RSS

చుట్టరికాల revival--part 2

    చుట్టరికాల రివైవల్ ప్రస్థానంలో హైదరాబాదు వెళ్ళాము. ట్రైనులో మా శ్రీవారు అలవాటు ప్రకారం ఓ కుర్రజంటతో పరిచయం చేసికున్నారు.ముందుగా వారి పాప( ఏణ్ణర్ధం వయస్సు) తో కబుర్లు మొదలెట్టారు. నాకు ఎప్పుడూ ఈయనతో గొడవే. ఊరికే అందరితోనూ పరిచయం చేసికుంటారూ, వాళ్ళకి నచ్చుతుందో లేదో అని అంటూంటాను. పూణే స్టేషన్ లో తెలుగు పుస్తకాలు కొన్నారు, కానీ చదువుకోడానికి మాత్రం తీయరు, అదేదో రేషను కొట్లో ఇచ్చినట్లుగా, ఒక్క పుస్తకమే ఇచ్చి, దాన్నే చదువుతూండమంటారు!ఎంతసేపని చదువుతామూ? అయినా సరే అన్ని పుస్తకాలు కొంటారా, కావలిసిందేదో చదువుకోవచ్చుగా అంటే, ఠాఠ్, అన్నీ బయట పెట్టేస్తే, ప్రతీవాడూ అడుగుతాడూ, మన ప్రయాణం పూర్తయేసరికి పుస్తకం రూపు మారిపోతుందీ అంటారు. మరీ గొడవచేస్తే, పుస్తకాలు కొనడం మానేస్తారేమో అని భయం! ఆయన ట్రైన్లో పరిచయం అయిన వారితో ఖబుర్లు చెప్పుకుంటూంటే, నా దారిన నేను ఏమీ పట్టనట్లు పుస్తకం ( ఆయన రేషన్ లో ఇచ్చినది!) చదువుకుంటూ కూర్చున్నాను.

    ఆయన కబుర్లు పూర్తవడం, నేను పుస్తకం చదవడం పూర్తి చేయడం ఒకేసారి జరగడంతో, ఇంకో దిక్కులేక, వారితో కబుర్లు మొదలెట్టాను. వారితో గడిపిన సమయం చాలా బాగా జరిగింది. దాని గురించి మావారు ఓ బ్లాగ్గు కూడా వ్రాశారు.

    ఇప్పుడు అర్ధం అయింది, ఆయన కనిపించిన ప్రతీ వారితో ఎందుకు పరిచయం చేసికుంటారో. ఈ పరిచయమే అవకపోతే మంచి స్నేహితులని మిస్ అయిపోయుండేదాన్ని కదా! ఈ మాట మావారితో అన్నానా ఇంక కాలరెత్తేసికుంటారు! 'చూశావా అస్తమానూ సణుక్కుంటూంటావు,అందరితోనూ పరిచయాలు వద్దండి బాబూ అని, ఇప్పుడు చెప్పు నేను చేసేది తప్పూ అని!'. ఏం చేస్తాం అన్నిరోజులూ మనవి కావుకదా! ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, పెళ్ళిలో శ్రీ అవధాన్లు గారి గురించి చెప్పగానే, మా 'ఇమేజ్' మాత్రం పెరిగిపోయింది.

    ఇంక పెళ్ళి సంగతికొస్తే, అక్కడ ఉన్నవాళ్ళందరూ మా అత్తగారివైపు వాళ్ళే. తెలుసుగా నా పరిస్థితి ఎలా ఉండిఉంటుందో? మరీ ఇదివరకటిలా కాదనుకోండి, ఎంతైనా నేనూ ఓ అమ్మమ్మ/నాన్నమ్మ స్టేజికి వచ్చానుగా!నాకూ ఓ 'స్టేటస్' ఇచ్చేశారు! మనవరాళ్ళూ, మనవలిగురించే కబుర్లు చెప్పుకుంటే అసలు గొడవే ఉండదు!పాతరోజుల్లో అయితే ఇలా పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, అత్తగారివైపు చుట్టాలందరికీ అడుగులకి మడుగులొత్తవలసివచ్చేది. హాయిగా ఇన్నేళ్ళ తరువాత అయితే ఓ సౌలభ్యం కూడా ఉంది. ఎవరైనా కనిపించినా గుర్తుచేసికోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓ పోజు పెట్టామనుకోండి, అవతలి వాళ్ళు 'డిఫెన్సివ్ మోడ్' లోకి వెళ్ళిపోతారు! మరీ కుదరలెదనుకోండి, ఎవరో పిలిచినట్లుగా ' ఆ వస్తున్నా' అంటూ వీళ్లని తప్పించుకోవచ్చు ! ఇంత హడావిడిలోనూ, మా మామగారి వైపు చుట్టం ఒకాయన కలిశారు. ఆయన, మావారి పెదనాన్నగారి కొడుకు. ఆయనా, మా'తోటికోడలూ' అప్పటికీ అననే అన్నారు-' ఇక్కడిదాకా వచ్చి ఓసారి మా ఇంటికి రాకుండా వెళ్తున్నారే' అని.అబ్బే ఈ వేళ సాయంత్రం వెళ్ళిపోతున్నామూ, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తామూ,అని ఓ స్టాండర్డ్ డయలాగ్గు చెప్పేశారు!
అందరితోనూ కబుర్లు చెప్పి. లంచ్ పూర్తి చేసికుని, సిఖ్ విలేజ్ నుంచి, ఎస్సార్ నగర్ దాకా ఓ ఆటో మాట్లాడుకుని, మా చెల్లెల్ని కలుసుకోవడానికి వెళ్ళాము. నేను వస్తున్నానని, మా అమ్మ తణుకునుండి వచ్చింది. వాళ్ళతో ఓ రెండు గంటలు గడిపి, మా వియ్యాలారింటికి కాచిగూడా తిరిగి వచ్చేశాము.రాత్రికి మళ్ళీ పూణే ఎక్స్ ప్రెస్ ( అదే మేము ప్రొద్దుట వచ్చిన ట్రైనే) లో ఎక్కి తిరిగి వచ్చాము. తిరుగు ప్రయాణం గురించి కూడా ఆయన ఓ బ్లాగ్గు వ్రాశారు.

    అక్కడితో వ్యవహారం పూర్తయిందనుకుంటున్నారేమో, మా అత్తగారి,అక్కయ్యగారి, కొడుకు కి, కూతురూ వాళ్ళూ పూణే లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. మేము వెళ్ళిన పెళ్ళి ముహూర్తమూ, వీళ్ళ గృహప్రవేశ ముహూర్తమూ ఒకేసారి అవడం వలన మేము వెళ్ళలెకపోయాము. తిరిగి రాగానే వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళి, వాళ్ళందరినీ భోజనానికి పిలిచారు. ఆయనా,మా 'తోటికోడలూ', వాళ్ళమ్మాయీ, అల్లుడూ, ఇద్దరుపిల్లలూ అందరూ కలిసి వచ్చారు, భోజనానికి. దీనితో మొత్తానికి మా అత్తారివైపు అందరికీ,అతిథి సత్కారం పూర్తైనట్లే !! ఆ వచ్చిన వారి కొడుకు ఒడుగుట కాకినాడలో. అదే ముహూర్తానికి మా మనవడికి అన్నప్రాశన హైదరాబాద్ లో, లేకపోతే ఆ ఛాన్సు వదిలేవారు కాదు !!

ఇదండీ సంగతి !!!

3 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

మీరు వారు చుట్టాల వరకే పరిమితం చేసారు . ఓ పది రోజుల క్రితం , మా పిల్లల డ్రైవర్ పెళ్ళికి , మా కొడుకు , కోడలికి తీరిక లేక వెళ్ళటం లేదని వాళ్ళను కోపం చేసి , మేమేమో , యాదగిరిగుట్ట దాటివెళ్ళి , ఇంకా ఆపైన ఓ పల్లెటూరు కు మండుటెండలో వెళ్ళివచ్చాము . ఏం చెప్పమంటారు లెండి . ఇది చూడండి మీకే తెలుస్తుంది !

http://sahiti-mala.blogspot.com/2009/12/blog-post_11.html

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాలా కుమార్
మా వారు ఉద్ద్యోగంలో వున్నప్పుడు ఫ్యాక్టరీ వర్కర్ల ఇంట్లో పెళ్ళిళ్ళకి వీలయితే ఇద్దరం ( మా అత్తగారు మా దగ్గరవుంటే నేను వెళ్ళెదాన్ని కాదు) వెళ్ళెవాళ్ళమండీ, బాబూ, ఆ ముచ్చట తీరింది.

Unknown చెప్పారు...

పిన్ని,
మేము ఎంత తక్కువ ప్రయాణం చేస్తామంటే మా చంటివాడికి రైలులొ "bathroom" ఉంటుందని కూడా తెలియదు. మేము క్రిందటి వారాంతమే ఒక ఉపనయనానికి బెజవాడ వెళ్ళి వచ్చేము. మా వాడికి రైలు ప్రయాణం నచ్చింది.
మాకైతే ఇప్పటికీ రైలు ప్రయాణం చాలా అద్భుతమైన గ్ఙాపకాలు తెస్తుంది. యెందుకంటే మేము చాలా తక్కువ ప్రయాణించే వాళ్ళం.
ఎదైనా యెక్కువ పాళ్ళు ఉంటే మొహం మొత్తిపోతుంది...అందుకే మీకు ఈ పెళ్ళిళ్ళనీ, శుభకార్యాలనీ, ఊళ్ళు తిరగడం అంటే కొంచం విసుపే మరి...సహజం!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes