RSS

తంబోలా ( తాంబూలం) పార్టీ

   మేము ఓ పదిహేనుమంది స్నేహితులం, ఓ చిట్ వేస్తూంటాము.ఏ నెల ఎవరికి వస్తే, వాళ్ళు ఓ బ్రంచ్ ఏర్పాటు చేయాలి. డిసెంబర్ నెలది నాకు వచ్చింది. మా గ్రూప్ లో మేము ఇద్దరమే తెలుగువాళ్ళం. ఆ రెండో ఆవిడకి మూడు నెలల క్రిందటే వచ్చింది. అందువలన ఆవిడ పార్టీ ఇచ్చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ,'లక్ష్మీ, నువ్వు ఇడ్లీలూ, వడా బాగా చేస్తావూ, అందువలన అవి తప్పకుండా చెయ్యాలీ' అన్నారు. సరే అని, దాంట్లోకి సాంబారు ఎలాగూ చేయాలి కదా అని, మా శ్రీవారిని మార్కెట్టుకు పంపి దాంట్లోకి వేయడానికి కావలిసిన కూరగాయలు తెప్పించాను.ఎప్పుడు ఇలాటి చిట్ పార్టీలు అయినా ఆ వచ్చే డబ్బులు నా దగ్గరే ఉంచేస్తాను. కానీ ప్రతీ నెలా వెయ్యి రూపాయలు ఆయనే ఇవ్వాలి.ప్రతీ నెలా ఆ డబ్బులిచ్చేటప్పుడు విసుక్కుంటూంటారు. కానీ ఓ సంగతి మరచిపోతూటారు-- ఆయనకి అత్యవసరమైనప్పుడల్లా, ఈ డబ్బులే ఆయనకి ఇస్తూంటాను. ఆ విషయం కన్వీనియెంటుగా మరచిపోతూంటారనుకోండి.
ఈ సారి చిట్ లో ఒక విషయమేమంటే ముగ్గురు క్రొత్తగా అత్తగార్లయ్యారు. ముందుగా వాళ్ళందరికీ అభినందనలు తెలిపాము.

    ఆ రోజు బ్రంచ్ లోకి వాళ్ళు అడిగినట్లుగా ఇడ్లీలు,వడ, దాంట్లోకి అల్లం పచ్చడి,పిండి పులిహోరా, ధనుర్మాసం కదా అని దధ్ధోజనమూ చేశాను. నా 'జున్ను కాని జున్ను ' ఉండనే ఉంది. ప్రొద్దుటే మా కోడలు, మిక్సీ లో మినప్పిండి(వడ ల కోసం) రుబ్బి పెట్టి ఇచ్చేసింది. పోనీ ఈ వేళ్టకి శలవు పెట్టేయొచ్చుగా అన్నాను. ' వద్దండీ, మీస్నేహితులతో ( అందరూ ఒకే వయస్సు వాళ్ళు) ఆనందంగా గడపండి' అని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయింది ( ఈ రోజుల్లో ఎంతమంది కోడళ్ళు అలా కోపరేట్ చేస్తారో నాకైతే తెలియదు).

    తిండి వ్యవహారం అయిన తరువాత, 'తంబోలా' ఆడడం కంపల్సరీ. ఆట మొదలెట్టే లోపల అందరూ కూర్చొని తమ తమ భర్తలమీద కోపం వచ్చిన సంఘటనలు( తాజా గా) చెప్పాలని కబుర్లు మొదలెట్టాము. అవన్నీ వింటూంటే బలే నవ్వొచ్చేసింది-- అందులో ఒకావిడ
' ఈ మధ్యన ఇంట్లో ఉన్న పాత బాటిల్స్ చెత్తలో పడేస్తూ, పెప్సీ, కోకాకోలా బాటిళ్ళు బయట పారేశాను. ఎక్కడ చూశాడో మా ఆయన, బయట పడేసిన బాటిల్స్ అన్నీ శుభ్రంగా కడిగి, దాన్నిండా నీళ్ళు పట్టి ఫ్రిజ్ లో పెట్టారు. నాకైతే ఒళ్ళు మండిపోయి, ఆయనమీద గయ్య్ మని అరిచేశాను. పిల్లలు, నెలకోసారి ఫ్రిజ్ లో అంతకు ముందున్న బాటిల్స్ ( అన్నీ ఏదో ఒక మాల్ లో కొన్నవే) అవతల పారేస్తూంటే, మీరేమిటీ, ఈ పిచ్చి బాటిల్స్ అవతల పారేస్తే, మళ్ళీ తెచ్చరూ?' అందిట.ఎంత చెప్పినా ఆయనకు ముందునుంచీ ఉన్న 'అతి జాగ్రత్త' స్వభావం మారదు కదా !!

    ఇంకో ఆవిడ--మా ఇంట్లో ఖర్చంతా నాచేతిమీదే నడుస్తుంది.ఎప్పుడైనా బజారులో, ఏ కొత్తిమీరో, కరివేపాకో తెచ్చాడా, దానికి అయిన ఖర్చు తెచ్చిన వెంటనే, నా దగ్గరనుండి వసూలు చేసేస్తారు, అందరి ఎదురుగుండా!!మరొకావిడ, క్లబ్బుకెళ్ళారూ,ఆకలితో వస్తారూ అని, వంట చేసేసి కూర్చొందట, ఇంటికి వచ్చినాయన ఎంతసేపైనా భోజనానికి లేవడే, అని' క్లబ్బులో ఏమైనా తినొచ్చారా, భోజనానికి లేవడం లేదూ' అని అడిగితే, 'క్లబ్బులో ఏం దొరుకుతాయ్, వడా పావ్,సమొసాలు తప్ప' అన్నాడు, ఈ మధ్యనే ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. ఛాన్స్ దొరికితే బయట ఏదో తినేస్తూంటారు. మరి కోపం వచ్చిందంటే రాదూ ?

    ముఫై ఏళ్ళ సంసారంలోనూ ఇలాటివి జరిగేవే,అదేదో వీటివల్ల కాపురాలు కూలిపోతాయని కాదు.అందరూ తలోటీ చెప్పారు.కొంచెం సేపట్లో చాయ్ చేసి తీసుకొచ్చాను. నా అనుభవం చెప్పమన్నారు--కప్పు నోటి దగ్గరకు తీసికొంటూ, ఇదిగో చూడండి, ఈ కప్పు లిప్పు దగ్గరకు వచ్చేలోపలే ,మా ఇద్దరికీ ఏదో విషయంలో వాదన జరుగుతూంటుంది అన్నాను ! మా మెంబర్లందరూ ఊరికి తలో మూలా ఉన్నారు, అయినా ఆటోలకి ఖర్చు పెట్టుకుని, తంబోలా ఆడడానికి కూడా డబ్బులు పెట్టుకుని, నెలకోసారైనా అందరూ కలుసుకోవాలని, గత పది సంవత్సరాలనుండీ ఎలాటి బ్రేక్కూ లేకుండా ఈ చిట్ ప్రోగ్రాం చేసుకుంటున్నాము.
చివరలో, మా శ్రీవారి 65 వ జన్మదినోత్సవం సందర్భంగా, అందరికీ, కుంకం భరిణెలతో తాంబూలం ఇచ్చేశాను.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes