మా బంగారు తల్లి నవ్య(మనవరాలు), వాళ్ళ అమ్మతో కలిసి పాడే మంగళహారతి. మా వారి బ్లాగ్గులో, ఎవరో కోరగా,ఈ పాట ఇక్కడ పెట్టాను.
మంగళహారతి-----రచయిత బ్రహ్ర్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం.
శీతాద్రి శిఖారాన పగడాలు తాపించు
మా తల్లి లత్తుకకు నీరాజనం- కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం.
యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం- బంగారు నీరాజనం- భక్తి పొంగారు నీరాజనం.
నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు
మా తల్లి గాజులకు నీరాజనం- రాగాల నీరాజనం- భక్తి తాళాల నీరాజనం.
మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం- ముత్యాల నీరాజనం- భక్తి నృత్యాల నీరాజనం.
చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగరకు నీరాజనం- రతనాల నీరాజనం- భక్తి జతనాల నీరాజనం.
పసిబిడ్డలను జేసి ప్రజనెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం- అనురాగ నీరాజనం- భక్తి కనరాగ నీరాజనం.
దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మా తల్లి కుంకుమకు నీరాజనం- నిండైన నీరాజనం- -భక్తి మెండైన నీరాజనం.
తేటిపిల్లల వొలె గాలి కల్లలనాడు
మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం- భక్తి భావాల నీరాజనం.
జగదేకమోహిని, సర్వేశగేహిని
మా తల్లి రూపునకు నీరాజనం- నిలవెత్తు నీరాజనం- భక్తి నిలువెత్తి నీరాజనం.
మంగళహారతి
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 8, నవంబర్ 2009, ఆదివారం
8 కామెంట్లు:
చివరి పంక్తిలో "నిలువెత్తి" కి బదులుగా "నిలువెత్తు" గా చదువుకోగలరు.
బాగుందండీ, మా అందరికి కూడా తెలియచేసినందుకు ధన్య వాదాలు.
beautiful
భావనా, కొత్తపాళీ,
ధన్యవాదాలు.
భారతదేశం వదలివచ్చే ముందు రోజు ఈ పాటను బాలమురళి గొంతులో జీటీవీలో విన్నాను. అప్పటినుండి పాట గుఱించి చాలా సార్లు ఆలోచించి చివరిగా జాలశోధించగా అయ్యవారి బ్లాగుద్వారా అమ్మవారి బ్లాగు చేరుకున్నాను. పాటను ఉంచినందుకు ధన్యవాదములు.
బాలమురళి గొంతులో ఈ పట మళ్ళీ వినగలిగితే ఇంకా బాగుంటుంది.
పునహాలో అంతా సౌఖ్యమని ఆశిస్తున్నాను, నేను అమెరికా వచ్చి రెండు వారాలైనా కాలేదు, గోదావరి మీద చాలా దేనవారిపోయింది. ఎప్పటికైనా వెనక్కివెళ్ళిపోవలసిందే ననిపిస్తుంది. :(
- రాకేశ్వర
ఇక్కడ దొరికింది ఈ పాట
ఉమాశంకర స్తుతిమాల - బాల మురళీ కృష్ణ, సుశీల గార్లు పాడిన పాటల క్యాసెట్టు - మంచి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
మా అన్నయ్య మాకు పరిచయం చేశాడు. చాలా బావుంటాయి ఈ పాటలు.
ఈ పాటలు ఇంకొన్ని ఇక్కడ:
http://www.esnips.com/web/umasankarastutimala
ఇందులో శివ తాండవం కూడా ఉంటుంది. పై లంకెలో ఎవరో గుర్తు చేశారు.
రాకేశ్వర రావు, మీ వద్ద ఉందా?
కాకుంటే ఈ పాటలలో ఎన్నో తెలియని, unexpected మాటలు ఉన్నాయి.
లత్తుక మొదట విన్నది ఈ పాటలోనే.
"దహరాన కనిపించు ఇన బింబమనిపించు"... లో గహరం అనుకునే దాన్ని.
దహరం అంటే హృదయం ట.
Thanks to http://andhrabharati.com/dictionary/
గహరం అంటే కూడా అర్థం ఇప్పుడే తెలిసింది.
ఇప్పటికీ ఆ లైను పూర్తిగా అర్థం కాలేదు.
అలాగే శివ తాండవంలో కూడా "ద్యూటీ" లాగా వినిపించే పదం ఏదో ఉండాలని గుర్తు.
మంచి పాట గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
రాకేశ్వర,
మమ్మల్ని గుర్తుంచుకొని, నా టపాలు చదువుతూన్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబూ. నీవు ఇచ్చిన పాటల లింకు ఎంతమందికో ఉపయోగిస్తుంది.మన దేశానికి ఎప్పుడు వచ్చేస్తున్నావు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి