RSS

నాపుట్టలో వేలెడితే కుట్టనా అందిట.. ఓ చీమ..

   ఈమధ్యన మా మనవడు చి.అగస్థ్యతో చాలా బిజీ అయిపోయాను. అక్కడకి వెళ్తే వాడితోటిదే లోకం. అస్సలు వదలండి బాబూ. ఓపికున్నా లేకపోయినా, వాణ్ణి వదలడానికి లేదు. మొన్న శనివారం చి.అగస్థ్య రెండో పుట్టిన రోజు చేసికున్నాడు. ఈ మధ్యనే ప్లే స్కూలుకి వెళ్ళడం మొదలెట్టాడు. ఏమిటో, నిండా రెండేళ్ళు లేవూ, అప్పుడే స్కూళ్ళూ, బాధ్యతలూనూ. మన రోజులే బావుండేవనిపిస్తోంది. వీళ్లని చూస్తూంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఏమిటో ఎక్కడ చూసినా పోటీ ప్రపంచం. స్కూళ్ళల్లో ప్రవేశం చేతికి వచ్చేదాకా అంతా అనుమానమే. ఈమధ్యన ఇక్కడ పేపర్లలో చదివాను, పిల్లాడి మాటెలా ఉన్నా, తల్లితండ్రుల్ని విడి విడిగా ఇంటర్వ్యూ చేస్తారుట. ఓరి నాయనో, మా పిల్లల టైముకి, మరీ ఇంత అన్యాయం కాదుకాబట్టి బతికిపోయాము. పైగా ఏదో వానాకాలం చదువులాయె, వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ప్రాణం మీదకొచ్చేది. ఏదో అదృష్టం కొద్దీ, పిల్లలు కూడా బాగానే చదివి, వాళ్ళకాళ్ళమీద వాళ్ళని నిలబెట్టకలిగేము.

   ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లల్ని చూస్తే జాలేస్తుంది. చలికాలం లో అంత ప్రొద్దుటే లేచి, స్కూలు బస్సుటైముకి తయారవడం పాపం వాళ్ళకీ కష్టమే, వాళ్ళని తయారుచేసే తల్లితండ్రులకీ కష్టమే. అలాగని ఏమైనా జాలి పడ్డామా అంతే సంగతులు ! పోనీ వాళ్ళని తయారుచేసే ఓపికుందా అంటే అదీ లేదూ. ఏమిటో ఈ చదువులూ, పరుగులూ చూస్తూంటే ఏం చేయాలో తెలియని నిస్సహాయత.

    మా ఇంటికి వెళ్ళామంటే చాలు, నవ్యనీ, అగస్థ్యనీ నాకొదిలేసి, మా శ్రీవారు చల్లగా జారుకుంటూంటారు. పొన్లెద్దూ ఏదో నాకే గా తెలుగు వీక్లీలు తేవడానికో, లేకపోతే ఏ మిస్టరీ షాపింగుకో వెళ్ళుంటారులే అనుకునేదాన్ని. నాకేం తెలుసూ, నాకు తెలియకుండా ఎవేవో నిర్వాకాలు చేసేస్తున్నారనీ? ఎప్పుడైనా తెలుగు పజిల్స్ లో ఏమైనా అడిగితే చాలు, వీటిమీద నాకు పెద్ద ఇంటరెస్టు లేదోయ్ అనేయడం. నిజమే కాబోలనుకునేదాన్ని.

   ఈయన బండారం అంతా, జనవరి ఒకటో తారీకు ఆదివారం బయట పడింది. చెప్పా పెట్టకుండా, ఆదివారాలు తెలుగువెలుగు కార్యక్రమాలు చూస్తూంటారన్నమాట. పోనీ చెప్తే ఏం పోయిందీ? ఉత్తి చూడ్డమే కాకపోగా, అందులో వచ్చే ప్రశ్నకి సమాధానం ఎస్.ఎం.ఎస్. చేయడం ఓటీ? అసలు ఈ విషయాలన్నీ నావి కదా, అసలు ఈయన వాటిలో వేలెట్టడం ఏమిటీ? పోనీ నాక్కూడా చెప్పొచ్చుగా, ఆ ఆదివారం నాడు, ఇంట్లో అందరినీ టి.వి.ఎదురుగుండా కూర్చోపెట్టేశారు, మా అగస్థ్యతో సహా! ఏమిటీ విశేషం అనుకున్నాము. తీరా చూస్తే, ఈయన జవాబుకి ప్రైజొచ్చిందనీ! ఎంత గుట్టో, పోనీ చెప్పొచ్చుగా, ముందరే చెప్తే సంతోషించేవాళ్ళం గా. ప్రతీదీ అంతే ! పైగా దానిగురించి ఓ టపాకూడా వ్రాసేసికున్నారు.

   నేనేమిటీ తక్కువ తిన్నదీ, ఆ తరువాతి ఆదివారం వచ్చిన ప్రశ్నకి నేనూ ఓ ఎస్.ఎం.ఎస్. పంపాను. నాకూ వచ్చేసింది ప్రైజు ! నాపేరూ వచ్చిందోచ్... ఏదో ఆయనతో వంతు అనకండి, అసలు ఈ ప్రశ్నలూ,జవాబులూ, గళ్ళనుడికట్లూ, వగైరాలన్నీ నాకు సంబంధించినవి. అదేదో కథలో ఓ చీమ అందిట.. నా పుట్టలో చెయ్యెడితే కుట్టనా ..అని .

5 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

మొత్తానికి ఇద్దరికీ వచ్చిందన్నమాట ప్రైజు....

Lasya Ramakrishna చెప్పారు...

meeku kuda prize ravadam bagundandi....

Advaitha Aanandam చెప్పారు...

మీదే పిసరంత అటుగానీ వెళ్ళిందేమో తెలుగు గళ్ళ , పజిళ్ళ జ్ఞానం అందుకే ప్రైజు వచ్చుంటుంది.......

ఇద్దరికీ వచ్చేసిందికదా సంతోషమైన విషయం.......

మరి ఈ టపాకి వివరణో లేక రెండు మాటలో అటువైపున చదువుతాము కాబోలు....

మాలా కుమార్ చెప్పారు...

ఇద్దరికీ అభినందనలు .

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@జ్యోతిర్మయీ,

ఔనండి...

@లాస్య పెద్దాడ,

ధన్యవాదాలు..

@మాధవి,

ఆర్నెల్లకే వారు వీరౌతారంటారు.. ఒకటా రెండా.. అబ్బో.. ఎన్నో.....

@మాలాకుమార్ గారు,

ధన్యవాదాలు.


ఏమనుకోకండి. మీరు పెట్టిన వ్యాఖ్యలకు ఇంత ఆలశ్యం గా జవాబిస్తున్నందుకు... పెద్ద బాలశిక్ష రెండు కాపీలు వచ్చాయి...

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes