మా అత్తగారు, తన ముద్దుల కొడుగ్గురించి, కాపరానికి వచ్చిన కొత్తలోనే చెప్పారు. పాపం ఏదో విసుగెత్తి చెప్పుంటారులే అని అనుకునేదాన్ని. ఇప్పుడనుకుంటున్నాను, పాపం ఆ వెర్రి ఇల్లాలు ఎంత విసిగిపోయి చెప్పుంటారో అని! అయినా కొడుగ్గురించి, కొత్తకోడలుతో అలా చెప్తారని ఎవరైనా అనుకుంటారా, చిత్రం కానీ. నలభైఏళ్ళకి తెలిసింది, ఆవిడన్నది అక్షరాలా ఎంత నిజమో. అబ్బబ్బబ్బ... ఒక్కపనీ టైముకి చెయ్యరు. ఇంట్లోకి ఏదైనా కావలిసొస్తే, పది రోజుల ముందరి నుంచీ చెప్తే, చివరకి డబ్బా ఖాళీ అయేసమయానికి తెస్తారు. పైగా ఇంకోటీ, " పూర్తిగా అయిపోయిందా, ఇంకా కొన్ని రోజులొస్తుందా..." అనోటీ! సరుకులన్నీ నిండుకుపోతే కొంపకి దరిద్రం చుట్టుకుంటుందమ్మా, అని మా అమ్మమ్మగారు ( అత్తగారు), చెప్పిందే ఎప్పుడూ నాకు వేదవాక్యం. అంతే కాకుండా, మా ఇంట్లో అయిదుగురప్పచెల్లెళ్ళల్లో పెద్దదాన్నవటం చేత, ఈ వ్యవహారాలన్నీ, నాకూ కొద్దిగా అనుభవం ఉంది. తణుకు లో మా చుట్టాలొకళ్ళుండేవారు లెండి, ఎప్పుడైనా మేము శలవలకి వాళ్ళింటికి వెళ్తే, ఏదో భోజనానికి పిల్చేవారు, అక్కడిదాకా బాగానేఉంది, కానీ మమ్మల్ని చూసిన తరువాత, భర్తని సరుకులకోసం బజారుకి పంపడం చూసినప్పుడు మాత్రం, అదోలా ఉండేది! పైగా మా ఎదురుగుండానే, కూరల సంచీ, సరుకుల సంచీ ఖాళీ చేస్తూ, వాటి ధరవరల పట్టిక కూడా చెప్తూండేవారు! ఆ వివరాలన్నీ విన్న తరువాత, ప్రశాంతంగా ముద్ద దిగమంటే ఎలా దిగుతుందీ? పోనీ అలాగని వాళ్ళకేమైనా డబ్బుకి ఇబ్బందా అంటే అదీ లేదూ, ఉట్టి బధ్ధకం! పోనీ అలాగని మాశ్రీవారు డబ్బు ఖర్చుపెట్టడంలో ఏమైనా మైజరా అంటే అదీ కాదూ. ఏమిటో అది చెప్పిందీ, మనం చేసేదేమిటిలే అనుకోడం. మళ్ళీ అతిథిసత్కారాలకేమీ లోట్లేదు. దానికి సాయం విడిగా ఫ్లాట్ తీసికునుంటున్నామేమో, ఎవరినీ అడిగే అవసరం కూడా లేదు. పలకరించిన ప్రతీ వాళ్ళనీ పిలిచేయడమే. పైగా వాళ్ళు వచ్చీ రాగానే, నావైపోసారి చూడ్డం, అక్కడకి ఆమాత్రం మర్యాదలూ, సత్కారాలూ తనొక్కరికే తెలుసున్నట్టు ! ఆ వచ్చినవాళ్ళని ఉత్తినే మంచినీళ్ళిచ్చి పంపుతామా ఏమిటీ, ఏదో ఇంట్లో ఉన్న సరుకుతో నాకు తోచిందేదో, ఆదరాబాదరాగా తయారుచేయడం. మళ్ళీ ట్రే లో పెట్టి హాల్లోకి తెచ్చినప్పుడు మాత్రం నా మొహంలోకి చూస్తే ఒట్టు ! ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అందరికీ మర్యాదలు చేయాలి, ఇంట్లో ఫలానా వస్తువు తెండీ అంటే మాత్రం, తనకు తోస్తేనే కాదు తేవడం ! ఇంట్లో ఏం సరుకుందో, కూరుందో ఓ సారి చూస్తే ఏం పోయిందిటా? పోనీ తనకు ఆమాత్రం టైములేకపోతే, చెప్తేనన్నా వినాలా ? అబ్బే అదీ లేదూ. సరుకులనే కాదు, ఎవరేనా వస్తే వాళ్ళ చేతుల్లో ఓ బ్లవుజు పీసేనా పెట్టకపోతే బావుంటుందా, ఇంట్లో చూస్తే, డ్రెస్స్ మెటీరియల్సూ. మరీ అందరికీ అలాటివి పెట్టలేముగా. ఇన్నేసి డ్రెస్స్ మెటీరియల్స్ ఎందుకండీ అంటే, సరదాగా కూతురికీ, కోడలుకీ ఎప్పుడైనా పెట్టడానికి బావుంటుందీ, పైగా నువ్వు కూడా ఆ చీరలు మానేసి హాయిగా డ్రెస్సేసికో అంటూ జ్ఞానబోధలోటీ , అసలు రహస్యం ఏమిటంటే, నాకోసం చీర ఒకటే కొంటే సరిపోతుందా, దానికి మాచింగు బ్లౌజు పీసూ, లోపలేసికోడానికి మాచింగు పెట్టీ కోటూ, మళ్ళీ వీటన్నిటికీ, పీకో, బ్లౌజు కుట్టు కూలీ, అన్నీ కలిపి తడిపి మోపెడౌతున్నాయిట, అందుకోసం హాయిగా డ్రెస్సేసికో అని! మరీ ప్రయాణాల్లో ఫరవా లేదు కానీ, మనవైపు ఏ పేరంటానికో, ఈ డ్రెస్సుల్లో వెళ్తే బావుంటుందా. ఏమిటో ఆయనకి తోచదూ, చెప్తే వినరూ... ఇలా ఉంది కాపరం ......
అత్తగారూరికే అనలేదు.....
వీరిచే పోస్ట్ చేయబడింది
భమిడిపాటి సూర్యలక్ష్మి
on 21, అక్టోబర్ 2011, శుక్రవారం
14 కామెంట్లు:
క్రిందటినెల తణుకు వెళ్లవలసి వచ్చింది అదికూడా బెల్లంమార్కెట్టుదగ్గర టీచర్స్ కాలనీకి. వెంటనే మీరు గుర్తుకు వచ్చారు.
మా అమ్మగారు అంటూ ఉండేవారు తను చెప్పినన్నాళ్లూ సామాన్లు వచ్చేవి కావని, మానాన్నగారు వంటచెయ్యవలసి వస్తే (ఎందుకో తెలుసుకదా) వెంటనే సామాన్లు అన్నీ వచ్చేవని.
నేను మాత్రం అలా కాదండోయ్. అర కిలో తెమ్మంటే కిలో తెచ్చేరకం.
బాగుంది మీరు చెప్పింది కాని "ఇది చెప్పేది ఎమిటి" అన్నది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం.
చెల్లాయ్,
పాపం మీవదిన ఫోన్ చేసి తెప్పించుకుంటుంది మరి కావలసిన సరుకులన్నీ యీ బాధపడలేక.
ఈ టపా తో ఫణి బాబు గార్కి తెలిసివస్తుంది లెండి.... దహా
:)
intha open gaa raasi mee
opiniions ni cheepinanduku
abhinandanalu.
హ హ హ నో కామెంట్స్...
బులుసువారికి ప్రణామములు....
ఎన్నాల్టికెన్నాల్టికి మీ దర్శనం..... ఏమైపోయారిన్నాళ్ళూ.....
మొత్తానికి మనసు లో వున్నదతా వెళ్ళగక్కి ఇప్పుడు నిమ్మళంగా వున్నారనుకుంటాను.విన్న (చూసిన) బ్లాగ్ మిత్రులకీ జై అనండి మరి. కిరాణా అతనికీ నాకు ఫ్రీ టాక్ టైం అండి. సరుకుల లిస్టు చెప్తాను. పాక్ చేస్తాడు. ఆటో లో పంపిస్తాడు. ఆటో డబ్బులు ఇస్తాను. ( ఇది మగ వారికి చెప్పకండి. సీక్రెట్.)
Maddy గారికి,
దండాలు దండాలు. ఇక్కడే ఉన్నాను. అయినా, నేనెక్కడికి వెళతాను మాష్టారూ? ఇంకా టైమ్ రాలేదు.. (సరదాగానే)
@రాజేష్,
ధన్యవాదాలు.
@వేణు గోపాల్,
మేం గుర్తొచ్చినందుకు థాంక్స్. మా శ్రీవారు తేవడానికి బధ్ధకం కానీ, అసలంటూ తెస్తే, ఆయనా చెప్పినదానికంటె ఎక్కువే తెస్తారు. ఇదేమీ గొప్ప విషయం కాదు! అస్తమానూ సతాయించరు కదా అని ఇదో ట్రిక్కూ !!
@సుమా,
మీరు స్పందించిన " "ఇది చెప్పేది ఎమిటి" అన్నది కరెక్ట్ కాదు" అర్ధం అవలేదు. ఏదో ఒకటీ, మిగిలిందంతా నచ్చిందిగా !
@అన్నయ్యగారూ,
ఇంక మీకూ బాధ తప్పిందన్నమాట !
@సుబ్రహ్మణ్యం గారూ,
" కోనసీమ" వారు అంత తొందరగా లొంగరండి బాబూ !!
@రెహమాను,
థాంక్స్...
@అజ్ఞాత,
నా కష్టాలు కూడా ఇంకొకరితో పంచుకోవాలిగా ....
@Maddy,
అలా వ్రాసేసి తప్పించుకుంటే ఎలా ?
@సమీరా,
సలహా బాగానే ఉంది కానీ, ఏదో ఒకటి అనకుండా ఉంటే కాలక్షేపం ఎలా ? పైగా నలభై ఏళ్ళనుండీ లేని అలవాటు ఇప్పుడు అవసరమా ....
Babayyagaaru paapam ee nela modatlo meeku gurtimpu saptaham chesaaraa ayinaa meeru ilaa antunnaru paapam.nenu Babayyagaari party ye. avasaram ayite chestaarane ankuntunna.meeru oppukuntaaru lendi chestaaru ani.time antaara ekkuva panlu pettukunte anthe kadaa paapam.
మీ పోస్ట్ బావుంది.
మొదటిసారి మీ బ్లాగ్ కి రావడం
మిగత పోస్ట్‌లు కూడా చదవాలి.
@శైలబాల గారూ,
ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు క్షమించండి. నా టపాలు నచ్చినందుకు ధన్యవాదాలు.
@అజ్ఞాత,
అక్కడే వస్తుంది గొడవంతా. ఎవరిని చూసినా ఆయన్ని సమర్ధించేవారే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి