RSS

ఓ చిన్న మాట...

   ఏమండోయ్! మాట! అన్నారనుకోండి వెనుక నుండి , వెంటనే వెనక్కి తిరిగి చూస్తాం కదా!అది కొత్త ప్రదేశం అయినా కొత్త మనుష్యులయినా సరే, ఏమిటో ? ఎందుకో? ఎవరో?ఇన్ని సందేహాలు కలిపిన ఆ" మాటలో" ని మహిమ. ఎలాగు ఆగారు,-- నేనూ టపా రాసి చాలా రొజులయింది" మాట" ముచ్చట్లు చెప్పుకుందామా మరి!

   ఇదుగో, నాన్నారూ-- అమ్మలూ, అలా ఏడువ కూడదమ్మా, నీకో " మాట" చెప్పనా, పండూ! అంటూ బుజ్జగించే అమ్మ " మాట" లోని మధురిమ ఆప్యాయతలకు అంతే లేదు. అంతే కాదు, అమ్మ " మాట" మంత్రం.

    పెద్దల "మాట" చద్దిమూట అన్నారు. మాట" ని ఆచితూచి మాట్లాడలన్నారు.

   పెదవి దాటిన " మాట" పృధివి దాటుతుందట. మనసు లోని " మాట ను స్పష్టంగాను, చెప్పాలట. మనసిచ్చే ముందు మనిషి " మాట" ను వినాలి. విజ్ఞన తో విచారించాలి.(తెలుసుకోవాలి) ఇదివరకో సినీకవి " తియతీయని " మాట" లతో తీస్తారుసుమా గోతులు, నమ్మవద్దూ! అని అన్నారు.అ మాత్రం జాగ్రత్త లేకపోతే , కొందరి మాట" లు నమ్మి నీ "మాట" నమ్ముకొని కుక్కతోక పట్టుకొని గొదారీదినట్లయిందని తల పట్టుకుంటారు. కొంతమంది " మాట" లు కోటలు దాటుతాయి కాని, కాలు గడప దాటదు.

   కొంతమంది మొండిఘటాలు ఎలాచెప్పినా, ఏం చెప్పినా వినరు, అర్ధం చేసుకోరు, ఏమీ"మాట" లే ఆడరూ. కిమ్మంనాస్తి. బెల్లం కొట్టిన రాయి లా వుంటారు. ఆ " మాట" కొస్తే కొంతమంది ఏం చెప్పాలన్నా సరే,పుష్కరాల "మాట" అంటూ మొదలు పెడతారు.అయినా " మాట" కి సొంపు పాటకి ఇంపు వుండాలంటారు. " మాట" లతో మూటలు సంపాదించొచ్చు. మనిషిని బురిడీలు కొట్టించొచ్చు. ఏమంటారు? అయినా " మాట" వెండి మౌనం బంగారం కదా! అయ్యో! " మాట" ల్లొ పడి మగనిని మరచినట్లు, ఏదొ చెబుదామనుకొని మరిచే పోయాను. ఈ సారి " మాట ని కొంగున కట్టుకొని మరీ చెబుతాను సరేనా!

   పెళ్ళి కుదిరిందా? పెళ్లి "మాట" లేమిటి?ఆ "మాట" లోనె వుంది మతలబు అంతానూ!

   అదే, మనలో " మాట" , ఆ " మాట" మీదే " మాటా మాటా" వచ్చిందంట!

   సరేలే, నలుగురిలోను అనుకునే " మాట' కాదు,

   అవునులే పైకి చెప్పుకోరుగా , అయినా ఆ " మాట" కొస్తే అ సంబంధం వదులు కోవడం మంచిది. ఈ రోజూల్లో ఈ" మాట" ఏమిటీ? ఇద్దరూ సమంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటూంటేనూ! ఇలా ఈ " మాట" ఎన్ని అర్ధాలతో, రంగులు మారుతూ రూపు దిద్దుకుంటుందో చెప్పలేము--

   నాతో " మాట" అంటే " మాటే" నూ,పౌరుషవంతుడు సవాలు విసిరినా, ఎంత"మాట" అన్నాడో చూడండి, చిన్నంతరం పెద్దంతరం లే కుండా అంటూ ఓ పెద్దమనిషి బాధ పడినా, వీరికి మంచి " మాట' లతో ఊరట కలిగించాలి. ఏ పక్షవాతంతొ "మాట" పడిపోయిన వారికి ఓ మంచి"మాట" అభిమానంతో కూడిన ఆత్మీయస్పర్శ చాలా అవసరం. ఈ రోజుల్లో అత్తాకోడళ్ళు కూడా బయట వారిముందు సరసమైన " మాట"లు.

   ఇంట్లో "మాట" మంతి లేకుండా కనిపించని గోడలు కట్టుకొని , ప్లాస్టిక్కునవ్వులుతో, పై పై "మాట" లతో గడిపేస్తున్నారు. ఇదివరకులా " మాటామాటా" అనుకోవడం, పెద్దలు ఓ " మాట" అన్నా పరవాలేదులే!అని చిన్నవాళ్ళు అనుకోవడం, తెలియక అన్నారులే పాపం చిన్నవాళ్ళు. అని పెద్దలు ఆలోచించడం అనే "మాటే" లేదు. కుటుంబం అందరు కలిసి కార్లో వెళ్ళినా వెనుక కూర్చున్న వారిని పట్టించుకోకుండా వాళ్ల ఆఫీసు విషయాలు, మరేవో మాట్లాడుకుంటూ , బయట వారి "మాట" వేదవాక్కు లా భావించి ఇంట్లో పెద్దవారి " మాట" కి విలువ యివ్వకపోడం అనేది ఎంతవరకు మంచిదంటారు? ఈ నా "మాట" కొంచెం ఆలోచించండి.

   " మాట"అమృతంలా పని చేస్తుంది. "మాట" కి వాడి వుంది. వేడి వుంది.దాన్ని మనం వుపయోగించడం మన లోనే వుంది.

   పెద్దల " మాట" లు అనుభవాలూ, ముత్యాలమూటలు. మనిషికి అలంకారం " మాట". మంచి "మాట' కరువైతే మంచిబాట కనుమరుగవుతుంది.

   ఆవేదనలో , ఆవేశంలో, ఆక్రోశం లో మాట్లా డే వ్యక్తి " మాట" లు పట్టించుకోకండి.

   తరాల అంతరాల "మాట"ల్ని , దేశకాలమాన పరిస్థితుల్ని ఆకళింపుచేసుకొని అనుభవజ్ఞుల "మాట" లని అర్ధ చేసుకునే ప్రయత్నం చేయాలి.

   కంప్యూటర్ల సందేశాలు, ఫోన్లు,వారెవరో అన్నట్లుగా ముఖపుస్తక పొడిపొడి " మాట" లయినా క్లుప్తంగా , కమనీయంగా, మంచిముత్యాల్లా వుండాలి.

   మంచిగా మాట్లాడే మనిషి మరణించినా అతని " మాట" మాత్రం శాశ్వతంగా నిలచి పోతుంది.

   ఉన్న " మాట" అంటే ఉలుకెక్కువంటారు. అంతే కాదు, ఉన్న"మాట" అంటే ఊరికి దూరమవుతారట.అయినా "మాట"కి "మాట" పెరుగు. నీటికి నాచు పెరుగు.

   మంచి మనిషి కో "మాట". మంచి పశువుకో దెబ్బ.

   అబ్బ! ఇన్ని "మాట" లెందుకు? ఏమండొయ్! శ్రీవారూ! ఓ, చిన్న"మాట" అంటూ అన్నీ సాధించుకుని, స్వంతం చేసుకునే " మాట" వేరే చెప్పాలంటారా!

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు వ్రాసిన" ఓ చిన్న మాట ". చక్కని కథనం! అభినందనలు

అజ్ఞాత చెప్పారు...

మీరు వ్రాసిన" ఓ చిన్న మాట ". చక్కని కథనం! అభినందనలు

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శాస్త్రిగారూ,

ధన్యవాదాలు..

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes