ఈవేళ అంతా బిజీ బిజీ.. మా శ్రీవారి చుట్టాలొకరు ముంబై నుంచి ఫోను చేసి, ఈవేళ, మా ఇంటికి వస్తామన్నారు. చుట్టరికం ఏమిటంటే, మా శ్రీవారి, పెదనాన్నగారి, మనవరాలు, అంటే మాకు మేనకోడలన్నమాట! ఆవిడ తన అన్నగారి ( మా శ్రీవారి మేనల్లుడు) కూతురిని, ఇక్కడ భారతీ విద్యా భవన్ లో పై చదువులకి చేర్పించే సందర్భం లో, వదినగారినీ, మేనకోడలునీ తీసికొచ్చారు. ఏమిటో అంతా కన్ఫ్యూజింగు గా ఉంది కదూ! నాకూ అంతేలెండి. అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులే కానీ, ఎప్పుడైనా వీళ్ళ చుట్టాలని కలిసిందే లేదు. కానీ అదేమిటో ఈ మధ్యన మా శ్రీవారి చుట్టాల పిల్లలు, ఉద్యోగ రీత్యానో, చదువు నిమిత్తమో పూణె వస్తున్నారు. పూణె అనేటప్పటికి ఈయన గుర్తొచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా, గత సంవత్సరంలోనూ, మా వారి చుట్టాలు చాలామందే వచ్చారు. ఇదీ బాగానే ఉందిలెండి, కనీసం ఇన్నేళ్ళకి చుట్టాల పరిచయం అవుతోంది.
అలా వచ్చినవారిలో ఈవేళ వచ్చినవాళ్ళన్నమాట.ఈయన దారిన ఈయన బయటకెళ్ళిపోతే, మళ్ళీ నాకు కష్టం అవుతుందని, బయటకు వెళ్ళొద్దన్నాను ఈవేళ్టికి. అదృష్టం బాగుండి ఒప్పుకున్నారు. ఆ వచ్చేవాళ్ళు భోజనానికే వస్తారో, లేదా ఊరికే చూసేసి కబుర్లు చెప్పి వెళ్ళిపోతారో, ఎంత సేపుంటారో అన్నీ సందేహాలే. "నీకు ప్రతీ దానికీ అనుమానాలే... అనుమానం ముందు పుట్టి తరువాత నువ్వు పుట్టుంటావు..", అని ప్రతీసారీ చివాట్లుతింటూంటాను!ఏమిటో కొంతమంది జాతకాలు అలాగే ఉంటాయేమో! అయినా... అనుమానం అంటారు కానీ, విషయమేదో తెలుసుకోవద్దూ.. భోజనానికైతే ఒకలాగా, టిఫినీ కే అయితే ఇంకోలాగా సిధ్ధంగా ఉండొద్దూ, లేకపోతే రేపు మనవాళ్ళందరిలోనూ ఫణి పెళ్ళాం ఇలాగా అని యాగీ చేసేయరూ? ఇలాటివన్నీ ఈ మొగాళ్ళకి అర్ధం అవదూ, చెప్తే అర్ధం చేసికోరూ, ఏమిటో వెళ్ళిపోతున్నాయి జీవితాలు...
ఆ వచ్చేవారి పిల్లతో ఫోనులో మాట్టాడుతూ, మొత్తానికి మూడింటికి, ఈయన కిందకు వెళ్ళి, వాళ్ళని పట్టుకుని ఇంటికి తీసికొచ్చారు. ఒకళ్ళ మొహం ఇంకోరికి తెలియదూ, అయినా ఎలా గుర్తుపడతారో ఆ భగవంతుడికే తెలియాలి. ఎప్పుడైనా, ఒకళ్ళనుకుని ఇంకోళ్ళని తెచ్చేస్తారేమో అని నాకు ఎప్పుడూ భయమే! ( మళ్ళీ చివాట్లు....).
ఆ మాటా ఈమాటా చెప్పుకుంటూంటే చివరకు తేలిందేమిటంటే ఆ మేనకోడలు మా ఊరి మాస్టారి కోడలే అని ! టిఫిన్లూ, పెద్దవాళ్ళయినందుకు, కాళ్ళకి దండాలు పెట్టించుకుని ఓ గంటన్నర కబుర్లు చెప్పుకున్నాము. మా అతిథ్యం నచ్చిందా పునర్దర్శనం లేదా అంతే....వాళ్ళని పంపేసి, పైకి వచ్చి, మెయిల్ చెక్ చేసికుంటే, మా చిన్ననాటి స్నేహితురాలి దగ్గరనుంచి మెయిలూ..
తన రోజులు బాగుండక, మొన్నెప్పుడో మా వారికి ఓ మెయిల్ పంపింది, ఇంక చూసుకోవాలి, దొరక్క దొరక ఓ శిష్యురాలు దొరికింది కదా అని, తనని హడలు కొట్టేస్తూ, "తెలుగులో వ్రాస్తే కానీ నేను జవాబివ్వనూ.." అంటూ, తెలుగులో ఎలా టైపు చేయాలో అన్నీ, వివరంగా వ్రాశారు. ఇద్దరు పిల్లల తల్లీ, ఒక మనవరాలికీ, ఓ మనవడికీ నానమ్మ అయిన తను పాపం, ఈ వయస్సులో ఇదేమి గొడవరా బాబూ అని అనుకోకుండా, మొత్తానికి ఛాలెంజి ఒప్పుకుంది.
వచ్చీరాని మాటలతో ( మరి మొదటిసారి కంప్యూటరులో తెలుగులో టైపు చేయాలంటే మరి అలాగే ఉంటుందిగా!), ఓ కవితే వ్రాసి పంపించేసింది...
కవితలు వ్రాయాలన్నా, కథలు వ్రాయాలన్నా ఉండాలి మనసు..కావాలి ప్రేరణ..
చూడగలిగిన మనస్సుంటే ప్రపంచమే ఒక పాఠశాల.. ప్రకృతియే ఒక గురువు
అనుభవాలే పాఠాలు..అందరి కష్టం నీదనుకుంటే ఆ బాధ ఇస్తుంది ప్రేరణ..
అందరి సుఖమూ కోరుకుంటే ఆ ఆనందం పరిపూర్ణం...
అదే దేవుని దయకు మూలం....
వచ్చీరాని మాట వరహాలమూట !
వచ్చీరాని మాటలు ఊరీ ఊరని ఊరగాయ రుచి లా... అన్నట్టుగా, వైద్యవృత్తిలో రాణించినట్టుగా, ఇందులో కూడా రాణించాలని కోరుకుంటున్నాను....చిన్నప్పటినుంచీ, తనకు కవితలు వ్రాయడం అలవాటు ఉందనుకోండి, కానీ, కాగితం మీద పెన్నుతో వ్రాయడానికే సీమిత్.. కానీ ఈ నవీనయుగంలో పుస్తకాలూ పెన్నులూ ఎవరిక్కావాలి? అంతా అంతర్జాలమే గా...
వచ్చీరాని మాట వరాల మూట.. వచ్చీరాని మాటలు ఊరీ ఊరని ఊరగాయ రుచి..
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 31, ఆగస్టు 2012, శుక్రవారం
3 కామెంట్‌లు:
simply !!
I love your couple.You write straight from heart.
thank you for your blog
మీరు పూనా లొ ఉంటారా. మేము ఈ నెలే పూనా వచ్చామ్.
@సమీరా,
నా టపాలూ, మేమిద్దరమూ, నచ్చుతున్నందుకు చాలా సంతోషమమ్మా. అలాగే కొనసాగిస్తూండు...
@కముధ గారూ,
ఔనండి. మా శ్రీవారు 50 సంవత్సరాలనుండీ, నేను 40 సంవత్సరాలనుండీ ఉంటున్నాము ఇంకో విషయం- మీకు తెలుగు పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉంటే, మా అబ్బాయి నడుపుతున్న గ్రంధాలయం చూడండి.( online). లింకు...https://www.tenderleaves.com/ అందులో 650 దాకా తెలుగు పుస్తకాలు ఉన్నాయి. మీరు బయటకు వెళ్ళఖ్ఖర్లేకుండా, మీ గుమ్మంలోకే వస్తాయి...
కామెంట్‌ను పోస్ట్ చేయండి