కృష్ణ! కృష్ణా! పేరులోనే ఎంత మధురం, కన్నయ్య! కమనీయమైన నామం, కన్నాయ్యా, కిట్టయ్యా! తలచుకుంటేనే భక్తి సరే, సరి. కన్నతల్లులకి కడుపులో పేగు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డ పసిరూపం కళ్ళముందు కనిపిస్తుంది. ప్రతి తల్లికి తన బిడ్డ ఓ చిన్ని కృష్ణయ్యె. తను ఓ యశొదే. ఈ భావం అందరికి వుంటుందనే నా భావం.
కృష్ణా లాలీ గోకులకృష్ణా లాలీ
తామరసనయనా సత్యా కృష్ణా లాలీ--
కృష్ణాలాలీ నందుని కృష్ణా లాలీ--
యశోదమ్మ నోములపంట కృష్ణ లాలీ--
పాడుతూ లాల పోసి అంగరక్ష పెట్టి అద్దాల తొట్టిలో పడుకోబెట్టి పవళింప చేసే ప్రతి తల్లి తనని ఓ యశొదగా, తన బిడ్డని చిన్ని కిట్టయ్య గా భావిస్తూవుంటుంది .కొంచెం పెద్దయిన బిడ్డని కాళ్ళ మిద కూర్చొబెట్టుకొని " తారంగం! తారంగం ! తాండవ కృష్ణ తారంగం" అంటూ చిన్ని కృష్ణుని పాటలు,పద్యాలతో అలరారిస్తుంది.ఆ బాలుడు కూడా ముద్దుగా, మురిపెంగా , అల్లరి ఆటలతో , ఆటల అల్లరితో కృష్ణ లీలలు వింటూ పెరుగుతాడు.అంతేకాదు వాడికి చిని కృష్ణుడి వేషం వేసి " తలలో పూవులు, మెడలో పూసలు" అంటూ పద్యాలతో చదువులో పెడుతుంది. అలా చదువులో ముందుకు సాగుతూ ముద్దుల బాల కృష్ణుడు కాలేజికి వచ్చేసరికి గోపికా కృష్ణుడుగా ఎదుగుతాడు.తల్లి ఆలనా పాలనలో దారి తప్పకుండా ఉద్యోగస్తుడవుతాడు.దేవుడు కృష్ణుడు ఎన్నివివాహాలు చేసుకున్నా వెర్రితల్లి యశొద దగ్గరలేకపోయింది, పాపం. కాని" యశోద" గా భావించే ఈ తల్లి మాత్రం తనకి వున్నంతలో అంగరంగ వైభవంగా కొడుక్కి పెళ్ళి చేస్తుంది.
" మీరజాల గలడా, నా ఆనతీ" అంటూ ఓ "సత్య" కొడుకు జీవితంలో ప్రవేసిస్తుంది. ఆ కొడుకు కూడా " మీరజాలడు". కాని కొద్ది రోజులకి ఆ " సత్య" కి తన వివాహ శుభలేఖ లోని " జానక్యాః కమలామలాంజలి పుటేయః..." శ్లోకం గుర్తుకు తెచ్చుకొని తను " సత్యధారణ" పక్కన పెట్టి సీతగా భావించుకొని, తన భర్త ని కృష్ణుని నుండి శ్రీరామునిగా మార్చుకుంటుంది. "ఒక్క భార్య, ఒక్క మాట" పంధాలో తన మాటే, అతని మాటగా, తన నోరే అతని నోరుగా, తన కళ్ళే అతని కళ్లుగా, తన చెవులే అతని చెవులుగా, అంతా ఒక్కటే! మనుషులు వేరు కాని మనసు ఒకటే!అంతలా మార్చేసుకుంటుంది. త్వమేహం!
అతను కృష్ణ మాయలొ నుండి బయటపడి రాముని ధారణ లో పడగానే,తల్లితండ్రులు మీద అనురాగం పెరుగుతుంది. వారి అలన పాలనలో శ్రద్ద పెరుగుతుంది.ఆ తల్లి, నా బిడ్డ కృష్ణుడే కాదూ, రాముడు కూడానూ, అనుకొని మురిసిపోతుంది. ఎక్కడో "ట్రాక్" తప్పుతోందే అని " సత్య సీత" ఆలోచనలో పడుతుంది. ఇంతలో పంట పండుతుంది." సత్య సీత" "యశోదగా" మారుతుంది.తన ఒడిలోని చిన్ని కృష్ణుడ్ని చూసుకొని మురిసిపోతూ "జో! జో! లాలీ" అని పాడుతూ, రాముని పాత్రలో ఒదిగిపోతున్న భర్తకి తండ్రి బాధ్యత గుర్తు చేస్తుంది. " అన్నింటి కంటె, అందరికంటె బిడ్డ భవిష్యత్తు ముఖ్యమని ముందు దారి చూపెడుతుంది.అంతే! మేమిద్దరం మాకొ బిడ్డ. ఇదే మా ఫ్యామిలీ. అనుకుంటారు. కొద్ది కాలానికి ముద్దు కృష్ణుడు బాల కృష్ణుడుగా, గోపికా కృష్ణుడుగా మారుతాడు.చదువు పూర్తయి ఉద్యోగస్తుడవుతాడు. " మరో సత్య" ఆగమనం. చరిత్ర పునారావృతం. అర్దంకాని అయోమయ స్థితిలో
" హరే రామా! హరే!కృష్ణ! కృష్ణ! కృష్ణ! హరే!హరే!.."అని తల పట్టుకుంటే, పెద్ద యశోద పరిస్థితి అర్దం చేసుకొని పార్టీ మార్చేసిన రాజకీయవాదిలా హరి హరులకు బేధం లేదంటూ " ఏమి సేతురా! లింగా! ఏమి సేతురా!అని పాడుకుంటుంది.ఆమె అడుగుజాడల్లో మరో యశొద, మరో సత్య, మరో యశొద...
అది అంతే!
అన్నట్టు కిందటి సారి టపా లో రాసిన పాట అంటే నాకు చాలా యిష్టం. మీరు కూడా వినండి! చాలా బాగుంటుంది.
మరో యశోద....
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 9, ఆగస్టు 2012, గురువారం
2 కామెంట్‌లు:
జీవన గమనంలో పాత్రల మధ్య జరిగే మార్పుని చాలా బాగా చెప్పారు. సత్య సీత ఎలా అవుతుందో, ఆ సీతే యశోదగా ఎలా మార్పు చెందుతుందో అందంగా వివరించారు. ఇది చదువుతుంటే నాకు కొంతమంది చెప్పుకునే ఒక మాట గుర్తు వచ్చింది.
ఒకావిడ అనుకుంటుందిట.."తాను సత్యభామలా వుండాలనీ, కాని తన భర్త మటుకు శ్రీరామునిలా వుండాలనీ.." ఎంత ఆశో కదా..
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు...
శ్రీలలిత గారూ
అర్ధమయ్యేలా రాసానో లేదో తెలీదు. కాని నా "భావాన్ని" చక్కగా పట్టుకోగలిగారు. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి