RSS

" పొరుగింటి మీనాక్షమ్మను........."


      ' ఇంటి గుట్టు లంకకు చేటు " అని పెద్దలంటే, ఇప్పటివారు, ' ఇంటి ' గుట్టు ఫేస్ బుక్కు లో పెట్టి రట్టు చేయకే ' అంటున్నారు.   ' ఆ ' ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలకూడదు' అని ఇదివరకువారంటే, ఇప్పుడు, ' ఆ ఇంటి పావురం ఈ ఇంటిమీద వాల కూడదు ' అంటున్నారు ( కాకులెక్కడున్నాయి, అన్నీ పావురాలె గా)   ' ' పొరుగు ఇంటి మీనాక్షమ్మను చూశారా ' , ' పొరుగు ఇంటి పుల్లకూర రుచి ' కి బదులుగా, ' పొరుగు ఇంటి మీనా ని చూశారా, తను పెట్టిన పోస్టుకి, ఇన్ని లైక్కులూ, ఇన్ని కామెంట్లూ వచ్చాయిట, అంతేకాదు, ఇంతమంది షేర్ చేసుకున్నారట' -- ఇదీ పరిస్థితి. ( భాష మారినా భావం మారిందంటారా?)   ' అందరిమీదా కేకలు వేసే పులిలాటి ఆఫీసరు, ' ఇంటిలో పిల్లి'. మరో ఇంటిలో పెత్తనం అంతా ఆవిడదే. ఆవిడే ఆ 'ఇంటి ' యజమానురాలు. ' ఇంటి ' ఆయన వంట ' ఇంటి ' కుందేలు అని అప్పటి మాటైతే, ఇప్పుడు ' ఇంటి ' కి ఇద్దరు, సమాన బాధ్యతలతో సమాన హక్కులతో, జంట గా జత గా ఉంటున్నారు.   ' కొంతమంది ' ఇంటి ' కంటే గుడి పదిలమన్నట్టుగా, శలవు రోజున 'ఇంటి' కంటే మాల్స్ లో గడిపే ప్రబుధ్ధులు ఉన్నారు.   ' ' ఇల్లు' కట్టి చూడు, పిల్ల పెళ్ళి చేసి చూడు  అని వారంటే, క్యాంపస్ ఉద్యోగం రావడమేమిటీ, లోను తీసికుని ' ఇల్లు' కట్టేస్తున్నారు  ( అదే లెండి ఫ్లాట్ ). దానికి ఎడ్వాన్సు కట్టే డబ్బు, రిటైరయిన తండ్రికొచ్చే సొమ్ము బాపతు, లోన్ తీసికున్నందుకుకాను, ఓనర్ షిప్ మాత్రం కొడుకు పేరు.   ' ' ఇల్లు' కట్టగానే సరిపోతుందా, ముందున్నది ముసళ్ళపండగ అన్నట్టు, వాయిదాలు ( EMI) కట్టడం. ' ఇంటి' వాడయ్యాడు కదా , స్వీట్ హోం.. 'ఇంటి ' కి ఇల్లాలు కావాలి కదా, వివాహం హ్యాపీ మ్యారేజ్. రిటైరయిన తల్లితండ్రులతో కలిసి ఉండేసరికి ' ఇల్లు ' చిన్నదవడంతో, ' ఇల్లు' ఇరకాటం ఆలి మర్కటం. పడక ' ఇంటి' ముచ్చట్ల బదులు ' ఇంటింటి' రామాయణం (  घर घर की कहानी..)    ' తిన్న ' ఇంటి' కే వాసాలు లెక్క పెట్టేవారనేవారు. ఇప్పుడు వాసాలెక్కడ, స్లాబ్ కదా. సిటీ లో అద్దెకిచ్చామా, స్లాబ్ చూస్తూ, ఖాళీ చేయకుండా  ' స్లాప్ ( slap)  ' ఇచ్చే మహానుభావులెందరో.    ' ' ఇంటి ' లో wi-fi  పెట్టి, password  జాగ్రత్తగా పెట్టుకోకపోతే, ' ఇంటి ' దొంగని ఈశ్వరుడైనా పట్టలేన్డన్నట్టుగా అయిపోతుంది. ' ఇంటి ' కి వచ్చినవారికి మంచినీళ్ళతో  wi-fi password  కూడా ఇచ్చేశామనుకోండి, అంతకు మించి అతిథి సత్కారం  మరోటి లేదు.  ( అతిథి దేవో భవ ).
   ' అమ్మాయిని పెద్ద ' ఇంటి ' లో ఇవ్వాలని, పేద ' ఇంటి ' అమ్మాయిని, తెచ్చుకోవాలని ఇదివరకు అనుకుంటే, అమ్మాయి కానీ, అబ్బాయికానీ  స్వంత ఫ్లాట్ ఉందా, ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకునే యువతీయువకులు చాలామందే ఉన్నారు.
   ' మీ ' ఇల్లు'  చిదంబరమా, లేక మధుర ( మీనాక్షి) మేనా,  అని గడుసుగా అడుగుతారు.    ' మా ' ఇంటి ' సభ్యులు నలుగురు, నలుగురూ బ్లాగర్లే, నాలుగు  FB Account లూ,  నాలుగు  Saving Account లూ. Like లతో.,  Comments లతో   Happy  గా ఉన్నామని ఓ ఇల్లాలు చెబితే, ' అమ్మ నీ 'ఇల్లు' బంగారం గానూ ' అనుకున్నాను..
    ' మా 'ఇంటి ' లో Quiz సమాధానాలు  Messenger లో పంపుతున్నాను కనక సరిపోయింది, లేకపోతే వంట ' ఇంటి' లో పోపులపెట్టి లాగ, దేవుడి గూటిలో వత్తుల పెట్టిలా అయిపోయుండేది నా Tab.   '  Homemaker  అనండి,  Housewife  అనండి, ' ఇంటి' కి దీపం మాత్రం ఇల్లాలే. ' ఇంటి' ని స్వర్గం చేసినా, ' ఇంటి' ని నరకం చేసినా ' ఇంటి' ఇల్లాలి చేతిలో మాత్రమే ఉంది.
   ' అయినా పొరుగు ' ఇంటి ' సంగతులు నాకెందుకూ?  నా ' ఇంటి ' సంగతులు నేను చూసుకోకా... కథ కంచికీ మనం ' ఇంటి' కీ....  


3 వ్యాఖ్యలు:

శ్రీలలిత చెప్పారు...

మీ ఇల్లు బంగారంగానూ...బాగా చెప్పారండీ...

Zilebi చెప్పారు...
యింతి జెప్పెను నిచటన యింటి కథలు
బంతి పూబంతు లుయనగ బ్లాగ రులుగ
వింత గొలుపుచు పడతులు వివిధ ములుగ
యింత అంతయు లేకను యిలన గలరు !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీలలిత గారూ, జిలేబి గారు,

ధన్యవాదాలు.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes