RSS

చంద్రకాంతలు

   ఆధునిక సదుపాయాలయిన గ్యాస్ స్టౌ, మిక్సిలు, లేని అరోజుల్లో అంత శ్రమ పడి , కమ్మగా చేసిన అమ్మ చేసిన పిండివంటలు ఇప్పటికి గుర్తుచేసుకుంటున్నారంటే ఆ వంటల్లోని రుచికంటె, -- అనురాగం, ప్రేమ, మమత రంగరించి అందించిన "ఆమ్మ". అంతే! అదే భావనతో కూడిన అణకువ, ఆప్యాయత తో అందుకున్న పిల్లలున్నంతవరకూ పాత పిండివంటలు ఇంకా అక్కడక్క్డడ ఘుమఘుమలాడూతూనేవుంటాయి. అలాంటివే " చంద్రకాంత"లు.

   కావలసినవి పెసరపప్పు---- 1 గ్లాసు లేక 1 కప్పు పంచదార----- 1 గ్లాసు లేక 1 కప్పు పచ్చికొబ్బరి---- 1 చెక్క ( తురుము కోవాలి) నెయ్యి ------- వేయించేందుకు జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి, ఇష్టమైతే కొద్దిగా పచ్చ కర్పూరం.

   1. ఓ గంటసేపు నానబెట్టిన పెసరపప్పుని కడిగి నీరు పోయకుండా ' మిక్సి' లో మెత్తగా రుబ్బుకోవాలి.( పెసరట్లకి రుబ్బుకున్నట్లుగా)

   2. పచ్చికొబ్బరి తురుము, పంచదార, పెసరపిండిలో కలిపి ( బాణలి కాని, దళసరి పాత్రలో కాని) " స్టౌ" మీదపెట్టి ఆడుగంటకుండా హల్వాకి కలిపినట్లుగా కలుపుతూ వుండాలి. ఓ పదిహేను నిమిషాలకి ముద్దలా అవుతుంది.దానిలో జీడిపప్పు, ఏలకులపొడి, కర్పూరం కలిపి ,"స్టౌ" కట్టేసి ఓ నిమిషం అలాగే వుంచాలి.

   3. తెల్లటి శుభ్రమైన కొంచెం దళసరి బట్ట ని తడిపి దాన్ని ఓ పీట మీదో చెక్క మీదో పరచి , దాని మీద పెసరపిండిమిశ్రమాన్ని వేసి జాగ్రత్తగా ఒత్తుకోవాలి. తడి రుమాలుతో ఒత్తుకుంటే చెయ్యి కాలకుండా వుంటుంది. మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఒత్తుకొని, చల్లారిన తరవాత మనకి కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.( డైమండ్సుగా, లేక గుండ్రంగా)

   4. బాణలిలో నెయ్యి వేసి ( ఇంచిమించుగా పప్పు ఎంత వేస్తామొ నెయ్యి అంత పడుతుంది),మరిగాక, కోసిన ముక్కలు వేయించుకోవాలి.జాగర్తగా బంగారం రంగు లోకి రాగానే తీసేయాలి. అంతే!

    అప్పుడప్పుడు ఇలాంటి పాతపిండివంటలు చేసి ఈ తరం వారికి రుచి చూపిస్తే బాగుంటుంది కదూ!!!

4 కామెంట్‌లు:

Advaitha Aanandam చెప్పారు...

చాలా బాగా చెప్పారు .... అమ్మ చేతి కమ్మదనం ఇంక ఎందులోనూ ఉండదు...

మీరు ఈ సంవత్సరం అదేదో Historic Announcement చేసారని చదవగానే భయపడిపొయాను ఆవకాయ పెట్టరేమో అని...

అదేంటో నేను ఎప్పుడో ఒకసారి మీ ఊరు వస్తే మీ ఆవకాయ అడిగి మరీ పెట్టించుకోవాలి అనుకుంటూ ఉంటాను.... మరి అలాంటప్పుడు మీరు పెట్టడం లేదు అని తెలిస్తే ఇక నా గతేమి కాను...

కానీ పూర్తిగ చదివాక అర్థం అయ్యింది... ఆ Historic Announcement ఈ సంవత్సరానికి వర్తించదు అని

మీరు మళ్ళీ బాబాయిగారితో అనకూడదు కానీ అది చదివి మొదటగా సంతోషించింది నేనే తెలుసాండీ...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాధవీ,

ఏమిటో అంతంత మంచి కాయలు చూసి ఊరుకోలేకపోయాను. ఓ సీసాడు పెట్టేశాను. పైగా మొట్టమొదటిసారిగా మంచి కండ, టెంక ఉన్న కాయలు తెచ్చారాయే...బై దవే ఎప్పుడూ వస్తూంట మా ఊరు ( పూణె)?

Advaitha Aanandam చెప్పారు...

అంతేలెండి అంత మంచి కాయలు చూస్తే మనసాగదాయే....
నేనూ ఇక్కడ ఏవో రెండు ఒక మోస్తరు కాయలతో పెసరావకాయ పెట్టాను..... బాగానే కుదిరింది అన్నారు...

ఎప్పుడు వస్తామో తెలీదు కానీ వస్తాము తప్పకుండా....
వచ్చే ముందు బాబాయిగారికి మెయిలు చేసి ఫోను నెంబరు తీసుకుంటాను...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాధవీ,

మరి త్వరగా వచ్చేయండి....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes