RSS

చెప్పిన మాట వినరు...

   ఈరోజు భక్తి టి.వి లో గరికపాటి వారి మహభారతం వినేందుకు కూర్చున్నాము. ఆయన చెబుతు చెబుతూ మధ్యలో చిన్న చిన్న ఉపకధల్లాంటి విషయాలు చెబుతూవుంటారు కదా, దృష్టిలోపమేకాని సృష్టి లోపంకాదని చెప్పారు,బాగానేవుంది, అలా చెబుతూ పొద్దునే లేచేసరికి చెట్టునుండి రాలిన గన్నేరుపూలు ఎంత అందంగా వుంటాయండీ అసలు, కాని అలావుంచుతారా? అబ్బే, చీపురు పెట్టి తుడిచేయరూ, ఏమన్నా అంటే నీట్ నెస్ అంటారు, ఏమి నీట్ నెస్ అండి పూలు అలావుంటే ఎంత బాగుంటుందీ,అని అన్నారో లేదో మాశ్రీవారికి విపరీతమైన నవ్వే నవ్వూ---.అమ్మయ్య ఇప్పటికైనా తనకి ఓ తోడు దొరికిందని( నీట్ నెస్ గురించి చిరాకు పడేవారు!)

   ఎందుకంటారా మా యింటిలో అందరూ ఈ నీట్ నెస్ కోసమై నా వల్ల పీడింపబడుతున్న బాధితులన్నమాట.అదేమి పాపమో, భగవంతుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడో నాకు తెలీదు, ఇలా అంటే ,ఎందుకేమిటీ మమ్మల్ని పీడీంచేందుకే అని టక్కున సమాధానం చెబుతారు.అసలు ఈ శుభ్రత అన్నది కూడా ఒక రోగమని అంటారట. అదంతా నాకు తెలీదు కాని పనిమనిషిని పెట్టుకోకుండా నేనే పనులు చేసుకుంటాను.చిన్నయిల్లే కదా ,చీపురుతో తుడవడం, తడిబట్టతో తుడవడం, గిన్నెలు తోముకోవడం,బట్టలు ఉతుక్కోవడం, అన్ని చేసుకోవడం, నడుంనొప్పికి మందులేసుకోవడం, మూవ్ రాసుకోవడం,బయటనుంచి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోమనడం,కాళ్ళు సరిగా తుడుచుకొని రమ్మనమనడం, హయిగా రోజూ ఇస్త్రి బట్టలు వేసుకోమ్మనమనడం,అన్నం తిన్న తరువాత, కంచంచుట్టూ పడ్డ మెతుకులు, ఓపిగ్గా కూరలోంచి ఏరిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పక్కనే వున్న చిన్నగిన్నెలో వేయమనడం, అవి డస్టుబిన్ లో వేసి కంచం వాష్ బేసిన్ లో పెట్టమనడం, సోఫాలలో కూర్చున్నపుడు కుషన్లు వాటి చోటులోనే వుంచండీ అనడం ,ముఖ్యంగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ సోఫా మీద వేస్తారే వెనక్కాల అవీ పూర్తిగా కిందకిపడిపోయేలా కూర్చోవడం,సెంటర్ టేబుల్ మీద పెట్టినవి తీసిచేతిలో పట్టుకోవడం,కర్టెన్లకి చేతులు తుడిచేయడం, పుస్తకాలు చదివి వాటిని అలాగే బోర్లా పెట్టెయడం,లేకపోతే పేజి మడతపెట్టేయడం, మంచంమీద తరగడాలు అటూ ఇటూ పడేయడం,యిదుగో యిలాంటి విషయాల్లోనే వస్తుందినాకూ మా యింట్లో వాళ్ళకీను----

   ఓసారి ఏమయిందంటే మా స్నేహితులు డాక్టరు గారింటికి వెళ్లాము, ఆయన మాతో మాట్లాడుతూ భోజనంచేసి తడిచేతులతో కర్టెన్ పక్కకి జరుపుతున్నారో తుడుచుకుంటున్నారో కూడా గమనించకుండా "గిలా హాత్ మత్ లగానా,నేప్కిన్ లే లేవ్ " అని మా అబ్బాయి మీద అరిచినట్లుగా అరిచేసేసరికి పిన్ డ్రాప్ సైలెన్సు ఐపోయింది. ఆ తరువాత నేను సిగ్గుతోచచ్చిపోయానంటే కూడా తక్కువేను,వాళ్ళ యింట్లో ఆయన్ని అల్లా అనడం నిజంగా తప్పేను, కాని ఏం చేయను చెప్పండీ, అదీ నా బలహీనత. ఆలోచిస్తుంటే నేను అందరిని ఎంత బాధ పెడుతున్నానో తెలుస్తుంది కాని మానుకోలేకపోతున్నాను.

   నిన్న మా స్నేహితులొకరు షిరిడీ వెళ్తున్నారంటే, ఒకసారి కలుసుకోవాలని వెళ్ళాము. ఆవిడ నాకు ఈ నీట్ నెస్ విషయంలో పెద్దక్కయ్య!నేనే అనుకుంటే నాకంటే ఛాదస్థం ఆవిడకి.ఇంట్లో ద్వారం దగ్గర మట్టుంటుందని చేతిలో చీపురూ, చేట తో వెళ్తారు ఆవిడ. మరీ అంతకాదుకానీ, నేను ప్రొద్దుటా సాయంత్రం తుడుస్తానంతే. ఇంక ఆవిడ ఎక్కడ పడితే అక్కడ నీళ్ళతో శుభ్రపరచడం అలవాటు. వాళ్ళమ్మాయి అంటుందిటా " చేప పిల్లలా అస్తమానూ నీళ్ళదగ్గరే ఉంటావెందుకూ" అని!

    పిల్లలు అడ్డాల్లో ఉన్నంతకాలం నా మాట విన్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళయిన తరువాత 'అమ్మయ్య ఈవిడ గోలోటి తప్పింది బాబూ..' అనుకుంటున్నారు. అందుకోసం మనవల్నీ, మనవరాళ్ళనీ పట్టుకున్నాను! ఏం చేస్తాను పుట్టుకతో వచ్చిన బుధ్ధీ!

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

aadavaallandariki ade baadha.

కొత్త పాళీ చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ
absolutely brilliant అండీ.
మా యింటోనూ ఇదే బాగోతం! :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆయన అంటే ఫణి గారు అల్లా మీరు ఇల్లా neatness మీద వ్రాసేస్తుంటే మేము ఎవరిమాట వినాలి.
మా ఆవిడ కూడా పాపం ఓ కర్ర పుచ్చుకొని గుమ్మం దగ్గర కాపలా కాస్తుంది. నేను వాకింగ్ చేసి వచ్చింతరవాత బూట్లు, సాక్స్ అన్నీ విప్పి వచ్చినా బయట కుళాయి దగ్గర కాళ్ళు కడిగితేనే ఇంట్లోకి అనుమతి అన్నమాట. ఏం చేస్తాంతప్పదు.

బావుందండి. చాలా బాగా వ్రాసారు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@సౌమ్యా,

శుభ్రంగా ఇంత మంచి పేరుండగా, ఏమిటో 'అజ్ఞాత' అనడానికే బాగుండడం లేదు !!

@కొత్తపాళీ గారూ,

ధన్యవాదాలు.

@సుబ్రహ్మణ్యంగారూ,

ధన్యవాదాలు.

ఆ.సౌమ్య చెప్పారు...

మీరు మరీనండి, శుభ్రంగా ఉండమనడం తప్పా? మీ తప్పేమీ లేదు. ఈ మగవాళ్లంత ఇంతే ఎవో ఒక పేర్లు పెడుతూ ఉంటారు జబ్బు గిబ్బు అని. నేను మీ పక్షమే, మీరు అస్సలు తగ్గకండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మన కనీస బాధ్యత.

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes