RSS

ఎరక్కపోయి ఉండమన్నాను ఇంట్లో...

    మా శ్రీవారు నామీద "అలిగినప్పుడు", ఇంట్లో ఉన్న తెలుగు పత్రికలు చదివేస్తూ ఉంటారు. నా అదృష్టం బాగోపోతే,తను చదివినదేదో మహ బాగా నచ్చేస్తూంటుంది. ఆ ప్రకరణం లో భాగంగా, నిన్న వచ్చిన "స్వాతి" పత్రిక లో వస్తున్న వంశీ గారి " రంగులరాట్నం" సీరియల్, జరిగిన కథ చదివేసి, అప్ డేట్ చేసెసికున్నారు. ఒక్కసారి ఆ కథలో ఆయన వ్రాస్తున్న, రాజోలు, మల్కిపురం, జగ్గంపేట, మానేపల్లి, పెదపట్నం పేర్లు చూసేసరికి, నామీదున్న అలక కూడా పోయింది. ఆ ఊళ్ళన్నీ తిరిగారుగా చిన్నప్పుడు, దానితో ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. అబ్బ ఎంత బాగా రాస్తున్నారోయ్, పాప జ్ఞాపకాలన్నీ గురొచ్చేస్తున్నాయి అన్నారు. ఏదో పాత జ్ఞాపకాలతో సరిపోతే బాగానే ఉండేది. కానీ ఆయనకి ఆరోజుల్లో వాళ్ళ అమ్మగారు చేసినవేవో గుర్తొచ్చేస్తూంటాయి. అక్కడే వస్తుంది అసలు గొడవంతా..

   ఇదివరకెప్పుడో చేసేదాన్ని, "చంద్రకాంతాలు" అని ఓ పిండివంట. దానికి ఓ కొబ్బరికాయ కూడా ఉండాలిలెండి. ప్రతీ శనివారం కొబ్బరి కాయ కొడుతూంటారు. కానీ ఎప్పుడూ కొబ్బరి రైస్సూ, లేకపోతే శనివారం ఫలహారాలకి పచ్చడి చేయడానికే సరిపోయేది.అప్పుడప్పుడు అడిగేవారులెండి, ఓసారి మళ్ళీ చంద్రకాంతాలు చెయ్యకూడదోయ్ అంటూ. చెప్పానుగా ప్రతీ రోజూ బ్రేక్ ఫాస్ట్ తినేసి, ఏదో వంక పెట్టేసి, మనవణ్ణి చూడ్డానికి పారిపోతూండేవారు. For a change.. ఈవేళ ఏమీ పనిలేదూ, ఇంట్లోనే ఉంటానూ అని ఇంటిపట్టునే ఉండిపోయారు. తెలుగు వారపత్రికలు నిన్ననే తెచ్చేశారులెండి. పైగా వాటిలో "దాపరికం" ఓటీ. తెచ్చినప్పుడు చెప్పొచ్చుగా, అవి నేనెక్కడ చదివేస్తాననో తలగడ కింద పెట్టుంచారు. ఏం లేదూ, శనివారాలు తెచ్చే పత్రికలు ఓ రొజుముందే తెస్తే, వాటిని చదివేసి " చదవడానికి ఏమీ లేదండీ." అని అంటానేమో అని భయంట ! ఇంక న్యూస్ పేపర్లైతే కొనడమే మానేశారు. ఆ మధ్యన ఓ టపా కూడా వ్రాశారు.

    ఈ శనివారం హాయిగా అలవాటు ప్రకారం ఆయన్ని బయటకు వెళ్ళనిచ్చినా బావుండేది. అనవసరంగా నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. నిన్న తెచ్చిన "స్వాతి" లో శ్రీ వంశీ గారి రంగులరాట్నం లో ఆయన ప్రస్తావించిన " మొక్కా మొక్కా మొలిచిందంటా ఏం మొక్కా మొలిసిందంటా రాజుగారి దొడ్డిలోనూ జాం మొక్కా మొలిసిందంటా... అమ్మా అక్కల్లారా, చంద్రగిరీ భామల్లారా, గొబ్బీయల్లో..."

   పాట చదివేసరికి, మా శ్రీవారు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. చెప్పానుగా ఆయనకి ఇలాటి వాటిల్లోకి వెళ్ళారంటే ఏదో " గొంతెమ్మ కోరికలు" వచ్చేశాయే.. పైగా ఎక్కడో ఎప్పుడో విన్న సామెతలు కూడా గుర్తొచ్చేస్తూంటాయి. "చెడిన కాపరం ఎలాగూ చెడిందీ, చంద్రకాంతలైనా చెయ్యవే భామా.."

అన్నదెప్పుడైనా విన్నావా అంటూ, వంటింట్లోకి వచ్చేశారు. ఇప్పుడు మన కాపరానికేమొచ్చిందండీ బాగానే ఉన్నాము కదా అంటే. అబ్బ అలా అని కాదోయ్, మాటవరసకన్నాను, అంటే అందులోని " చంద్రకాంతాలు" చేయమని గుర్తుచేయడం అన్న మాట! ఏం చేస్తానూ తప్పుతుందా. ఇదిగో దాని ఫలితమే పైన పెట్టిన ఫొటో. చూడ్డానికే కాదు, తిండానికి కూడా బాగానే ఉందోయ్ అన్న ఒక్క మాట చాలదా మరి, సంతోషించడానికి...

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Emandoy,

evarandee mee pathi devulu?


Cheers
zilebi.

Mauli చెప్పారు...

నవ్వి కల్లెమ్మట నీళ్ళు వచ్చాయండీ, పన్లో పని రెసిపి కూడా ఇచ్చెద్దురూ

శ్రీలలిత చెప్పారు...

అబ్బ...చంద్రకాంతలే!...
మీ ఓపికకి నా జోహార్లండీ..
(మనలో మన మాట.. చెయ్యడం చాలా కష్టంట కదా...)

నాగేస్రావ్ చెప్పారు...

ఏదీ రెసిపీ కూడా ఇస్తారేమోనని చూశాను!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@జిలేబీ,

మీ అందరికీ తెలిసినాయనే మా శ్రీవారు....

@మౌళి,

ధన్యవాదాలు...రెసిపీ త్వరలో వ్రాస్తాను...

@శ్రీలలిత గారూ,

కష్టమే అనుకోండి. అయినా పాపం ఆయన అడిగారు కదా అని చేశాను....

@నాగేస్రావూ,

కొద్దిగా వెయిట్ చేయండి...

Advaitha Aanandam చెప్పారు...

పొనీలేండి చేసినవి తినేసి వదిలేయకుండా చక్కగా పొగిడారు కదా.... సంతోషమే....

కానీ మీ ఓపికకు ఇవే పదివేల జోహార్లు...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాధవీ,

ఏం చేస్తానమ్మా తప్పుతుందా మరి...

Advaitha Aanandam చెప్పారు...

:-)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాధవీ,

థాంక్స్...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes