్యాసానికి ఆయన్ని ఎంచుకున్నావండీ!

ఎంచక్కా మిల్క్ మెయిడ్ వాడి కమ్మని జున్ను చేసినందుకు మిమ్మల్నీ!

ఇంతకీ నిన్నంతా ఫణిబాబు గారు పేపరు పుచ్చుకు తిరగడానికి వీల్లేకపోయిందా? ఎంకంటే మీకొచ్చేది మహారాష్ట్ర ఎడిషన్ కదా పాపం!

ఆ.సౌమ్య చెప్పారు...

అవును మీరే గొప్ప, మీరేముందు పేపర్లో పడ్డారు కాబట్టి మీరే గొప్ప అంతే అంతే!

చిన్న డౌటండీ. పతియే పరమేశ్వరుడైతే ఇల్లు కైలాసం కదా అవ్వాలి, వైకుంఠం ఎలా అయిందండీ?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఇనగంటి,

అలాగే ఆశిద్దాం. ఆమెన్ !!!

శ్రీలలిత చెప్పారు...

మనం చేసిన వాటిని బాగుందని వాళ్ళెప్పుడూ అనరండీ. బాగారాకపోతే మాత్రం వెంటనే చెప్పేస్తారు. వాళ్ళు కామెంట్ చెయ్యకుండా తిన్నారంటే బాగుందనే అర్ధం. ఏమంటారు? మీరన్నట్లు వాళ్ళూ వాళ్ళూ అంతా ఒకటే. మనమేగా పరాయివాళ్లం..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీకర్,

ఇంట్లో అయిపోయింది బాబూ! మీ 'గురువు' గారికి అభినందనలు అందించేశా.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నరసింహరావుగారూ,

థాంక్స్.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుజాతా,

పేపరు దొరక్కపోతేనేం? నెట్ ఉన్నవాళ్ళందరికీ ఎటాచ్మెంట్ పంపేశారు,హైదరాబాద్ లో ఉన్నవాళ్ళందరికీ ఫోన్లోటీ !

వేణు చెప్పారు...

> అయినా మీకు తెలుసుగా, ఈ మగాళ్ళెలా మాట్లాడతారో
> ఎవరిదొచ్చిందమ్మా ముందర పేపర్లో?
> ఎంతైనా వాళ్ళూ వాళ్ళూ ఒకటే!

ఎంత చక్కగా రాశారో కదా! హాయిగా నవ్వుకోవాలంటే వెంటనే మీ బ్లాగుల్లోకి వచ్చేస్తున్నాను, ఈ మధ్య. చక్కని తెలుగు శైలి విషయంలో ఫణిబాబు గారిని మాత్రమే మెచ్చుకుంటే అన్యాయమే! మీకూ సమాన మార్కులు వేయాల్సిందే.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సౌమ్యా,

ఊరికే అంటాను కానీ,ఆయన ఈ బ్లాగుల్లోకి వచ్చేముందర,ఇండియా లో ఉండే ప్రతీ ప్రముఖ మ్యాగజీన్నూ, పూణే లో ఉండే ప్రతీ న్యూస్ పేపర్లలోనూ,వ్రాసేవారు.మధ్య మధ్యలో కొన్ని గిఫ్టులు,చెక్కులూ వచ్చాయి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీలలితా,

బాగా చెప్పారు !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

వేణూ,

సహవాస ఫలితం నాయనా ఇదంతా !!

పానీపూరి123 చెప్పారు...

>ఈయనేం చెప్పారో, ఆ ఇంటర్వ్యూ చేసినాయనేం విన్నారో
అదే మీడియా మహిమ :-)
ఇప్పుడే observer చేశాను.
మీరేమో బ్లాగ్‌స్పాట్, ఫణిబాబుగారు వర్డ్ ప్రెస్ లో ఉన్నారు :-)

ఆ.సౌమ్య చెప్పారు...

నేనడిగిన దానికి జవాబివ్వలేదు మీరు :)

"చిన్న డౌటండీ. పతియే పరమేశ్వరుడైతే ఇల్లు కైలాసం కదా అవ్వాలి, వైకుంఠం ఎలా అయిందండీ?"

Unknown చెప్పారు...

:) నిజంగానే...అదేదొ అడ్వెర్టైస్మెంట్ లోలాగా, వంటకాలని ఒక్క నిముషం "కంఫర్ట్" లిక్విడ్ లో ముంచితే మెప్పులు ఆటోమాటిక్ గా వస్తాయేమో! లేకపొతే, లక్షణంగా రాజ్మా కూర చేస్తే వంకలా?

కూతుళ్ళకి ఏమైనా తల్లి దండ్రులమీదే ద్రుష్టి(పెళ్ళి అయ్యి అత్తారింటికి వెళ్ళిందెగ్గరనుంచీ మరీనూ)... ఒకే ఊరైతే మనసు పీకుతూ ఉంటుంది చూసివద్దామని...మరి ఇలాంటప్పుడు మీ అమ్మాయి రావడాన్ని నేను అర్ధంచేసుకోగలను...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సౌమ్యా,

దానిగురించి ఇదివరలో ఓ టపా http://bsuryalakshmi.blogspot.com/2009/04/blog-post_25.html వ్రాశాను

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఏరియన్,

గింజలు ఉడక్కపోతే తినలేరు పాపం, పళ్ళసలు లేవు కదమ్మా!!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes