RSS

ఇన్నేళ్ళకి మొత్తానికి మా శ్రీవారికీ తట్టిందండోయ్....

    మొత్తానికి నలభైఏళ్ళు పట్టింది--కట్టుకున్నదానికి పుట్టినరోజుకి , స్వంతంగా నేను మాత్రమే ఉపయోగించుకోగలది తేవాలని !!!ఎప్పుడు చూసినా, తనకి తోచిందీ, ఇంట్లో అందరికీ ఉపయోగంగా ఉండేదీ ఒకటి తేవడం, దానికేమో నా బర్త్ డే గిఫ్ట్ అని పేరు పెట్టడం. పైగా ఇంటికొచ్చినవాళ్ళందరికీ చెప్పడం ఒకటీ, మా ఇంటావిడ జన్మదిన సందర్భంగా ఫలానా వస్తువు కొన్నానూ అని, అదేదో పేద్ద ఘనకార్యంలా. ఆ వచ్చినవాళ్ళు కూడా, "పాపం ఆయన ఈవిడతో ఎలా వేగుతున్నాడో పాపం.. మరీ బర్త్ డేలకి కూడా ఇలాటి పెద్ద పెద్ద వస్తువులు కొనిపించుకోవాలా మరీనూ.." అంటూ చెవులు కొరుక్కోడమోటి. ఎన్ని తిప్పలు పెట్టారో లెఖ్ఖే లేదు. మామూలుగా పుట్టిన రోజు వస్తోందంటే, అందరికీ ఓ ఆత్రుత ఉంటుంది. నాకలాంటి అదృష్టం ఎప్పుడూ కలగలేదు.

    కాపరంలోకి మొట్టమొదటి వస్తువు కత్తిపీట తేగలిగిన మనిషికి, అంతకంటే మంచి ఆలోచనలొస్తాయని అనుకోడం అసలు నాదే బుధ్ధితక్కువతనం.ఎవరైనా పుట్టినరోజుకి స్టీలు అమ్మాందస్తా తెస్తారా ఎక్కడైనా. పైగా వంకాయలో కారం పెట్టి చేయడానికి, ఆ పచ్చిమిరపకాయలూ, కొత్తిమీరా నూరుకోడానికి ఈజీగా ఉంటుందోయ్ అంటూ సమర్ధింపోటీ !!అక్కడ పుట్టింటినుంచి ఉత్తరాలూ-- అక్కా ఈసారి పుట్టినరోజుకి బావగారు ఏం గిఫ్టిచ్చారూ అంటూ.. సిగ్గేసిపోయేది చెప్పుకోడానికి. అసలు ఈ పెద్దమనిషి జీవితంలో ఎప్పటికైనా బాగుపడతారా అనిపించేది.ఒకసారి కలర్ టీవీ, ఓసారి వాక్యూం క్లీనరూ, ఇంకోసారి ఫ్రిజ్జూ ఏదో చెప్పుకోడానికైనా దర్జాగా ఉండేది, మరీ అమాందస్తాలూ, కల్వాలూ ఏమిటండి బాబూ? ఈయన వ్యవహారం చూస్తూంటే, ఎప్పుడో నన్ను , అరుగుమీద కూర్చోపెట్టి, ఆయుర్వేదం మందులు నూరించినా నోరించొచ్చనిపించేది.

    ఇదివరకటి రోజుల్లో కనీసం, ఆర్చీస్ కి వెళ్ళి ఓ చక్కటి గ్రీటింగు కార్డైనా తెచ్చేవారు. ఈ కంప్యూటరూ అవీ వచ్చిన తరువాత, ఆ ముచ్చటా తీరిపోయింది.ఇంట్లో అందరిదగ్గరా టచ్ స్క్రీన్ సెల్లులూ, ఐఫోన్లూ, ఐపాడ్లూనూ, ఇంటినిండా ల్యాప్ టాప్పులూ అవీనూ.. పోనీ అలాటివేవీ లేకపోయినా, కనీసం లక్షణంగా ఉన్న ఓ సెల్ ఫోనైనా కొనాలనిపించలేదు మా శ్రీవారికి ఇన్నాళ్ళూ.. ఇంట్లో హీనాతిహీనమైన ఫోనునున్నది నాకొక్కర్తికే. పేరుకి ఫోనే కానీ, దానికో రూపం, ఆకారం ఉండేది కాదు. చిరిగిపోయిన బట్టలకి ఉత్తరేణి కుట్లు వేసినట్టుగా, ఈ ఫోనుకి అతుకులూ, బొతుకులూనూ.. మా అగస్త్య చేతిలో పాపం ఆ ఫోను నానా " అత్యాచారాలకీ" బలైపోయింది ! దానికి తోచినప్పుడు వినిపిస్తుంది. వినబడకపోతే, వాడినే అడగడం, దాన్నో దెబ్బేసో,నేలమీద ఒకసారి విసిరేసో , దానికి ప్రాణం పోసేవాడు.బంగారుతండ్రి... చివరకి వాడికీ విసుగొచ్చేసినట్టుంది, ఎదురుగుండా పెట్టినా ముట్టుకొనేవాడు కాదు కూడానూ.పోనీ మా శ్రీవారికి తెలియకా అంటే అదీకాదూ.. పోనిద్దూ ఈవిడచేసే ఘనకార్యాలకి ఈమాత్రం చాలదా అని ...ఎప్పుడో పోరగా ..పోరగా.. పై ఊళ్ళకి వెళ్ళేముందరోసారి మొక్కుబడి కోసం ఓ మాటనడం.. పోనీ ఈసారి ఓ కొత్త ఫోనోటి కోనేద్దామేమిటీ అని. ఆ ప్రయాణాల్లో ఏదో ఈ పాత మోడల్ తోనే కానిచ్చేద్దామూ, మళ్ళీ ఈ ఖర్చులోటెందుకూ అని నేనడం, అమ్మయ్యా ఈసారికి బ్రతికిపోయానురా బాబూ అని ఈయన మరీ పైకి కాకపోయినా లోపల్లోపలే సంతోషపడిపోతూండడమూనూ...ఎక్కడికైనా ప్రయాణం అనేసరికి మొట్టమొదట నా ఫోను సంగతే ఎత్తడం. పిల్లలు, "డాడీ, మమ్మీకి కొత్త ఫోను కొంటానన్నారూ ఏమయిందీ .." అని అడగడం తరవాయి. " నేను ఎప్పటికప్పుడు కొందామనుకున్నా, తనే వద్దంటోందీ.." అని చెప్పడమూ, మా పిల్లలేమో " అమ్మా..అమ్మా..త్యాగమయీ...." అంటూ యుగళస్వరాలో పాటలెత్తుకోడమూనూ..

    పోనీ సావకాశంగా ఉన్నప్పుడయినా, ఓ కొత్త ఫోను కొనేసి సంతోషపెడదామూ అన్న ఆలోచన ఒకటంటే ఒక్కసారైనా అసలు ఈయనలో వస్తుందా అని ప్రతీ పుట్టినరోజుకీ అనుకోడమూ, ఇంక ఈ జీవితానికి ఇంతే ప్రాప్తం అని వదిలేశాను. అలాటిది, ఆయన బుర్రలో, ఏ "అమ్మవారు" ప్రేరేపించిందో ఏమిటో కానీ, మొత్తానికి మొన్న 15 వతారీఖుకి ఓ రెండు రోజులు ముందుగానే వెళ్ళి ఓ నోకియా ఫోనోటి తెచ్చారు.పోనీ అదేదో మామూలుగా ఉండే కీబోర్డు దయితే గొడవే లేదు. మళ్ళీ అదేదో టచ్ స్క్రీన్ ట.అందులో ఏవేవో ఉన్నాయని కొట్టువాడు చెప్పేడుట, ఈయనేమో తెచ్చేసి చేతిలో పెట్టేశారు. మా అమ్మాయి,అల్లుడూ ఇచ్చిన టాబ్ ధర్మమా అని, కొద్దిగా అలవాటయింది. కానీ నెట్ చూసుకోవాలంటే, వై ఫై ఉంటేనే కానీ చూడొద్దూ, ఊరికే బిల్లు తడిపిమోపెడవుతుందీ అని చెప్పడం వలన, పోనీ ఇన్నాళ్ళకి నా పేరుమీదా, ఓ ఫోనొచ్చిందీ, దానికి ఆ వై ఫై ఉందో లేదో చూసేసరికి, తీరా ఈ మోడల్ లో లేదని తెలిసింది. తిరిగిచ్చేద్దామా పోనీ అన్నారు. కొనక కొనక ఓ ఫోను తెస్తే, ఇలా అయింది.ఏదో ఈయన అడగడమూ, ఆ కొట్టువాడు ఒప్పుకోడమూ మొత్తానికి, తెచ్చినదానిని మార్చి, కొత్తది తెచ్చారు.

    హాయిగా ఉంది నా ప్రాణానికి- పైగా దాంట్లో చక్కగా తెలుగులోనే మెసేజి లూ, మెయిల్సూ పంపుకోడానికి సదుపాయం కూడా ఉండడంతో ఇంక ఆయన డెస్క్ టాప్ నాకు ఉపయోగించుకోనీయకపోయినా గొడవ లేదు. నా దారిన నేను మన తెలుగు టపాలు చదువుతున్నాను...दॅर हैं मगर अंधॅर नही......

14 కామెంట్‌లు:

Mauli చెప్పారు...

నెల నేలా చక్కగా చిట్ వేసికొంటారు కదా, ఒక ఫోన్ కోనేసికోవాల్సింది అండీ. బొత్తిగా అమాయకపు ఇల్లాలు లా ఉన్నారు :)

Mauli చెప్పారు...

ఇదిగో మీ బోటి వాళ్ళకోసమే, భర్త ఆదాయంలో భార్యకు వాటా ఇవ్వడం సముచితమని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. మద్దతు ఇచ్చేద్దామా :)

అజ్ఞాత చెప్పారు...

>>ఇంట్లో హీనాతిహీనమైన ఫోనునున్నది నాకొక్కర్తికే..
ఇది ఫణి బాబు గారికి:
ముదితల్ నేర్వరాని విద్య గలదే...

చూసారా ఆఖరికి మిమ్మల్ని ఏవన్నారో? మీరు తెచ్చే గిఫ్ట్ లు గురించి చెప్పాలంటే 'సిగ్గేసి పోయేదీ ట. మీరు ఈవిడ్ని అరుగు మీద కూర్చోబెట్టి కల్వం నూర్పించినా నూర్పించగలరుట. హన్నా.. ఎంతేసి మాటలంటున్నారూ? మళ్ళీ 'పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం' అని కబుర్లు ఒకటీ.

లక్షిగారు చితక్కొట్టేసరండీ. ఫణి బాబు గార్కి పళ్ళు లేవుగానీ ఉంటేనా, మీరు పెట్టిన వడల్లో పంటి కింద వచ్చిన రాయితో మిమ్మల్నే కొట్టేగల్రు. :-)

పరిమళం చెప్పారు...

మొత్తానికీ కధ సుఖాంతమైంది మీకుఅభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

బాగుందమ్మా, మీకేన ఇలా, లేక పిల్లల విషయం లో కూడా ఇంతేనా..మా నాన్న అయితే అడిగింది అరవై రోజుల తరువాత అదీ గుర్తుంటే, అప్పతకి పైకం ఉంటె అప్పుడు ఆలోచించేవాళ్ళు. ఇంకా మా అమ్మకేల కొనుంటారో ఆలోచించండి.
:venkat

అజ్ఞాత చెప్పారు...

బాగుందమ్మాయ్! మొత్తానికి బావగరు కొత్త ఫోన్ కొన్నారు. ఆలస్యంగా పుట్టినరోజు శుభకామనలు.

Priya చెప్పారు...

మీ కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది ఆంటీ :)
ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు :) :)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మౌళీ,

అంత సంబడంకూడానా తల్లీ..వచ్చిన రెండు చిట్టీ డబ్బులూ ఆయనకే ఇచ్చాను. ఏం చేశారో ఆ భగవంతుడికే తెలియాలి! ఆ " మద్దతు" మరీ బావుండదేమో పోన్లెద్దూ...

అజ్ఞాతా,

మరీ ఇలా non-aligned గా ఉంటే ఎలాగా? ఎవరో ఒకరి పార్టీ లో ఉండాలి కానీ...

పరిమళం గారూ,

ధన్యవాదాలు. ప్రస్తుతానికి సుఖాంతం అయినట్టే...

వెంకట్,
పిల్లల విషయంలో అలా ఎందుకుంటారూ... వాళ్ళు అడగనైనా అడగఖ్ఖర్లేదు...

అన్నయ్యగారూ,

మేము అనపర్తి వచ్చినప్పుడు, అదృష్టం కొద్దీ , నా పాత ఫోను చూపించలేదు. లేకపోతే అప్పుడే అ(క)డిగేసేవారు...

ప్రియా,

థాంక్సమ్మా...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మౌళీ,

అంత సంబడంకూడానా తల్లీ..వచ్చిన రెండు చిట్టీ డబ్బులూ ఆయనకే ఇచ్చాను. ఏం చేశారో ఆ భగవంతుడికే తెలియాలి! ఆ " మద్దతు" మరీ బావుండదేమో పోన్లెద్దూ...

అజ్ఞాతా,

మరీ ఇలా non-aligned గా ఉంటే ఎలాగా? ఎవరో ఒకరి పార్టీ లో ఉండాలి కానీ...

పరిమళం గారూ,

ధన్యవాదాలు. ప్రస్తుతానికి సుఖాంతం అయినట్టే...

వెంకట్,
పిల్లల విషయంలో అలా ఎందుకుంటారూ... వాళ్ళు అడగనైనా అడగఖ్ఖర్లేదు...

అన్నయ్యగారూ,

మేము అనపర్తి వచ్చినప్పుడు, అదృష్టం కొద్దీ , నా పాత ఫోను చూపించలేదు. లేకపోతే అప్పుడే అ(క)డిగేసేవారు...

ప్రియా,

థాంక్సమ్మా...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నీకు పనిలో సహాయం గా ఉంటుందని ఈమెను తీసుకోచ్చేసాను పుట్టిన రోజు కానుకగా అంటారేమో ఎప్పుడో ....దహా.

Mauli చెప్పారు...

@ఆ " మద్దతు" మరీ బావుండదేమో పోన్లెద్దూ...

ఒకవేళ మద్దతు ఇచ్చినా ఆ అకవుంట్, చెక్ లు మీ వారి చేతుల్లోనే ఉంటాయి అని కదా మద్దతు కు వెనుకాడుతున్నారు :)

ఇప్పుడు అన్నీ మీ ఫోన్ నుండి నడిపించేయ్యోచ్చు :P


(సరదాగా )

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ,

మరీ అంత తెగించేయరులెండి.. ఆ మాత్రం నమ్మకం ఉంది..

మౌళీ,

చెక్కులని కాదూ, ఆ ఏటీఎం కార్డుల మొహం ఇప్పటిదాకా చూడలేదు, ఎప్పుడడిగినా, నీక్కావలిసినవేవో తెస్తున్నానుగా అనే...

అజ్ఞాత చెప్పారు...

అబ్బా,

ఈ భమిడి పాటి వారు బ్లాగ్ రాజ్యమేలే స్తున్నా రండో య్ !

అక్కడేమో అయ్యవారు శ్రీమతి ఖబుర్లు, ఇక్కడేమో, అమ్మ వారు అయ్య గారి కబుర్లు !

ఇంతకీ ఐ పద్మిని(iPadmini) వచ్చిందాండీ ఇంటికి ?

చీర్స్
జిలేబి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

జిలేబీ,

ఏం చేయమంటారూ ? ఖాళీగా ఉంటే ఏమీ తోచడంలేదు! పద్మినీయో, శంఖిణీయో ఏదో ఒకటి, కొత్తదిమాత్రం ఒకటి తెచ్చారు. కాలక్షేపం బాగానే ఉంది !!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes