RSS

నా తిప్పలెవరితో చెప్పుకోనూ?

    శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో చూసాము. ఓ ఆవు, ప్రతీ రోజూ ఠంచనుగా, మందనుంచి తప్పించుకుని, స్వామికి పాలివ్వడానికి ఒకే టైముకి వెళ్ళేదని. మరీ అలాగని కాదు కానీ, ఈ మధ్యన మా శ్రీవారు, ప్రతీ రోజూ ప్రొద్దుటే
స్నానం, పానం, బ్రేక్ ఫాస్టూ పూర్తిచేసికుని, ఇంట్లోంచి బయటకు వెళ్ళి, మళ్ళీ భోజనానికే, 12.30 కి వస్తున్నారు. మరీ అలాగని ఈయనేమీ, నాకు తెలియకుండా ఉద్యోగమేమీ వెలిగించడం లేదు, ఎప్పుడైనా మిస్టరీ షాపింగులున్నా, చెప్తారు, ఇంకీయనెక్కడికి వెళ్తున్నట్టూ?

    ఈ మధ్యన మరీ పనేమీ లేక, నెట్ లో పెట్టే కంది శంకరయ్యగారి పజిలూ, తురపుముక్క మురళీ మోహన్ గారి పజిలూ, చూడడం మొదలెట్టాను. ఒకాయనేమో ప్రతీ రోజూ పొద్దుట ఆరున్నరయేసరికి పెట్టేస్తున్నారు. అదేదో చూసి సరదాగా సాల్వ్ చేద్దామని, మొదలెట్టాను.ప్రతీ రోజూ అదో వ్యసనంలా తయారయింది.నాకు తెలిసినవేవో ముందర వ్రాసేసికుని, నాకు మరీ అంత తెలియనివి, ఉన్నారుకదా అని మా శ్రీవారిని అడుగుతూంటాను. ఏవేవో వ్రాస్తూంటారుకదా, ఆ మాత్రం తెలియదా అని. పాపం ఆయనకున్న వీక్ నెస్స్ ఏమిటంటే,తనకు ఏ మాత్రం పరిచయం లేని సబ్జెక్ట్ లో ఎవరైనా ఏమైనా అడిగితే పాపం టెన్షనొచ్చెస్తూంటుంది.

    అప్పటికీ, నేనెక్కడడుగుతానో అని భయ పడుతూ, షేవింగు చేసికుంటూనో, స్నానం చేస్తూనో, పూజ చేసికుంటూనో గడిపేస్తూంటారు! అలాగని నన్ను తప్పించుకునెక్కడికి వెళ్తారూ, మేమున్నదేం భవనమా ఏమిటీ, సింగిల్ బెడ్రూం, హాల్,కిచెన్! అక్కడ మా ఇంట్లో (స్వంత) అయితే, మా అగస్త్యని ఎత్తుకుంటూనో, నవ్యతో మాట్లాడుతూనో తప్పించేసికునేవారు.ఇకాడ, ( కొత్త బంగారులోకం లో డయలాగ్గు గుర్తుచేసికోండి!) పాపం అలాటి పప్పులేం ఉడకడం లేదు. అలా వచ్చీ, ఇలా వచ్చీ ఏదో ఒకటి అడగడం మానట్లేదూ, ఆయన విసుక్కోడం మానడం లేదూ!

    అలాగని ఆయనకేమీ తెలియదనడానికి వీల్లేదు.పుస్తకాలు చదువుతారు, ఎప్పుడు చూసినా నెట్ మీదే ఉంటారు. అదడిగిందీ, మనం చెప్పకూడదూ అంతే ! ఎప్పుడైనా నేను వ్రాసినవి అన్నీ కరెక్టవుతే శంకరయ్యగారూ, మురళీ కృష్ణ గారూ
చెప్తూంటారు కదా. అదీ విషయం! నేనెక్కడ బాగుపడిపోతానో అని దుగ్ధ!!అందుకనే పన్లన్నీ పూర్తిచేసికుని, బయటకెళ్ళిపోతే అసలు గొడవే ఉండదుగా, నా తిప్పలెవో నేనే పడతాను.బయటకెళ్ళి మళ్ళీ ఫోన్లోటి, 'నీ పజిలు పంపించడం అయిపోయిందా' అంటూ.అప్పుడుకానీ కొంపకి చేరరు. ఇదండీ విషయం !! ఇన్ని తిప్పలు పెట్టినా ఎప్పటికో అప్పటికి हाँगॅ कामियाब एक दिन् అనుకుంటూంటాను!!

6 కామెంట్‌లు:

A K Sastry చెప్పారు...

మా ఆవిడ ఈనాడు ఆదివారం ఆఖరిపేజీలో వుండే పదవినోదం పూర్తి చేస్తూ, నన్ను "యేవండీ! ఫలానా ఆయన భార్య యెవరు?" "ఫలానా ఆవిడ కొడుకెవరు?"--ఇదొక్కటీ వచ్చేస్తే, పజిల్ అంతా వచ్చేస్తుంది--ప్లీజ్! చెప్పరూ? అని గోముగా అడుగుతూ వుంటుంది.

మనం చెపుతామా! సీరియస్ గా ఓ సిగరెట్టు వెలిగించుకొని, "ఫోర్క్ బయటికి తియ్యి" అని బాత్రూం లో దూరతాం!

(మన ఙ్ఞాపక శక్తి ని పెంచుకోడానికి, ఫోర్క్ తో మన బుర్రచుట్టూ గుచ్చుకొని, బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తే ఫలితం వుంటుంది--దీన్నీ ఇంగ్లీషులో ర్యాకింగ్ ది బ్రెయిన్ అంటారు--అని మా పిల్లలకీ, ఇంకా చాలా మందికి నేర్పించాను)

నేను బయటికి వచ్చేసరికి, "వచ్చేసిందండీ" అంటూ--"ఛెషైర్ కేట్" లా నవ్వుతూ మా ఆవిడ!

మీవారు కూడా అలాంటి ట్రిక్కే వాడుతున్నారు అని యెందుకు అనుకోరూ?

మీ టపా బాగుంది! హమ్ హోంగే కామ్యాబ్!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

కృష్ణశ్రీ గారూ,

ఆమాత్రం తెలిస్తే చెప్పడానికి ఏం పోయిందీ? అన్నీ గొప్పలు కానీ! हं हाँगॅ जरूर काम्याब !!

శ్రీనివాసరాజు చెప్పారు...

ఆంటీ.. అది మేకపోతు గాంబీర్యం అంటారే.. అదయ్యుంటుందిలేండి.. తెలియదు అంటే ఎక్కడ ఎగతాళిచేస్తారో అని పాపం అలా తప్పించుకు తిరుగుతున్నారు.. పాపం వదిలెయ్యండి.. :-)

పానీపూరి123 చెప్పారు...

> బయటకెళ్ళి మళ్ళీ ఫోన్లోటి, 'నీ పజిలు పంపించడం అయిపోయిందా' అంటూ
మీకు మరింత సేపు computer కావాలంటే ఇంకా పజిల్ పూర్తవ్వలేదు అని చెప్ప వచ్చేమో? :-D

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

శ్రీనివాసూ,

వదిలేయకేంచేస్తాం?

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

పానీపురీ 123,

ఈసారి ప్రయత్నిస్తాను.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes