RSS

ముగ్గురు పిల్లలతో...

    మా అబ్బాయీ,కోడలూ ముంబై ఏదో పనిమీద వెళ్ళవలసివచ్చేసరికి, నవ్య,అగస్థ్య లను నేను చూస్తానూ అన్నాను.ఏదో, మా శ్రీవారుకూడా సహాయం చేస్తారనే సదుద్దేశ్యంతో. ఏదో నా తిప్పలేవో నేనే పడిఉంటే గొడవుండేదేకాదు.పైగా, 'పిల్లల్ని ఈ వర్షంలో తిసికెళ్ళడం కష్టం. నేను,ఈవాళ్టికి బయటకు ఎక్కడా తిరగడానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటానులే' అని ఓ ఎష్యూరెన్స్
కూడా ఇచ్చేశారు. పోనీ మనిషికి మనిషుంటే తోడూ అనుకొని బాగానే ఉందీ అనుకున్నాను.

   నిన్న నవ్య పుట్టినరోజుకి చేసినవే, మిగిలినవి బ్రేక్ ఫాస్ట్ గా పెట్టేసి, పేద్ద వంటా అదీలేదుకదా, పిల్లాడిని చూసుకోవచ్చనుకున్నాను.మా కోడలు వెళ్ళేముందరే, అగస్థ్యకి ఏదైనా అవసరం వస్తే
వేయవలసిన మందులూ అవీ, చెప్పి నీట్ గా ఓ కాగితంమీద వ్రాసేసి ఇచ్చింది.ఏమీ అవసరం లేకపోయేయనుకోండి.

    ఈ మొగాళ్ళున్నారే, చిన్న పిల్లలు ఆడుతూ పాడుతూంటే చూస్తారుకానీ, ఏడిస్తే ఊరుకోపెట్టడం మాత్రం చెయ్యలేరని తెలిసిపోయింది. స్నానం చేసి, పూజ చేసికుందామని, ఈయనని కొంచెం పిల్లాడిని చూస్తూండమని చెప్పాను. మంచం మీద పొడుక్కోపెట్టినా పాకుతూ మంచం చివరకు వచ్చేస్తాడని, ఈయనని చూడమన్నాను.అసలు పిల్లల్ని చూడ్డం వస్తేకదా,మా పిల్లలటైములోనూ, ప్రొద్దుటే 7.00 గంటలకి ఫాక్టరీకి వెళ్ళిపోతే, తిరిగి సాయంత్రానికే రావడం.రోజంతా పిల్లలతో ఏమేమి తిప్పలు పడ్డానో ఈయనకేం తెలుసూ? పిల్లలు క్రమశిక్షణగా పెరగడం అంతా ఈయన ఘనతే అనుకుంటూంటారు.

   మా అగస్థ్యకి వాళ్ళ అమ్మ ఇంట్లోనూ, డే కేర్ లో ఆయాలూ ఎత్తుకోవడం అలవాటుచేసేశారు. క్రింద పడుక్కోబెడితే చాలు భోరుమని ఏడుపూ.ఒళ్ళో సేఠ్ లా కూర్చోవడం.పోనీ ఒక్కసారి ఎత్తుకోండీ అంటే, ఓ నిమిషం ఎత్తుకుని, మంచంమీద పడుక్కోపెట్టేస్తారు. వాడేమో ఏడుపూ.ఏమైనా అంటే విసుగూ.పోనీ వాడికి పట్టడానికి పాలైనా కలుపుతారా అంటే,అదీ లేదూ. న్యాపీ తడిసిపొతే మార్చడం కూడా రాదు.

    పోనీ నవ్యతోనైనా సరీగ్గా ఉంటారేమో అనుకుంటే అదీ లేదు.చిన్నపిల్ల,కొంచెం ఏక్టివ్ గా ఉంటుంది. అమ్మా నాన్నా లేకపోతే తనే ఇంటి పెద్దా అనుకుంటుంది.ఇల్లంతా కలియబెట్టేస్తూంటుంది. ఈయనకేమో చిరాకు. అలా కాదండీ, పిల్లల్ని అది చేయకూ,ఇది చేయకూ అంటే వినరూ ఈ రోజుల్లో, మాటల్లో పెట్టి వాళ్ళ దృష్టి మార్చాలీ అంటే, మూతి ముడుచుక్కూర్చుంటారు!
దీనితో ఈ వేళంతా ముగ్గురు పిల్లల్ని చూడ్డం అయింది మొత్తానికి.

3 కామెంట్‌లు:

నాగేస్రావ్ చెప్పారు...

మీకొసమెరుపు చదివే సరికి నవ్వొచ్చిందండి! శీర్షిక ముందు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా!!

Unknown చెప్పారు...

నిజమే...మీ టపా టైటిల్ చూసి కూడా కనుక్కోలేకపొయాను. చివరి వాక్యం చదివాక అర్ధమైంది. నవ్వాగలేదనుకోండి!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

నాగెశర్రావు,ఏరియన్,

నా బ్లాగ్గు నచ్చినందుకు సంతోషం.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes