మా శ్రీవారికి ఇంట్లో ఓ భార్య అనే ప్రాణి ఉందని అసలు గుర్తింపే ఉండదు. ఎప్పుడో దశకానికో, పుష్కరానికో గుర్తొస్తూంటాను. రాజమండ్రీ లో ఉన్న ఏణ్ణర్ధం ఫరవా లేదు, ఇంకో గతి లేక నన్నే నమ్ముకుని ఉండిపోయారు పాపం! ఊళ్ళోవాళ్ళెవరూ తిండి పెట్టరు. ముద్ద దిగాలంటే భార్యే గతి కదా! పూణె తిరిగొచ్చేసిన తరువాత అసలు లెఖ్ఖే చేయడం మానేశారు. కూతురూ, కొడుకూ ఇక్కడే ఉన్నారుగా, ఎవరో ఒకరు తిండి పెడతారులే అని ధైర్యం. లేకపోతే ఏమిటండీ, ప్రొద్దుటే బ్రేక్ ఫాస్ట్ తినేసి, మల్లాది వారిదీ, చాగంటి వారిదీ ప్రవచనాలు వినేసి, బయటకు ఏదో పేద్ద పనున్నట్లు పారిపోవడం. ఆ ప్రవచనాలు ప్రతీ రోజూ వింటున్నారు కదా, అందులో చెప్పే ఒక్క విషయమైనా వంటబట్టిందా, అబ్బే. అలాటివేవీ గుర్తుండవు.తిరిగి ఒంటిగంటా అయేసరికి,భోజనానికి తయారు. ఈ లోపులో ఇంట్లో ఒకర్తుందనే ధ్యాసే ఉండదు. పోనీ ఇంటికొచ్చిన తరువాతైనా ఏమైనా ఉధ్ధరిస్తారా అంటే అదీ లేదూ, ఎప్పుడు చూసినా బ్లాగులూ గొడవానూ. పైగా ఈ మధ్య ఇంకోటి మొదలెట్టారు. చదివేవాళ్ళని బెదిరించడం. మరీ ఎక్కువైపోతున్నాయేమో, పోనీ వ్రాయడం మానేయమంటారా అంటూ, ఎవడికిట ఉధ్ధరింపూ, అందరూ సుఖ పడతారు. దానికి సాయం, అందరూ వ్యాఖ్యలోటి -- " అయ్యో బాబాయి గారూ, మానేయకండి ..." అంటూ. ఔను వాళ్ళదేం పోయిందీ, భరించేది నేనూ. ఇంక ఆ వ్యాఖ్యలు మావారికి ఓ టానిక్కులా పనిచేసి, ఇంకా పేట్రేగిపోతున్నారు. ఏమిటో ఏదో వ్రాయాలని ఏదేదో వ్రాసేస్తున్నాను. ఈ మధ్య సడెన్ గా మా శ్రీవారికి, ఇంట్లో తనే కాకుండా ఇంకోళ్ళు కూడా ఉన్నట్టు గుర్తొచ్చేసింది. ఆయన ఏవో మిస్టరీ షాపింగులూ అవీ చేస్తూంటారు గా, క్రితం వారం లో నా పేరున రెండూ, ఆయన పేరున నాలుగూ వచ్చాయి. అందులో షాపర్స్ స్టాప్ వాళ్ళదానికి, ఏదో ఒక బట్ట తీసికుని, దానికి ఆల్టరేషన్ కూడా చేయించాలన్నారు. అవకాశం వచ్చిందీ, అందరికీ చెప్పుకోడానికీ గొప్పగా ఉంటుందీ, అనుకుని, నన్నూ తీసికెళ్ళారు. ఓ ఔట్ లెట్ లో పైన వేసికునే కుర్తా, రెండో ఔట్ లెట్ లో కిందవేసికునే సల్వారూ కొనేసి, వాటిని ఆల్టర్ చేయించేసి, పని పూర్తిచేసేశారు. ఎప్పటినుండో అడుగుతున్నాను, కళ్ళజోడు మార్పించండి మహప్రభో అని, వింటేనా? ఈ మధ్యన, కళ్ళజోళ్ళ షాప్ కూడా ఒక ఆడిట్ చేయవలిసొచ్చింది ( లారెన్స్ మేయో). అమ్మయ్య ఓ గొడవొదిలిందిరా బాబూ అనుకుని, నన్ను అక్కడకి కూడా తీసికెళ్ళి కొత్త కళ్ళ జోడు కూడా కొనేశారు. నా అదృష్టం కొద్దీ ఇవేవో కలిసొచ్చాయి కానీ, ఈయన కా అంత అదండి మా శ్రీవారి " గుర్తింపు సప్తాహం". మళ్ళీ ఎప్పుడో ఏమిటో....
పెద్ద మనసూ? దసరాల్లో మొన్న సప్తమి నాడు, తిథుల ప్రకారం నా పుట్టిన రోజులెండి. పైగా ఈ తీసికున్నవాటినన్నిటికీ ఓ గిఫ్ట్ ప్యాకింగు చేసేసి, చేతులో పెట్టేశారు. అదేదో అమ్మవారికి అలంకారాల్లా నాకూ, ఓ జత బట్టలూ, కళ్ళకి కొత్త జోడూ అమిరేయి!
అక్కడితో ఎక్కడయిందీ, ఈవేళ ప్రొద్దుటే లేచి, " ఈవేళ సినిమాకి వెళ్దామోయ్" అన్నారు. చెప్పేనుగా అప్పుడప్పుడు మా శ్రీవారికి వేవిళ్ళ కోరికల్లాటివి వస్తూంటాయి. ఎప్పుడో రెండేళ్ళ క్రితం, రాజమండ్రీ లో చూసిన " ఆకాశమంత" తరువాత మళ్ళీ థియేటరుకి ఎక్కడ వెళ్ళామూ? సరే ఆయన మాటెందుకు కాదనాలీ,ఎప్పుడో కానీ అడగనే అడగరు, కాదంటే మళ్ళీ సినిమా చూడకుండానే వెళ్ళిపోతే అమ్మోయ్ ! సినిమా ఏమిటీ -- " దూకుడు"-- దూకుళ్ళూ అవీ చూసే వయస్సా ఇదీ? ఏమిటో లేడికి లేచిందే పరుగూ.
గుర్తింపు సప్తాహం...
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 5, అక్టోబర్ 2011, బుధవారం
18 కామెంట్‌లు:
eppatilage chaala baga raasaru.
antelendi maa godari abbayilani amayakulini chesi adinchestunnaru meru
ఏమో.. వచ్చే యేడు "గెంతుడు.." సినిమా వస్తుందేమో..
ఈ సప్తాహం అప్పుడూ జరగొచ్చేమో...
ఏమో గుర్ర మెగరావచ్చూ...
eeroju meeru babayyagaaru naaku kala lo vatchaarandi.baavunnayi mee iddari post lu,dookudu meeku natchindaa inthaki.dasara la lo mee puttinrojaa.puttinroju Subhaakaankshalu meeku.Dasara Subhaakaanhalu mee intlo andarki.
అన్యోన్య దాపంత్యం..
హహహ బాగుందండీ! మీది కూడా రాజమండ్రినా? శ్రీవారికి వేవిళ్ళ కోరికలు బాగుంది మీ పదప్రయోగం!
ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు (మా అందరి తరుఫున)
అలా మరి గట్టిగా అంటే కష్టమే ...... మరి మీరేమో రోజూ రాయరు కదా.....
అందుకే బాబాయి గరిని మానకండీ అన్నము అంతే....
అయినా ఫరవాలేదు లెండీ మరో కామెడీ సినిమా వస్తే మళ్ళీ ఆ అవకాశం రావొచ్చేమో కదా...
చెల్లాయ్!
పుట్టిన రోజు శుభకామనలు. మీ వదినా నన్ను ఇలాగేతిడుతోంది.మరీ అన్యాయంగా ఇంట్లో పట్టించుకోటం లేదనకు తల్లీ.
@రవీ,
థాంక్స్. మరీ అంత సానుభూతి చూపించఖ్ఖర్లేదు !!
@శ్రీలలిత గారూ,
వచ్చినా రావచ్చు. ఎలాగూ ఓ ఏడాది ఆగాలి కదా !!
@అన్నపూర్ణ,
ఇదేమిటి తల్లీ? మేము కలల్లోకి కూడా వస్తున్నామంటే, పొగిడినట్లా తిట్టినట్లా? దూకుడు నచ్చింది. కామెడీ బావుంది.
@జ్యోతిర్మయీ,
ధన్యవాదాలు.
@రసజ్ఞ గారూ,
మాశ్రీవారిది అమలాపురం. మాది తణుకు.
@Maddy,
శుభాకాంక్షలకి ధన్యవాదాలు. రోజూ రాయడానికి, కంప్యూటర్ కూడా ఖాళీగా ఉండొద్దూ ?
@అన్నయ్యగారూ,
ధన్యవాదాలు.
'గుర్తింపు సప్తాహం' చాలా బావుంది :)
pogidinatte nandi.attach ayipoyaamu mee blogs tho ani artham.kalalo vatchaarani nenu aananda paddanu.maa ammammagaari vuuru kooda Tanuku.
mee iddari maatalu vintunte maa intlo maatallaane vuntaayi.
బాగున్నాయండి మీ కబుర్లు. మీ ఇద్దరి పోస్ట్స్ ఇలా చదవడం చాలా సరదాగా ఉంది. ఆయన మీద ఇలా వ్రాస్తూనే ఉండండి. కొంచం ఆలస్యం గా చెబుతున్నాను,
దసరా మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు
@లలిత గారూ,
థాంక్స్.
@అన్నపూర్ణా,
సంతోషం! తణుకు లో మీ అమ్మమ్మగారు ఎక్కడ ఉంటారు?
@సుబ్రహ్మణ్యం గారూ,
శుభాకాంక్షలకి ధన్యవాదాలు. అస్తమానూ వ్రాస్తే, అలంకరణలు చేయడం మానేస్తే కష్టం అవుతుందని ఆలోచిస్తున్నాను!!
మీ టపాలు బావు౦టాయి కాని, ఈ సారి మాత్రం మీ వారు వ్రాసిన౦త బాగా వ్రాసారు. :)
మౌళి గారూ,
ధన్యవాదాలు.
తేదీ ప్రకారం,
ఈ రోజు మీ పుట్టిన రోజట,
జన్మదిన శుభాకాంక్షలు!
రెహమానూ,
ధన్యవాదాలు.
Koncham late gaa choochaanu ee Tapaa! belated happy birthday Lakshmi gaaru.
సునీతా,
థాంక్స్....
కామెంట్‌ను పోస్ట్ చేయండి