RSS

అడిగేవాళ్ళు లేకపోతే సరీ.....

    ఏమిటో తన దారిన తను ఏవో టపాలు వ్రాసుకుంటూంటారనుకుంటాము కానీ, నెలకో రెండు నెలలకో ఒకసారి, నా మీద ఓ టపా వ్రాస్తే కానీ, మా శ్రీవారికి తోచదనుకుంటాను. ఏమిటండీ ఆ టపాలు, outsourcing ట, నిన్నటికి నిన్నా అక్కడికేదో ఆయన్ని ఆరళ్ళు పెట్టేస్తున్నట్టు ఊరంతా చెప్పేసికుంటున్నారు. అసలు ఆయన వ్రాసేవాటికి ఓ అర్ధం పర్ధం ఉందంటారా? ఏదో వంటింట్లో నాలుగ్గిన్నెలు సద్దేయమంటే అది తప్పా? రెక్కలు ముక్కలు చేసికుని, ఓ పనిమనిషినైనా పెట్టుకోకుండా, అప్పటికీ ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటున్నానే, ఆమాత్రం గిన్నెలు సద్దలేరూ? ఆక్కూరలు బాగుచేసేటప్పుడు, కాడలుంచేస్తానుట, అదికూడా తప్పేట. ఉత్తుత్తి ఆకులే తింటే ఏదో ఆవులికీ, మేకలకీ వాటికీ పెట్టినట్టుంది కానీ, ఆ కాడల్లోనే ఉంటుందిట అసలు గుణాలన్నీనూ, మరీ మెంతికూర వేళ్ళతో పెట్టడం లేదుగా, కాడల్తో తింటే గొంతుకలో అడ్డుపడతాయిట, బయట హొటళ్ళకి పిల్లలతో వెళ్ళినప్పుడు తిండం లేదూ, ఆ హొటళ్ళలో పెట్టే గడ్డంతా, ఇంటికొచ్చేటప్పటికే అన్ని సూకరాలూనూ. చెయ్యకేంచేస్తుందిలే అని. కాడలు లేకుండా, ఆకు ఆకూ విడిగా తియ్యమంటే ఎలాగ బాబూ? అక్కడ గిన్నె ఇక్కడ పెట్టడానికి నడుం మాత్రం ఒంగదు, కానీ వీటికి మాత్రం లోటు లేదు !! పైగా బెదిరింపోటీ, టపాల్లో వ్రాసేస్తా అంటూ, రాసుకుంటే రాసుకోండి నాకేమిటీ? వాళ్ళేమైనాఆర్చేవారా తీర్చేవారా, ఒక్కళ్ళైనా వచ్చి మెంతికూర బాగుచేయండీ అంటే చేస్తారా? ( ఏమీ అనుకోకండి, మీ అందర్నీ ఉద్దేశించి కాదు... ఉత్తిత్తినే..., ఆ మాత్రం బెదిరిస్తే కానీ లొంగరు లెండి !).

    ఇంక ఏమిటీ, డబ్బాల్లో కాఫీ పొడీ, చాయ్ పత్తీ ,పంచదారా ఖాళీ అయిపోతే, మాట్టాడకుండా కూర్చుని, ఆయన చేత కాఫీ పెట్టిస్తానా? అయ్యో అయ్యో .. ఎవరైనా నమ్మే మాటేనా ఇదీ ? పోనీ ఎప్పుడైనా అలా చేశానూ అంటే అర్ధం ఏమిటీ, ఖాళీ డబ్బాలు నింపడానికి, ప్యాకెట్లూ, పెద్ద డబ్బాలో పంచదారా చూస్తేనైనా అసలు స్టాకు ఎంతుందో తెలుస్తుందనీ, కొత్త కాఫీ పౌడరు ప్యాకెట్టూ, కొత్త చాయ్ ప్యాకెట్టూ తెస్తారనీనూ. అలా కాక ఎప్పుడైనా కాఫీ పౌడరు తీసుకు రండీ అని చెప్తే, " మొన్నే కదా తెచ్చానూ, అప్పుడే అయిపోయిందా..." అంటూ ఆరాలూ, అక్కడికేదో పుట్టింటివాళ్ళకి దోచి పెడుతున్నట్టు !! ఈయనతో ఈ నలభై ఏళ్ళూ ఎలా వేగానో, తల్చుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది.అందుకే అప్పుడెప్పుడో ఓ టపా వ్రాశాను. ఈమాత్రం దానికి ఆయన అంత పెద్ద టపా వ్రాసేసి, అక్కడికేదో ఆయన్నికష్టాలు పెట్టేస్తున్నట్టు రాసేసికోడం. వాటిని చదివి, ఈయన అభిమానులందరూ " పాపం అయ్యో అలాగా, ఈ వయస్సులో ఎంత కష్టం వచ్చిందో పాపం .." అనుకుంటూ వ్యాఖ్యలూ.. అసలు ఈయనమీద టపాలు వ్రాయకూడదూ అని ఓ ఒట్టు కూడా పెట్టేసికున్నాను. అందుకే ఈమధ్య టపాలే వ్రాయడం లేదు. అలాటిది ఆ ఒట్టు కాస్తా గట్టు మీద పెట్టేసి, ఇదిగో ఇలా వ్రాయవలసొస్తోంది !!

    నిన్నటికి నిన్న, అక్కడికేదో అస్తమానూ నన్ను బయటకు తీసికెళ్తున్నట్టూ, మా ఫ్రెండ్స్ తో చేసికునే కిట్టీ పార్టీల గురించీ వ్రాసేశారు. ఏదో ఓ ఇద్దరు ఫ్రెండ్సొస్తారంటేనే అవీ ఇవీ తయారుచేసికుంటాము కదా, అలాటప్పుడు పదిహేను మందికి తయారు చేయాలంటే ఆ మాత్రం హడావిడుండదేమిటీ? పోనీ నేనేమైనా ప్రతీ నెలా పిలుస్తున్నానా, ఏదో ఇరవై ఏళ్ళ నుండి నిరాటంకంగా జరుపుకుంటున్న ఈవెంటు ఇదీ.పైగా అందరూ ఫాక్టరీ వాళ్ళే కూడానూ, ఏదో నెలకోసారి ఎవరింట్లోనో కలిస్తే, ఆ విషయమూ, ఈ విషయమూ, క్షేమ సమాచారాలూ తెలుస్తాయని కానీ, ఊరికే ఒకళ్ళమీద ఒకళ్ళు పితూరీలు చెప్పుకోడానికి కాదు. మా ఫ్రెండ్స్ లో చాలామంది, ఏ ఒక్కరో ఇద్దరో తప్పించి, అమ్మమ్మలూ, నానమ్మలూ అయినవాళ్ళే. వాళ్ళకీ ఇళ్ళల్లో ఎప్పుడూ ఉండేదే హడావిడి, ఏదో for a change, వాతావరణం మార్పుంటుంది కదా అని కానీ, ఏదో డబ్బులు బ్యాంకుల్లో వేసేసికుని, వడ్డీలు సంపాదించేద్దామని కాదు. జీవితమంతా సంపాదించడానికేనా ఏమిటీ? అప్పటికీ వాళ్ళందరూ ఎంతంతో దూరాల్నుంచొస్తారు,పైగా రావడానికి ఎన్నెన్నో ప్రిపరేషన్లూ, జుట్టుకి డై చేసికునేవాళ్ళు ఓ రోజుముందరినుంచీ రెడీ అవాలి, అస్తమానూ పాత మొగుడేనా అన్నట్టు, ఓ కొత్త చీర కట్టాలి, ఎవరి ఆనందాలు వాళ్ళవి.ఒకమాట మాత్రం ఒప్పుకోవాలి, రావడానికి వీలు లేకపోయినా సరే డబ్బు మాత్రం టైముకి పంపేస్తారు. ఎలాటి "నాగా" లు పెట్టకుండా, వాళ్ళకి ఆ మాత్రం భోజనమైనా పెట్టొద్దూ? హొటళ్ళకి ఎప్పుడూ వెళ్ళేదే, ఇంట్లో చేతివంట చేస్తే అదో తృప్తీ. పైగా అందులో ఇంకో తెలుగావిడ తప్పించి, మిగిలినవాళ్ళందరూ యూపీ, మహరాష్ట్ర కి చెందినవాళ్ళే. మన వంటలు అప్పుడప్పుడు తింటూంటేనే కదా వాళ్ళకీ తెలిసేదీ? నేను "వడలు" చేస్తే, " లక్ష్మీ మీకు ఇంత మెత్తగా ఎలా వస్తాయీ, మేము ఎప్పుడు చేసినా గట్టిగా రాళ్ళలా ఉంటాయీ, ఏదో సాంబారులో వేస్తే మెత్తబడతాయి కానీ..." అంటూ, వాళ్ళూ అడిగినప్పుడు అదో సంతోషమూ, ఇంట్లో వాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు...

    పోనీ ఎప్పుడైనా బ్లాగులు వ్రాసుకుందామా అంటే ఎప్పుడూ దాన్ని పట్టుకునే ఉండడం, నెల తిరిగేసరికల్లా మాలిక, కౌముది, సుజనరంజని లలో వచ్చే పదచంద్రికలు ఓ print out తీసేసి నా మొహాన్నేసి కొట్టేస్తారు. వాటితో నా కాలక్షేపం అయిపోతూంటుంది.ఆయన దారిన ఆయన ఏవో టపాలు వ్రాసుకుంటూంటే ఫరవాలేదు కానీ, నన్నే యాగీ చేసేస్తే, అందరూ నేనేదో ఆయన్ని కష్టాలు పెట్టేస్తున్నట్టు అనుకుంటారేమో అని, ఇలా అప్పుడప్పుడు వ్రాస్తూండాలి. అయినా అడిగేవాళ్ళు లేకపోతే అలాగే ఉంటుంది.....

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఆలా గట్టిగా అడగండి మన పగోజి వాళ్ళంటే కొద్దిగా చులకనగా చూస్తున్నారు
కోనసీమ వాళ్ళు.

అజ్ఞాత చెప్పారు...

ఆలా గట్టిగా అడగండి మన పగోజి వాళ్ళంటే కొద్దిగా చులకనగా చూస్తున్నారు
కోనసీమ వాళ్ళు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

అదీ అలా గడ్డి పెట్టండి మగాను బావుడికి.ఏంటీ!రోజూ మీరు పెట్టేది అదేనంటున్నారా?అందుచేతే ఆయన మెదడుకూడా అదే తిని మీమీద అలాంటివి వ్రాస్తున్నంటుంది.ఇంట్లో బియ్యం కడిగినట్లు ఆయన్ని బజారులో కడిగేసారుగా? ఇంక ఏ మాత్రం బుధ్ధి మిగిలి ఉన్నా మీ జోలికి రారులెండి.

అజ్ఞాత చెప్పారు...

ఆలా గట్టిగా అడగండి మన పగోజి వాళ్ళంటే కొద్దిగా చులకనగా చూస్తున్నారు
కోనసీమ వాళ్ళు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@శాస్త్రి గారూ,

పోనిద్దురూ...

@గోపాలకృష్ణరావుగారూ,

మరీ అంతంత మాటలు అనఖ్ఖర్లేదండి... టపాల్లో మా వాగ్వివాదాలు మామూలేలెండి...

@బోనగిరి గారూ,

పైన శ్రీశాస్త్రి గారికి చెప్పినదే....

sameera చెప్పారు...

చక్కటి జంట !
మాది కూడా ఇంచుమించు ఇలాంటి స్టొరి నే :-)

sameera చెప్పారు...

చక్కటి జంట !
మాది కూడా ఇంచుమించు ఇలాంటి స్టొరి నే :-)

deepa చెప్పారు...

అమ్మమ్మ గారికి,

నమస్కారాలు..నెను మీ టపాలన్ని చదువుతుంటాను..
మీకు తెలుగులొ వ్యాఖ్య రాయాలని లెఖినిని ఉపయొగించాను.. తప్పులు వుంటె సారీ..లవ్ యూ అమ్మమ్మ.. అన్ని చాలా బావుంటాయి మీరు చెప్పీవి ..

deepa చెప్పారు...

అమ్మమ్మ గారికి,

నమస్కారాలు..నెను మీ టపాలన్ని చదువుతుంటాను..
మీకు తెలుగులొ వ్యాఖ్య రాయాలని లెఖినిని ఉపయొగించాను.. తప్పులు వుంటె సారీ..లవ్ యూ అమ్మమ్మ.. అన్ని చాలా బావుంటాయి మీరు చెప్పీవి ..

deepa చెప్పారు...

అమ్మమ్మ గారికి,

నమస్కారాలు..నెను మీ టపాలన్ని చదువుతుంటాను..
మీకు తెలుగులొ వ్యాఖ్య రాయాలని లెఖినిని ఉపయొగించాను.. తప్పులు వుంటె సారీ..లవ్ యూ అమ్మమ్మ.. అన్ని చాలా బావుంటాయి మీరు చెప్పీవి ..

the tree చెప్పారు...

భలే రాశారండి, హ,హ, అభినందనలు, రాస్తూవుండండి

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

@సమీరా,

గుడ్... కీప్ ఇట్ అప్....

@దీపా,

ఏమీ తప్పులు లేవమ్మా. మీ తాతగారు ఒక మెయిల్ పంపారుట. జవాబు కోసం ప్రతీ రోజూ ఎదురు చూస్తున్నారు. అదేదో త్వరగా పంపేయకూడదూ ?

@ద ట్రీ,

ధన్యవాదాలు....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes