RSS

చారు ( చిల్లు) గిన్నె


 

మునక్కాడ ముక్కలు వేసి చారు పెడదామని ముక్కలు గిన్నెలో వేసిస్టౌవ్ మీద పెట్టి దర్జాగా తెలుగు పజిల్ చేద్దామని కూర్చుంటేసమయమే తెలియలేదు. కాసేపటికి వాసన .(గ్యాస్)

వెళ్ళి చూసేసరికి గిన్నె లో నీళ్ళు బర్నర్ మీదకి పడుతున్నాయి. ఏమిటా, అని చూస్తే చారుగిన్నెకి చిల్లు.నిన్నటి వరకూబాగానేవుంది. అంటే ,ఏమిటో? తెలుసా? గిన్నెలు అరిగి, చిల్లులు పడేలా , సుబ్బరంగా తోముతానన్న మాట.కదా! (  నాకు నేనే వీరతాడు వేసేసుకున్నాను.😊)

 వాడగా , వాడగా చింతపండు పులుపుకి గిన్నెలు ఇలా అవుతాయనే పులుసుగిన్నె, చారుగిన్నెలు విడిగావుండాలనేవారు. పెద్దలు. అప్పట్లో అది చాదస్తమనిపించేది.కాని అక్షరాల నిజం.

మా అమ్మమ్మగారు (అత్తగారు)చారు గిన్నె నిలువుగిన్నె. ఆవిడ చేతి చారు చాలా బావుండేది.

గిన్నె చాలా బావుండేది.

చారు(చిల్లు)గిన్నె గురించి ఏమిటంటారా? చారు చారే!! చిల్లు చిల్లే!! వాటి ‘ప్రత్యేకత, హోదా  యే వేరు.  ఓసారిమేమందరం బయట డిన్నర్ కి వెళ్ళినపుడు (కరోనా ముందు) సూప్, తో ముందు తినేవి తెప్పించారు. తీరా సూప్ చూస్తే  అక్షరాల మన చారే!!  చారు కి వారు వేసిన బిల్లు ఎలా మరచిపోగలను? 😊

నా చిన్నపుడు మా ఊళ్ళో మాట్లు వేసేవారు వచ్చేవారు. సకుటుంబంగా. అస్తమాను కాదు అప్పుడప్పుడు. బహుశాతిరుగుతూ వుంటారనుకుంటాను. వీధిలో నీడపట్టున కూర్చునేవారు.వాళ్ళు వచ్చేసరికి అందరికీ హడావిడి. గిన్నెలకుతేలు కుట్టిందనే వారు. తేలు కుడితే చిల్లు పడేదో, చిల్లు పడితే తేలు కుట్టిందనే వారో తెలీదు. అన్నీ అటక ఎక్కేవి. వీళ్ళరాకతో చిల్లు పడ్డ గిన్నెలు, చెంబులు, బిందెలు అన్నీ అటక మీదనుంచి దిగేవి. మాట్లు వేస్తూంటే చూసేందుకుతమాషాగా వుండేది.బాదం ఆకుల్లో పచ్చడో, ఉరగాయోపెట్టి ఇచ్చి రమ్మనేవారు. పెద్దవాళ్ళు. ఒక్కోసారి బిందెలకి అడుగుతీయించి అడుగు వేయించామనేవారు. అర్ధమయ్యేది కాదుఅన్నింటికి మాట్లు వేయించి ఇంత చింతపండు,ఉప్పు వేసివుంచేవారు. తోమేందుకు.

మర్నాడు గిన్నెలు చూసిన పనమ్మాయి ,మాట్లు వేసేవారు దిగారేటమ్మా ?  అంటూ అన్ని తళతళ మెరిసేలా తోమిఎండలో బోర్లించేది

చిల్లు అంటే గుర్తు వచ్చేది. చిల్లుల గరిటె. అది లేకపోతే పిండివంటలే చెయ్యలేం కదా! 

చిల్లుల బుట్టతో  బియ్యం కడిగి పెట్టుకొని నీళ్ళు మరిగిన తర్వాత ఆబియ్యం అందులో పోసి, పెంకు ముక్కలతో పట్టుకొనిగంజి వార్చి న రోజులే రోజులు. పైగా అన్నం గిన్నెకు ముందు బూడిద రాసి పొయ్యి మీద పెట్టడం…

షష్టిపూర్తి వేడుకలో చిల్లుల బుట్టకాని, జల్లెడ కాని అందులో నవరత్నాల తాపడం వేసి దంపతులకి స్నానం చేయిస్తారుకదా, చిల్లులది అయితే ఏం? ఎంత ప్రత్యేకతో కదా!!

, పెద్ద చప్పుడు వినిపిస్తే,  చెవులు చిల్లులు పడిపోయాయి . ‘అనుకుంటాం.

, పనికి రానివో, పనికి వచ్చేవో చిల్లు చెల్లులు,

‘చిరాకు, కలత కలిగితే చిల్లుపొల్లు’

‘ తడిసిన కన్నులు కలవాడయితే చిల్లుడు’

‘సాంబారు పెట్టాలంటే కావలసినది చిల్లుల్లి.’

ఇవన్నీ జ్ఞాపకాలు.

నా చారు(చిల్లు)గిన్నె ఏం ,చేయాలి? ఆ!ఆ! తట్టిందండోయ్!!

మట్టి వేసి ‘మనీప్లాంటు’ మొక్క పెడితే….బావుంటుంది. కదా!!

   

--



 

 


పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes