RSS

ప్రేమనేది ఉన్నట్టా లేనట్టా...

    మా చిన్నప్పుడు, దేముడికి పూజ చేయాలంటే, పెరట్లోకెళ్ళి, ఏ మందార పువ్వులో, నందివర్ధనం పువ్వులో కోసి, దేముడి మందిరం ముందర పెట్టేవాళ్ళం. అమ్మో నాన్నగారో పూజ చేసుకున్న తరువాత ఏమైనా మిగిలితే దేముడికి మనమూ ఓ పువ్వు పెట్టేసి, మనకున్న కోరికలేవో చెప్పేసి, లెంపలెసేసికుని ఓ దండం పెట్టుకునేవాళ్ళం. పెళ్ళై కాపరానికి వస్తే ఏముందీ, పూనా లో ఓ రెండు రూమ్ములూ, దాంట్లోనే ఓ మోరీ (అదేనండి, మనవైపు అంట్లు పడేస్తామే అలాటిదన్నమాట), అక్కడే స్నానాలూ, అక్కడే వంటా వార్పూ, స్టోర్ రూమ్మూ all in one అన్నమాట. ఇంక మిగిలిన ముందరి రూమ్ములోనే, ఓ మంచం, కబ్బోర్డూ, ఓ రేడియో ( అప్పటికింకా టి.వీ లు రాలేదు ). ఇంక ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే, మా ఇద్దరి బిచాణా all in one లోకి మారిపోయేది. ఆ వచ్చినవాళ్ళెవరో నిద్ర లేచే లోపలే, నిద్ర లేవాలి. ఏమిటో ఈ జీవితం అనిపించేది. తణుకు లో ఉన్నప్పుడు ఎంత మహరాజభోగం లా గడిచేదీ? ఏమిటో అవన్నీ గుర్తు తెచ్చుకుని ఏం లాభం?

    ఏ పండగో పబ్బమో వస్తే ఎలా ఉండేది మనవైపూ, గుమ్మానికి మామిడాకుల తోరణం కంపల్సరీగా ఉండవలసిందే. మరి ఇక్కడో, మామిడి చెట్టెక్కడో వెదుక్కోవాలి. చేసికున్నంతా అని ఓ దండం పెట్టి ఊరుకోవడం. అదృష్టం కొద్దీ మా అమ్మాయి పుట్టిన వేళా విశేషం అనండి, ఫాక్టరీ వాళ్ళు కొత్తగా కట్టిన క్వార్టరోటి దొరికింది. మరీ ఇక్కడున్నంత అన్యాయం కాపోయినా, ఏదో మూడు రూమ్ములూ, ఓ కిచెనూ ఉండేవి. ఇంక పువ్వుల విషయంలో, మా శ్రీవారు ప్రతీ రోజూ ఫాక్టరీ నుంచి, పూజకి పువ్వులు తెచ్చేవారు. అవికూడా ఏమిటీ, మందార మొగ్గలు, మర్నాటికల్లా విచ్చుకునేవి. ఎంత ఓ పిల్లకి తల్లినైనా, ఇంకా అప్పటికి నిండా ఇరవైయేళ్ళైనా లేవు, ఏదో అప్పటికింకా నెత్తిమీద జుట్టులాటిదీ, మరీ సవరాల అవసరం లేకుండా ఓ జడ లాటిదీ ఉండేవి. అదేదో ఉన్నంత కాలమూ, ఓ దండో, పువ్వో పెట్టుకోవాలని ఉండదా ఏమిటీ. మా శ్రీవారికేమో అలాటి ఈస్థటిక్ సెన్సనేది ఉన్నట్టు కనిపించలేదు. ఎప్పుడు చూసినా మందార మొగ్గలే కానీ, ఇంట్లో ఓ భార్యుందీ, తనకి పువ్వులు పెట్టుకోవాలనుంటుందీ అని ఎప్పుడైనా తడుతుందా అంటే అదేం కనిపించలేదు. చివరకి చెప్పగా చెప్పగా మొత్తానికి నా పోరు పడలేక, బజారుకెళ్ళి అవేవో లిల్లీ పువ్వులూ, బంతి పువ్వులూ తెచ్చారు! ఇంక జన్మలో మళ్ళీ అడక్కుండా ! ఎప్పుడో పధ్ధెనిమిదో ఏటే ఇల్లొదిలి వచ్చేస్తే జీవితంలో ఈ పువ్వులూ, భార్యా... అనేవెక్కడ తెలుస్తాయి? ఒకటి లెండి, ఇంటినిండా పుస్తకాలు మాత్రం పుష్కలంగా ఉండేవి.

   ఏదో అప్పుడప్పుడు ఏ కథో చదివి మొత్తానికి మా శ్రీవారిలోనూ ఓ కదలికేర్పడింది. దానికి సాయం ఫాక్టరీలో ఆయన తోటి వారు, భార్యలకోసం ఫాక్టరీ అంతా రౌండ్లు వేసి, మల్లెపువ్వులూ, జాజి పువ్వులూ, గులాబీలూ కలెక్టు చేయడం మొదలెట్టడం చూశారో ఏమో, తనూ మొదలెట్టారు. ఏమొచ్చినా అతివృష్టీ, అనావృష్టీనూ... వాళ్ళ ఫ్రెండ్ల కంటే ముందరే వెళ్ళి కోసేసికోడం. ఫాక్టరీ నుండి వచ్చిన తరువాత డబ్బా తెరిస్తే, దాన్నిండా ఓ దాంట్లో మందారాలూ( దేముడికి లెండి), ఇంకో దాంట్లో గుభాళించే మల్లేమొగ్గలూ, పైగా వాటిలో వెరైటీలోటి. ఈయనకేమీ పనిలేదా, భార్యకోసం పువ్వులు కోయడం తప్పించీ అనుకోకండి, పాపం పనిదొంగ మాత్రం కాదు ఎప్పుడూ! ఏదో తనకి ఉండే తీరిక సమయం గంటలోనే ఈ నిర్వాకాలన్నీనూ. ఆ పువ్వులన్నీ మాల కట్టేటప్పటికి గంట పట్టేది. ఓ సారెప్పుడో మాటవరసకి ఆయనతో అన్నానంతే, మర్నాటినుంచీ, ఓ దండ కట్టి మరీ తెచ్చేవారు!

   మేము వరంగాం వెళ్ళినప్పుడైతే క్వార్టరు చుట్టూరా ఓ పేద్ద గార్డెనే. అన్ని రకాల పువ్వులూ, పళ్ళూ అబ్బో ఒకటేమిటి ! జీవితానికింకేం కావాలీ అనుకున్నంత సేపు పట్టలేదు, అందుకే అంటారు దేనికీ దిష్టి కొట్టకూడదూ అని.1998 లో తిరిగి పూణే వచ్చాము. అప్పటికి ఆ జడా లేదూ, ఆ పువ్వులూ లేవు! ఏదో శుక్రవారం పూజ కోసం పువ్వులూ, తోరణానికి ప్లాస్టిక్కు మామిడాకులూ, ప్లాస్టిక్కు బంతి పువ్వులూ మిగిలాయి.

    ఏదో ఊరికే వస్తున్నాయని పుష్కలంగా పువ్వులు తెచ్చేవారా ? నిజంగా నా మీద ప్రేముండే తెచ్చేవారా? ఏం లేదూ ఇప్పటిదాకా డబ్బులెట్టి ఓ మూర దండైనా తెచ్చిన పాపాన్ని పోలేదు !! ఏమిటో జీవితం అంతా ప్రశ్నలే ......

10 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

బాగుంది.

మగాళ్ళంతా తెలుసుకోవలసిన విషయాలు చాలా చెప్పారు కూడా.

అన్నట్లు, 'దేముడు' అని చాలా మంది వ్రాయటం చూస్తుంటాము. కాని అది తప్పు. 'దేవుడు' అని వ్రాయాలని విన్నపం. ( దేవ శబ్దానికి మనం డుమువులు చేర్చి తెలుగు చేసుకున్నామన్నమాట. )

sravya చెప్పారు...

meeru marinandi.
babai garu tekapote teledu ani godava.
Teste emo koni teledu ani godava.
ippudu maa varitho kuda naku oju ide godava.
oka mura puvvulu kuda tevu ani.
intha chesi naa age 23.

రసజ్ఞ చెప్పారు...

హహహ బాగుందండీ! ఎంత అదృష్టం మీకు చక్కగా మాల కట్టి మరీ తెచ్చేవారా? ఇక్కడ హాస్టల్లో పూసిన పూలను ఒక రోజు మా రూంమేట్ తో ఈ పూలు కడుతూ ఉండు నేను పూజకి మిగతా ఏర్పాట్లు చూస్తాను అంటే అది నాకు ఈ మాలలు కట్టడం రాదు బాబు నువ్వే కట్టుకో అంది! అప్పుడనుకున్నా ఏమిటో ఆడపిల్లలకి కూడా పూలు మాల కట్టడం రావడం లేదే అని కనుక ఈ విషయంలో మాత్రం మీరు మీ శ్రీవారిని మెచ్చుకోవాలండీ!

Advaitha Aanandam చెప్పారు...

మీరూ మరీ అలా అనేస్తే కష్టమేనండీ...
పాపం ఎలాగోలా తెచ్చారు కదా...
మళ్ళీ చివరన అలాంటి సంశయాలెందుకండీ....

ప్రేమ ఉండబట్టే అందరూ తీసుకెళ్తున్నారు అని తెలిసి వారు కూడా తెచ్చారు కదా పాపం...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@శ్యామలీయం గారూ,

నాటపా నచ్చినందుకు ధన్యవాదాలు. మీ సూచన ఇటుపైన అనుసరిస్తాను.

@శ్రావ్యా,

ఈమాత్రం గొడవ లేకపోతే ఎలాగ తల్లీ? ఏదో ఒకటి అంటూండకపోతే, మరీ నెత్తికెక్కేస్తారు. అయినా ముందు ముందు నీకూ తెలుస్తుందిలే, ఇంకా 23 ఏళ్ళేగా !!

@రసజ్ఞా,

ఆ పూలు కట్టడాలూ అవీ ఏదో స్వర్ణయుగం నాటివి! ఇప్పుడు ఇంట్లో ఓ కప్పు చాయ్ పెట్టమన్నా తీరిక లేదంటారు !!


@Maddy,

ఇదిగో ఇలాటి వ్యాఖ్యలు చదివే, మరీ నెత్తికెక్కేస్తున్నారు మా శ్రీవారు !!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాకూ అదే సంశయం వచ్చిందండి. అందరూ తీసుకెళ్లుతున్నారనే తీసుకొచ్చి ఉంటారేమో నని..... దహా

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ,

పాపం మరీ అలా అనేయడం ఎందుకులెండి...

Disp Name చెప్పారు...

మన ఆడవాళ్ళకి, ఎప్పుడూ సందేహమె నండీ, తెస్తే, ఫ్రీగా వచ్హింది కాబట్టి తెచ్చారు, తేకుంటె, అసలు ఇంట్లొ ఒక ఆడమనిషి ఉందన్న జ్ఞానం వీళ్ళకి ఆఫీస్ లొ గుర్తుంటుందా అన్న సందేహం ! ఈ సందేహాలన్నీ 'some' దేహం కొసమే కాబట్టి, మనం దేహాతీతం గా ఆలొచించవలె అని మా బామ్మ చెప్పేదంటె నమ్మండి సుమీ !

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

జిలేబీ,

పెద్దవారు చెప్పేది వినాలి కదా !!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes