RSS

మీకు మీరే.. మాకు మేమే...

   ఈమధ్య మావారి సెల్ నిండా బోలెడు కొత్త నెంబర్లు చోటు చేసుకుంటున్నాయి. ఎవరో ఒకరు ఫోన్ చేయడం పూనా లో వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని కాస్త మంచి లొకాటిలో ఇల్లు చూడమని, అడగడం, “అబ్బో, అంతేనా! తప్పకుండా,..” అంటూ ఈయన తన స్నేహితులకి చెప్పడం, పెద్దాయన అడిగారనుకొని వాళ్ళు చూడ్డం, చిన్నవాళ్ళు అయితే సీరియస్ గా వాళ్ళ పనులు మానుకొని వేటలో పడతారు. సదరు పెద్దమనిషి మళ్ళీ ఫోను చేయరు. ఓ వేళ ఈయన ఫోను చేసి తెలుసుకుంటే, వాళ్ళ అబ్బాయి ఆఫీసులో ఎవరో చూసి పెట్టారని చెప్పి , చిన్నప్పటి సంగతులు , అవీ ఇవీ ఓ గంట మాట్లాడుతాడు.లేదూ, ఓ థేంక్సు చెప్పి , ముందుసారి, ప్లీజ్! అంటూ అడిగిన పెద్దమనిషి మరో మాట లేకుండా పెట్టేస్తాడు. అప్పుడు ఈయన ఎవరయితే శ్రమపడి చూసారో వారికి ఫోను చెసి తప్పు తనదే అన్నట్లుగా సారీ , చెప్పుకోవడం....

   ఇంకొంతమంది పెళ్ళి వ్యవహారాల్లో ఫలానా వాళ్ళుతెలుసా, అలా ఇలా విషయ సేకరణ చేస్తారు కాని అ తరువాత ఏమయిందీ అన్నది చెప్పరు.అందరూ కాదనుకోండి.మరి కొంతమంది ముఖ్యంగా అమ్మాయిల తల్లితండ్రులు ఇక్కడ కాలేజీ ల్లో సీట్ దొరికితే ఎక్కడెక్కడొ బంధువులు ఎలాగో ఫోను నెంబరు తెలుసుకొని కాంటాక్టు చేస్తారు. వచ్చి కలుస్తారు. ఆ అమ్మాయి మొదటి సారి అమ్మ నాన్నలతో వస్తుంది అంతే, ఆ తరువాత అతా పతా వుండదు. తల్లి తండ్రులు మాత్రం ఈ బాదారాయణ సంబంధాలకి ప్రాణం పోసేందుకి ప్రయత్నిస్తారు.అవసరంకదా! మరి.ఇంక అబ్బాయిలయితే ఫోను కూడా చేయరు. ఈయనే ఆ పేరెంట్సు కోసం వాళ్లిచ్చిన నెంబరుకి ఫోను చేస్తే , “కాల్ యు బేక్,” అంటారు. అంతే !. ఇదీ ఇప్పటి చుట్టరికాలు, సంబంధాలునూ, ఓ వేళ అలా కాకుండా వుంటే మనం కూడా ఓ రోజు , రెండు రోజు లంటె పరవాలేదు కానీ అంతకంటె భరించే శక్తి మనకి లేదు.పూర్వం తెలియని వారికి కూడా ఆతిధ్యం యిచ్చేవారట. కొంతమంది అతిధి లేకుండా విస్తరి వేసేవారు కాదట.ఎవరయినా వస్తారా అని చూసి , చూసి భోజనానికి కాళ్లు కడుక్కునేవారట.

    ఓ సారి ఒకాయన బండి మీద పొరుగూరు వెడుతున్నారట. ఇంతలో భోజన సమయం అయిందట. ఓ ఇంటి ముందు బండి అపి నూతి దగ్గరకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపల యజమాని పక్కన కూర్చున్నాడు,. ఆ ఇంటి ఇల్లాలు ఆయనకి ఆకు వేసి భోజనం వడ్దించిదట.భార్య చుట్టమనుకొన్నాడట యజమాని. భర్త చుట్టమనుకుందట భార్య. వాళ్ళ పెరట్లో రేగు చెట్టు వుందట. భోజనమయిన తరువాత యజమాని ఆ వచ్చినాయన్ని " మన చుట్టరికమేమిటనీ " ఆడిగాడట. అందుకు అతను , మా బండి చక్రం రేగి కర్రతో చేసినది. మీ పెరట్లో రేగి చెట్టున్నాయి కదా, మీకు మాకు బాదారాయణ సంబంధం వున్నాట్లే కదా! ( బదరీ వృక్షమంటె రేగి చెట్టు) నిజానికి మీకు మీరే, మాకు మేమేను! అన్నాడట. అందుకు ఆ యజమాని ఆయన చమత్కారానికి ఆనందించాడట.. ఇప్పుడు అంతపెద్దమనసు, ఆ ఆతిధ్యం అవీ , బహు కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తున్నాయి.దూరపు వాళ్ళు ఎవరయినా వస్తూన్నారన్నా, ఫోను చేసినా వెంటనే మనసులో మెలిగేది ఏం, ఇన్నాళ్ళకి గుర్తు వచ్చామా? అనే ప్రశ్నేను,చాలా మందిలో, అందరూ కాదండోయ్! మా అత్తగారింట్లో ఏ సమయంలో ఎవరొస్తారో అన్నట్లుగానె వుండేది.ఇంటి సభ్యులు మాత్రమే భోజనం చేసిన సందర్బం నేను ఎప్పుడు చూడలేదు.కొందరయితే చుట్టాలికిచ్చిన ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేం. ఓపిక లేకపోతే అప్పు చేసి మరీ ఆదరించిన వారున్నారు. ఇప్పుడు ఎవరయినా వస్స్తూన్నారంటే భయం ! ఎక్కడికయినా వెళ్ళాలంటే భయం,ఎందుకంటె మీ ఇంటికొస్తున్నాం , మాకేమిస్తారు? మా ఇంటికి వస్తూన్నారా? మాకేం తెస్తున్నారు? ఇదీ సంగతి! ,

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes