
అప్పుడే ఒక నెల దాటింది నేను ఓ టపా వ్రాసి.మన బంధువర్గం అంతా ఎలా ఉన్నారో పలకరిద్దామని ఈ టపా. శంకరాభరణం గడి, మురళీ మొహన్ గారి గళ్ళనుడికట్టూ పూరించి పంపిస్తున్నాననుకోండి, అయినా ఓ టపా వ్రాసి చాలా రోజులయింది కదా! ఇన్నాళ్ళు శలవు పెట్టేసరికి, కూడలి లోనూ, హారంలోనూ వస్తుందో రాదో కూడా అనుమానమే! 'మాలిక' వారైతే నన్నసలు పట్టించుకోవడమే లేదు.అదేం పాపం చేశానో?
మా చెన్నై ట్రిప్పుగురించి మా శ్రీవారు వ్రాసిన టపాలు చదివేఉంటారు.నా అభిప్రాయాలు కూడా వ్రాయాలికదా.మా అబ్బాయి క్విజ్, అష్టలక్ష్మి గుడి దర్శనం, వీటన్నిటినీ మించి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ దంపతులతో గడిపిన మూడున్నర గంటల సమయమూ, ఆ తరువాత శ్రీ బాపూ గారితో గడిపిన గంటన్నరా,మరచిపోలేని మధుర జ్ఞాపకాలు. శ్రీ బాపూ గారిని కలవడంతోటే, మా శ్రీవారు తన స్టైల్లో ' మీరూ శ్రీ రమణ గారిలాగే,మేమిద్దరమూ తూ.గో.జి, ప.గో.జి' అన్నారు.
ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి, లోపలకి వెళ్ళి ఇదిగో పైన పెట్టిన కార్టూన్ మీద మా పేర్లు వ్రాసి, చేతిలో పెట్టారు! మనుష్యుల్ని చూడగానే ఆయన అసలు ఎలా ఊహించేశారో తల్చుకుంటే ఆశ్చర్యం వేసి ఆయనతో అననే అన్నాను! 'మనుషుల స్వభావాలు ఎంత బాగా అంచనా వేశారూ!'.అందుకే అంత గొప్పవారయ్యారు.
చిన్నప్పుడు గుర్తుందా, పిల్లలు స్కూలు ఎగ్గొడదామంటే, కడుపునొప్పో, కాలి నొప్పో అని వంక పెట్టేవారు.ఎందుకంటే అవి Non verifiable రోగాలు! మరీ డాక్టరు దగ్గరకు తీసికెళ్ళినా కుయ్యో మొర్రో అనేవారు! ఇప్పుటి పిల్లలకలా కాదనుకోండి- వెళ్ళం అంటే వెళ్ళరు.తల్లి తండ్రులకి కూడా, వాళ్ళని కాదని ఏదో చేసే ధైర్యమూ లేదు! అలాగామ్మా, కడుపునొప్పొచ్చిందా అంటూ,హడావిడి చేసేసి, ఎక్కడోఅక్కడికి లాంగ్ డ్రైవు కి తీసికెళ్తే, అన్ని రోగాలూ హాం ఫఠ్ !ఈ రోజుల్లో పిల్లలెంత అదృష్టవంతులో కదా! దేనికైనా పెట్టి పుట్టాలి!
ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, నాకు ఈ మధ్యన నడుంనొప్పితో చాలా బాధ పడుతున్నాను, వయస్సేమైనా తగ్గేదా ఏమిటీ? ఏళ్ళొచ్చీకొద్దీ ఇలాటివి తప్పవు,వీటిగురించి ఎవరితోనైనా చెప్పినా నమ్మరుకూడానూ, అదేంఖర్మమో! ఏమైనా అంటే, మా శ్రీవారు, ఓ పైన్ కిల్లర్ ఇచ్చేసి, ఏదో క్రీం మూవ్వో ఇంకోటో ఏదో మొహాన్న పడేస్తారు. ఓ గిన్నెతో వేణ్ణీళ్ళు పెట్టి,హాట్ వాటర్ బాగ్ లో పోసి పెడతారు.పాపం అంతకంటే ఏం చేస్తారులెండి? నా బాధ ఆయన పడలేరుగా,నేనే అనుభవించాలి. దీనికి సాయం పన్ను నొప్పోటీ, ఎప్పటినుంచో చెప్తున్నాను ఆయనతో, వింటేనా? ఏమైనా అంటే, పీకించేసుకో సుఖ పడతావూ అంటారు. నాకసలే డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళాలంటే చచ్చేటంత భయం. మా అబ్బాయి నా బాధ చూడలేక, మొత్తానికి డెంటిస్ట్ దగ్గరకు తీసికెళ్ళాడు.అక్కడి భాగవతం అంతా మాశ్రీవారి టపాలో చదివే ఉంటారు.అక్కడ నేను నొప్పితో బాధపడుతూంటే, ఆయనకెంత నవ్వో!
ఇన్ని బాధలు పడుతూ ఉన్నా, రోజువారీ పనులు-వంటా వార్పూ-తప్పించుకోలేముగా! పైగా ప్రతీ వీకెండ్స్ కీ, మా ఇంటికి వెళ్తూంటాము. అక్కడికెళ్తే మా అగస్త్య నన్నొదలడు. అయ్యో మర్చేపోయాను, వరలక్ష్మి వ్రతమ్ రోజున మా అమ్మాయి వచ్చి, నాతో కలిసి కథ వింది, తనకే వాయినం ఇచ్చేశాను.సాయంత్రం అబ్బాయీ పిల్లలూ, అదేరోజున మా డాక్టరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మొత్తానికి ఆ రోజున ముగ్గురు ముత్తైదువలకి వాయినం, తాంబూలం, బట్టలూ పెట్టుకోకలిగాను.
ఆ తరువాత వినాయక చవితికి అందరం కలిసే పూజ చేసికున్నాము. శుక్రవారాలు అమ్మవారి పూజ చేసికుని నైవేద్యానికి ఏదో ఒక స్వీటు చేస్తూంటాను.ఈవేళ, ఆనపకాయతో పాయిసం చేశాను. మా శ్రీవారి ప్రొద్దుటి తిరుగుళ్ళన్నీ పూర్తయిన తరువాత ఇంటికి రాగానే ఇచ్చాను,రుచి చూసి ఓ సారి బాగుందంటే ఆయన సొమ్మేం పోయిందీ? రుచి చూడగానే అన్నారుట బ్రహ్మాండంగా ఉందని, నాకేం తెలుసూ నేను వినలేదు, దాంతో మళ్ళీ భోజనం దగ్గర ఇచ్చినప్పుడు అడిగాను ఎలా ఉందండీ, అంతే గయ్య్ మన్నారు 'నోట్లో పెట్టుకున్న ప్రతీసారీ అడగాలా, ఓసారి చెప్తే చాలదా' అంటూ! అవునండీ అడిగామూ,చెప్తే ఏం పోయిందిట? ఆయన్నేమైనా మణులడిగామా, మాణ్యాలడిగామా? ప్రతీ దానికీ దెబ్బలాడడమే!
దెబ్బలాటంటే గుర్తొచ్చింది, మేము ప్రతీ శుక్రవారం మా పిల్లలతో గడపడానికి మా ఇంటికి వెళ్తూంటాము. నాకు హిందీ సీరియల్స్ చూడడం (అన్నీ కాదు, ఒకటో రెండో మూడో.). వీకెండ్స్ లో మిస్సయినవాటిని సోమవారం మేముండే చోట చూస్తూంటాను. ఖర్మకాలి ఈ వారం ఏమయ్యిందంటే, నేను చూస్తున్న ప్రతీ సీరియల్లోనూ ఒకే విషయం! దాంతో ఆయనకి చిరాకు పుట్టి, 'ఆ సీరియళ్ళు చూడకపోతే నీకు రోజెళ్ళదా' అంటూ కోప్పడేశారు. నేనేం తక్కువ తిన్నానా ఏమిటీ, నాకు మాత్రం పౌరుషం లేదా ఏమిటీ, నాకూ కొపం వచ్చేసి, ఆ టి.వీ కాస్తా కట్టేశాను.అంతే ఆయనకి కూడా కోపం, అలకా వచ్చేసి కంప్యూటరు మీద చెయ్యికూడా వెయ్యలేదు. చెరో పుస్తకం పుచ్చుకుని అంత విశాలభవనం లోనూ
( అదేనండీ మేముండే ఒన్ బెడ్రూం ఫ్లాట్ లో) తలో మూలా సెటిలయ్యాము! ఎంతసేపూ 14 గంటలు! ఆయనకి కంప్యూటరు ముట్టుకోందే నిద్ర పట్టదూ, నాకు సీరియళ్ళు చూడందే రోజెళ్ళదు ( వాళ్ళందరూ ఏమైపోయారో తెలిసికోవద్దూ). అలాగని నేనేమీ సీరియళ్ళకి ఎడిక్ట్ కాదు, ఏదో కాలక్షేపం!
ఇదిగో ఇలాగ దెబ్బలాడుకుంటూ లాగించేస్తున్నాము. మరి శ్రీ బాపూ గారు మాకు అలాటి కార్టూన్ ఇచ్చారంటే ఇవ్వరూ మరి
6 కామెంట్‌లు:
A very very nice post....Thinking about my parents after reading this...They exactly do the same...but in my case Daddy is so much into 'BABA' books..Thanks for such a nice post...
hammayya mee version kosam chaala wait chestunaanu.
Valli,
Happy to note that you liked my post.
రవీ,
నచ్చిందా లేదా?
లక్ష్మి గారూ,
మీకు ఇబ్బంది లేకపోతే కనుక ఈ ప్రశ్న కి జవాబు ఇవ్వండి. నేను ఎన్ని రోజుల నుండో బాపూ రమణలని కలవాలనుకుంటోంటే కుదరలేదు ఇంతలో రమణ గారి మరణం. కనీసం బాపు గారి నయినా కలుద్దామని/ఉత్తరం రాద్దామని ఆలోచన.
మీ వారి టపా లో,బాపు/రమణ గార్ల నుండి స్వయంగా ఉత్తరం వచ్చింది అని రాసారు కదా.
వాళ్ళ అడ్రస్సు ఇదేనా?
నంబరు 9,గ్రీన్ వేస్ రోడ్ ఎక్స్టెన్షన్,రాజా అన్నా మలై పురం,చెన్నై-600028,ఫోను 044-24951987
నోటు: ఈ కామెంటు ప్రచురించక్కర్లేదు. అవును కాదు అని సమాధానం ఇవ్వండి చాలు,అదీ మీకు ఇబ్బంది లేకపోతేనే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి