ఏమిటో చూస్తూ చూస్తూ మూడేళ్ళు గడిచిపోయాయి, ఈ టపాలు వ్రాయడం ప్రారంభించి. మేము రాజమండ్రి లో ఉంటున్నప్పుడు, మా శ్రీవారు ఏదో సుఖపడిపోతున్నారూ, ప్రపంచం లోని ఎక్కడెక్కడివారూ ఆయన బ్లాగుల్లోకి వచ్చేసి, ఆయన వ్రాసే బాతాఖానీ కబుర్లు చదివేస్తున్నారే, ఆమాత్రం నేను వ్రాయలేనా అనుకుని, ఆయన్ని బతిమాలి, బామాలి, దెబ్బలాడి, మొత్తానికి నేర్చుకుని, వ్రాయడం మొదలెట్టాను. ఒకానొక స్టేజ్ లో " నాకు నేర్పకపోతే, మీకు పనసపొట్టు కూర ఆవ పెట్టి చెయ్యనంతే..." అనేదాకా బెదిరిస్తే, చేయకేంచేస్తారు పాపం!ఆయన చూడకుండా, ఓసారి మంగళసూత్రాలు కళ్ళకద్దేసికుని, పాపం ఆయనకి పనసపొట్టు కూరా, కందా బచ్చలి కూరా పెట్టకుండా నేనుండగలనా, ఏమిటో ఈమాత్రం బెదిరింపుకూడా తప్పేనా ఏమిటీ?
అయినా ఆయన వ్రాసినన్ని నేనెక్కడ వ్రాయగలనూ, ముక్కుతూ మూలుగుతూ ఏదో మొత్తానికి ఓ నూట నలభై దాకా లాక్కొచ్చాను. అయినా ఆయనలాగ నాకేమైనా రిటైర్మెంటా పాడా, ప్రతీ రోజూ ప్రొద్దుటే బ్రెక్ ఫాస్టూ, మధ్యాన్నం పన్నెండున్నరకల్లా ఓ కూరా, పప్పూ, పచ్చడి తో భోజనం, పైగా వీటిల్లో ఏమైనా లోటు చేస్తానేమో అని ప్రతీ రోజూ శ్రీ చాగంటి వారి ప్రవచనాలు వినిపించడం ఓటీ, "పతియే ప్రత్య్క్షక్ష దైవం.." అన్న సూక్తి మర్చిపోతానేమో అని! వీటికి సాయం మా అగస్థ్య, నవ్య, తాన్యా, ఆదిత్యల తో కాలక్షేపం, ఇన్ని పనులతో ఇంక ప్రతీ రోజూ టపాలు పెట్టడం కొద్దిగా కష్టమే కదూ.
ఏదో నాకుతోచిందేదో వ్రాసేసి సేవ్ చేసి, అవేవో రంగులూ అవీ పెట్టి ఓసారి చూసేసి పోస్ట్ చేసేయండీ అని నాదారిన నేను ఏ ఈవెనింగ్ వాక్కుకో వెళ్ళడం. మరి ఎంత కూర చేసినా, దాంట్లోకి "పోపు" పెట్టకపోతే, రుచుండొద్దూ? అదండి నా బ్లాగు ప్రస్థానం.. ఏదో వ్రాసేసి, అసలు మన టపాలు ఎవరైనా చదువుతారా ఏమిటీ అనుకోడం, పోనీ చదివినా వ్యాఖ్యలు పెడతారా, ఎవరైనా వ్యాఖ్యలు పెట్టిన రోజు పొంగిపోవడం, లేని రోజు " అయ్యో.." అనుకోడం.. కలిమిలేములూ, కష్టసుఖాలూ అనుకుంటూ హమ్మ్ చేసికోడం అలా వెళ్ళిపోతోంది. ప్రతీరోజూ వ్రాసేవారి సంగతి వేరూ, ఏదో వారానికీ, పక్షానికీ వ్రాసే నాలాటి వారి టపాలు ఒక్కొక్కప్పుడు కూడలి లోనూ, హారం లోనూ కొన్ని గంటలపాటుండి మాయమైపోతూంటాయి. అదిగో అలాటప్పుడే, మా శ్రీవారు తన టపాల్లో లింకులు పెట్టి, తన " అభిమానుల" చేత బలవంతంగా చదివిస్తూంటారు. అయినా ఇంకోళ్ళ మెహర్బానీతో బతకడం దేనికంట?
అసలు ఎవరైనా తమ పని స్వయంగా చేసికోవాలికానీ, ఇంకోళ్ళమీద ఆధార పడకూడదంటాను.ఫొటోలు పెట్టడాలూ, ఇంకా ఏవేవో చేయడాలకీ మా శ్రీవారికి నా బ్లాగే ఓ testing ground లా వాడేసికుంటూంటారు ! తన బ్లాగులో అలాటివి చెసికుంటే ఆయన " ఇమేజ్" తగ్గిపోదూ మరి ! ఒక విషయం నిజమే, నాకు వ్యాఖ్యలు పెట్టినవారికి జవాబివ్వడం వచ్చుకానీ, ఇంకో గొడవేమీ తెలియదు. తను ( మా శ్రీవారు) ఏవేవో చేస్తూంటారు కదా, ఆమాత్రం సరీగ్గా చూడొద్దూ, నా బ్లాగుల్లో ఏమైనా వ్యాఖ్యలు spam లోకి వెళ్ళిపోయాయేమో అనీ, ఈ spam అన్నది ఒకటుంటుందని ఈమధ్యనే తెలిసిందిలెండి. ఈవేళ్టికి , నా బ్లాగుకి కూడా మూడేళ్ళు నిండుతాయీ, అనుకుని ఈ సంవత్సరపు చిఠ్ఠా వర్జా చూసుకునేసరికి, తేలిందేమిటీ అంటే, నా నిర్లక్ష్యం అనండి, చేతకానితనం అనండి, ఇంకొకరి మీద ( భర్త అయినా సరే!) ఆధార పడడం అనండి మొత్తానికి ఓ తొమ్మిది వ్యాఖ్యలు ఆ spam లో దాక్కున్నాయని తెలిసింది. అయ్యో.. అయ్యో... ఎంత పని జరిగిపోయిందీ.. వ్యాఖ్యలు పెట్టకపోతే పెట్టలేదో అని గోలా, తీరా పెట్టిన వారినేమో అసలు పట్టించేకోకపోవడం. అసలు నాకు పుట్టగతులుంటాయా?
నా టపాలు చదివి ప్రోత్సాహపరచడానికి వ్యాఖ్యలు పెడుతున్న అందరికీ ధన్యవాదాలు... ఇంకా కొత్తవారు కూడా నా టపాలు చదువుతారని ఆశిస్తూ... ఇదండి సంగతి....
ఇదండి సంగతి...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 22, ఏప్రిల్ 2012, ఆదివారం
4 కామెంట్లు:
Good luck and keep writing when ever possible :)
మూడు సంవత్సరాలు దిగ్విజయంగా బ్లాగు నడిపిన శుభసందర్భంగా నా అభినందనలు అందుకోండి. మరిన్ని మంచి టపాలతో మమ్మల్ని అలరిస్తారని కోరుకుంటున్నాను.
Blog lokam lo moodu vasanthaalu poorti chesukunnanduku Subhakanksalu.
-Suma
@ఋషీ,
మా శ్రీవారు ఆ కంప్యూటరు వదిలితే అసలూ, రాద్దామనే ఉంది....
@మురళీ మోహన్ గారూ,
ధన్యవాదాలు.అలరిద్దామనే ఉందండి. ఔనూ , మీ పజిళ్ళు కనిపించక ఏమిటో తోచడం లేదు. త్వరలో ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను..
@సుమా,
ధన్యవాదాలు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి