RSS

ఏం మగాళ్ళండి బాబూ...

   మొన్న మా స్నేహితురాలు తన చిట్ పార్టీ చతుర్ శృంగీ కొండ మీద యిచ్చింది. సరే ఎలాగు మేము వెడదామనుకుంటున్నాము కదా అని మా వారితో కలసి ఉదయమే 10 గంటలకల్లా బయలుదేరి వెళ్ళి చీర, పసుపు, కుంకుమ యిచ్చి దర్శనం చేసుకొని నేను అక్కడే వుండి లలితా సహస్రం, లలితా చాలీసా చదువుకుంటూ కూర్చున్నాను. మా శ్రివారు బాపు గారిచ్చిన బొమ్మ ఫ్రేమ్ కట్టించినది కలెక్టు చేసుకొందుకు వెళ్ళి పోయారు.పార్టీ మెంబర్సు వచ్చేది 12 గంటలు దాటిన తరువాత. ఈ లోపులో నేను చదువుకునేవి పూర్తి చేసికుని కాస్త అటూ యిటూ తిరుగుతూ గణేష్ మందిర్ పక్కన సిమెంట్ సోఫా మీద కూర్చున్న నాకు పక్కనే వున్న యిద్దరు మరాఠి స్త్రీల సంభాషణ , వినిపించిన దాన్ని బట్టి , వారి స్నేహితురాలికి మళ్ళి మనుమరాలని దానితో ఆమె నిరాశ పడిందని చెప్పుకుంటూ, అబ్బాయిలకి ఏ మాత్రం అమ్మాయి తీసిపోదని, అబ్బాయిలదిఏముందీ? అమ్మ ఆంచల్ నుండి బీవి కి ఆంచల్ లకి అంతేను, అంటూ ఏవో చెప్పుకుంటూ సేద తీరి కిందకి వెళ్ళిపోయారు.నేను పైకి దర్శనానికి వెళ్ళె భక్తుల్ని చూస్తూ కూర్చున్నాను. అందులో శ్రద్ధ గా వెళ్ళె అబ్బాయిల్ని చూసి( వాళ్ళ మాటల ప్రభావమొ ఏమిటో) నాకనిపించింది, నిజమే కదా వీళ్ళకో అదృష్టం, వీళ్ళకని జాతకం అల్లాంటివి ఏమీ వుండవు కదా!ముందర తల్లి కడుపు చలవ, ఆమె అదృష్టం, మంచితల్లిగా, వీరమాత ( జీజాబాయి), ఆదర్శతల్లిగా వుండే యోగం వుంటే అల్లాంటి పుత్రుడే పుడతాడు. ఆ తర్వాత భార్య తాళి గట్టిగా వుంటే ఆయురారోగ్యాలతో, వీరపత్నిగా, ఆష్టేశ్వర్యాలతో అనుభవించే నసీబ్ వుంటే అవి అన్నీ సమకూర్చకలిగిన మొగుడు గా వుంటాడు. గాడు సారీ! మగాడుగా అతనికి ఏముందండీ? అతనికంటూ ఓ నసీబ్ , ఓ జాతకం ఏమీ లేవే, మరి ఎందుకు విర్రవీగుతాడో తెలీదు.

   మాతృభూమి, మాతృదేశం, మాతృసంస్కృతి ,మాతృభాష, వీటిని మించినది ఏముందండీ,యివి గౌరవిస్తే మగవానికిఎక్కడయినా నీరాజనాలే కదా!చదువు కావాలంటే సరస్వతిని, శక్తి కావాలంటే దుర్గని, డబ్బులు కావాలంటే లక్ష్మి కి పూజలు చేస్తాడే, కనేందుకు అమ్మాయి అక్కరలేదు, ముసలితనంలోవున్న తల్లి ని మరచిపోతాడే, భార్య మక్కువలో పడి, ఏం, మగాడండీ?

   తల్లి నిజం. తండ్రి నమ్మకం అన్నారొకరు.తల్లే తొలి గురువు.తొలి మాట " అమ్మా" చిన్న దెబ్బ తగిలితే నోట వచ్చేది "ఆమ్మా".ప్రంపంచంలో చెడ్డ సంతానం వుంటుంది కానిచెడ్డ తల్లి వుండదంటారు. అమ్మాయి పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది, కాని అబ్బాయి తండ్రికి స్నేహితుడవుతాడంటారా? ఏమో, స్త్రీని స్త్రీ గౌరవించడం తెలుసుకోవాలి, చిన్నప్పటినుండి మగవాడికి తెలియబరచాలి. ఈ రోజు అమ్మాయే రేపటి అమ్మ. ఇంకో మగవానికి జన్మ యిచ్చే తల్లి.తన జీవితాన్ని యిచ్చి శక్తిమంతుడ్ని చేసే నారి. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా,ఆత్మీయత పంచి యివ్వకలిగే కల్పవృక్షం. నా ఉద్దేశ్యంలో ఆడది మగవాడు లేకుండా జీవించగలదుకానీ మగవాడు ఆడది లేకుండా ఆనాధ అయిపోతాడు.

   ప్రొద్దుటే మావారు బయటకి వెళ్ళడంతో, కంప్యూటరు ఫ్రీగా ఉందని, ఆయన్ తిరిగివచ్చే లోపల ఈ టపా వ్రాశాను.ఇది చదివి,మా శ్రీవారు ఛుప్ అయిపోయారు.ఏమిటీ కోపంగా ఉన్నావా, లేక నిన్నటి 'జయప్రదం'లో కమల్ హాసన్ చెప్పినట్లు, కోపం వస్తేనే కానీ, క్రియేటివిటీ ఉండదనా అన్నారు! ఏం మగాళ్ళండి బాబూ !

4 కామెంట్‌లు:

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>>అమ్మ ఆంచల్ నుండి బీవి కి ఆంచల్ లకి అంతేను,
>>>మగవాడు ఆడది లేకుండా ఆనాధ అయిపోతాడు.

నిజం నిజం మీరన్నది నిజం. పాపం మగాడు. అయినా అందరూ వాడినే ఆడిపోసుకుంటారెందుకో? :):)
చాలా బాగా చెప్పారు.

Unknown చెప్పారు...

ఎవరికీ ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందండి. పూర్వ జన్మల్లో చేసిన పాప పుణ్యముల వల్ల ఈ జన్మలో చెడు కర్మలు, పాడు బుద్ధులు వస్తాయండి.
కాబట్టి ఎవరి గురించో బాధ పడే కంటే మన బంగారం మంచిగా ఉంచుకున్నామా లేదా అనేది ముఖ్యం :) ఏమంటారు...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

బులుసు సుబ్రమణం గారూ
అదేనండీ నేను అనేదీను--
టపా చదివినందుకు ధన్యవాదాలు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మధుమోహన్ గారూ
" పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు " అంటారండీ, పెద్దలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes