RSS

నేను కూడా ఉప్పాడ చీర కొనుక్కున్నానోచ్...

   " ఏనుగొచ్చింది, ఏనుగు, ఉప్పాడొచ్చింది ఏనుగు, ఉప్పు నీళ్ళు తాగింది ఏనుగు" ఇది వరకటి మాట. ఇప్పుడు " చీరలమ్మా చీరలు ఊప్పాడొప్పాడా చీరలు" ఇప్పటి మాట.
మేము ఆంధ్రా వెళ్ళినపుడు ఎవరి నోట విన్న ఉప్పాడ చీరల గురించేను, అందులోను ఓ యువ హీరో పెళ్లికి పెళ్లికొడుకు తల్లి కాబోయే కోడలికి, ఊప్పాడ చిరలు ప్రత్యేకింఛి నేయించినవి స్వయంగా వచ్చి తీసుకువెళ్ళారట. అప్పటినుండి మరీ ప్రచారంలోకి వచ్చాయట.

   మేము అన్నవరం వెళ్ళి కళ్యాణం చేయించుకొని పిఠాపురం వెళ్ళి వద్దామనే ప్లాన్ వేసుకున్నాం. ఇంక మా మరదలు జయ గుడి సాయంత్రం కాని తెరవరు కదా! ఎండ సమయంలో ఉప్పాడ వెళ్ళి వచ్చేద్దామండి , అక్కయ్య గారూ అంటూ ఆ చీరల విశిష్టత , వాళ్ళ అక్క వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకన్నారని, అసలు ఆ చీర లేకపోతే ఉనికే లేదన్నట్లుగానూ, ఊరించి , ఊదరగొట్టేసి ఉప్పాడ ప్రోగ్రాం పెట్టేసింది. దానికి మా మరిది కూడ సై అనేసరికి మా వారికి ఒ.కె. అనక తప్పలెదు.అలా ఉప్పాడ లో అడుగు పెట్టామండి..

   అక్కడ ఇంటింటికి ఓ బోర్డు. ఇక్కడ ఉప్పాడ జాందాని చీరలు దొరకునని. రోడ్డుకి అటు ఇటూ ఎటు చూసిన ఇవే బోర్డులేనూ, సొసైటి కూడా వుందట కాని సాయంత్రం కాని తెరవరట.అందుకని ఓ ఇంటి లోకే వెళ్ళాము.పల్లె వాతావరణంలొ ఇంటి ముందు ముగ్గు, కూరల తీగలు, పూల మొక్కలుతో కంటికి ఆహ్లదంగా చక్కగా వుంది. రండి, రండి మమ్మల్ని ఎదర గదిలో కూర్చోబెట్టి మాకు చీరలు చూపించడం మొదలు పెట్టాడు. అబ్బాయి మహ హుషారుగా వున్నాడు.మా మరిది జయ చీరల సెలక్షను లో బిజీ అయిపోయారు. .ఏం! చీరలండీ బాబూ! ఒకదాన్ని మించి ఒకటీ,సిల్కు కాటన్, అన్నీ కూడా కంటికి యింపుగా సొంపుగా చాలా బాగున్నాయి. ముందు చీరల సొగసులు కి మురిసిపోయి ధరలు చూసి కూతురిచ్చిన ఆండ్రాయిడ్ తీసుకొని చీరలకి, పెరట్లో ముగ్గులికి, వాళ్ళ పాపకి, ఆఖరికి వాళ్ళ కుక్క పిల్లకి ఫొటో లు తీయడం మొదలుపెట్టి,ఇక్కడే దో చూడకూడనిది వినకూడనిది వున్నట్లుగా పెరట్లో మొక్కలికి ఫోటో తీయడానికి వెళ్ళిపోయారు. అక్కడికి మా జయ చెబుతూనేవుంది, ఇక్కడ తక్కువ ధరకే యిస్తారని,వెయ్యి రూపాయల నుండి ఏభై వేల రూపాయల వరకూ వున్నవి చూపించారు.ఈయన వాలకం చూసి మంచి రంగులతో చూడ చక్కగా వున్న చీరలు దోచేసిన నా చంచల మనసుని అదుపులో పెట్టుకొని రెండొ అతనితో కబుర్లు మొదలుపెట్టాను.

   కొట్టు యజమాని చెప్పిన సారాంశం ఏమిటంటే, ఈ చీరలు ఎప్పటినుండో, మగ్గాల మీద పిఠాపురం జమీందార్లకి ప్రత్యేకించి నేసేవారనీ, తేలికగా మెత్తగా ఉండే నేత చీరలూ, చక్కని రంగులతో, జరీతో తయారుచేసిన పట్టు చీరలూ-- వీటినే "జందానీ " చీరలంటారనీ, ఇదే పేరుతో "పేటెంటు" కూడా తీసికున్నారనీ చెప్పాడు.ముందుగా డిజైను వేసి,ముడి సరుకు ఇచ్చి, మగ్గాలమీద నేయిస్తారుట. ఒక్కో డిజైనుకీ రెండు, మహ అయితే మూడు చీరలు మాత్రమే. చీరకి ఉపయోగించే దారం, జరీ కూడా చూపించాడు. నేను ఓ పేద్ద పోజు పెట్టేసి, ఓ పుస్తకం తీసికుని దాంట్లో నోట్ చేసికోడం మొదలెట్టాను.మా వారేమో టక టకా ఫొటోలు తీసేయడం,ఆ కొట్టువాళ్ళైతే మహ ఇంప్రెస్ అయిపోయారు మా హడావిడి చూసి !!

   ఈ లోపులో మా మరిదీ, మరదలూ కొన్ని చీరలు సెలెక్ట్ చేసికుని, పక్కకు పెట్టారు. ఇంక మా మరదలైతే " అక్కయ్య గారూ, మీరు కూడా ఒకటి సెలెక్ట్ చేసికోండి, ఇంత దూరం వచ్చి,పైగా పెళ్ళయి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భం లో తీపి గుర్తుగా ఉంటుందీ వగైరా..వగైరా...." అని మొదలెట్టింది. ఇవన్నీ విని,మా శ్రీవారైతే తనకేమీ పట్టనట్టుగా, ఏదో పనున్నట్టుగా ఆ ఇంటి పెరట్లోకి వెళ్ళి, ఫొటోలు తీసికోడం లో బిజీ అయిపోయారు. నాకూ అనిపించింది ఔను కదూ అని. అప్పటికీ మరదలూ మరిదీ బట్టలు పెట్టారు. తణుకులో అమ్మ ఓ చీర ( ఉప్పాడ దే), హైదరాబాద్ లో మా వియ్యాలారు ఓ చీర పెట్టారు. మళ్ళీ ఇంకో చీర అంటే, ఆయన గయ్యి మంటారేమో, దుకాణం ఏమైనా పెడతావా అంటారేమో అని భయం, పైగా మా " అన్యోన్య దాంపత్య" ఇమేజ్ కి భంగం రాదూ మరి, అయినా ధైర్యం చేసేసి, పెరట్లో బిజీగా ఉన్న ఆయన దగ్గరకి వెళ్ళి మెల్లిగా మొదలెట్టాను." పోనీ మీరు కూడా ఒకటి తీసికోకూడదూ, మళ్ళీ ఇంత దూరం వస్తామా ఏమిటీ, మీకు నచ్చిందేదో తీసికోండి. ..: అక్కడికేదో ఈ నలభై సంవత్సరాలూ నాకు నచ్చింది తీసికున్నట్టు!! ఒక్కసారంటే ఒక్కసారైనా, నన్ను సెలెక్ట్ చేసికోనివ్వ లేదు. ఆ ముహూర్తం ఎప్పుడొస్తుందో ఏమో... ఏ మూడ్ లో ఉన్నారో ఏమో, మొత్తానికి తనూ ఓ చీర సెలెక్ట్ చేశారు. ఖరీదు తరువాత తెలిసింది నాలుగు వేలుట. అయిదున్నరదీ, నాలుక్కిచ్చాడు. అదండీ మా ఉప్పాడ ట్రిప్పు.

   అదేం చిత్రమో మేమిద్దరం కలిసి, 2004 లో దక్షిణ దేశ యాత్రకి వెళ్ళి వచ్చిన ప్రదేశాలన్నీ, సునామీ లో కొట్టుకుపోయాయి. ఈసారి ఉప్పాడ వెళ్ళామో లేదో, మొన్నెప్పుడో వచ్చిన భూకంపాల ధర్మమా అని, మేము వెళ్ళిన ఉప్పాడ లో కూడా సముద్రం అలలు, చాలా హడావిడి చేశాయిట. ఏమిటో పాద మహిమ !!

5 కామెంట్‌లు:

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>> " పోనీ మీరు కూడా ఒకటి తీసికోకూడదూ,....

నాలుగు వేల చీర సెలెక్ట్ చేసినందుకు ఆయన్ని అబినందించ మంటారా? నాలుగు వేలేనా అని కోప్పడమంటారా?

త్వరగా చెప్పండి. దీని మీద ఆయన టపా వేసేలోపు..... దహా.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ,

అడక్కుండా తెచ్చిన 400 రూపాయల చీరలో ఉన్న అందం,ఆనందం, అడిగి కొనిపించుకున్న 4000 రూపాయల చీరలో అగుపించలేదండీ. అందుకనే ఏం చేయాలో అర్ధం కావడం లేదు...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మీకు మీరే, ఆయన ఆయనే....... దహా.

Sujata M చెప్పారు...

"అడక్కుండా తెచ్చిన 400 రూపాయల చీరలో ఉన్న అందం,ఆనందం, అడిగి కొనిపించుకున్న 4000 రూపాయల చీరలో అగుపించలేదండీ" -

ఎంత బాగా చెప్పారండీ. హృదయానికి హత్తుకుంది ఈ మాట.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@సుబ్రహ్మణ్యంగారూ,

ధన్యవాదాలు..

@సుజాతా,

థాంక్స్...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes