RSS

గృహహింస

   అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటే మోసెవారుకూడా వుండాలి కదా,అల్లాగే అందరూ వ్రాసేవారుంటే ఎలా? చదివెవారు వుండాలికదా అందువల్ల నేను చదవడంఇష్టపడతాను. అయినా కొతమంది అనుకున్నది అనుకున్నట్లుగా వ్రాయగలరు. కొంతమంది మాట్లేడేందుకు మితభాషి అయినా చక్కగావ్రాయగలరు, కొంతమంది మాట్లాడ్డం చక్కగా మాట్లాడి పదినిమిషాలుండి వెడదామనుకున్నవారిని ఓ గంట కూర్చోపెట్టగలరు మాటలతో, వీరికి కాయితం మీద అక్షరంపెడితే కలం ముందుకుసాగదు. మరి కొంతమందికి ఈ రెండు కళలు చక్కగావుంటాయి. ఆదృష్టవంతులు. అలాంటి కోవలోకే మాశ్రీవారు వస్తారు. బాగుందయ్య. తనదారిన తను వ్రాసుకుంటున్నారు. ఆనందంగావుంది. నన్ను వ్రాయమంటారే అదే కొంచం యిబ్బందిగావుంది ఇది యిప్పటిమాట కాదు,1972నుండి యిదే పాట. ఎందుకంటే అప్పుడు నేను వ్రాసిన కధ, కాదు వ్యధ, కాగితాలు నా కంట పడ్డాయి.మీరూ నాకధ చదివీ అమ్మయ్య బతికిపోయామనుకుంటారు,చూడండిమరి. (లేకుంటే ఎంతమంది నా హింసకి బలి అయివుండె వారో)

    నేను ఒక సామాన్యకుటుంబములో పుట్టి పెరిగాను, మరో సామాన్యకుటుంబములొ కోడలిగా వెళ్ళాను.అన్నికధలు, నవలలూ, కనిపించిన అన్ని పుస్తకాలు చదువుతాను.దాని మీద అభిప్రాయాలు లోటుపాట్లు నాలో నేనే చర్చించుకుంటాను. రచయిత, రచయిత్రులను మెచ్చుకుంటాను. కాని నేనే ఓకధ వ్రాయవలసివస్తుందని కలలో కూడా అనుకోలేదు. మాశ్రీవారికి నేను కధలు వ్రాయాలని ఓ రచయిత్రినవాలని ఓ పెద్దకోరికగా పరిణమించింది. ముందర లాలనగా ఆ తరువాత అభ్యర్దనగా ఆపై ఆజ్ఞాపించడం మొదలుపెట్టారు. క్రొత్తగా వివాహమయిన మా దాంపత్యంలో ఇదొక ప్రళయంగా మారింది
ఓరోజు ఆఫీసు నుంచివస్తూ కాయితాలు,పెన్ను యిచ్చి కధ వ్రాయమని ఇంట్లో పని తను చూసుకుంటానని,కావాలంటే ఎక్కడకయినా తీసుకువెడతానని, ఓమంచి కధా వస్తువు దొరుకుతుందని అన్నారు.(ఇదేమయినా బయట దొరికే వస్తువా) అప్పటికి తప్పించుకొవచ్చనని నిజమేనండీ, వెడదాము ఏదయినా దొరకొచ్చు అన్నాను సాలోచనగా,అంతే ఆ మర్నాడు నుండి వరుసగా ఓ మూడు రోజులుశలవు పెట్టి పూనా అంతా ఓపిగ్గా బండ్ గార్డెన్,మండేబజార్,సారస్ బాగ్, ఆగాఖాన్ ప్యాలెస్,మ్యూజియమ్,మొదలయినవి మధ్యలో హొటెల్సు,చూపించి ఇంక కధ వ్రాయమన్నారు,భలే సరదగా చూసానేకానినాకు ఏమీ తట్టలేదు."బజారులో వంకాయలు కొన్నట్లా కధ వ్రాయడమంటే" అని రచించడంలోని సాధకభాధలన్ని నాకు తెలుసున్నంతవరకూ విడమర్చి చెప్పాను.,

    మూడు రోజులు 90రూపాయలు తగలేసి శలవు పెట్టి మరీ తిప్పానుకదా, నీకు ఏమీ తట్టలేదా,మళ్ళి యిన్ని పుస్తకాలు చదువుతావు?అంటూ నిలదీశారు. ఇంక తప్పదనుకొని వ్రాయడానికి నిర్ణయం చేసేసుకున్నాను.చాలా సీరియస్ గా ఆలోచనలోపడ్డాను. ప్రఖ్యాత రచయిత, రచయిత్రులు ఎలా వ్రాశారో, అనుకుంటూ క్షుణ్ణంగా చదవడం మొదలుపెట్టాను. కధలో పాత్రల పేర్లు ఏమి పెట్టాలి? కధకి ఏం పేరు పెట్టాలి?ప్చ్! సరికొత్తపేర్లు పెట్టాలి, కధ ఏమిటీ? ఓ నవలే వ్రాసేయాలి దెబ్బతో పెద్ద రచయిత్రినయిపోవాలి, అంతేకాదూ ఓ పుణ్యాత్ముడు దాన్ని ఓసినిమగా నిర్మించాలి. పాఠకలోకానికి అత్యంత పాత్రురాలినయిపోవాలి,అనుకుంటూ పెన్ను కాయితాలు తీసుకుకూర్చున్నాను, కానిఏం వ్రాయాలొ తోచలేదు. కిటికిలోంచి అరుగు మీద అమ్మలక్కలు కబుర్లు చెప్పుకుంటున్నట్లు కనిపించీంది అక్కడాకు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకొంటున్నారొ రాసేస్తేపోదూ, అనుకొని అక్కడకి వెళ్ళాను, నన్ను చూసి రండి, కూర్చోడి అమ్టూ బాతాఖానిలో పడిపోయారు, ఆ కబుర్లుతో మూడు గంటలు గడచిపోయాయి,స్కూలు పిల్లలు రావడంతో ఎవరికివాళ్ళు వాళ్ళ ఇళ్ళకి తప్పుకున్నారు. నేను ఇంటికి వచ్చెసాను. పనిమనిషి "సోనాబాయి" వచ్చింది. గిన్నెలు కడగడానికివేసి మూడు గటల ముచ్చట్లలో ఒక్కవిషయం సరిగాలేదు, ఓ ప్రత్యేకతలేదు,అని ఆలోచిస్తూ తలనొప్పితో అలాగే చేతిలో పెన్నుతో టేబిల్ మీదకి ఒరిగాను.
ఏమయిందీ, సుమతీ! అంటూ అప్పుడే ఆఫీసునుండి వచ్చిన శ్రీవారి పిలుపుతో కళ్ళు తెరిచి కారణంచెప్పాను. అంతేనా, కధ వ్రాసి అలసటతో పడుకున్నావనుకున్నాను అన్నారు నిరుత్సాహంగా,
అమాయకంగా ఆయనకేసి చూస్తూ" అయినా అందరూ రచయిత్రులే అయిపోతే చదివెవాళ్ళు ఎవరుంటారు?
ఎంత చదివెవాళ్ళు లేకపోతే యిన్ని పుస్తకాలు ప్రింటు అవుతున్నాయి? అయినా ఒకే ఒక కధ వ్రాయమన్నాను అంతేకదా!కట్నాలా, కానుకలా , అన్నారు ఎంతోభాదగా,చాలా జాలి వేసింది."ఆలోచించి త్వరలొ రాస్తాలెండి"అన్నాను. ఆమాత్రానికే ఎంతో ఆనందంగా ఇన్నాళ్లకి ఆలోచించడం మొదలుపెట్టావా,ఇంక వ్రాసేయ్, ఒక్క కధ వ్రాసేవంటే ఆటోమేటిగ్గా ఆతరువాత అనేకం రాయగలవు అంటూ తన చేతుల్లోకి తీసుకున్నారు.
ఆమరునాడు ' సోనాబాయి" వచ్చినపుడు తనతో నీ జివితవిశేషాలు చెబుదూ? అన్నాను.
ఏముందమ్మా, అయ్య చూసినతన్ని పెళ్ళిచేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, పొట్టకూటి కొసం పనులు చేస్తూన్నాను, ఇద్దరి సంపాదనతో ఇల్లు బాగానే గడచిపోతోంది--
ప్చ్త్! అదికాదే, మీఆయన కొట్టడం, తిట్టడం, తాగడం ఏమన్నా చేస్తాడా?
అది ఏమిటమ్మా? అల్సిన శరీరానికి హాయికోసం ఓచుక్క వేసుకుంటాడు కోపమొస్తే అరుస్తాడు,ప్రేమ వస్తేలాలిస్తాడు, అయినా ఏమిటమ్మా ఈ ప్రశ్నలు? జీవితమే యిదీ'--
నేను ఓ కధ వ్రాసుకోవాలి అందుకని అడిగానులే,
సరేలే అమ్మా, నేను ఇంకా పని చేసుకొవాలి అని చెప్పి వెళ్ళిపొయింది. నా ఆలోచనల్తో ఓఆరు వారాలు గడచిపోయాయి. ఏమీ ఇంప్రూవ్ మెంటు లేదు. ఓ రోజు" సుమతీబాభీ" నా కొడుకు వ్రాసిన కధ ఈ పుస్తకంలో పడిందట,చదవమంటూ " మరాఠి" పుస్తకం చేతిలో పెట్టింది, ఏమిటీ నీ కొడుకు కధలు రాస్తాడా అన్నాను ఆశ్చర్యంగా,
ఇదే మొదటి కధమ్మా! ఆరోజు నువ్వు అలా అడిగావని చెప్పాను, అప్పుడె వ్రాసి పంపాడట,--
అలాగే తరువాత చదువుతానులే ముందరతొందరగా పని చేసెయ్, మేము బయటకువెళ్ళాలి, నీ కొడుక్కి నా తరఫున కంగాచ్యులేషన్సు చెప్పు.
అసలు సంగతి ఏమిటంటే నాకు మరాఠి మాట్లాడ్డమేకాని, చదవడంరాదు,అంతేకాక నాలొ ఏదో తెలియని చిన్న అసూయ, అసహాయత అవతరించాయి.

    మాశ్రీవారికి సంగతి తెలిసినతరువాత నాతొ మాట్లాడ్దం మానేశారు.అయినా అంతగా నన్ను వ్రాయమని అనకపోతే తనే వ్రాయకూడదూ, ఓకధ వ్రాస్తే వచ్చే సంతోషమేమిటి?-- మా యిద్దరిమధ్యదూరం మరింత ఎక్కువయింది, సినిమాలు లేవు, షికార్లులేవు, పరాచికాలులేవు, పరుపులు వేరయ్యాయి,యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి ఎక్కువభాగం ఆఫీసులోనే గడుపుతున్నారు, శ్రీవారి లాలిత్యంలో గుర్తురాని అమ్మ నాన్నగార్ల మీద మనసు పోయింది"ఒకేఒక్కకధ" మాయిద్దరిమద్య అడ్డుగానిలచింది, పోని వాసేద్దామంటే ఏం వ్రాయాలో,ఒకవేళా నేను వ్రాసినా పబ్లిష్ చేసుకునేదెవరూ? పబ్లిష్ మాట దేముడెరుగు ముందర రాసేద్దాం, -- వివాహమయిన అరు నెలల్లొ ఆవిర్బవించిన ఈ అంతఃకలహం ప్రళయంగా మారురుతుందో, ప్రణయంగా మారుతుందో చెప్పలేను కాని కాయితాలు, పెన్ను తీసుకొని చాలా చాలా సీరియస్ గా వ్రాయడానికి ఉపక్రమించాను.

   ( మనలో మాట- ఇది గృహహింస చట్టంలోకి వస్తుందా చెప్పండి, ప్రోసీడ్ అయిపోతాను.కాలం ముందుకు జరిగినా పరిస్థితిలో ఏమీ మర్పు లేదు).., ,.

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కథల కోసం కాపురం కూల్చుకుంటామా??...... :P
చివరికి మీరు రాసేసి ఉంటారని అనుకున్నా.....రాయలేదా ప్చ్!!

మాలా కుమార్ చెప్పారు...

ఏమో నాకు తెలీదండీ . . .

విజయ క్రాంతి చెప్పారు...

పాపం మీవారి ముచ్చట తీర్చేయండి ... ;-)

ఐన గృహ హింస బుర్ర లేని మేధావులకు కానీ , మనలాంటి వాళ్లకు చిన్న చిన్న విషయాలకు సర్డుకుపోవటమే ...

భావన చెప్పారు...

ఇది గృహ హింస కాదు సంసారం లో సరిగమ లేమో...

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

హరీష్,
రాసిఉంటే ఈ గోల అంతా ఎందుకు అందరితో మొరపెట్టుకుంటానూ ?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

మాలాకుమార్,
తెలియదని తప్పించుకుంటే ఎలా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

విజయ క్రాంతి,

అంతేనంటారా?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

భావనా,
మీ వ్యాఖ్య వినసొంపుగా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

Aunty, ilanti gruha himsa chattam tevalsinde.. nenu pelli ante.. gadapa ki pasupu raasi inti mundu muggu petti,, prati yedadi varalakshmi vratam chesukovatam anukunaanu. kaani maa varu kapuraniki vachindi modalu... GMAT raayi.. applications prepare chey ani roju okate gola ... pelli ayyi 5 yrs ayina.. nee cheta eppati kayinaa MS cheyinchaka potaana ani gull confidence tho unaaru. manchi ga vanta chesteno illu baaga peditenoo raani santosham.. okka ganta pustakam pattukuni kurchunte chaalu.. moham chetantha ayyi aa roju vanta aayane chestaaru..

aayaniki telugu raadu.. nenu telugu blogs chadivi vishayalu cheptunte.. nuvvu kuda oka blog start cheyraadu ani gola.. emi raastanu nenu... andaru rraase vallu unte.. chadivi aanandinche vallu kuda undaali kada.. chepte vinaru.. nenu oka pedda telugu pandituraalini .. chaduvula sarawati ni annattu choostanu..

mimmalni poorti ga relate chesukogalanu ee vishayam lo

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అజ్ఞాతా,

ఏమిటో అలా "అజ్ఞాతా" అని సంబోధించడం అస్సలు బాగోలేదు. అయినా మీ శ్రీవారు చెప్పింది మీ మంచికోసమే కదా! ఇంక బ్లాగులంటారా, ఇన్నేళ్ళొచ్చి నేనే వ్రాయగా లేనిది, మీలాటివారికి ఇంకా సులభం....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes