RSS

నా అల్లికల ప్రస్థానం












    బాల్కనీ లో నిలబడి, చక చకా చేతులు ముందుకూ, వెనక్కూ తిప్పుతూ స్వెట్టర్లు అల్లుతున్న ఉత్తర భారతీయ స్నేహితుల్ని చూసి, చీపురు పుల్లలతో,పురుకొస తో, అల్లిక విధానం పుస్తకాలతో మొదలయిన నా ' అల్లిక ప్రస్థానం' నిరాటంకంగా 15 సంవత్సరాలు బాగా నడిచింది.


    చిన్న చిన్న స్కార్ఫ్( చెవులకి కట్టుకునేవి) తో మొదలయి ఎన్నెన్నో స్వెట్టర్లూ, ఫ్రాకులూ, షర్టులూ, బ్లౌజులూ అన్నీ పూర్తి అయి ఓ పెద్ద షాల్ తో ఇంచుమించు ముగిసింది.
రోజూ, 'ఈవేళ మేడం, ఏ రంగుది, ఏ డిజైన్ లో వేసేరా' అని పరీక్షగా చూసేవారుట ! నా డిజైన్లకి అంత ప్రాచుర్యం వస్తోందంటే వినడానికి బాగానే ఉండేది కానీ, మరీ ఆడ పిల్లలు ఈయనని చూసేరంటే వినడానికి బాగుండేది కాదు! ఆఫీసులో ఆడ పిల్లలు చూస్తారని కాబోలు, ఈయన ప్రతీ రోజూ మర్చిపోకుండా నేను అల్లిన కొత్త స్వెట్టరు వేసుకుని వెళ్ళేవారు!

    అప్పుడు రోజుకు రెండు రకాల స్వెట్టర్లూ--ఒకటి ఏ పుట్టిన రోజుకో సర్ప్రైజ్ గా ఇచ్చేది ఒకటీ,( ఆయన ఆఫీసు కి వెళ్ళిన సమయంలో అల్లేది), ఇంకోటి పిల్లల ఎదురుగానూ, ఆయన ఎదురుగానూ అల్లేది. అన్నేసి స్వెట్టర్లు ఎలా అల్లేనో ఇప్పుడు ఆలోచిస్తే అర్ధం అవదు. అంత పిచ్చిగా అల్లేసే దాన్ని.అదొక 'అబ్సెషన్' లా ఉండేది.
వరంగాం లో ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు మార్కెట్ ఉండేది. ఎవడైనా కొత్త డిజైన్ వేసికుని మార్కెట్ కి వచ్చేడంటే చాలు, నేనూ, నా స్నేహితురాలూ, ఆ స్వెట్టర్ చుట్టూరా, అతనికి తెలియకుండా తిరగడం ( ప్రదక్షిణం లాగ!). ఆ డిజైన్ చూసి, ఇంటికి వెళ్ళి తయారు చేసికోవడం !!

    ఇవే కాకుండా, పాపం మా శ్రీవారి గురించి కూడా చెప్పుకోవాలి- ఇంగ్లీషు లో వచ్చే ' చిక్ ' మాస పత్రిక తెప్పించేవారు, నా ఆసక్తి చూసి. అలాగే హిందీ పత్రికలు కూడాను. ఎప్పుడైనా కొల్తలు కావాలంటే ,మా శ్రీవారినీ, పిల్లల్నీ నుంచోపెట్టి కొలుచుకునే దానిని! వాళ్ళందరికీ అసలు 'ఈస్తటిక్ సెన్స్' ఉండేది కాదు. ఏదో కొత్త డిజైన్ వేసి, ఎలా ఉందీ అని అడిగితే, ఏదో సమాధానం చెప్పొచ్చు కదా, ' ఏం అర్ధం అవడం లేదూ' అనేవారు. స్వెట్టరు తయారయిన తరువాత మాత్రం, ప్రతీ రోజూ మార్చడానికి మాత్రం రెడీ !!

   ఈ రోజుల్లో స్వెట్టర్లు ఎవరు వేసికొంటున్నారూ, అందరూ జెర్కిన్లూ, జాకెట్లూనూ. ఊలుతో అల్లిన స్వెట్టర్లు ' అవుట్ ఆఫ్ ఫేషన్' అయిపోయాయి.ప్రస్తుతం నేను అల్లిన స్వెట్టర్లు అన్నీ' కలరా ఉండలు' వేసి సూట్ కేసుల్లో క్షేమంగా విశ్రాంతి తీసికుంటున్నాయి. అయినా సరే శీతా కాలం వచ్చిందంటే, వాటన్నింటినీ ఒకసారి బయటకు తీసి పలకరిస్తూంటాను !



మళ్ళీ నానమ్మయ్యానోచ్!

  హాయ్ హాయ్ నేను మళ్ళి నాన్నమ్మ ని అయ్యానోచ్చి! ఈసారి మనుమడుకి, మాబంగారుతల్లి నవ్య అక్క అయింది. మనుమరాలు ( మూడున్నర సంవత్సరాలు) అచ్చంగా ఇల్లేరమ్మేను,అందరికి స్కూల్లోను బస్ లోను ఆటోవాళ్ళకి , షాపులొ వాళ్ళకి ఇరుగుపొరుగు తెలిసినవాళ్ళందరికి మా యింట్లొ బేబి వస్తోంది జననరిలో అక్కని అయిపోతానని చెప్పి టాం టాం.తమ్ముడుని చూసి ఓ మురిసిపోతోంది.ఎంత సంబరమొను, నిజానికి నాకు అలాగే వుంది. అందుకే మీ అందరితో నా సంతోషాన్ని పంచుకుంటున్నాను. మాల గారు రాసినట్లుగా నాకు నవరత్న మాల వఛ్ఛెసిందండి.అమ్మాయి, అల్లుడు వాళ్ళపిల్లలు , చి. తాన్య. (అమ్మాయి) చి. ఆదిత్య(అబ్బాయి) అబ్బాయి, కోడలు వాళ్ళ పిల్లలు నవ్య(అమ్మాయి) తమ్ముడు. (నిన్నే పుట్టిన బాబు), మా శ్రీవారు. ఇంత చక్కని అనందాన్నిచ్చిన తల్లి లలితా దేవికి నమొ నమహ!

తంబోలా ( తాంబూలం) పార్టీ

   మేము ఓ పదిహేనుమంది స్నేహితులం, ఓ చిట్ వేస్తూంటాము.ఏ నెల ఎవరికి వస్తే, వాళ్ళు ఓ బ్రంచ్ ఏర్పాటు చేయాలి. డిసెంబర్ నెలది నాకు వచ్చింది. మా గ్రూప్ లో మేము ఇద్దరమే తెలుగువాళ్ళం. ఆ రెండో ఆవిడకి మూడు నెలల క్రిందటే వచ్చింది. అందువలన ఆవిడ పార్టీ ఇచ్చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ,'లక్ష్మీ, నువ్వు ఇడ్లీలూ, వడా బాగా చేస్తావూ, అందువలన అవి తప్పకుండా చెయ్యాలీ' అన్నారు. సరే అని, దాంట్లోకి సాంబారు ఎలాగూ చేయాలి కదా అని, మా శ్రీవారిని మార్కెట్టుకు పంపి దాంట్లోకి వేయడానికి కావలిసిన కూరగాయలు తెప్పించాను.ఎప్పుడు ఇలాటి చిట్ పార్టీలు అయినా ఆ వచ్చే డబ్బులు నా దగ్గరే ఉంచేస్తాను. కానీ ప్రతీ నెలా వెయ్యి రూపాయలు ఆయనే ఇవ్వాలి.ప్రతీ నెలా ఆ డబ్బులిచ్చేటప్పుడు విసుక్కుంటూంటారు. కానీ ఓ సంగతి మరచిపోతూటారు-- ఆయనకి అత్యవసరమైనప్పుడల్లా, ఈ డబ్బులే ఆయనకి ఇస్తూంటాను. ఆ విషయం కన్వీనియెంటుగా మరచిపోతూంటారనుకోండి.
ఈ సారి చిట్ లో ఒక విషయమేమంటే ముగ్గురు క్రొత్తగా అత్తగార్లయ్యారు. ముందుగా వాళ్ళందరికీ అభినందనలు తెలిపాము.

    ఆ రోజు బ్రంచ్ లోకి వాళ్ళు అడిగినట్లుగా ఇడ్లీలు,వడ, దాంట్లోకి అల్లం పచ్చడి,పిండి పులిహోరా, ధనుర్మాసం కదా అని దధ్ధోజనమూ చేశాను. నా 'జున్ను కాని జున్ను ' ఉండనే ఉంది. ప్రొద్దుటే మా కోడలు, మిక్సీ లో మినప్పిండి(వడ ల కోసం) రుబ్బి పెట్టి ఇచ్చేసింది. పోనీ ఈ వేళ్టకి శలవు పెట్టేయొచ్చుగా అన్నాను. ' వద్దండీ, మీస్నేహితులతో ( అందరూ ఒకే వయస్సు వాళ్ళు) ఆనందంగా గడపండి' అని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయింది ( ఈ రోజుల్లో ఎంతమంది కోడళ్ళు అలా కోపరేట్ చేస్తారో నాకైతే తెలియదు).

    తిండి వ్యవహారం అయిన తరువాత, 'తంబోలా' ఆడడం కంపల్సరీ. ఆట మొదలెట్టే లోపల అందరూ కూర్చొని తమ తమ భర్తలమీద కోపం వచ్చిన సంఘటనలు( తాజా గా) చెప్పాలని కబుర్లు మొదలెట్టాము. అవన్నీ వింటూంటే బలే నవ్వొచ్చేసింది-- అందులో ఒకావిడ
' ఈ మధ్యన ఇంట్లో ఉన్న పాత బాటిల్స్ చెత్తలో పడేస్తూ, పెప్సీ, కోకాకోలా బాటిళ్ళు బయట పారేశాను. ఎక్కడ చూశాడో మా ఆయన, బయట పడేసిన బాటిల్స్ అన్నీ శుభ్రంగా కడిగి, దాన్నిండా నీళ్ళు పట్టి ఫ్రిజ్ లో పెట్టారు. నాకైతే ఒళ్ళు మండిపోయి, ఆయనమీద గయ్య్ మని అరిచేశాను. పిల్లలు, నెలకోసారి ఫ్రిజ్ లో అంతకు ముందున్న బాటిల్స్ ( అన్నీ ఏదో ఒక మాల్ లో కొన్నవే) అవతల పారేస్తూంటే, మీరేమిటీ, ఈ పిచ్చి బాటిల్స్ అవతల పారేస్తే, మళ్ళీ తెచ్చరూ?' అందిట.ఎంత చెప్పినా ఆయనకు ముందునుంచీ ఉన్న 'అతి జాగ్రత్త' స్వభావం మారదు కదా !!

    ఇంకో ఆవిడ--మా ఇంట్లో ఖర్చంతా నాచేతిమీదే నడుస్తుంది.ఎప్పుడైనా బజారులో, ఏ కొత్తిమీరో, కరివేపాకో తెచ్చాడా, దానికి అయిన ఖర్చు తెచ్చిన వెంటనే, నా దగ్గరనుండి వసూలు చేసేస్తారు, అందరి ఎదురుగుండా!!మరొకావిడ, క్లబ్బుకెళ్ళారూ,ఆకలితో వస్తారూ అని, వంట చేసేసి కూర్చొందట, ఇంటికి వచ్చినాయన ఎంతసేపైనా భోజనానికి లేవడే, అని' క్లబ్బులో ఏమైనా తినొచ్చారా, భోజనానికి లేవడం లేదూ' అని అడిగితే, 'క్లబ్బులో ఏం దొరుకుతాయ్, వడా పావ్,సమొసాలు తప్ప' అన్నాడు, ఈ మధ్యనే ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. ఛాన్స్ దొరికితే బయట ఏదో తినేస్తూంటారు. మరి కోపం వచ్చిందంటే రాదూ ?

    ముఫై ఏళ్ళ సంసారంలోనూ ఇలాటివి జరిగేవే,అదేదో వీటివల్ల కాపురాలు కూలిపోతాయని కాదు.అందరూ తలోటీ చెప్పారు.కొంచెం సేపట్లో చాయ్ చేసి తీసుకొచ్చాను. నా అనుభవం చెప్పమన్నారు--కప్పు నోటి దగ్గరకు తీసికొంటూ, ఇదిగో చూడండి, ఈ కప్పు లిప్పు దగ్గరకు వచ్చేలోపలే ,మా ఇద్దరికీ ఏదో విషయంలో వాదన జరుగుతూంటుంది అన్నాను ! మా మెంబర్లందరూ ఊరికి తలో మూలా ఉన్నారు, అయినా ఆటోలకి ఖర్చు పెట్టుకుని, తంబోలా ఆడడానికి కూడా డబ్బులు పెట్టుకుని, నెలకోసారైనా అందరూ కలుసుకోవాలని, గత పది సంవత్సరాలనుండీ ఎలాటి బ్రేక్కూ లేకుండా ఈ చిట్ ప్రోగ్రాం చేసుకుంటున్నాము.
చివరలో, మా శ్రీవారి 65 వ జన్మదినోత్సవం సందర్భంగా, అందరికీ, కుంకం భరిణెలతో తాంబూలం ఇచ్చేశాను.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes