మా అత్తగారు, తన ముద్దుల కొడుగ్గురించి, కాపరానికి వచ్చిన కొత్తలోనే చెప్పారు. పాపం ఏదో విసుగెత్తి చెప్పుంటారులే అని అనుకునేదాన్ని. ఇప్పుడనుకుంటున్నాను, పాపం ఆ వెర్రి ఇల్లాలు ఎంత విసిగిపోయి చెప్పుంటారో అని! అయినా కొడుగ్గురించి, కొత్తకోడలుతో అలా చెప్తారని ఎవరైనా అనుకుంటారా, చిత్రం కానీ. నలభైఏళ్ళకి తెలిసింది, ఆవిడన్నది అక్షరాలా ఎంత నిజమో. అబ్బబ్బబ్బ... ఒక్కపనీ టైముకి చెయ్యరు. ఇంట్లోకి ఏదైనా కావలిసొస్తే, పది రోజుల ముందరి నుంచీ చెప్తే, చివరకి డబ్బా ఖాళీ అయేసమయానికి తెస్తారు. పైగా ఇంకోటీ, " పూర్తిగా అయిపోయిందా, ఇంకా కొన్ని రోజులొస్తుందా..." అనోటీ! సరుకులన్నీ నిండుకుపోతే కొంపకి దరిద్రం చుట్టుకుంటుందమ్మా, అని మా అమ్మమ్మగారు ( అత్తగారు), చెప్పిందే ఎప్పుడూ నాకు వేదవాక్యం. అంతే కాకుండా, మా ఇంట్లో అయిదుగురప్పచెల్లెళ్ళల్లో పెద్దదాన్నవటం చేత, ఈ వ్యవహారాలన్నీ, నాకూ కొద్దిగా అనుభవం ఉంది.
తణుకు లో మా చుట్టాలొకళ్ళుండేవారు లెండి, ఎప్పుడైనా మేము శలవలకి వాళ్ళింటికి వెళ్తే, ఏదో భోజనానికి పిల్చేవారు, అక్కడిదాకా బాగానేఉంది, కానీ మమ్మల్ని చూసిన తరువాత, భర్తని సరుకులకోసం బజారుకి పంపడం చూసినప్పుడు మాత్రం, అదోలా ఉండేది! పైగా మా ఎదురుగుండానే, కూరల సంచీ, సరుకుల సంచీ ఖాళీ చేస్తూ, వాటి ధరవరల పట్టిక కూడా చెప్తూండేవారు! ఆ వివరాలన్నీ విన్న తరువాత, ప్రశాంతంగా ముద్ద దిగమంటే ఎలా దిగుతుందీ? పోనీ అలాగని వాళ్ళకేమైనా డబ్బుకి ఇబ్బందా అంటే అదీ లేదూ, ఉట్టి బధ్ధకం!
పోనీ అలాగని మాశ్రీవారు డబ్బు ఖర్చుపెట్టడంలో ఏమైనా మైజరా అంటే అదీ కాదూ. ఏమిటో అది చెప్పిందీ, మనం చేసేదేమిటిలే అనుకోడం. మళ్ళీ అతిథిసత్కారాలకేమీ లోట్లేదు. దానికి సాయం విడిగా ఫ్లాట్ తీసికునుంటున్నామేమో, ఎవరినీ అడిగే అవసరం కూడా లేదు. పలకరించిన ప్రతీ వాళ్ళనీ పిలిచేయడమే. పైగా వాళ్ళు వచ్చీ రాగానే, నావైపోసారి చూడ్డం, అక్కడకి ఆమాత్రం మర్యాదలూ, సత్కారాలూ తనొక్కరికే తెలుసున్నట్టు ! ఆ వచ్చినవాళ్ళని ఉత్తినే మంచినీళ్ళిచ్చి పంపుతామా ఏమిటీ, ఏదో ఇంట్లో ఉన్న సరుకుతో నాకు తోచిందేదో, ఆదరాబాదరాగా తయారుచేయడం. మళ్ళీ ట్రే లో పెట్టి హాల్లోకి తెచ్చినప్పుడు మాత్రం నా మొహంలోకి చూస్తే ఒట్టు ! ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అందరికీ మర్యాదలు చేయాలి, ఇంట్లో ఫలానా వస్తువు తెండీ అంటే మాత్రం, తనకు తోస్తేనే కాదు తేవడం ! ఇంట్లో ఏం సరుకుందో, కూరుందో ఓ సారి చూస్తే ఏం పోయిందిటా? పోనీ తనకు ఆమాత్రం టైములేకపోతే, చెప్తేనన్నా వినాలా ? అబ్బే అదీ లేదూ.
సరుకులనే కాదు, ఎవరేనా వస్తే వాళ్ళ చేతుల్లో ఓ బ్లవుజు పీసేనా పెట్టకపోతే బావుంటుందా, ఇంట్లో చూస్తే, డ్రెస్స్ మెటీరియల్సూ. మరీ అందరికీ అలాటివి పెట్టలేముగా. ఇన్నేసి డ్రెస్స్ మెటీరియల్స్ ఎందుకండీ అంటే, సరదాగా కూతురికీ, కోడలుకీ ఎప్పుడైనా పెట్టడానికి బావుంటుందీ, పైగా నువ్వు కూడా ఆ చీరలు మానేసి హాయిగా డ్రెస్సేసికో అంటూ జ్ఞానబోధలోటీ , అసలు రహస్యం ఏమిటంటే, నాకోసం చీర ఒకటే కొంటే సరిపోతుందా, దానికి మాచింగు బ్లౌజు పీసూ, లోపలేసికోడానికి మాచింగు పెట్టీ కోటూ, మళ్ళీ వీటన్నిటికీ, పీకో, బ్లౌజు కుట్టు కూలీ, అన్నీ కలిపి తడిపి మోపెడౌతున్నాయిట, అందుకోసం హాయిగా డ్రెస్సేసికో అని! మరీ ప్రయాణాల్లో ఫరవా లేదు కానీ, మనవైపు ఏ పేరంటానికో, ఈ డ్రెస్సుల్లో వెళ్తే బావుంటుందా. ఏమిటో ఆయనకి తోచదూ, చెప్తే వినరూ... ఇలా ఉంది కాపరం ......