RSS

ఏదో ఇంటిపట్టునుండాలి కానీ....

    ఏమిటో ఈమధ్యన టపాలు వ్రాయడానికే తీరికుండడం లేదు. ఇదివరకు మా శ్రీవారు ఉద్యోగం లో ఉన్నప్పుడే హాయిగా ఉండేది. ఏదో ప్రొద్దుటే ఎనిమిందింటికి " డబ్బా" ఇచ్చేస్తే ఓ గొడవొదిలేది. దాంట్లో ఓ రెండు చపాతీలూ, ఓ కూరా ఇంకోదాంట్లో పెరుగూ అన్నం తో సరిపోయేది. ఈ రిటైరయిన తరువాత అసలు తీరికుంటేనా? అబ్బాయి వాళ్ళూ ఉన్న మా ఇంటికి వెళ్తే, అక్కడ మా నవ్యా, అగస్థ్యా అసలు వదలరు. ఏ శనివారం ప్రొద్దుటే వెళ్తే, మళ్ళీ ఆదివారం రాత్రికే తిరిగి రావడం. మా సామ్రాజ్యానికి వచ్చేసిన తరువాత, ఈయనతో పడలేక, ప్రాణం పోతోందంటే నమ్మండి. తనకి కావలిసిన కూరలేవో తెచ్చుకుంటారు, అదేదో తీసుకురాలేకపోయారా అంటే, నాకు ఆ కూర పేరు నచ్చలేదూ అంటారు. ఇదేం చిత్రమమ్మా, ఎక్కడైనా పేర్లబట్టి తెచ్చుకుంటారా కూరలూ, ఇన్నాళ్ళూ ఏదో రుచి,జిహ్వ ని బట్టీ తెచ్చుకుంటారనుకునేదాన్ని, లోకజ్ఞానం లేనిదాన్నీ ఏం చేస్తాను? మళ్ళీ ఆ తెచ్చిన వాటిని తనకు నచ్చేటట్లే చెయ్యాలి. ఎందులోనో "నువ్వుపిండి" వేస్తే బావుండేదోయ్ అంటూ. ఆ నువ్వులేవో తెచ్చి నా మొహాన్న పడేయాలనే ఇంగితజ్ఞానం ఉండొద్దూ? అలాటివి గుర్తుండవు, కానీ కోరికలు మాత్రం కోకొల్లలు!

    ఈ గొడవలన్నీ పడ లేక, నాకొచ్చిందేదో చేస్తానూ, ఇష్టముంటే తినండీ, లేకపోతే ఓ వంట మనిషిని పెట్టుకుని, కావలిసినవన్నీ చేయించుకోండి అనేటంత కోపం వచ్చేస్తూంటుంది. అయినా అలా అంటామా ఏమిటీ? ఏదో ఆయన విసిగించినప్పుడల్లా ఓసారి అనుకోడం. అప్పుడెప్పుడో, తను చేసే మిస్టరీ షాపింగు వాళ్ళు, ఈయన్నేదో హోటల్ కి వెళ్ళమన్నారుట, పోనీ ఇంట్లో ఇంకో ప్రాణోటుందీ, దాన్ని కూడా తీసికెళ్తే బావుండునూ అని ఆలోచన వస్తుందా, అబ్బే, వాడెవడో వెళ్ళమన్నాడుట, ఈయనేమో తెయ్యిమంటూ ఎగరేసికుంటూ వెళ్ళిపోడమే! ఇలాటివాటికి మనం గుర్తురాము. ఏం చేస్తాం? మనుగుడుపుల పెళ్ళికొడుకులా తయారయి ఇంటికి టాక్సీ తెప్పించుకుని మరీ వెళ్ళారు! ఎక్కడైనా విన్నారా అసలు ఈ విచిత్రం? ఊళ్ళో పిల్లల్నీ, భార్యనీ పెట్టుకుని హోటల్లో ఉంటారా ఎక్కడైనా? అంతా కలికాలమండి బాబూ కలికాలం! పైగా అక్కడికేదో నేనంటే భయమన్నట్టు, ప్రతీ అరగంటకీ , నేను ఫోను చేసినట్టో, లేక తనే ఫోను చేసినట్టో ఓ టపా కూడా వ్రాసుకున్నారు.కావలిసొస్తే నా ఫోను చూసుకోండి, అక్కడ ఏమేం రాచకార్యాలు వెలగబెట్టారో నాకేం తెలుసూ నేను మాత్రం, హాయిగా ఉన్నాను ఆ ఇరవై నాలుగ్గంటలూనూ. నెలకోసారైనా ఇలాటివుంటే ఎంత బావుండునూ అనిపించింది!

   ఇంక అక్కడనుంచి వచ్చేసిన తరువాత చూడాలి. ఇంకా ఆ హొటల్ "హాంగోవర్" లోనే ఉన్నట్టున్నారు, ఇది ఇల్లు మాస్టారూ అని గుర్తుచేయాల్సొచ్చింది! ఏమిటో పాపం నన్ను ఒక్కర్తినీ వదిలేసి వెళ్ళానని గిల్టీ ఫీల్ అయ్యారేమో, ఇంతలో అప్పుడెప్పుడో వర్షం లో వెళ్ళామే ఆ హోటల్ కే మళ్ళీ వెళ్ళమని ఫోనొచ్చిందిట. అమ్మయ్య ఇదీ బావుందీ అనుకున్నారు. జేబులో డబ్బు ఖర్చు చేయఖ్ఖర్లేదూ, భార్య దగ్గర ఇమేజ్ పెంచేసికోవచ్చూ, ఇంతకంటె మంచి అవకాశం ఎలా వస్తుందీ?

    మొత్తానికి ఓ ఆటో చేయించుకుని వెళ్ళాము. కిందటిసారి అనుభవం తో తెలిసిందిగా, ఏమేం ఆర్డరు చేస్తే ఎంతంత ఇస్తారో, అయినా మనం తినే తిండికి, ఈ స్టార్ హొటళ్ళు కూడా ఎందుకూ? ఏదో సరదా పడ్డారు కదా అని వెళ్ళడం కానీ, ఆ తిళ్ళు మనకేమైనా ఎక్కుతాయా ఏమిటీ? ముందుగా అదేదో appetizers ట. మెనూ లో చూసి పోనీ అవేవో క్యాప్సికం రోల్సో, ఆనియన్ రోల్సో, కొత్తగా ఉన్నాయీ పోనీ, తెప్పిద్దామా అంటే వినరే, ఇదివరకోసారి తిన్నాం కాబట్టి అవే తెప్పిద్దామూ అంటారు. ఈ పెద్దాళ్ళిక్కడ దెబ్బలాడుకుంటున్నారూ అని చుట్టుపక్కల వాళ్ళనుకోకుండా, సరే మీఇష్ట ప్రకారమే కానీయండి అన్నాను.అసలు వచ్చిన గొడవంతా ఈయనకి పళ్ళు లేకపోవడం! ఆ పన్నీరు అనేదేదో మెత్తగా, ఆరారగా తినేయొచ్చూ అని అపోహ! మొత్తానికి అవేవో పన్నీర్ పకోడా తెప్పించాము. అసలు అవి తినేటప్పటికే కడుపు నిండిపోయింది! ఇంకా, అదేదో మెయిన్ కోర్సుట, వాటిని కూడా తెప్పించాలి. ఓ పరోఠా, వెజ్ పులావోటీ తెప్పిద్దామన్నాను. తక్కువైపోతాయేమో నోయ్ అంటూ పోనీ రెండేసి తెప్పిద్దామా అన్నారు. కావలిసొస్తే తెచ్చిన రెండూ మీరే తిందురుగాని, ఒక్కోటి చాలు అని, ఆర్డరిచ్చాము. తీరా వాడు తెచ్చినవి చూసేటప్పటికి హడలి పోయాము. ఆ పరోఠా నాలుగు ముక్కలు చేసి ఓ ప్లేటులో పెట్టాడు, ఆ పులావేదో, ఓ గిన్నెనిండా, నలుగురికి సరిపోయేలా తెచ్చాడు. వాడు తెచ్చాడు కదా అని అంతా ఎక్కడ తినగలమూ, అసలే మనవి పిట్ట కడుపులూ. తిన్నదంత తిని, మిగిలినది ప్యాక్ చేయించి తెప్పించాము.
అప్పుడే ఎక్కడయిందీ, అవేవో బెవరేజీ, డెజర్టూ కూడా తెప్పించుకోవాలిట. నాకంత ఓపికలేదమ్మా అనుకుని ఓ లస్సీ తెప్పించుకుని తాగాను. ఆయనేమో కుల్ఫీ!

    హాయిగా ఇంట్లో కూర్చుని, ఏ దొండకాయ వేపుడో, చారో పెట్టుకుని తినేయక ఎందుకొచ్చిన తిరుగుళ్ళు చెప్పండి? ఈ వయస్సులో హరాయించుకోగలమా? ఏమిటో వెళ్ళిపోతోంది....

5 కామెంట్‌లు:

Advaitha Aanandam చెప్పారు...

అప్పడికీ నేనూ అడిగానండీ..... 'మా పిన్నిగారిని తీసుకెళ్ళకుండా వెళ్తారా....?' అని

ఈ సారి తీసుకెళ్తానన్నారు కాబట్టి ఏమి అనడానికి లేకుండా పోయింది....

పోనీలెండి ఎంచక్కా కొత్త రుచులు తిన్నాక మీ వంటే కమ్మగా ఉంటుందని ఒప్పేసుకుంటారు బాబాయిగారు....
అందుకోసమైనా అప్పుడప్పుడూ ఇలాంటి అవకాశాలు రావాలి మరి.... ఏమంటారు...?

kastephale చెప్పారు...

చెల్లాయ్! పోనీ అమ్మా బావగారి చిన్న కోరిక కదా! అన్నయ్యా నువ్వూ మీబావ పక్షమే అని తిట్టకూ.

కృష్ణప్రియ చెప్పారు...

:) భలే గా రాశారు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అపిటైజెర్స్ కి ముందు మరేమీ లేవా?

మిస్టరీ షాపీంగ్స్ లో మిస్టీరియస్ విషయాలు ఏమి లేవుకదా? ఏమి లేదూ ఈ మధ్యన హోటేల్స్ ఎక్కువుగా వస్తుంటేను, చిన్న అనుమానం.... దహా

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@మాధవీ,
కొద్దిగా ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. నీవు చెప్పినట్టు అప్పుడప్పుడు ఇలాటివి జరుగుతేనే తెలిసొస్తుంది !!

@అన్నయ్య గారూ,
ఇలాటి సానుభూతి చూసుకునే, ఆయన నామాట అసలు వినడం లేదు !!

@కృష్ణప్రియా,

థాంక్స్..

@సుబ్రహ్మణ్యం గారూ,
మిస్టరీలేమిటిలెండి? ఏదో తనొక్కరూ వెళ్ళారు కదా అని ఈ సారి నన్నూరుకోబెట్టడానికి అన్నీ ఈ వేషాలు.....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes