RSS

ఓ చిన్న సందేశం.. ఓ చిన్న పలకరింపు...

   " ఏమండీ... ఓ చిన్న మాట.. కింద మెట్లదగ్గర, ఒక సిమెంటు కలర్ హాఫ్ స్వెట్టరులో, తలకి మఫ్లర్ చుట్టుకుని, ఒకాయన కనిపిస్తే చెప్పండి, నేనూ, పాప బాగానే ఉన్నామూ.., పాప ఏడవడం లేదూ , ఫలానా కొండ మీద ఉన్నామూ..." అని ప్లీజ్ చెప్తారు కదూ... అంటూ, కొండ దిగేవారితో, ఓ "చిరుసందేశం". అలాగే, పైకి వస్తున్నవారు ఓ చిన్న మాట, " కింద ఓ స్వెట్టరు, వేసికుని, మఫ్లర్ చుట్టుకున్నాయన్ని చూశాము,ఆయన మెల్లిగా మెట్లు ఎక్కుతున్నాననీ, మమ్మల్ని జాగ్రత్తగా ఉండమనీ..చెప్పారు.." అంటూ ఓ మేఘసందేశమూ.. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? తిరుమల కొండ మెట్ల మార్గం ద్వారా, 1974 లో, మా అమ్మాయి అన్నప్రాశనకి ఆ శ్రీవెంకటేశ్వరుడి దర్శన నిమిత్తం వెళ్తూ...మరి ఆరోజుల్లో సెల్ ఫోన్లూ, ఎస్.ఎం.ఎస్ లూ లేవుగా, ఓ " చిన్న మాట.. ఓ చిరుపలకరింపే.. " దిక్కు.

    మనవరాలి అన్నప్రాశనకి, మామగారు ఓ ముహూర్తం ఫిక్స్ చేసి ఉత్తరం వ్రాసేశారు. ఆ రోజు ఉదయం 10.20 కి పాపకి "పుట్టువెంట్రుకలు" తీయించి, స్వామివారి ప్రసాదం ముట్టించడం కార్యక్రమం. మా వారికేమో, మెట్లమీదుగానే వెళ్ళాలీ అని. పోనీ ఈరోజుల్లోలాగ మన లగేజీ, టిటిడి వారే పైకి అందచేసే సదుపాయం ఉందా అంటే అదీ లేదూ. ఓ మనిషిని పెట్టుకుని, మన లగేజీ పైకి తీసికెళ్ళడం. పోనీ ఆ లగేజీ అయినా, తేలిగ్గా ఉంటుందా అంటే అదీ లేదూ, నా పెళ్ళై నాతో తెచ్చుకున్నof all things.. ట్రంకు పెట్టి !! దానికి మూడు తాళాలూ. పాపకి దారిలో అవసరం అయితే పట్టడానికి పాలూ నీళ్ళూ, వీటిని పెట్టుకోడానికి ఓ ప్లాస్టిక్ బుట్ట ! వెర్రితల్లి, అన్నప్రాశన అయేదాకా పాలూ,నీళ్ళూ తప్ప ఇంకోటి ఇచ్చేవాళ్ళం కాదు. అసలు ఇప్పుడు తలుచుకుంటే నవ్వాలో, ఏడవాలో కూడా తెలియదు! ఏమిటో పెద్దవారు చెప్పారూ, మనం విని తీరాలీ అనే కానీ, అయ్యో పాలూ నీళ్ళతో ఆ బుల్లికడుపు నిండుతుందా అనే ఆలోచనే ఉండేది కాదు!

    ప్రయాణం లోనే ఆయనకి కొద్దిగా నలతగా ఉండి, అలిపిరిలో మా ఫ్రెండు ఇంటికి చేరేటప్పటికే 104 డిగ్రీలు జ్వరం.పోనీ అలాగని ఏ బస్సులోనో వెళ్దామా అంటే వినరూ. ఆయనకి ఆ స్వామి అంటే అంత నమ్మకమూ భక్తీనూ. ఏం పరవాలేదు, ఆయనే చూసుకుంటారు అని ఓ విశ్వాసం. ఆయన నమ్మకాన్నీ కాదనలేముగా, అన్ని కొండలూ ఈడ్చుకుంటూ , అంత జ్వరంలోనూ ఎక్కలేదూ? నాదారిన నేనూ, ఓ చేత్తో ప్లాస్టిక్ బుట్టా, చంకలో పాపా, పక్కనే సామాన్లు మోస్తూ ఒక మనిషీ. ఇంతలో ఒకతను వచ్చి పరిచయం చేసికుని, కింది కొండమీద మెట్లమీద ఒకాయన స్వెట్టరూ, మఫ్లరుతో కనిపించారండి, తను జాగ్రత్తగానే ఎక్కుతున్నాననీ, మమ్మల్నీ మెల్లిగా ఎక్కమని చెప్పారనీ అన్నారు. తను ఏదో సినిమా కంపెనీలో పనిచేస్తున్నట్టు పరిచయం చేసికుంటూ, పాపని ఎత్తుకుంటానూ ఇలా ఇవ్వండీ అన్నారు. అమ్మో పాపనివ్వడమా ఏ పరిచయమూ లేనివారికీ! ఫరవాలేదులెండి అంటూనే మొత్తానికి కొండపైకి చేరాము. ఇంకా ఆయన అతా పతా లేదు !మాతో వచ్చినాయన, నాకు ఓ కాటేజీ ఇప్పించి,సామాను లోపల పెట్టించి, త్రాగడానికి ఓ కాఫీ కూడా తెప్పించి, వెళ్ళిపోయారు. తిరిగి ఓ రెండు గంటల తరువాత, మా వారిని కాటేజీకి తీసుకొచ్చి, నాకు అప్పగించి మరీ వెళ్ళారు! ఇలాటి వ్యక్తినా అనుమానించానూ అని ఎంతో బాధపడ్డాను. ఆయనకి ధన్యవాదాలైనా తెలుపుకుందామని చూస్తే, ఇంకెక్కడ ఆయన ? పుణ్య క్షేత్రాల్లో ఇలాటివి జరిగినప్పుడు, భగవంతుడి మీద భక్తీ, విశ్వాసమూ ఇంకా పెరిగిపోతుంది. ఇందులో నష్టమేమీ లేదుగా..

.

    పాప తలనీలాలు తీయించి, స్నానం, పానం చేసి, తెమిలి, క్యూ కాంప్లెక్స్ కి వెళ్తే, అక్కడ మమ్మల్ని మూడో కంపార్టుమెంటులో కూర్చోపెట్టారు. ముహూర్తం టైముకి, పాపకి స్వామివారి ప్రసాదం పెట్టగలనా, అన్నీ సవ్యంగా జరుపు తండ్రీ అంటూ ప్రార్ధించడం తప్ప ఇంకో ధ్యాసే లేదు. మా పక్కనే ఒక మార్వాడీ కుటుంబం కూర్చున్నారు, నాకు తెలిసిన తూఠీ పూఠీ హిందీలో వారిని పలకరించాను. మా శ్రీవారేమో, కొత్త పరిచయాలు చేసికోడంలో ఎప్పుడూ ముందేగా,ఆ కుటుంబ పెద్దతో కబుర్లు మొదలెట్టారు. ఏమయిందో ఏమో, ఆయన గేటు దాకా వెళ్ళి సెక్యూరిటీ వారితో, ఏదో మాట్టాడారు. వారు స్పెషల్ దర్శనానికి టిక్కెట్టు తీసికున్నారుట, ఇక్కడ క్యూలో నుంచునే అవసరం లేదని తెలిసికుని, బయటకు వెళ్ళే ప్రయత్నం లో, ఒకాయన వెనక్కి వచ్చి, " పిల్లలకి టిక్కెట్టుండదుట, కావలిస్తే మీరిద్దరూ మాతో రావచ్చూ, ఎలాగూ మతో ఇంకో ఇద్దరిని తీసికెళ్ళొచ్చూ..." అన్నారు. నిజంగా ఆ శ్రీవెంకటేశ్వరుడే, వీరి రూపం లో వచ్చి, మాకు అనుకున్న ముహూర్తానికి దర్శనం, ప్రసాదం ఇప్పించారనిపించింది !!

    చూశారా ఒక చిన్న పలకరింపు ఎంత ఉపయోగించిందో... కొండ ఎక్కుతూండగా ఓ చిన్న సందేశం, ఓ చిన్న మాటా... మరి ఈరోజుల్లోనో ఎవరినైనా పలకరించాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి....

6 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

నిజమే ఇప్పుడు ఏదిచేయాలన్నా ఆలోచించాలి!

శరత్ కాలమ్ చెప్పారు...

నిజమే.

టపా బావుంది.

Advaitha Aanandam చెప్పారు...

నిజమేనండీ.... ఒక్కోసారి ఒక చిన్న పలకరింపే మనసుకి ఆనందాన్నిస్తుంది...
ఇలా ఎన్నో సంధర్భాల్లో ఎన్నో రకాలుగా అక్కరకు వస్తుంది...

జ్యోతిర్మయి చెప్పారు...

ఒక్క పలకరింపు ఒంటరితనాన్ని దూరం చేసి ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్న మాట మనసులను కలిపే వారధి..
టపా బావుంది.

అజ్ఞాత చెప్పారు...

enta baagaa raasaaro..

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@పద్మార్పిత గారు,

నిజమే కదూ...

@శరత్ గారూ,

ధన్యవాదాలు..

@మాధవీ,

అనుభవం మీదే తెలుస్తాయి ఇటువంటివి...

@జ్యోతిర్మయి,

ధన్యవాదాలు...

@అజ్ఞాత,

థాంక్స్...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes