RSS

స్టీలు సామాన్ల "యావ"...

   ఏమిటో కొన్నిటిని గురించి ఆలోచించినప్పుడు, ఏమిటో అంత సిల్లీగా ఎలా ఉండేవాళ్ళమో అనిపిస్తూంటుంది. పైగా ఈ రొజుల్లో వస్తున్న వస్తువులని చూసినప్పుడు మరీనూ. అయినా సరే, ఆనాటి పరిస్థితులతో చూసుకుంటే, రైటేనేమో అనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలో, మా ఆడపడుచు పెళ్ళికి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, ఆవిడన్నారూ, కావలిసినవేవో తీసికెళ్ళవే అన్నారు. అప్పటికి మా కొత్తకాపరం లో ఇడ్లీ స్టాండ్ లేదు కదా అని, ఓ అల్యూమినియం స్టాండూ, ఓ జర్మన్ సిల్వర్ పాత్రా తీసికున్నాను. అత్తారింట్లో ఓ శుభ్రమైన ఇత్తడి ఇడ్లీ పాత్ర ఉండేది. అది తీసికెళ్తానన్నా, అవిడ కాదనేవారు కాదు. అయినా, తెల్లగా ఉందికదా అని ఆ మాయదారి అల్యుమినం ఇడ్లీ పాత్ర తీసికున్నాను.

   అదేమిటో, ఆ రోజుల్లో స్టీలు సామాన్ల హవాయే ఎక్కడ చూసినా. వేసవి కాలం శలవల్లో, పుట్టింటికీ, అత్తారింటికీ వెళ్ళగానే ముందుగా స్టీల్ సామాన్ల కొట్టులోకి వెళ్ళిపోడమే! అదేమిటో ఇల్లంతా స్టీలు సామాన్లతో నింపేయాలని ఓ యావ ! మొట్టమొదట కొన్నదేమిటో తెలుసా- నాలుగ్గిన్నెల క్యారీరు! ఇద్దరు పెద్దాళ్ళూ, ఏణ్ణర్ధం ఉన్న పిల్లా ఉన్న ఇంట్లోకి అసలు అంత పెద్ద కారీరెందుకూ అనే ఆలోచన కూడా రాలేదు ! ఎవరింట్లోనూ లేనిదేదో మనింట్లో ఉండాలి. మనవైపు హొటళ్ళలో డబల్ కారీర్ అని ఇచ్చేవాడు, అంతుంటుందన్నమాట !అమలాపురం లో తీసికోడం, దారిలో తణుకు లో దిగినప్పుడు దాన్నిండా అమ్మ ఇచ్చిన ఊరగాయలు తీసికోడమూనూ. దాన్ని ఏ సంచీలోనైనా సద్దుదామంటే, పట్టదే. ఏదో మా శ్రీవారి చిరాకులూ పరాకులూ భరించి మొత్తానికి తీసికెళ్ళేవాళ్ళం. పైగా ఎప్పుడైనా మళ్ళీ మనవైపు వెళ్ళినప్పుడు, మా చెల్లెళ్ళు పోనీ తింటారులే అనుకుని, బేసిన్ లడ్డూలూ, అవి చేసికుని నాలుగు డబ్బాల్లోనూ పెట్టుకుని తీసికెళ్ళడమూ, తీరా చెల్లెళ్ళు ఆ డబ్బా తెరిచి," అదేమిటి అక్కా, చలిమిడీ, చిమ్మిలీ తెచ్చావేమిటీ, బేసిన్ లడ్డూలన్నావు?" అనడమూ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఆంత శ్రమపడీ చేసిన బేసిన్ లడ్డూలు, ఎండలకి కరిగిపోయి, పాకం రూపుకొచ్చేసేవి! మా నాన్నగారు, పాపం అమ్మాయి బాధపడిపోతుంది అనుకుని, " ఏమి పరవాలేదు, కొంచం గట్టిపడ్డ తరువాత ఉండ చుట్టుకుంటే సరీ.." అని సద్దిచెప్పేవారు!

   ఇంట్లోకి డైనింగ్ టేబులోటి కొన్నారు ( ఇప్పటికీ ఉందండోయ్!), ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే, కూరా, పప్పూ వగైరాలు టేబిల్ మీదే పెట్టుకోవాలని మనసూ !! దానికోసం ఓ నాలుగ్గిన్నెల గుత్తీ !! వాటిని పూర్తిగా నింపితే పదిమంది దాకా సునాయాసంగా భోజనం చేయొచ్చు, అంత ఉంటుందది !! ఇళ్ళల్లోకి అంతంత గుత్తులు ఎందుకు చెప్పండి? అక్కడితో పూర్తయిందా, మా శ్రీవారికి భోజనం పంపడానికి మళ్ళీ ఇంకో మూడు గిన్నెల క్యారీరూ. ఫాక్టరికి టిఫిన్ తీసికెళ్ళే కుర్రాడు, అవసరార్ధం ఆ క్యారీరుని తాకట్టు పెట్టేశాడు. ఇంకో మూడు గిన్నెల క్యారీరు కొనాల్సొచ్చింది. అలాగే ఇంకోసారి రెండు గిన్నెల క్యారీరూ. ఇంట్లో ఆస్థిపాస్థులున్నా లేకపోయినా, ఎక్కడ చూసినా కారీర్లే ! ఇంత హడావిడిలోనూ ప్రయాణాల్లో మంచినీళ్ళకోసం ఓ స్టీలు మరచెంబోటండోయ్...

   ఇవన్నీ కాకుండా, బట్టలకి స్టీలు సామాన్లిచ్చే మనిషి దగ్గర, ఇంట్లో పాత చీరలూ అవీ ఇవ్వడం, ఓసారి నాలుగు డబ్బాల సెట్టూ, ఇంకోసారి ఇంకో గిన్నెల సెట్టూ. ఎప్పుడూ ఆ మనిషితో గొడవే. ఇంకొంచం బట్టలిమ్మనేది! ఒక్కోసారి శ్రీవారి పాంట్లూ షర్టులూ సద్దవలసివచ్చేది. ఓసారి చూసుకున్నారు, ఏదో తేడా వస్తోందీ అని, అంతే, నాకు " పాతగా" కనిపించే బట్టలన్నిటికీ తిరిగి ప్రాణం పొసేసి, ఇస్త్రీ చేసెసికుని దాచేసుకునేవారు ! ఏమిటో అర్ధం చేసికోరూ, హాయిగా స్టీలు సామాన్లు కొనుక్కోక, ఆ పాత బట్టలనే పట్టుకుని వేళ్ళాడేవాళ్ళని ఏం చేస్తాం లెండి!! మా చుట్టుపక్కలున్న తెలుగువాళ్ళు కూడా, " మీకైతే బట్టలకి మంచిగా ఇస్తుందండీ.." అని వాళ్ళ బట్టలుకూడా మా ఇంట్లోనే ఉంచేవారు !

   మంచినీళ్ళకి డ్రమ్మూ,టేబిలు మీద పెట్టుకోడానికి జగ్గులూ, అత్తగారి మడినీళ్లకి ఓ చిన్న బిందె, ఒకటేమిటీ అంతా "వస్తుభ్రాంతి" ! ఇంకోటేమిటంటే, ఏదో ఫలానా వస్తువు తీసికుంటే బావుంటుందీ, అని అనడం ఏమిటి, పక్కింటావిడ బజారుకెళ్ళి తెచ్చేసికోడం, హాత్తెరీ మన కంటే ముందర వాళ్ళింట్లోకి వచ్చేసిందీ అని తెచ్చేసికోడం, పైగా వాళ్ళింట్లో దానికంటే పెద్దది! ఆ పోటీ ప్రస్థానం లో పాతిక ఇడ్లీల స్టాండూ, దానికోసం ఓ స్టీలు కళాయీ. వీటికి సాయం ఏ స్టీలు కొట్టువాడో "నెలకి పదిరూపాయల" స్కీము పెట్టాడని తెలిస్తే చాలు, దాంట్లో చేరిపోడమూ, మనవైపు వెళ్ళినప్పుడు చవకలో వచ్చెస్తున్నాయీ అని, ఏది పడితే అదే కొనేయడం. ఇంట్లో ఎంత స్టీలు సామానుంటే అంత ఫాషనూ, స్టేటస్సూనూ !! మా చుట్టం ఒకావిడ ఎంతదాకా వచ్చిందంటే, " మా ఆయన రిటైరయినప్పుడు వచ్చే డబ్బులతో స్టీలు సామాన్లు కొనేయాలీ.." అనే వరకూ !!

    ఆ రోజుల్లో పెళ్ళిళ్లనండి, లేక ఇంకోటేదో ఫంక్షననండి, ఒట్టి చేతులతో కాకుండా, ఏదో ఈ స్టీలు కప్పో, గ్లాసో, ప్లేటో ఇచ్చేవారు. పైగా ఒకళ్ళు కప్పూ, ఇంకోళ్ళు ప్లేటూ, వీటికి వంతులోటీ! ఆ రెండో ఆవిడ రాకపోతే ఆ సెట్టు పూర్తయేది కాదు. మనం కొన్న వస్తువులమీద పేరు వేయించుకోడం, వాటితో ఓ ఫుటో తీయించుకోడమూ ముఖ్యం !! రైళ్ళల్లో భోజనానికి అదేదో "గదులు" ఉన్న ప్లేటు చూడ్డం, అంతే వెళ్ళి తెచ్చేసికోడం.

   ఏమిటో ఇప్పుడు అనుకుంటే సిల్లీగా కనిపించొచ్చు కానీ, ఈరోజుల్లో " బఫే" ల్లో ఇస్తున్న ఆ "గదుల" కంచాలు మా ఇంట్లో నలభై ఏళ్ళ క్రితమే కొనుక్కున్నామోచ్ ! స్టీలు సామాన్ల మీద మోజు లేని, మన తెలుగువారెవరైనా ఉంటారా అసలూ... మా మరిది నలభై ఏళ్ళ క్రితం పూణే వస్తూ తెచ్చికున్న స్టీలు సబ్బు పెట్టి, ఇక్కడ మర్చిపోయాడు. ఇన్నేళ్ళనుండీ మా శ్రీవారు తిరిగి ఇవ్వనూ లేదూ, తను అడగడం మానా లేదూ...

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

So true. I remember my mom and her friends discussions on this topic. Nice memories.

Chaitu

Sujata M చెప్పారు...

ha ha ha ha '

Chala enjoy chesanu ee post. thanks andi.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మా ఇంట్లోను ఇదే సంగతి. దహా.

sree చెప్పారు...

same to same in every home

sree చెప్పారు...

same to same in every home

అజ్ఞాత చెప్పారు...

maa atta garu kuda ilane andi.
asalu intlo ekkada chusina steel samanule.
ippatiki kontu vuntaru.
Illu maralante vuntundi cinema maaku.
avida evi pack cheyaru kada,chesedi meme.
maa aayana eppudu antu vuntadu,edo oka roju santa ki teesukelli ammestan u ani.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@చైతూ,

ధన్యవాదాలు..

@సుజాతా,

థాంక్స్..

@సుబ్రహ్మణ్యం గారూ,

ఇలాటివి లేని ఓ "తెలుగిల్లు" చూపించండి...

@శ్రీ,

ఔను కదూ...

@శ్రావ్యా,

ఔనమ్మా! అలాగే ఉంటుంది... ఇలాటివి దాచుకోవాలంటే ఓ "స్వంత"ఇల్లుంటే సరీ.... ఇంక "సంత" కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు..!!!

అజ్ఞాత చెప్పారు...

hi Aunty,
all your posts are wonderful.
thanks
sneha.

Ruth చెప్పారు...

సూపర్ అసలు !!!
ఈ రోజుల్లో ఆ స్టీలు స్థానంలో ప్లాస్టిక్ వచ్చింది అంతే తేడా అల్లా. పైగా, టప్పర్వేరులు, తొక్కవేరులు అంటూ డబ్బులు కూడా తెగ తగలెయ్యటం... కాని ఏం చెస్తాం, అదో బలహీనత అంతే. ఇప్పటికీ గ్రొసరీస్ కి వెళ్ళీనప్పుడల్లా... ఆ డబ్బల సెట్లు, చిన్న చిన్న ప్లాస్టిక్ బౌల్స్... చూస్తుంటే భలే ముద్దొస్తూ ఉంటుంది.
కాని, టపా అంతటికీ సూపర్, ఆ ఫొటో :) చాలా చాలా బాగుంది.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@స్నేహా,

చాలా చాలా సంతోషమమ్మా నా టపాలు నచ్చినందుకు.

@రూత్,

ధన్యవాదాలు. నిజమే ఈరోజుల్లో అంతంత డబ్బులు పోసి కొనుక్కుంటున్న టప్పర్ వేర్లకంటే నా స్టీల్ సామాన్లు ఏం తక్కువయ్యాయి? ఇంక ఫొటో అంటారా, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తీయించుకున్నది. పాత ఫొటోలు ఎప్పుడూ మధుర జ్ఞాపకాలే... నేను కట్టుకున్న చీర మాత్రం, మాశ్రీవారు పుట్టినప్పుడు, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అమ్మమ్మ గారిచ్చిన చీరట ( ఇప్పటికీ నా దగ్గర ఉంది !!!!)

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes