మాశ్రీవారికి అలవాటేగా, ఛాన్సు దొరికితే చాలు, నన్నూ,మా ప.గొ.జి వాళ్ళనీ ఎత్తిపొడవడం. నిన్నంతా ప్రయాణం బడలికతో కంప్యూటర్ దగ్గరకే వెళ్ళలేదు. ఈయన గారికి పాపం మూడు రోజుల కంప్యూటరు ఉపవాసం తరువాత, పూణే ఇంకా వచ్చేమో లేదో, కంప్యూటరు దగ్గరకూర్చుని, తన 'ఖున్నస్' అంతా వ్రాసేసికున్నారు, ఈ బ్లాగ్గులో
అసలు ఒకటి చెప్పండి-పెళ్ళికి పూర్వం ఇంట్లో నాన్నగారు 'అమ్మాయీ' అని పిలవడం, చెల్లెళ్ళు,తమ్ముడు 'పెద్దక్కా' అనడం, ఏదో అమ్మ ఒకత్తీ పాపం 'లక్ష్మీ' అని పిలిచేది. బయటివాళ్ళందరూ ( అంటే చుట్టాలు) పేరయ్య శాస్త్రిగారి అమ్మాయీ అనేవారు. పెళ్ళైన తరువాత, అత్తగారూ, మామగారూ 'ఏమమ్మా' అనేవారు. పిల్లలు పుట్తుకొచ్చిన తరువాత, రేణూ కీ మమ్మీ, ఆ తరువాత హరీష్ కీ మమ్మీ అని పిలిచేవారే కానీ, అసలు నా పేరెవరికైనా గుర్తుండిందనుకోను. ఫాక్టరీ ఎస్టేట్ లో అందరికీ మిస్సెస్.ఫణిబాబు. అసలు నా పేరు నాకే గుర్తుంటుందా అనిపించేది. అదేదో కథలో ఓ ఈగ తన పేరు మర్చిపోయిందిట, అలాగయ్యింది నా పరిస్థితి! ఎప్పుడో, ప్యాన్ కార్డుకీ,వోటరు కార్డుకీ,పాస్ పోర్ట్ కీ నా పేరు గుర్తొచ్చేది ఆయనకి. బ్యాంకు ఎకౌంట్లన్నీ ఆయనపేరుమీదే. నా పేరు వ్రాయకపోతే పెన్షన్ ఇవ్వరేమో అని భయ పడికానీ, లేకపోతే అక్కడా ఉండేది కాదు!
ఈ ముఫైఏడేళ్ళూ ఏ శుభకార్యానికీ వెళ్ళలేకపోయాము అనేక కారణాలవల్ల. మొత్తానికి ఈయన రిటైరైన తరువాత ఎలాగో మూడ్ వచ్చి ఎవరు పిలిస్తే వాళ్ళింట్లో శుభకార్యాలకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాము.మేము రాజమండ్రీ వెళ్ళినప్పుడు, మా ఎపార్ట్మెంటు సొసైటీ లో మాత్రం, నలుగురైదుగురు లక్ష్మిలుండడంతో, నన్ను 'పూనా లక్ష్మి గారు' అనే పిలిచేవారు. ఏంచేస్తాం అంతకంతా!మొత్తానికి పరిస్థితిలో కొంతైనా మార్పొచ్చిందికదా అని సంతోషం!
మా పెళ్ళైన తరువాత మా ఆడపడుచు పెళ్ళికి వెళ్ళినప్పుడైతే మరీ అన్యాయం- 'ఫణి పెళ్ళాం ఎవరూ' అంటే 'అదిగో చేతికి గాజులుకానీ, మెళ్ళొ నగలు కానీ లేకుండా ఉందే తనే'అనడం కూడా విన్నాము! పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగే ఉండవుగా!
ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే, మా శ్రీవారు తననేదో, మావాళ్ళందరూ తక్కువ చేసి చూశారూ అనుకోనక్కర్లేదు.అక్కడ ఉన్నవాళ్ళకి, నా పేరే గుర్తులేదు, ఇంక ఈయన్ని ఎవరు గుర్తు పెట్టుకుంటారూ?అయినా వాళ్ళకింకేమీ పనిలేదా!అస్సలు గొడవంతా ఎక్కడొచ్చిందంటే, అక్కడ పాపం ఈయనకి వాళ్ళ కోనసీమ వాళ్ళెవరూ దొరకలేదు. అదీ ఉడుకుమోత్తనం! ఎవరితో చెప్పుకుంటారూ, అందుకని ఆ ఉక్రోషం తో ఉన్నవీ లేనివీ వ్రాసేయడం! మరి మా అత్తగారి/మామగారి వైపు వాళ్ళింటికి వెళ్తే వాళ్ళందరూ 'ఫణి పెళ్ళాం' అనలేదూ? ఇప్పుడు మా వాళ్ళందరూ 'లక్ష్మి మొగుడు' అనేటప్పటికి మాత్రం పొడుచుకొచ్చింది పేద్ద, అడిగేవాళ్ళు లేక !!!
చెప్పాలంటే, అక్కడ మ్యారేజ్ హాల్లో, అందరికీ విడిగా రూమ్ములున్నాయి కావాలంటే, ఉండాలని ఉంటే ఉండేవారే,మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు 'లక్ష్మి మొగుడు' అని వినాల్సొస్తుందో అని, పిల్లల వంక పెట్టి,కాచిగూడా, మా వియ్యాలారింటికి
వెళ్ళిపోయారు. అక్కడైతే ఈయన ఎంతైనా వియ్యంకుడు గారు కదా, అన్ని మర్యాదలూ జరుగుతాయి! నేను మాత్రం ఎన్నో సంవత్సరాల తరువాత చాలా బాగా ఎంజాయ్ చేశాను! చుట్టాల్లో కూడా, ఇదివరకటికీ,ఇప్పటికీ ప్రవర్తనలోకూడా చాలా మార్పొచ్చింది, వస్తుంది లెండి ఎందుకు రాదూ!
రాత్రంతా చుట్టాలందరితోనూ కబుర్లతోటే గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాల కబుర్లో! అందరూ అమ్మమ్మలో/మామ్మలో అయ్యేపోయారు! వాళ్ళ పిల్లల్నీ,మనవల్నీ, మనవరాళ్ళనీ పిలవడం, పరిచయం చెయ్యడం, అసలు టైము ఎలా గడిచిపోయిందో తెలియేలేదు, తెలిసేసరికి తెల్లారి పెళ్ళి టైము అయ్యేపోయింది.
ప్రొద్దుటే శ్రీవారి ఫోన్నూ-ఇంకో పది నిమిషాల్లో వస్తున్నానూ, ఆటో వెయిటింగులో పెట్టి, రెడీగా ఉండూ అంటూ. ఓమాటు వాళ్ళకి చెప్పేసివచ్చేస్తానండీ అన్నా కాని వినకుండా, ' ఏం అఖ్ఖర్లేదు,రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారుగా,నీ గురించేం బెంగపెట్టుకోరులే' అంటూ ఆటోలో కూర్చోపెట్టేశారు! ఇదంతా క్రిందటిరోజు అందరూ 'లక్ష్మి మొగుడూ' అన్నదానికి ఫలితమన్నమాట!
ఇన్నాళ్ళకి ఒక్కసారంటే ఒక్కసారి అలా పరిచయం చేసేసరికి, అసలు రంగంతా బయట పడిపోయింది!! ఉత్తి ఉడుకుమోత్తనం! అంతే ఇంకేమీ లేదు !
25 కామెంట్‌లు:
అద్గదీ..అలా వుండాలి .. మనూరి తడాఖా చూపించారు. :-))
అది ఉడుకుమోత్తనం కాదండీ...అయినా రాత్రంతా మీరు మీ వాళ్ళతో తనివితీరా లోకాభిరామాయణం చెప్పుకోడానికి ఆయన త్యాగం చేసి మీ వియ్యాల వారి ఇంటికి వెళ్ళారని ఎందుకనుకోరు? అయినా మీ ప.గొ.జీ వాళ్ళంతా అంతే. మా తూ.గొ.జీ వాళ్ళంటే ఒట్టి ఉడుకుమోత్తనం...నా ఓటు ఫణిబాబు గారికే...
ఇదే మొదటిసారండీ మీ బ్లాగు చూడటం...చాలా బావుంది. అన్నట్టు ఒక సందేహం... మీ వెల్కం నోట్ లో "పతియే పరమేశ్వరుడు...ఇల్లే వైకుంఠం" అన్నారు.. వైకుంఠం లో పరమేశ్వరుడు ఏంటండి...అదేదో కైలాసం అన్నా పోయేదిగా :)
నేను గత నవంబర్ లోనే బ్లాగడం మొదలు పెట్టిన జూనియర్ బ్లాగ్గేయకారుడిని. కాబట్టి మీ దంపతులిద్దరూ నా బ్లాగును సందర్శించి మీ ఆశీస్సులు, అభిప్రాయాలు....ఏవైనా నచ్చకపోతే అచ్చ తెలుగు అక్షింతలు అందించమని ప్రార్ధన.
భవదీయుడు
సరస్వతుల శ్రీనివాస ఉమాశంకర్
ధిత్తాం ధికతాం , ధిక్తళాంగు తక తళాంగు తక ధిరికిటి తక..
ఆహా లెస్సబలికితిరి, ఇది తప్పక కైలాసమే శ్రీ గౌరీ శంకరుల నాట్య విన్యాసాలవిగో :))
మాదేవూరో గుర్తు లేదు, కాని ఇప్పుడు ప.గో.జి పక్షం వహిస్తున్నా.
S.N.Krishna Rao
Bhale raasaaru. Adbhutam.
Ramu
apmediakaburlu.blogspot.com
Very nice..
Thanq..
మంచుపల్లకీ,
ఎవరో వస్తారనీ,ఏదో చేస్తారనీ ఎదురుచూడకుండా, మనల్ని మనమే డిఫెండు చేసుకోవాలి!
SHANKY,
నా వెల్కంనోట్ లో వ్రాసినదాన్ని గురించి ఓ బ్లాగ్గు పోస్ట్ చేశాను ( బ్లాగులు మొదలెట్టిన కొత్తలో).. http://bsuryalakshmi.blogspot.com/2009/04/blog-post_25.html నా బ్లాగ్గు నచ్చినందుకు ధన్యవాదాలు.
snkr,
మా విన్యాసాలేమిటో తెలియదుకానీ, మీ వ్యాఖ్య అద్భుతం !
Sitaram,
ఇదేమిటండి ఒకసారి 'రాము' అంటారు, ఇంకోసారి 'సీతారాం' అంటారు!
రామనరసింహ,
ధన్యవాదాలు.
శ్రీకృష్ణా,
చాలా సంతోషం
'ఖున్నస్'
చాలా రోజుల తరువాత మహారాష్త్ర flavor తగిలింది.
అమ్మా..
మన అసలు పేరు...'సీతా రామ శేషు.
రాము
apmediakaburlu.blogspot.com
కృష్ణార్జున్,
ఎంతైనా 40 సంవత్సరాలనుండి ఉంటున్నాము కదా!
సీతారాం,
ఇందులో ఏ పేరుతో పిలుస్తారు మిమ్మల్ని?
Amma,
Namasthe. Got introduced to your blog through apmediakaburlu. The way you write is excellent. I'm at Chennai.
I've not yet seen your Srivari's blog. IDI SANGATHI.
బాగుందండీ మీ ప్రచ్చన్న యుధ్దం.
చాలా సరసంగా ఉంది. కానీ అనిపిస్తుంది ఫణిబాబుగారు నిజంగా అమాయకులే అని. లేపోతే బ్లాగరి అయిన శ్రీమతి మీద బ్లాగులోనే కంప్లెయింటు రాస్తారా? వడ్డీతో సహా తీర్చేశారుగా! భేష్!
అయినా శ్రీరాముడంతటి వాణ్ణి మిథిల వెళ్తే, మన సీతమొగుడేనే అన్నార్ట .. మానవ మాత్రులం, మాదేముంది! ఆ సతికి పతి అనే గుర్తింపునే మహాబిరుదులాగా భుజకీర్తులమీద మోసేస్తాం!
మాధురీ,
'ఇదీ సంగతి' నాబ్లాగ్గు. మా శ్రీవారిది...
PHANIBABU-MUSINGS http://harephala.wordpress.com
బోనగిరీ,
ధన్యవాదాలు.ఏదో కాలక్షేపం ఉందాలి కదండీ !
కొత్తపాళీ గారూ,
ఆయన మరీ అమాయకులని అనుకోకండి.ఊరికే public sympathy కోసం ఇలా వ్రాస్తూంటారు!!
==>అయినా శ్రీరాముడంతటి వాణ్ణి మిథిల వెళ్తే, మన సీతమొగుడేనే
త్యాగరాజ స్వామి వారు ఇంకో అడుగు ముందుకేసి, "మా జానకి చెట్ట పట్టగా, మహ రాజువైతివి" అన్నారు. (లేహ పోతే నీ బోడి గొప్పేమిటి మహా! అన్నట్టేమో!)
పొస్టు బలే కమ్మగా వుందండీ సూర్య లక్ష్మి గారు.
మా పరిచయస్తుల్లో ఒకరి పేరు "లక్ష్మీ పతి". ఆయన శ్రీమతి గారు "జయ". అందుకే అందరూ తనని "జయా పతి" అని పిలుస్తున్నారని అయనెప్పుడూ వాపోతూ వుంటారు :)
శారద
శారదా,
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి