RSS

సూకరాలు

    మా శ్రీవారు ఈమధ్యన అదేదో టపా వ్రాసి, అక్కడకి ఆయన్నేదో హింసించేస్తున్నానని ఊరంతా టముకేసుకుంటున్నారు. ఏదో ఆరేసిన బట్టలు మడత పెట్టమనడం కూడా ఓ పేద్ద పనేనా? ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మనం అంటే అదే housewife లు చేసే పనుల్లో ఇవేపాటివండీ? ఆక్కూరలు మాత్రం వారంలో రెండు మూడు సార్లైనా కావాలీ, పైగా అందులో "కాడలు" వచ్చి గొంతుక్కడ్డం పడ్డాయని గోలోటా? అందరిలా గా పళ్ళు తీయించేసిన తరువాత డెంచెర్లు పెట్టుకోవద్దని ఎవరు చెప్పారుట? పాపం ఆ AFMC డాక్టరుగారు, శుభ్రంగా అవి తయారు చేసి ఇస్తే, గత పదేళ్ళనుండీ, ఓ స్టీలు డబ్బాలో పెట్టి పూజ చేస్తున్నారు. వేషాలు కాపోతే ఏమిటిట ఇవీ?

   ఈ మధ్యన పిల్లలు పెట్టిస్తున్నారు కదా అని ఎడాపెడా ఐస్ క్రీమ్ములు లాగించేశారులెండి. ఏదో అప్పుడప్పుడైతే పరవాలేదు కానీ, వారంలో మూడేసి, నాలుగేసి సార్లు తినెస్తే ఎలాగ? ఏదో ఓ తీరువుగా తింటే పరవాలేదు కానీ, ఛాన్సు దొరికిందికదా అని పిల్లలతో వెళ్ళినప్పుడల్లా, వాళ్ళతో సమానంగా, పోటీ పడితే ఎలాగ? పైగా " నాకు పళ్ళే లేవుగా ఊరికే మింగేయడమేకదా, ..." అని జ్ఞానబోధోటీ? అలాగని పొద్దస్తమానూ మింగేస్తే హరాయించుకోవద్దూ? వదిలింది పైత్యం. పళ్ళంటే లేవుకానీ, గొంతుకోటి ఉందిగా, అది కాస్తా ఛోక్ అయిపోయింది. మామూలుగా తినే తిండి కూడా తినడానికి కష్టం అయిపోయింది. గొంతుకలో నొప్పిగా ఉందోయ్.. అంటూ, మామూలుగా తినే ఇడ్లీలు కూడా తినలేకపోయారు. పోనీ మెత్తగా ఉండి పోన్లే ఏదోలా తింటారూ అని, ఓ కప్పులో చారూ, ఓ కప్పులో పెరుగూ వేసి, దాంట్లో నానపెట్టుకు తినండి పోనీ, అని ఈమధ్యన అలా ఇస్తున్నాను. రుచి మరిగినట్టున్నారు, ఇదే బావుందిలే అనుకుని, ఇంక ప్రతీ రోజూ ఇదే యావ!

   భోజనం చేసేటప్పుడు కూడా ఇదే రంధి! అన్నీ మెత్తగా జావలా చేయాలి. ఉన్నదా బిక్కుబిక్కుమంటూ ఇద్దరం. మళ్ళీ అందులో ఒకరికి జావ. ఆ మాయదారి జావ, ఏదో లంఖణం చేసినప్పుడైతే పరవాలేదు కానీ, బ్రేక్ ఫాస్టు కీ, లంచ్ కీ, డిన్నరుకీ కూడా జావే అయితే ఎలాగండి బాబూ? పోనీ ఇంట్లో ఆమాత్రం చేసిపెడితే, ఏదో పుణ్యం పురుషార్ధం అనుకుని గత వారం రోజులుగా ఇదేనండి బాబూ. వీటితో ఎక్కడ అయిందీ, మామిడిపళ్ళు కూడా, ముక్కలు మింగలేరుట, అందుకోసం వాటిని ముక్కలుచేసి, మిక్సీలో తిప్పి ఓ కప్పులో పోసి ఇవ్వాలిట. పన్లోపని దాంట్లో క్రీం కూడా వేస్తే బాగుంటుందని ఓ సలహా కూడానూ. తప్పుతుందా మరి. మా అగస్థ్య కి కూడా పెట్టొచ్చు కదా అని, అలాగే చేశాను. ఏదో మామిడిపండంటే ఒకటో రెండో సరిపోయేవి. ఇలాగ గుజ్జు తీసి క్రీం వేసి తయారుచేయాలంటే ఒక్క పండుతో ఏం సరిపోతుంది? మూడో నాలుగో పళ్ళు కావాలి, వాటిని ముక్కలు చేయాలి, వీటన్నిటినీ మిక్సీలో వేయాలి, అన్నీ పూర్తయిన తరువాత, ఆ మిక్సీ జార్లన్నీ కడుక్కోవాలి. ఇవన్నీ ఎవరు చేస్తారుట? ఇలాటివి కనిపించవు. పైగా ఓసారి ఆరేసిన బట్టలు మడతపెడితే, అదేదో outsourcing ట !

   పోనీ ఏదో ఆరారగా తింటారూ అని చేసిపెడుతూంటే, ఈమధ్యన మా కోడలు అన్నగారూ, వదినా సింగపూర్ నుంచి వచ్చారని చూడ్డానికి వెళ్ళాము. ఏదో అందరూ కలిసి భోజనాలు చేద్దామని, పిలిచారు. పానీపూరీలు ఇంట్లోనే తయారు చేశారు. నేనేమో అగస్థ్యతో ఆడిస్తూ ఇంకో గదిలో ఉన్నాను. తీరా హాల్లోకి వచ్చి చూద్దునుకదా, హాయిగా చిద్విలాసంగా, ఆ పూరీలు చిల్లు చేసేసికుని, ఓ స్పూన్ తో వాటిలో ఆ పానీ ఏదో పోసేసికుని, లాగించేస్తున్నారు! అయ్యో అయ్యో ఇదేమిటండీ, మీకు గొంతుకు నొప్పిగా ఉందన్నారూ, అలా పూరీలు తినేస్తున్నారేమిటీ, ఏ పూరీ ఏనా గొంతుక్కడ్డంపడితే కష్టం కూడానూ అని నాగోల. అసలు ఆయనకి పట్టినట్టేనా?

    దీనర్ధం ఏమిటీ అంటే, ఈ "సూకరాలు" అన్నీ ఇంట్లోనే అన్నమాట. బయటకి వెళ్ళినప్పుడు ఇలాటివేమీ గుర్తుకురావు. ఇంటికొచ్చేసరికి మళ్ళీ మొదలూ! చేసిపెట్టేవాళ్ళుంటే కావలిసినన్నీ ! ఏదో నూటికీ కోటికీ ఓసారి, ఆక్కూరలు బాగుచేయడం, డబ్బాల్లో పంచదార, చాయ్ పత్తీ నింపడం మొత్తం నలభై ఏళ్ళలోనూ, ఈమధ్యనే మొదలెట్టారు, పైగా ఏదో ఆయన్ని ఏదో కష్టపెట్టేస్తున్నట్టుగా టపాల్లో వ్రాసి, అందరి సానుభూతీ సంపాదించడం కాకపోతే, దీన్నేమంటారు.....

4 కామెంట్‌లు:

Advaitha Aanandam చెప్పారు...

చాలా బాగా చెప్పారు..... నేనూ అదే మాట అన్నాను... ఏవో చిన్న చిన్న పనులు చేసి మళ్ళీ దానికి ఆ పేరెందుకూ అని.... చెబితే వింటారా కానీ..... మీరు చాలా మటుకు అన్నీ నోటి దాకా అందిస్తున్నారని అర్థమైంది.... కాకపొతే బాబాయిగారు కూడా అప్పుడప్పుడు ఆ పని ఈ పని అందుకుంటున్నారు కాబట్టి ఈ సారికి వదిలేయండి....

కాకపొతే... హన్నన్నా...! పానీపూరీలు మాత్రం టకాటకా తినగలిగి , ఇడ్లీలకి ,మరీ మావిడిపండ్లకి కూడా ఇలా అంటే కష్టమే..... ఈ విషయంలో మటుకు నేను మీ వైపే...

జ్యోతిర్మయి చెప్పారు...

నిజమేనండీ..నేనూ మీ పక్షమే..

అజ్ఞాత చెప్పారు...

:)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@మాధవీ,

పోన్లే మీకైనా నాబాధ అర్ధం అయింది.. థాంక్స్...

@జ్యోతిర్మయీ,

థాంక్స్....

@అన్నయ్యగారూ,

ఏమిటీ అదేదో చుక్కలు పెట్టేసి వదిలేశారూ... ఒప్పుకున్నట్టా లేనట్టా... ఏమిటో ఊరికే ఇరుకున పెట్టేస్తున్నాను కదూ....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes