ఈ నెలంతా మా మనవడు చి.అగస్థ్య తోనే గడిపాను. వాడి పుట్టినరోజూ, ఆ తరువాత మా మనవరాలు చి.తాన్యా పుట్టినరోజూ, ఆ మధ్యలో మా డాక్టరు స్నేహితులు వారి కూతురితో రావడం, ఈ వారంలో మా అబ్బాయికి స్కూల్లో ఇంగ్లీషు చెప్పిన మాస్టారు భార్య, డాక్టరీ చదువుతున్న కూతురితో రావడం, రెండు రొజులక్రితం మా అల్లుడు చి.విశాల్ పుట్టినరోజూ, అన్నీ పూర్తిచేసికుని మేముండే ఇంటికి చేరాము. ఓ నెలరోజులపాటు, ఇల్లు తాళంపెట్టుంచేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా! మధ్యమధ్యలో మావారు వచ్చినా, ఏదో తన టపాలు వ్రాసుకోవడంలో బిజీగా ఉంటారుకానీ, ఇంట్లో పనులేం ఉన్నాయి చేయడానికీ అంటారు!
చెయ్యాలని ఉండాలేకానీ, పన్లే ఉండవా మరీ చిత్రం కానీ,ఓ చీపురేస్తే, మరీ అంతగా దుమ్ముకొట్టుకుపోదుగా,పొనీ బూజులాటివేమైనా ఉంటే ఒకసారి,దులిపేస్తే సరిపోతుంది. అబ్బే అలాటివెక్కడ తడుతాయీ? మర్చిపోయానండోయ్, ఈ మధ్యలో
మా మనవడు చి.ఆదిత్య స్కూల్లో Grandparents day జరిగితే, దానికోదానికి వెళ్ళాము. ఒకరోజు చి.నవ్య కి స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉంటే, అక్కడికి చి.అగస్థ్య ని తీసికెళ్ళడానికి వీలులెకపోతే, నాతోనే ఉన్నాడు. మావారేమో, ఏదో మిస్టరీ షాపింగుకి వెళ్ళారు,ఇంక ఆరోజంతా అగస్థ్యతోనే ఉన్నాను.ఆ సాయంత్రానికి ఇంటికి వచ్చినా, మర్నాడు ఆదివారం, మా అబ్బాయి బయటకు వెళ్ళాడని, మా శ్రీవారు, మా ఇంటికి వెళ్ళి అక్కడే కోడలుకి తోడు గా ఉండి, అబ్బాయి వచ్చిన తరువాత వచ్చారు.
అక్కడితో అవలేదుగా, ఇంకో రోజు మా తాన్యాకి స్కూల్లో ప్రోగ్రాం ఉండడం, దానికి ఆదిత్యని తీసికెళ్ళకపోవడం తొ, మావారు వాడితో గడపడానికి వెళ్ళారు.ఏమిటో ఈ గొడవంతా ఏమిటీ, మీరేం చేసుకుంటే మాకెందుకూ అంటారా, అదే మరి
ఒకేఊళ్ళో కూతురూ కొడుకూ ఉండి వాళ్ళకు ఇద్దరేసి పిల్లలూ,ఉంటే అర్ధం అవుతుంది.మేమేదో ఘనకార్యం చేసేశామని కాదూ, వంట్లో ఏదో కొద్దిగా ఓపికుంది కాబట్టి, వాళ్ళడిగినప్పుడల్లా వెళ్ళడం, పిల్లలతో కాలక్షేపం చెయ్యడం. దానికీ అదృష్టం ఉండాలిగా మరి.మా అగస్థ్యేమో నన్ను వదలడు, ఇంకా ఎంత, మొన్ననే ఏడాది నిండింది.ఒక్కొక్కప్పుడు వాడితో సమానంగా ఆడడం కొంచం కష్టమే అనుకోండి.ఇదివరకు మా పై ఇద్దరి మనవరాళ్ళనీ, మనవణ్ణీ అవసరాలు వచ్చినప్పుడు చూళ్ళేదూ? ఇదీ అలాగే. రేపు పెద్దయిన తరువాత వాళ్ళకి గుర్తే ఉందదు!వాళ్ళేమిటీ, పిల్లలకి మాత్రం గుర్తుంటుందా? అక్కడికి వాళ్ళే, తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటూంటామనుకుంటారు కానీ, ప్రతీ తల్లీ తన పిల్లల్ని అలాగే పెంచుతుంది. ఎవరి తాహతుని బట్టి వారు పెంచుతారు. ఇప్పుడు పిల్లో పిల్లాడో పుట్టినప్పటినుండీ, ఫుటోలూ, వీడియో లూ కావలిసినన్ని documentary evidence లూ మరి. రేపు పెద్దైన తరువాత, ఆ తల్లితండ్రులూ, పిల్లలూ చూసుకుని మురిసిపోవడానికి, మా రోజుల్లో ఏమున్నాయి?
ఈవేళ 'మా' టి.వీ. లో 'జయప్రదం' కార్యక్రమం లో శ్రి విశ్వనాథ్ గారితో పరిచయ కార్యక్రమం బావుంది. అందులో 'సిరిసిరిమువ్వ' గురించి చెప్తూంటే, నా దగ్గర ఉన్న ఓ 'సిరిసిరిమువ్వ' గుర్తొచ్చింది! అదేమీ పేద్ద విషయం కాదనుకోండి,పోలికలు మాత్రం చాలా ఉన్నాయి.ఆ సినిమాలో జయప్రద లాగే, పాపం దీనిక్కూడా సౌండు లేదు!మరేం లేదు, నా సెల్ ఫోను!అదేం ఖర్మమో,మా అగస్థ్య ఒకరోజూ దానితో ఆడుకుంటూ,సరదాపుట్టి విసిరేశాడు!అమ్మవారు,ఖండాలుగా అష్టాదశ స్థానాల్లో పడ్డారుట, మరీ అంతకాదుకానీ, మూడు ముక్కలుగా పడింది నా ఫోను.మా కోడలు,దొరికినన్ని భాగాలు తీసి, ఏదో ఎసెంబుల్ చేసింది. ఏమిటో,అప్పటినుంచీ నా బుచ్చి ఫోను మ్రోగడం మానేసింది.పెర్మనెంటు vibration mode లో సెటిల్ అయిపోయింది! అదృష్టం బాగుండి చూసుకున్నానా సరే, లేకపోతే అంతే సంగతులు!మాశ్రీవారు బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడున్నారో, ఎప్పుడు ఇంటికి వస్తారో ఫోను చేస్తూంటారు. అదేమీ నామీద ప్రేమనుకోకండి, ఆయనొచ్చేటప్పటికి కుక్కరు పెట్టేయమనీ! ఈ మధ్యన, నా సిరిసిరిమువ్వ ధర్మమా అని, ఆయన ఫోను చేసినా రింగు వినిపించడం మానేసి సుఖ పడ్డాను!
ఇంక ఆయన ఇంటికొచ్చి, అన్నిసార్లు ఫోను చేసినా తియ్యలేదే,బయటకేమైనా వెళ్ళావా అనడం. నేనెక్కడికి వెళ్తానూ వేషాలు కాపోతే? ఆ దిక్కుమాలిన ఫోను మోగదూ, అది ఎప్పుడు మోగుతుందో చూస్తూ కూర్చోడానికి, నాకేమీ ఇంకో పని లేదా ఏమిటీ?అదండి నా సిరిసిరిమువ్వ విషయం!ఎప్పుడో తీరికున్నప్పుడు, కొత్త ఫోనోటి కొనిపెడితే, ఆయనకే ఉపయోగం. లేకపోతే నాకేం?